ఒక వీర్యదాత వీర్యంతో పుట్టిన 14 దేశాల్లోని 197 మందికి క్యాన్సర్ ముప్పు..

ఫొటో సోర్స్, Shutterstock
- రచయిత, జేమ్స్ గలఘర్, నటాలియె ట్రస్‌వెల్
- హోదా, హెల్త్, సైన్స్ కరెస్పాండెంట్, ఇన్వెస్టిగేషన్స్ ప్రొడ్యూసర్
క్యాన్సర్ ప్రమాదాన్ని తీవ్రంగా పెంచే జన్యు మ్యుటేషన్ తనకు ఉన్నవిషయం తెలియని ఓ వ్యక్తి వీర్యాన్ని దానం చేసి యూరప్‌లో 197మంది పిల్లలకు తండ్రయినట్టు పరిశోధనలో తేలింది.
అలా పుట్టిన పిల్లల్లో కొందరు ఇప్పటికే మరణించారు. ఈ మ్యుటేషన్‌ను వారసత్వంగా పొందినవారిలో కొద్దిమంది మాత్రమే తమ జీవితకాలంలో క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోగలరు.
వీర్యాన్ని యూకే క్లినిక్‌లలో విక్రయించలేదు. కానీ, డెన్మార్క్‌లో ఫెర్టిలిటీ చికిత్స తీసుకున్న బ్రిటిష్ కుటుంబాలు కొన్ని ఆ దాత వీర్యాన్ని ఉపయోగించుకున్నాయి.
బాధిత కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలుపుతున్నామని, కొన్ని దేశాల్లో ఈ వీర్యం వల్ల చాలామంది పిల్లలు పుట్టారని వీర్యాన్ని అమ్మే డెన్మార్క్‌కు చెందిన యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ తెలిపింది.
బీబీసీతో పాటు 14 పబ్లిక్ సర్వీస్ బ్రాడ్‌కాస్టర్లు యూరోపియన్ బ్రాడ్‌కాస్టింగ్ యూనియన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం నెట్‌వర్క్‌లో భాగంగా ఈ పరిశోధన నిర్వహించాయి.


ఫొటో సోర్స్, Getty Images
17 ఏళ్లుగా నుంచి వీర్య దానం
2005లో విద్యార్థిగా ఉన్నప్పటినుంచి ఆ గుర్తు తెలియని వ్యక్తి వీర్యం దానం చేశారు. 17 ఏళ్లుగా నుంచి ఆ వీర్యాన్ని మహిళలు ఉపయోగించుకుంటున్నారు.
దాతలకు నిర్వహించే పరీక్షల్లో ఆయన ఆరోగ్యంగా ఉన్నట్టు తేలింది. అయితే ఆయన కణాల్లోని కొన్నింటిలో డీఎన్‌ఏ ఆయన పుట్టకముందే మ్యుటేట్ అయింది.
టీపీ53 జన్యువును అది డామేజ్ చేసింది. శరీరకణాలు క్యాన్సర్ బారిన పడకుండా నిరోధించడంలో టీపీ53 జన్యువుది కీలకపాత్ర.
దాత శరీరంలోని చాలా భాగంలో టీపీ53 ప్రమాదకరంగాలేదు. కానీ వీర్యంలో 23శాతం మాత్రం భిన్నంగా ఉంది.
ప్రభావితమైన వీర్యం కారణంగా ఎవరైనా పుడితే, వారి శరీరంలోని ప్రతి కణం మ్యుటేషన్ అవుతుంది.
దీనిని ‘లి ఫ్రామెనీ సిండ్రోమ్’ అని పిలుస్తారు. క్యాన్సర్ బారిన పడడానికి 90 శాతం అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి చిన్నవయసులోనే ఈ ప్రమాదం ఉంటుంది. అమ్మాయిలకు తర్వాతి దశలో రొమ్ము క్యాన్సర్ రావడానికీ అవకాశం ఉంటుంది.

నిరంతరం పరీక్షలు తప్పనిసరి
''ఇది భయంకరమైన విషయం'' అని లండన్‌లోని క్యాన్సర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో క్యాన్సర్ జన్యు నిపుణులు ప్రొఫెసర్ క్లేర్ టర్న్‌బల్ బీబీసీతో చెప్పారు. ఓ కుటుంబానికి ఇది చాలా పెద్ద సమస్య. క్యాన్సర్‌తో జీవించడం భరించలేని బాధ'' అని క్లేర్ టర్న్‌బల్ అన్నారు.
''ఏటా శరీరానికి, మెదడుకు ఎంఆర్ఐ స్కాన్‌లు అవసరం. పొత్తికడుపులో ట్యూమర్లను గుర్తించడానికి అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించాలి. క్యాన్సర్ సోకే ప్రమాదాన్ని నివారించుకునేందుకు మహిళలు రొమ్ములు తొలగించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి'' అని తెలిపారు.
అయితే.. ''వీర్య దాతగానీ, ఆయన కుటుంబ సభ్యులుగానీ అనారోగ్యం బారిన పడలేదు'' అని యూరోపియన్ స్పెర్మ్ బ్యాంక్ తెలిపింది. జన్యపరమైన పరీక్షల్లో మ్యుటేషన్‌ను ముందే గుర్తించడం సాధ్యం కాదని చెప్పింది. ఆయన వీర్యంతో ప్రమాదం ఉందని గుర్తించిన వెంటనే ఆ దాత నుంచి వీర్యం సేకరించడం నిలిపివేశామని తెలిపింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇప్పటికే మరణించిన కొందరు పిల్లలు
వీర్యదానం వల్ల జన్మించిన పిల్లల్లో క్యాన్సర్ గుర్తించిన డాక్టర్లు ఈ ఏడాది యూరోపియన్ సొసైటీ హ్యూమన్ జెనెటిక్స్‌లో ఆందోళన వ్యక్తంచేశారు.
67 మంది పిల్లల్లో 23మందికి వేరియంట్ ఉన్నట్టు వారు రిపోర్టు చేశారు. పదిమందికి ఇప్పటికే క్యాన్సర్ ఉన్నట్టు నిర్ధరణ అయింది.
ఈ వీర్య దాత వల్ల చాలామంది పిల్లలు పుట్టినట్లు ‘ఫ్రీడమ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్’ కింద విజ్ఞప్తులు, డాక్టర్లతో, పేషెంట్లతో ఇంటర్వ్యూల ఆధారంగా తెలిసింది.
అలా పుట్టిన పిల్లల సంఖ్య 197 వరకు ఉండొచ్చు. కానీ అంతమందే అనుకోవడానికి వీలులేదు. చాలా దేశాలకు చెందిన సమాచారం అందుబాటులో లేదు.
ఈ పిల్లల్లో ఎంతమంది ప్రమాదకర వేరియంట్‌ను వారసత్వంగా పొందారో కూడా తెలియదు.
''ఇప్పటికే అనేకమంది పిల్లలకు క్యాన్సర్ సోకింది'' అని ఫ్రాన్స్‌లోని రోయున్ యూనివర్సిటీలో క్యాన్సర్ జన్యు నిపుణులు డాక్టర్ ఎడ్‌విగ్ కాస్పర్ చెప్పారు.
''పిల్లలకు రెండు రకాల క్యాన్సర్లు సోకాయి. వారిలో కొందరు చాలా చిన్న వయసులోనే చనిపోయారు'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఎప్పుడైనా క్యాన్సర్ బారిన పడొచ్చు’
14 ఏళ్ల క్రితం దాత వీర్యం ద్వారా ఫ్రాన్స్‌కు చెందిన ఒంటరి మహిళ సెలీన్(అసలు పేరు కాదు)పాపకు జన్మనిచ్చారు. ఆ పాపకు మ్యుటేషన్ ఉంది.
దాత వీర్యం ఆమె ఉపయోగించుకున్న బెల్జియంలోని ఫెర్టిలిటీ క్లినిక్ నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది. పరీక్షల కోసం ఆమె కూతురుని తీసుకురావాలని క్లినిక్ కోరింది.
'' దాతపై నాకు కచ్చితంగా తీవ్రమైన భావాలేమీ లేవు'' అని ఆమె చెప్పారు. అయితే సురక్షితం కాని, ప్రమాదకరమైన వీర్యాన్ని ఇవ్వడం అంగీకారం కాదని ఆమె అన్నారు.
తమ జీవితాల్లోని మిగిలిన కాలాన్ని క్యాన్సర్ ప్రమాదంలో ఉంచబోతోందని ఆమెకు తెలుసు.
''క్యాన్సర్ ఎప్పుడు సోకుతుందో, ఎలాంటి క్యాన్సర్ వస్తుందో, ఎన్ని రకాల క్యాన్సర్ల బారిన పడతామో తెలియదు'' అని ఆమె అన్నారు.
''అది జరగబోతోందని నాకు అర్ధమైంది. క్యాన్సర్ బారిన పడ్డప్పుడు మేం పోరాడాలి. అనేక రకాల క్యాన్సర్లు సోకితే మేం అనేక సార్లు పోరాడాలి'' అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

ఫొటో సోర్స్, Getty Images
14 దేశాల్లో వినియోగం
14 దేశాల్లోని 67 ఫెర్టిలిటీ క్లినిక్‌లు దాత వీర్యాన్ని ఉపయోగించాయి.
యూకేలోని క్లినిక్‌లలో ఆ వీర్యాన్ని విక్రయించలేదు.
అయితే దాత వీర్యాన్ని ఉపయోగించి ఫెర్టిలిటీ చికిత్స తీసుకోవడానికి బ్రిటిష్ మహిళలు డెన్మార్క్ వెళ్లారని అక్కడి అధికారులు యూకే హ్యూమన్ ఫెర్టిలైజేషన్ అండ్ ఎంబ్రయాలజీ అథారిటీ(హెచ్‌ఎఫ్ఈఏ)కి తెలియజేశారని పరిశోధనలో తెలిసింది.
ఆయా మహిళలకు దీనిపై సమాచారం అందింది.
''బాధితులైన మహిళల సంఖ్య చాలా తక్కువ. వారు చికిత్స పొందిన డానిష్ క్లినిక్ దాత గురించి వారికి చెప్పింది'' అని హెచ్ఎఫ్ఈఏ చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ థాంప్సన్ చెప్పారు.
దాత వీర్యం ఇచ్చిన వేరే దేశాల్లో ఇతర బ్రిటిష్ మహిళలెవరన్నా చికిత్స తీసుకున్నారో లేదో తెలియదని ఆయన చెప్పారు.
ఎవరికన్నా సందేహాలుంటే వారు తాము చికిత్స పొందిన క్లినిక్‌ను, ఫెర్టిలిటీ అధారిటీని కాంటాక్ట్ అవ్వాలని సూచించారు.
దాత గుర్తింపు నంబరును బహిరంగపరచకూడదని బీబీసీ భావించింది. సంబంధిత కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినందున, దాతకు ఎలాంటి చెడు ఉద్దేశం లేనందున బీబీసీ ఈ నిర్ణయం తీసుకుంది.
దాత వీర్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎన్నిసార్లు ఉపయోగించాలనేదానిపై ఎలాంటి చట్టం లేదు. ఆయా దేశాలు సొంత పరిమితులు విధించుకున్నాయి.
కొన్ని దేశాలు ఈ పరిమితులను ఉల్లంఘిస్తున్నాయని, డెన్మార్క్, బెల్జియంతో చర్చలు జరపుతున్నామని యూరోపియన్ స్మెర్మ్ బ్యాంక్ అంగీకరించింది.
బెల్జియంలో ఓ వ్యక్తి ఇచ్చిన వీర్యాన్ని ఆరు కుటుంబాలు మాత్రమే ఉపయోగించాలి. కానీ 38 మంది మహిళలు ఆ దాత వీర్యం ద్వారా 53మంది పిల్లలకు జన్మనిచ్చారు.
ఒక దాత వీర్యాన్ని యూకేలో 10 కుటుంబాలు ఉపయోగించొచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
‘అన్ని పరీక్షలూ చేయలేం’
పెద్ద అంతర్జాతీయ స్పెర్మ్ బ్యాంకులపై చాలా దేశాలు ఆధారపడుతున్నాయని, యూకేలో ఉపయోగిస్తున్న వీర్యంలో సగం దిగుమతి చేసుకున్నదేనని మాంచెస్టర్ యూనివర్శిటీలో బయాలజీ మెడిసన్, హెల్త్ ఫాకల్టీ డిప్యూటీ వైస్ ప్రెసిడెంట్, గతంలో షెఫీల్డ్ స్పెర్మ్ బ్యాంక్ నిర్వహించిన ప్రొఫెసర్ అలన్ పేసీ చెప్పారు.
''పెద్ద అంతర్జాతీయ స్పెర్మ్ బ్యాంకుల నుంచి మనం దిగుమతి చేసుకోవాలి. డబ్బుకోసం అవి ఇతర దేశాలకు కూడా అమ్ముతున్నాయి. ఇక్కడే సమస్య మొదలవుతోంది. వీర్యాన్ని ఎలా ఉపయోగించొచ్చనేదానిపై అంతర్జాతీయ చట్టాలు లేవు'' అని ఆయన బీబీసీతో చెప్పారు.
దీనితో సంబంధం ఉన్నవారందరికీ ఇది భయానకర అనుభవం. కానీ పూర్తిగా సురక్షితమైన వీర్యం లభించడం అసాధ్యం కావొచ్చు.
''ప్రతిదాన్నీ మనం పరీక్షించలేం. ప్రస్తుతం ఉన్న పరీక్షల ద్వారా వీర్యం దానం చేయాలనుకునే మగవారిలో ఒకటి నుంచి రెండు శాతం వారినే అనుమతిస్తున్నాం. మరింత కఠినంగా నిబంధనలు అమలుచేస్తే మనకసలు స్పెర్మ్ డోనర్లే ఉండరు – ఇదింకా అసమతుల్య పరిస్థితులను సృష్టిస్తుంది'' అని ఆయన తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














