‘‘పండగనాటికి మా ఆయన వచ్చేస్తాడా?’’ ఆ గర్భిణి ఎదురుచూపులకు సమాధానం దొరుకుతుందా?

సురాడ అనిత
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

చేతిలో ఫోన్ పట్టుకుని, ఒక్క రింగు కోసం ఎదురు చూస్తున్నారు సూరాడ అనిత. ఆమె ఇప్పుడు 9 నెలల గర్భిణి.

జనవరి 16న డెలివరీ అయ్యే అవకాశముందని డాక్టర్లు చెప్పారు.

కానీ, ఆ సమయానికి తన భర్త ఇంటికి వస్తాడా? పుట్టే బిడ్డను చూసే అవకాశం దక్కుతుందా? అన్న ప్రశ్నలు ఆమెను వెంటాడుతున్నాయి.

‘‘రోజూ ఫోన్ చేస్తూనే ఉన్నా. ఎప్పుడైనా రింగు అవుతుందేమోనని, మా ఆయన ఫోన్ ఎత్తుతాడేమో అనుకుంటా. కానీ, రింగ్ కూడా వెళ్లడం లేదు. ఎక్కడున్నాడో? ఎలా ఉన్నాడో?’’ అంటూ కన్నీళ్లతో ఎదురు చూస్తున్నారు అనిత.

అనితకు వివాహమై ఏడాదైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఏడాది అక్టోబర్ 13న విశాఖ హార్బర్ నుంచి చేపల వేటకు బయలుదేరిన తొమ్మిది మంది బృందంలో అనిత భర్త అప్పలకొండ కూడా ఉన్నారు.

తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారంటూ బంగ్లాదేశ్ కోస్ట్ గార్డు పోలీసులు అక్టోబర్ 21న వీరిని అరెస్ట్ చేశారు.

ఇప్పటికి రెండు నెలలు దాటి.. మూడో నెల నడుస్తోంది. కానీ, ఆ 9మంది యోగక్షేమాలపై ఎటువంటి సమాచారం లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

మత్స్యకారుల కుటుంబాల ఆందోళన

'వేటకు వెళ్లి తిరిగిరాని జీవితాలు'

ఈ ఆవేదన ఒక్క అనితదే కాదు. చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్టు గార్డుకు చిక్కిన తొమ్మిది మంది మత్స్యకారుల కుటుంబాలది కూడా.

విజయనగరం జిల్లా తిప్పలవలస, చింతపల్లి, కొండ్రాజుపేట గ్రామాలకు చెందిన ఈ మత్స్యకారులు బంగ్లాదేశ్ కోస్టు గార్డుకు చిక్కినట్టు అక్టోబర్ 22న కుటుంబాలకు సమాచారం చేరింది.

అప్పటి నుంచి వారు ఎక్కడున్నారు? ఎలా ఉన్నారనే విషయాలేవి తెలియలేదని కుటుంబ సభ్యులు చెప్పారు.

బంగ్లాదేశ్‌లో పోలీసులు అదుపులో ఉందని చెబుతోన్న IND-AP-V5-MM-735 నెంబరు, ANI I అనే పేరు గల బోటులో బయలుదేరిన 9 మంది మత్స్యకారుల ఫోన్లు ఇప్పుడు పని చేయడం లేదు.

వారి పరిస్థితి తెలియక కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

అధికారుల, నాయకుల పరామర్శలు, భరోసాలు జరిగిపోయాయి. కానీ, ఇప్పటి వరకు ఎలాంటి సానుకూల సమాచారం ఈ కుటుంబాలకు చేరలేదు.

నూకాలమ్మ
ఫొటో క్యాప్షన్, నూకాలమ్మ

జైల్లో ఉన్నారా? లేదా?

తన కొడుకు గురించి చెప్తూ నూకాలమ్మ కన్నీళ్లు పెట్టుకున్నారు.

"కనీసం వాళ్లు జైల్లో ఉన్నారా? లేదా? అదే మాకు గుండె పీకుతోంది. తింటున్నారా? ఉంటున్నారా? ఏమీ తెలియదు" అంటూ ఆమె ఏడుస్తూనే ఉన్నారు.

తన కొడుకు ప్రవీణ్ గురించి ఏ చిన్న సమాచారం వచ్చినా చాలని ఆమె ఎదురు చూస్తున్నారు.

"మా అబ్బాయి తెస్తే మేం తింటాం, లేదంటే లేనట్లే. మావాడి వయసు 20 సంవత్సరాలు. నాకు ఇద్దరు ఆడపిల్లలు కూడా ఉన్నారు. ఇంటి అద్దెలు కూడా కట్టలేకపోతున్నాం. మాకు ఇప్పుడు దిక్కే లేదు" అని ఆమె బీబీసీతో అన్నారు.

అనిత
ఫొటో క్యాప్షన్, అనిత

'ఫోన్ స్విచ్ ఆఫ్' అదే భయం మొదలైన రోజు

"విశాఖపట్నం నుంచి 13న వేటకు వెళ్లారు. 14, 15 తేదీల్లో ఫోన్లు పని చేశాయి. ఆ రెండు రోజులు నాకు ఫోన్ వచ్చింది. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. వేటలో ఏవో ఇబ్బందులు వస్తుంటాయి, అలాంటిదేమో అనుకున్నాం. అక్టోబర్ 22న ఆ బోటు యజమాని ఇంటికి వచ్చారు. వారి ఆధార్ కార్డులు అడిగారు. వాళ్లు బంగ్లాదేశ్‌లో చిక్కుకుపోయారని చెప్పారు" అని అనిత గుర్తు చేసుకున్నారు.

"ఇప్పుడు నాకు తొమ్మిది నెలలు. డెలివరీ సమయానికి మీ భర్త మీ ఇంట్లో ఉంటారని అధికారులు చెప్పారు. కానీ, ఆయన ఆచూకీ ఇంకా లేదు. మాట లేదు. ఏమీ లేదు" అంటూ.. చెప్తున్న ఆమె మాటలు ఆగిపోయి, కన్నీళ్లు బయటకు వచ్చాయి.

కొండ
ఫొటో క్యాప్షన్, పిల్లలు నాన్న కోసం అడుగుతున్నారని కొండ అన్నారు.

'పిల్లలను సముదాయించలేకపోతున్నాం'

స్కూల్‌కి వెళ్లిన పిల్లల కోసం ఎదురు చూస్తున్న వాసుపల్లి యర్రమ్మ మాటల్లోనూ అదే బాధ. ఆమె పిల్లలు పది, ఎనిమిదవ తరగతులు చదువుతున్నారు.

కొండ అనే మహిళ కూడా తన పిల్లలు తండ్రి కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.

"పిల్లలు అడుగుతుంటారు. నాన్న ఎక్కడికి వెళ్లాడని. వచ్చేస్తారు, ఇక్కడికెళ్లారు, అక్కడికెళ్లారని చెప్తున్నాం. వేటకు వెళ్తే 20 రోజులకో, నెల రోజులకో వచ్చేసే తమ తండ్రి ఇన్ని రోజులైనా.. ఇంటికి రాకపోవడంతో ఇప్పుడు వారి ప్రశ్నలకు నేను చెప్తున్న సమాధానం సరిపోవడం లేదు" అని కొండ ఆవేదన వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారుల బోటు

ఫొటో సోర్స్, Janaki ram

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతలు...ఇక్కడ భయాలు

బంగ్లాదేశ్ పోలీసులకు పట్టుబడిన వారిలో నక్క రమణ, వాసుపల్లి సీతయ్య, మైలపల్లి అప్పన్న, మరుపల్లి చినఅప్పన్న, మరుపల్లి రమేష్, సూరాడ అప్పలకొండ, మరుపల్లి ప్రవీణ్, సురపతి రాము, సురపతి చినఅప్పన్న ఉన్నారని బంగ్లాదేశ్ మీడియా తన కథనాల్లో పేర్కొంది.

ఈ మత్స్యకారులతో పాటు వారి బోటును కూడా అధికారులు అదుపులోకి తీసుకున్నట్టు అక్కడి కథనాలు చెబుతున్నాయి.

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో తమ వారి పరిస్థితి ఏమై ఉంటుందోనన్న భయం కుటుంబాల్లో పెరుగుతోంది.

"అక్కడ యుద్ధాలు జరుగుతున్నాయట. అందుకే వారిని తీసుకుని రావడం లేటవుతుందని పెద్దోళ్లు చెప్తున్నారు. వాళ్లు ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి కనీసం ఒక ఫోన్ కాల్ అయినా చేయించమని అడుగుతున్నాం" అని సీతమ్మ అన్నారు.

ఆమె సోదరుడు సీతయ్య బంగ్లాదేశ్ కోస్టు గార్డు అదుపులో ఉన్న 9 మందిలో ఒకరు.

బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారులు

ఫొటో సోర్స్, Janaki ram

ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో చిక్కుకున్న మత్స్యకారులు ఇలా సంకెళ్లతో మీడియాలో కనిపించారు.

ఆర్థిక స్థితి దిగజారుతోంది

ఇంటి వద్ద పరిస్థితి రోజురోజుకు దిగజారుతోందని కుటుంబాలు చెబుతున్నాయి. వేటకు వెళ్లి తమ వారు తీసుకొచ్చే ఆ కాస్త డబ్బులే తమ కుటుంబాలకు ఆధారమని చెబుతున్నారు.

ఇప్పుడు రెండు నెలలకు పైగా వారు ఇంటికి చేరకపోవడంతో వారి యోగక్షేమాలపై ఆందోళన పెరుగుతోంది. అలాగే ఇంటి వద్ద ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుందని అంటున్నారు.

"మా వాళ్లు వేటకు వెళ్లి దాదాపు ఇరవై రోజులు పని చేస్తే పది వేలు దొరుకుతాయి. అదే మాకున్న ఆధారం. కనీసం తింటున్నామా? ఉంటున్నామా? అని ఎవరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం అద్దెలు కట్టలేని పరిస్థితికి వచ్చాం. తెలిసిన వారు సాయం చేస్తే తింటున్నాం" అని నూకాలమ్మ అన్నారు.

బంగ్లాదేశ్ అధికారులు ఏమన్నారంటే...

మత్స్యకారుల యోగక్షేమాలపై వారి కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తోన్న నేపథ్యంలో బంగ్లాదేశ్ విదేశాంగ శాఖను సంప్రదించి మత్స్యకారుల యోగక్షేమాలపై సమాచారం కోరింది బీబీసీ.

అయితే, ఇప్పటివరకు వారి నుంచి స్పందన రాలేదు. సమాధానం వచ్చిన వెంటనే తెలియజేస్తాం.

మరోవైపు, బంగ్లాదేశ్‌లో బందీలుగా ఉన్న మత్స్యకారులకు న్యాయ సహాయం అందించడంతో పాటు వారిని స్వదేశానికి క్షేమంగా రప్పించేందుకు అన్ని స్థాయిల్లో చర్యలు వేగవంతం చేశామని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి తెలిపారు.

వాసుపల్లి జానకిరామ్
ఫొటో క్యాప్షన్, బంగ్లాదేశ్‌లో అధికారులను కలిసిన యూనియన్ నాయకులు వాసుపల్లి జానకిరామ్

బంగ్లాదేశ్‌లో మత్స్యకార యూనియన్లు...

మత్స్యకార సంఘాల నాయకులు బంగ్లాదేశ్ వెళ్లి వారిని విడిపించే ప్రయత్నాలు చేస్తున్నట్టు చెబుతున్నారు.

"బంగ్లాదేశ్ అధికారులు ఇక్కడి జైల్లో ఉన్న మత్స్యకారులను... భారతీయులను కలవడానికి అనుమతి లేదని చెప్పారు. వీరి కేసు ఫిబ్రవరి 18కి వాయిదా వేశారు" అని ఈస్ట్ కోస్ట్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వాసుపల్లి జానకిరామ్ తెలిపారు. ఆయన బంగ్లాదేశ్ వెళ్లి అక్కడి అధికారులను కలిశారు.

బంగ్లాదేశ్, ఇండియాల మధ్య ఉన్న ఒప్పందాల ప్రకారం మత్స్యకారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదనీ, త్వరలోనే వారు విడుదల అవుతారని బంగ్లాదేశ్ అధికారులు చెప్పారని జానకిరామ్ అన్నారు.

కుటుంబ పోషణ కోసం సముద్రంలోకి వెళ్లిన తమ వారు తిరిగి రావాలని, కనీసం ఒక్క ఫోన్ కాల్ అయినా రావాలని కోరుకుంటూ ఆ తొమ్మిదిమంది మత్స్య కారుల కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు.

మరోవైపు పుట్టబోయే బిడ్డకు తండ్రి ముఖం చూపించగలమా అన్న ప్రశ్న అనిత మనసులో ప్రతిరోజూ మెదులుతూనే ఉంది.

‘పండగ నాటికి మా ఆయన వచ్చేస్తాడా’ అంటూ అనిత అందర్ని అడుగుతున్న ప్రశ్నకు సమాధానం ఏంటో, ఎప్పుడు వస్తుందో మాత్రం తెలియడం లేదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)