రాజస్థాన్: పాఠశాల భవనం కూలడంతో మరణించిన పిల్లల అంత్యక్రియలకు టైర్లు వాడారా?

ఫొటో సోర్స్, Anees Alam
- రచయిత, మొహర్ సింగ్ మీనా
- హోదా, బీబీసీ కోసం
రాజస్థాన్‌లోని ఝలావర్‌లోని ఓ స్కూల్ బల్డింగ్ కూలి ఏడుగురు మృతి చెందిన ప్రమాదం ఓ పెద్ద ప్రశ్నను లేవనెత్తుతోంది.
ఈ ఘటనలో మృతిచెందిన పిల్లల దహనక్రియలలో సైకిల్, మోటార్‌సైకిళ్ల టైర్లు వినియోగించారనే ఆరోపణలు వచ్చాయి.
బడి భవనం పైకప్పునుంచి పెళ్లలు రాలిపడుతున్నాయని ఫిర్యాదులు చేసినా టీచర్లు పట్టించుకోలేదని ఈ ప్రమాదంలో గాయపడిన పిల్లలు, వారి కుటుంబసభ్యులు ఆరోపించారు.
అంత్యక్రియలలో టైర్లు వినియోగించారనే ఆరోపణలను ఝలావర్ కలెక్టర్ అజయ్ సింగ్ రాథోడ్ ఖండించారు. పాఠశాల భవనం కూలిపోవడంపై విచారణ జరుగుతోందని, నిర్లక్ష్యం ఉందని తేలితే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని ఆయన బీబీసీకి చెప్పారు.
ఈ ఘటనలో కొందరు ఉపాధ్యాయులను, ఐదుగురు అధికారులను సస్పెండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్ సంస్థకు చెందిన ఇంజనీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.
సస్పెండ్ అయిన టీచర్లు బీబీసీతో మాట్లాడారు.


ఫొటో సోర్స్, Anees Alam
అసలేం జరిగింది?
రాజస్థాన్‌లోని ఝలావర్ జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో మనోహర్ పోలీసుస్టేషన్ పరిధిలోని పిప్లోడి గ్రామంలోని ఓ ప్రభుత్వ పాఠశాల భవనంలోని రెండుగదులు హఠాత్తుగా కూలిపోయాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు విద్యార్థులు చికిత్స పొందుతూ మృతిచెందారు.
ప్రమాదంపై గ్రామస్తులు ఆగ్రహంతో అధికారులకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రమాదంలో చనిపోయిన ఏడుగురు పిల్లలకు శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు.
వీరి అంత్యక్రియలలో సైకిల్, మోటారుసైకిల్ టైర్లు వాడారంటూ సోషల్ మీడియాలో ప్రచారమైంది.
‘‘పేదలు కావడం వల్ల ఇదేనా శిక్ష? చదువుకోవడానికి బడికి వెళ్తే, అది కూలిపోయి చనిపోతే, వారి చితికి కట్టెలతో కాకుండా, రబ్బర్‌టైర్లతో నిప్పుపెట్టారు. నాకు నోటమాట రావడంలేదు. నా మనసు వికలమైపోయింది’’ అంటూ కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ సోషల్ మీడియాలో ఓ ఫోటో పోస్టు చేశారు.
దహనక్రియలలో టైర్లు వాడారన్న ప్రచారంపై ఝలావర్ కలెక్టర్ అజయ్ సింగ్ రాథోడ్ బీబీసీతో మాట్లాడారు. ‘‘అలాంటిదేమీ జరగలేదు. కట్టెలు సహా కావాల్సిన సామగ్రినంతా అందజేశాం. అక్కడ మొత్తం మూడు స్మశానవాటికలు ఉన్నాయి. ఒకచోట నలుగురి మృతదేహాలను ఖననం చేశారు. నేను కూడా అక్కడే ఉన్నాను. మరో చోట రెండు, ఇంకోచోట ఒక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అన్నిచోట్లకు అధికారులు హాజరయ్యారు’’ అని చెప్పారు.
‘‘ఈ ప్రాంతంలో చితి పక్కన టైర్లను ఉంచుతుంటారు. వానొస్తే కట్టెలు తడిసిపోయి కాలవనే ఉద్దేశంతో వాటిని అక్కడ ఉంచుతుంటారు. కానీ నేను వాటిన్నంటినీ తీసివేయాలని చెప్పాను’’ అని తెలిపారు.
కానీ అంత్యక్రియలలో టైర్లు వాడిన ఘటనకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. దీనిపై సర్పంచ్ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘‘అక్కడ చాలామంది గ్రామస్థులు హాజరయ్యారు. వారిలో ఎవరో ఒకటో రెండో సైకిల్ టైర్లు వేశారు. తరువాత వాటిని తీసేశారు’’ అని చెప్పారు.
స్కూలు ప్రమాదంలో గాయపడిన 11మంది విద్యార్థులు ఇంకా ఎస్ఆర్‌జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన, గాయపడిన పిల్లల్లో ఎక్కువమంది బిల్ గిరిజన తెగ, దళిత కుటుంబాలకు చెందినవారే.
శుక్రవారం సాయంత్రం పోస్ట్‌మార్టమ్ పూర్తయ్యాక, శనివారం ఉదయం మొత్తం ఏడుగురు పిల్లల అంత్యక్రియలు జరిగాయని ఝలావర్ అదనపు కలెక్టర్ అభిషేక్ చరణ్ బీబీసీకి ఫోన్ ద్వారా తెలిపారు.
ఈ ప్రమాదానికి అసలు కారణమేమిటనేది విచారణ పూర్తయిన తరువాతే తెలుస్తుందని ఝలావర్ కలెక్టర్ అజయ్ సింగ్ రాథోడ్ చెప్పారు.

ఫొటో సోర్స్, Anees Alam
బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి?
ప్రస్తుతం ఝలావర్‌లోని ఎస్ఆర్‌జీ ఆస్పత్రిలో 11 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారని, వీరిలో ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.
పదకొండేళ్ల అనురాధ తన ఇద్దరు అక్కలు పాయల్, సునీతతో కలిసి ఒకే పాఠశాలలో చదువుతోంది. ఈ ప్రమాదంలో ఆరో తరగతి చదువుతున్న అనురాధ చేతికి ఫ్రాక్చర్ కాగా, ఆమె అక్క పాయల్ మృతి చెందింది.
ఆస్పత్రిలో ఉన్న ముగ్గురు చిన్నారుల పరిస్థితి విషమంగా ఉందని అనురాధ బంధువు సందీప్ తెలిపారు.
ఈ ప్రమాదంలో గాయపడిన బాదల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మూడో తరగతి చదువుతున్నాడు. రఘువీర్ మేనమామ రాంగోపాల్ ఆసుపత్రి నుంచి బీబీసీతో ఫోన్లో మాట్లాడుతూ ‘‘బాదల్ నడుము, మోకాలికి మధ్య గాయమైంది. అతను లేవలేడు, కూర్చోలేడు."
‘‘ఏడాదిన్నర క్రితమే పాఠశాల అభివృద్ధి కోసం మాట్లాడాం. కానీ, ఏమీ జరగలేదు’’ అన్నారు.

ఫొటో సోర్స్, Anees Alam
పిల్లలు ఏమంటున్నారు?
ఎస్ఆర్‌జీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజు అనే బాలిక ఐదో తరగతి చదువుతోంది. ప్రమాదంలో ఆ బాలిక చేతులు, కాళ్లు విరిగిపోయాయని ఆమె తల్లి గాయత్రి బాయి భిల్ చెప్పారు.
‘‘పిల్లలు పాఠశాలలోని ఓ గదిలో ఉన్నారని, పైకప్పుపై నుంచి రాళ్లు పడటం మొదలైనప్పుడు కొందరు పిల్లలు పారిపోయారు, మరికొందరు పరుగెత్తలేకపోయారు. ఈలోగా పైకప్పు మొత్తం కూలిపోయిందని రాజుచెప్పింది’’ అని గాయత్రిబాయి తెలిపారు.
దీనిపై ఓ విద్యార్థి ఏఎన్ఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ .. ‘‘మేం బయట శుభ్రం చేస్తున్నాం. లోపల కూర్చుని ఉన్న పిల్లలు ‘‘దీదీ, రాళ్లు పడుతున్నాయి అని చెప్పారు. కానీ దీదీ రాళ్లేం పడటం లేదంటూ వారిని కూర్చోబెట్టారు’’ అని ఆ విద్యార్థి ఆరోపించారు.
‘‘ఆ సమయంలో టీచర్ బయటకూర్చుని పోహా తింటున్నారు. మేం బయట శుభ్రం చేస్తున్నాం. హఠాత్తుగా పైకప్పు కూలిపోయి పిల్లలు దాని కింద కూరుకుపోయారు’’ అని ఆ విద్యార్థి చెప్పారు.
మరో విద్యార్థిని 14 ఏళ్ల వర్ష కూడా మీడియాతో మాట్లాడుతూ "మేం దీదీకి చెప్పినప్పుడు, ఆమె మమ్మల్ని బెదిరించి కూర్చోబెట్టింది. కాసేపటి తర్వాత తలుపు దగ్గర ఉన్న పిల్లలు పారిపోగా లోపల ఉన్న వారిని అలాగే కూర్చోనిచ్చారు. టీచర్ బయట కూర్చుని బ్రేక్‌ఫాస్ట్ తింటున్నారు’’ అని తెలిపింది.
టీచర్లు ఏం చెబుతున్నారు?
ఈ ఘటన తరువాత జిల్లా విద్యాశాఖాధికారి నార్సో మీనా ఐదుగురు టీచర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఇద్దరు టీచర్లు బీబీసీతో ఫోన్లో మాట్లాడుతూ తమపై వచ్చిన ఆరోపణలను ఖండించారు.
‘‘ఇది చాలా విషాదకర సంఘటన. తాను పాఠాలు చెప్పే పిల్లలకు ఇలా అయితే ఏ టీచర్‌కైనా జీవితంలో అదో విషాదకర క్షణం అవుతుంది’’ అని సస్పెండ్ అయిన జావెద్ అహ్మద్ చెప్పారు.
‘‘అప్పుడు సమయం ఉదయం 7గంటల 30 నిమిషాలవుతోంది. తరగతి గదుల తాళాలు తెరిచారు. ఆ టైమ్‌లో టీచర్లు టిఫిన్ చేస్తున్నారనే ఆరోపిస్తున్నారు. అలాంటిదేమీ లేదు. బయట ప్రార్థన జరిగే ప్రాంతమంతా వర్షం కారణంగా చిత్తడిగా ఉంది. అందుకే ప్రార్థన కోసం పిల్లలను గదుల్లోనే కూర్చోబెట్టాం’’ అని ఆయన చెప్పారు.
‘‘నేను ప్రార్థన చేయించడానికి క్లాసురూములోకి వెళ్లినప్పుడు అక్కడ కొంతమంది పిల్లలే ఉన్నారు. మిగిలినవారంతా ఏమయ్యారు అని అడిగితే గ్రౌండ్‌లో ఉన్నారని పిల్లలు చెప్పారు. నేను గ్రౌండ్‌లో ఉన్న పిల్లలను పిలవడానికి బయటికిరాగానే , తరగతి గదులు కూలిపోవడం మొదలయ్యాయి. అంతా క్షణాల్లో జరిగిపోయింది’’ అని జావెద్ అహ్మద్ తెలిపారు.
‘‘సంఘటన జరిగిన సమయంలో నేను బడిలో లేను. నేను విధినిర్వహణలో భాగంగా వేరే పనిపై బయట ఉన్నారు. నేను సంఘటన జరిగిన తరువాత ఉదయం 9గంటల సమయానికి బడికి చేరుకున్నాను’’ సస్పెండ్ అయిన మరో టీచర్ బద్రి ప్రసాద్ బీబీసీకి ఫోన్‌లో చెప్పారు.
దీని తరువాత విద్యాశాఖామంత్రి మదన్ దిలావర్ ఆదేశాల మేరకు విద్యాశాఖ కార్యదర్శి కృష్ణ కునాల్, ఝలావర్ జిల్లా ప్రాథమిక విద్యాశాఖాధికారి నార్సో మీనా, చీఫ్ బ్లాక్ విద్యాశాఖాధికారి ప్రమోద్ కుమార్ బాలసోరియాను సస్పెండ్ చేశారు. అలాగే కాంట్రాక్ట్‌పై విధులు నిర్వహిస్తున్న జూనియర్ ఇంజనీర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు.

ఫొటో సోర్స్, Anees Alam
శిథిలావస్థలో ఉన్న భవనాల జాబితాలో పాఠశాల ఉందా?
శిథిలావస్థలో ఉన్న భవనాల జాబితాలో ఈ పాఠశాల లేనప్పుడు ప్రమాదం ఎలా జరిగిందని కలెక్టర్ అజయ్ సింగ్ రాథోడ్‌ను బీబీసీ అడిగింది.
జిల్లా విద్యాశాఖాధికారి పంపిన శిథిలావస్థలో ఉన్న పాఠశాలల జాబితాలో ఈ స్కూలు లేదని కలెక్టర్ చెప్పారు.
‘‘పాఠశాల పరిస్థితి గురించి చెప్పాల్సిన బాధ్యత టీచర్లపై ఉంది. నిన్న కూడా టీచర్లు సమస్యేమీ లేదని చెప్పారు’’ అని కలెక్టర్ తెలిపారు.
పాఠశాల గదులు శిథిలావస్థకు చేరాయా, మరమ్మతులు అవసరమా? ఈ ప్రశ్నకు సస్పెన్షన్‌కు గురైన ఉపాధ్యాయుడు బద్రి ప్రసాద్ మాట్లాడుతూ ‘‘ఈ గదులు ఎప్పుడూ వర్షానికి కారలేదు, మిగతా రెండు గదులు కారేవి. అందుకే చాలా కాలం క్రితమే ఆ రెండు గదులకు తాళాలు వేశాం’’ అని చెప్పారు.
అదే సమయంలో ఏడాదిన్నర క్రితం పాఠశాల దుస్థితిపై నిరసన వ్యక్తం చేసినట్లు స్థానికులు చెప్తున్నారు.
దీనిపై అదనపు కలెక్టర్ అభిషేక్ చరణ్ బీబీసీతో మాట్లాడుతూ ‘‘స్థానిక ఎస్డీవో నుంచి మాకు ఎలాంటి సమాచారం అందలేదు. 2022-23 సంవత్సరంలో లక్ష రూపాయల వ్యయంతో పైకప్పులను వాటర్ ప్రూఫ్‌గా మార్చినట్లు మా రికార్డుల్లో ఉంది’’ అని చెప్పారు.

ఫొటో సోర్స్, Anees Alam
స్కూలు ఎప్పుడు ఏర్పాటైంది?
స్థానిక మన్‌పాసర్ గ్రామ పంచాయతీలో ఇదొక్కటే ఒకటో తరగతి నుంచి 8వ తరగతివరకు ఉన్న ప్రభుత్వ పాఠశాల అని, మొత్తం 72మంది పిల్లలు చదువుతున్నారని స్థానికులు చెప్పారు.
ఈ స్కూల్‌ను 1988లో ఏర్పాటు చేశారని వారు తెలిపారు. ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పునాది కుంగిపోవడంతో గోడలు, పైకప్పు కూలిపోయాయన్నారు.
ప్రభుత్వం మృతుల కుటుంబాలకు ఒకొక్కరికి పదిలక్షల రూపాయల ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి క్లాస్ 4 కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించింది.
‘‘తీవ్రంగా, పాక్షికంగా గాయపడినవారికి కూడా ఆర్థిక సాయం అందుతుంది’’ అని జిల్లా కలెక్టర్ అజయ్ సింగ్ రాథోడ్ చెప్పారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














