వైకింగ్ స్పెర్మ్: డెన్మార్క్ మగవాళ్ల వీర్యానికి ప్రపంచవ్యాప్తంగా ఎందుకంత డిమాండ్?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జేమ్స్ గల్లాఘర్, క్యాథరిన్ స్నోడెన్
- హోదా, బీబీసీ ప్రతినిధులు
వీర్యదానం ద్వారా కొంతమంది పురుషులు అనేక మంది పిల్లల పుట్టుకకు కారణం అవుతున్నారు.
క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే జన్యు పరివర్తన ఉన్న వీర్య దాత గురించిన కథనాన్ని బీబీసీ ఇటీవల ప్రచురించింది. ఇందులో మరో ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆ వ్యక్తి వీర్యం ద్వారా 14 దేశాల్లో 197 మంది జన్మించినట్లు పరిశోధనలో తేలింది.
ఇది వీర్యదాతల పరిశ్రమ ఏ స్థాయిలో విస్తరించిందో తెలుసుకునే ఆసక్తిని పెంచింది.
స్వలింగ సంపర్కులైన మహిళలు, ఒంటరిగా పిల్లలను పెంచుకోవాలని భావించేవారు, భాగస్వామికి సంతాన సామర్థ్యం లేనప్పుడు వీర్యదానం వల్ల మహిళలు తల్లులయ్యే అవకాశం ఉంది.
ఇది ఇప్పుడు పెద్ద వ్యాపారంగా మారింది. 2023 నాటికి యూరప్‌లో దీని మార్కెట్ విలువ 2 బిలియన్ పౌండ్లుగా ఉన్నట్లు అంచనా వేశారు. ప్రధానంగా డెన్మార్క్ వీర్యం ఎగుమతిదారుగా ఉంది.
కొంతమంది వీర్యదాతలు అనేకమంది పిల్లలకు ఎందుకు తండ్రులవుతున్నారు? డానిష్ లేదా 'వైకింగ్ స్పెర్మ్' ఎందుకు అంత ప్రసిద్ధి పొందాయి? ఈ పరిశ్రమపై నియంత్రణ అవసరమా?


ఫొటో సోర్స్, Getty Images
పురుషులందరి వీర్యం నాణ్యమైనది కాకపోవచ్చు
మీరు పురుషులైతే, ఈ కథనం చదువుతూ ఉంటే, ఇది మీకు చెప్పడానికి మేం చింతిస్తున్నాం. మీ వీర్యంలోని నాణ్యత, మీరు వీర్యదాతగా మారేందుకు సరిపోకపోవచ్చు.
వంద మంది పురుషుల్లో ఐదుగురి కంటే తక్కువమందిలో మాత్రమే వీర్యదాతగా మారగలిగే నాణ్యమైన వీర్యం ఉంటుంది. ముందుగా మీ వీర్యంలో స్పెర్మ్ కౌంట్‌ను చూడాలి. వీర్యంలో వీర్య కణాలు ఎలా ఈదుతున్నాయి, వాటి చలనశీలత, ఆకారాన్ని అధ్యయనం చేయాలి.
వీర్యాన్ని గడ్డకట్టించి స్పెర్మ్ బ్యాంక్‌లో నిల్వ ఉంచిన తర్వాత కూడా అది మనుగడ సాగిస్తుందా అనేది నిర్థరించుకోవడానికి తనిఖీ చేస్తారు.
మీలో సంతాన సామర్థ్యం మెండుగా ఉండవచ్చు, మీకు ఆరుగురు పిల్లలు ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ మీరు వీర్యదాత కాలేకపోవచ్చు.
వీర్య దానానికి సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కో రకమైన నియమావళి అమల్లో ఉంది. బ్రిటన్‌లో అయితే మీరు యువకులై ఉండాలి. వయసు 18-45 సంవత్సరాల మధ్య ఉండాలి. హెచ్ఐవీ, గనేరియా లాంటి ఇన్ఫెక్షన్లు ఏవీ ఉండకూడదు.
సిస్టిక్ ఫైబ్రోసిస్, వెన్నెముక కండరాల క్షీణత, రక్త సంబంధిత రుగ్మత లాంటి జన్యుపరమైన వ్యాధులకు కారణమయ్యే కణాలేవీ మీ వీర్యంలో ఉండకూడదు వీటన్నింటిని చూస్తే వీర్యదాతల సంఖ్య చాలా తక్కువగా ఉందని అర్థం. బ్రిటన్‌లో సగానికి పైగా వీర్యాన్ని దిగుమతి చేసుకుంటున్నారు.
అయితే దాతలు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ, పిల్లలను ఎక్కువ సంఖ్యలో కనగలరు. ఒక అండాన్ని ఫలదీకరించడానికి ఒక వీర్య కణం సరిపోతుంది. వీర్యదాతల ఒక స్కలనంలో పది లక్షల వీర్య కణాలు ఉంటాయి.
వీర్యదాతలు వీర్యాన్ని దానం చేసేటప్పుడు వారానికి ఒకటి లేదా రెండుసార్లు క్లినిక్‌కు వస్తారు. ఇలా నెలల తరబడి రావచ్చు.
"వీర్యదాతల నుంచి సేకరించే వీర్యం తక్కువగా ఉండటం వల్ల ఇది 'విలువైన వస్తువు'గా మారింది. స్పెర్మ్ బ్యాంకులు, సంతానోత్పత్తి క్లినిక్కుల్లో డిమాండ్‌ను తీర్చేందుకు అందుబాటులో ఉన్న వీర్యదాతలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు" అని ఫెర్టిలిటీ అండ్ జినోమిక్స్ మీద పని చేస్తున్న ప్రోగ్రెస్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చారిటీ సంస్థ డైరెక్టర్ సారా నోర్‌క్రాస్ చెప్పారు.

ఫొటో సోర్స్, Allan Pacey
కొంతమంది స్పెర్మ్‌కు విపరీతమైన గిరాకీ
వీర్యదాతల సంఖ్య తక్కువగా ఉండటంతో కొంతమంది వీర్యానికి మిగతా వారి కంటే ఎక్కువ డిమాండ్ ఉంది.
వీర్యదాతల్ని ఎలా పడితే అలా ఎంపిక చేయరు. డేటింగ్ యాప్‌లలో భాగస్వామిని ఎంచుకున్నట్లుగానే మిగతా వారి కంటే కొంతమందికి ఎక్కువ గిరాకీ ఉంటుంది.
స్పెర్మ్ బ్యాంక్ ఇచ్చే ఫోటోలను మీరు చూడవచ్చు, వీర్యదాతల గొంతు వినవచ్చు, వాళ్లు ఏం పని చేస్తున్నారు? ఇంజనీరా లేక ఆర్టిస్టా అనేది తెలుసుకోవచ్చు. వారి ఎత్తు, బరువు గురించి కూడా తెలుసుకోవచ్చు.
"వాళ్లను స్వెన్ అని పిలవవచ్చు. (నార్స్ భాషలో స్వెన్ అంటే యువకుడు లేదా యోధుడు అని అర్థం). వాళ్లకు బంగారు రంగు జుట్టు ఉంటుంది. ఆరడుగల ఆజానుబాహుడై ఉండవచ్చు. అతను 7 భాషలు మాట్లాడుతూ ఉండవచ్చు. మంచి ఆటగాడై ఉండవచ్చు. ఈ లక్షణాలన్నీ నాలాగా కాకుండా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి" అని షెఫీల్డ్‌లో స్మెర్మ్‌బ్యాంక్ నడిపే ఫెర్టిలిటీ ఎక్స్‌పర్ట్ ప్రొఫెసర్ అల్లన్ పేసీ చెప్పారు.
"అంతిమంగా, తమకు నచ్చిన, అన్ని రకాలుగా సరిపోయే డోనర్ కోసం ప్రజలు ఎవరినైనా ఎంచుకోవచ్చు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డెన్మార్క్ కేంద్రంగా...
ప్రపంచంలో అతి పెద్ద స్మెర్మ్ బ్యాంకులకు డెన్మార్క్ కేంద్రంగా ఉంది. "వైకింగ్ బేబీస్" ను ఉత్పత్తి చేయడంలో ఈ బ్యాంకులు గుర్తింపు పొందాయి.
0.5మిల్లీ లీటర్ల వీర్యకణాల సీసా ధర 100 యూరోల నుంచి వెయ్యి యూరోల కంటే ఎక్కువగా ఉంటుందని క్రియోస్ ఇంటర్నేషనల్ స్పెర్మ్‌బ్యాంక్ వ్యవస్థాపకుడు ఓలే స్కౌ తెలిపారు.
డెన్మార్క్‌లో వీర్య దానం సంస్కృతి చుట్టు పక్కల ఉన్న దేశాల కంటే భిన్నంగా ఉంటుందని ఆయన అన్నారు.
"జనాభా మొత్తం ఒక కుటుంబం లాంటిది. సమాజంలో దీన్ని పెద్దగా పట్టించుకోరు. మా ప్రజలు నిస్వార్థపరులు. వీర్యదాతల్లో అనేక మంది రక్తదానం కూడా చేస్తారు" అని ఓలే స్కౌ చెప్పారు.
అదే డెన్మార్క్‌ను వీర్యాన్ని ఎగుమతి చేసే కొద్ది దేశాల్లో ఒకటిగా నిలిపిందని ఆయన అన్నారు
అంతే కాకుండా జన్యుపరమైన అంశాలు కూడా డానిష్ స్పెర్మ్ ప్రముఖంగా మారడానికి కారణమని షౌ చెబుతున్నారు
"డెన్మార్క్ ప్రజల నీలికళ్లు, బంగారు రంగు జట్టున్న జన్యువులు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు చెరొకటి సంక్రమిస్తాయని ఆయన బీబీసీతో అన్నారు.
ఫలితంగా తల్లిలో నల్లటి జుట్టు ఉంటే పుట్టే బిడ్డకు అలాంటి జుట్టు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని స్కౌ వివరించారు.
వీర్యదాతల కోసం "ఒంటరిగా, ఉన్నత విద్యావంతులైన, 30ల్లో ఉన్న మహిళల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నాయి. వాళ్ల విజ్ఞప్తులు ఇప్పుడు 60శాతానికి చేరుకున్నాయి" అని ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Cryos International
సంతానోత్పత్తి వ్యాపారానికి దారితీసిందా?
డెన్మార్క్‌లోని యూరోపియన్ స్పెర్మ్‌బ్యాంకులో పురుషుడి స్పెర్మ్‌ను సేకరించి, దానిని 14 దేశాలలో 67 సంతానోత్పత్తి క్లినిక్‌లకు ఎలా పంపారనే విషయంపై జరిగిన పరిశోధన గురించి బీబీసీ ప్రచురించిన కథనం చర్చించింది
ఒక పురుషుడి వీర్యం ఎన్నిసార్లు ఉపయోగించవచ్చనే విషయమై ప్రతీ దేశానికి దాని సొంత నియమావళి ఉంది.
కొన్నిసార్లు ఇది పిల్లల సంఖ్యతో ముడిపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో దీన్ని తల్లుల సంఖ్యకు పరిమితం చేస్తారు. (దీని వల్ల ప్రతీ కుటుంబం తమకు కావల్సినంతమంది పిల్లల్ని కలిగి ఉండవచ్చు)
తాము ఒకే పురుషుడి వీర్యం వల్ల పుట్టామని తెలియని స్త్రీ, పురుషులు కలవకుండా చేయడమే ఈ పరిమితుల ప్రధాన ఉద్దేశం.
197 మంది పిల్లలలో కొంతమందికి క్యాన్సర్‌కు దారితీసిన జన్యువు కలిగిన స్పెర్మ్ దాతపై దర్యాప్తు తర్వాత, యూరప్‌లో ఒక దేశం నుంచి మరో దేశానికి ఎగుమతి చేసే స్పెర్మ్‌ను పర్యవేక్షించడానికి యూరప్ వ్యాప్తంగా స్పెర్మ్ డోనర్ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని బెల్జియం అధికారులు యూరోపియన్ కమిషన్‌ను కోరారు.
ఈ పరిశ్రమ 'వైల్డ్ వెస్ట్' లాంటిదని డెన్మార్క్ ఉప ప్రధానమంత్రి ఫ్రాంక్ వాండెన్ బ్రౌకే చెప్పారు.
"పిల్లలు లేని వారికి పిల్లల్ని అందించాలనే లక్ష్యంతో ప్రారంభమైన ప్రక్రియ సంతానోత్పత్తి వ్యాపారానికి దారి తీసింది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వీర్యదానం ఎన్నికుటుంబాలకైనా అందించొచ్చా?
యూరోపియన్ దేశాల్లో ఒక దాత వీర్యం 50 కుటుంబాలకు మించి అందించడానికి వీల్లేకుండా తక్షణ నిబంధన తీసుకు రావాలని ది యురోపియన్ సొసైటీ ఆఫ్ హ్యూమన్ రీ ప్రొడక్షన్ అండ్ ఎంబ్రియోలజీ ప్రతిపాదించింది. ఈ విధానం ఒక వీర్యదాత వల్ల వంద మంది పిల్లలు పుట్టేందుకు మాత్రమే అనుమతినిస్తుంది. అంతిమంగా ఒక దాత అందించే వీర్యం 15 కుటుంబాలకే పరిమితం అవుతుందని ఆ సంస్థ నమ్ముతోంది.
వీర్యదానం ద్వారా పుట్టిన పిల్లలు వారు ఆ విషయాన్ని ఎలా స్వీకరిస్తారనే ఆందోళనలు ఉన్నాయి. కొందరు దీనిని ఆనందంగా స్వీకరించవచ్చు. మరికొందరు తాము దాత వీర్యంతో జన్మించామని, తమకు వందలసంఖ్యలో తోబుట్టువులున్నారనే రెండు నిజాలను తెలుసుకున్నప్పుడు తీవ్ర మానసిక వేదనకు గురయ్యే అవకాశం ఉంది.
దాతల విషయంలోనూ ఇది వర్తిస్తుంది. తమ వీర్యాన్ని ఇంత విస్తృతంగా ఉపయోగిస్తారనే విషయం వారికి కూడా తెలియకపోవచ్చు.
డీఎన్ఏ పరీక్షలు సులభంగా అందుబాటులో ఉండటం, సోషల్ మీడియా ద్వారా తమ పిల్లలు, తోబుట్టువులు లేదా దాతను వెతకగలిగే అవకాశం ఉండటంతో ఈ ప్రమాదాలు మరింత పెరుగుతున్నాయి. యూకేలో ఇకపై వీర్య దాతల వివరాలను బహిరంగ వ్యవహారంగా మారనున్నాయి. పిల్లలు తమ బయోలాజికల్ తండ్రి గురించి అధికారికంగా తెలుసుకోవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
వీర్యదానంపై ఆంక్షలు విధించడం వల్ల కుటుంబాలు "పూర్తి స్థాయిలో నియంత్రణ లేని మార్కెట్ల వైపు మొగ్గుతాయి" అని స్కౌ వాదిస్తున్నారు.
వీర్యాన్ని విస్తృతంగా ఉపయోగించడం ‘విస్తృతమైన’ నైతిక మందుపాతర లాంటిదని లాంకష్టర్ యూనివర్సిటీలో మెడికల్ ఎథిసిస్ట్ డాక్టర్ జాన్ ఆపిల్‌బై చెప్పారు.
"ఒక దాత వీర్యం ఎన్నిసార్లు, ఎంత మందికి ఉపయోగించాలనే దానిపై సంతానోత్పత్తి పరిశ్రమ బాధ్యతతో ఉండాలి. అయితే నియంత్రణ కోసం అంతర్జాతీయ స్థాయిలో నియమావళిని రూపొందించడం చాలా కష్టం" అన్నారు.
గ్లోబల్ స్పెర్మ్ డోనర్ రిజిస్టర్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చినప్పటికీ దానికి ఏర్పాటులో నైతిక, చట్టపరమైన సవాళ్లు ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














