బంగ్లాదేశ్‌తో సంబంధాల విషయంలో భారత్ తప్పటడుగులు వేసిందా? ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ రిపోర్టు ఏం చెబుతోందంటే..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, రజనీశ్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణం చేసిన తర్వాత నెల రోజుల నుంచి షేక్ హసీనాకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్‌లో ప్రజలు వీధుల్లోకి వచ్చి పోరాటం మొదలుపెట్టారు.
ఈ నిరసనలు ఆగస్టు 5న తీవ్ర హింసాత్మకంగా మారాయి. షేక్ హసీనా తన ప్రాణాలను కాపాడుకోవడానికి భారత్‌కు రావాల్సి వచ్చింది. బంగ్లాదేశ్‌లో నిరంకుశ పాలనను కొనసాగించారని ఆమెపై ఆరోపణలు ఉన్నాయి.
బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడిగా పేరున్న హసీనా తండ్రి ముజిబుర్ రెహమాన్‌కు, భారత్‌తో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయి. షేక్ హసీనా, భారత్ మధ్య సంబంధాలు కూడా అదే విధంగా కొనసాగాయి. అయితే, భారత్ మద్దతుతోనే షేక్ హసీనా అధికారంలో ఉన్నారని బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్షాలు, షేక్ హసీనా వ్యతిరేకులు ఆరోపిస్తూ వచ్చారు.
గతేడాది ఆగస్టులో షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం ఇచ్చిన తర్వాత బంగ్లాదేశ్‌లో యాంటీ-ఇండియా సెంటిమెంట్ మరింత పెరిగింది.
బంగ్లాదేశ్‌ను భారత్ ఎప్పుడూ షేక్ హసీనా కుటుంబ దృష్టితోనే చూస్తోందని, అంతకు మించి చూసేందుకు ఎప్పుడూ ప్రయత్నించలేదని బంగ్లాదేశ్ మీడియా అంటోంది.


ఫొటో సోర్స్, @DrSJaishankar
ఐసీజీ ఏం చెబుతోంది?
ఈ నెల డిసెంబర్ 23న బ్రస్సెల్స్‌కు చెందిన లాభాపేక్ష లేని పరిశోధనా సంస్థ ఇంటర్నేషనల్ క్రైసిస్ గ్రూప్ (ఐసీజీ) భారత్-బంగ్లాదేశ్ సంబంధాలపై 'ఆఫ్టర్ ది ''గోల్డెన్ ఎరా'': గెటింగ్ బంగ్లాదేశ్-ఇండియా టైస్ బ్యాక్ ఆన్ ట్రాక్ అనే పేరుతో 53 పేజీల రీసర్చ్ రిపోర్టును ప్రచురించింది.
గతేడాది ఆగస్టులో బంగ్లాదేశ్ ప్రధానమంత్రిగా షేక్ హసీనా తన పదవిని కోల్పోవడం భారత్‌కు తీవ్ర ఎదురు దెబ్బ అని ఈ నివేదికలో పేర్కొంది.
బంగ్లాదేశ్-భారత్ సంబంధాలపై ఐసీజీ తాజాగా విడుదల చేసిన నివేదికలో.. విలియం వ్యాన్ షెండెల్ పుస్తకం ‘ఏ హిస్టరీ ఆఫ్ బంగ్లాదేశ్' లోని కోట్‌ను కూడా చేర్చింది.
ఈ పుస్తకంలో ఇరు దేశాలు తమ సంబంధాల విషయంలో ఒకదానికొకటి ఎలా చూసుకుంటాయో వివరించారు.
‘ఏ హిస్టరీ ఆఫ్ బంగ్లాదేశ్’ పుస్తకంలో విలియం వ్యాన్ షెండెల్ రాసిన వివరాల్లో, '' బంగ్లాదేశ్ స్వాతంత్య్రానికి భారత్ మద్దతు ఇచ్చినప్పటికీ, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు శత్రుత్వంలా కాకపోయినా, తరచూ ఉద్రిక్తంగానే ఉండేవి. బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించడంలో ఒకరి పాత్రను మరొకరు తక్కువ చేసుకునే కథనాలను రెండు దేశాలు ప్రోత్సహించేవి’’ అని పేర్కొన్నారు.
‘‘స్వాతంత్య్ర పోరాటంలో న్యూదిల్లీ సహకారానికి తగినంత కృతజ్ఞతను బంగ్లాదేశ్ చూపించలేదని భారత్‌లో ఒక దృక్ఫథం ఉంది. అలాగే, భారత్ కేవలం తన సొంత వ్యూహాత్మక ప్రయోజనాలకు మాత్రమే జోక్యం చేసుకుంటుందని.. స్వతంత్ర బంగ్లాదేశ్‌ను ఒక శాటిలైట్ స్టేట్‌గా (మరోదేశం నియంత్రణలో,అత్యధిక రాజకీయ ప్రాబల్యంతో నడిచే దేశంగా) భావించి, ఏహ్య భావంతో చూస్తుందని ఆ దేశ ప్రజలు విస్తృతంగా భావిస్తున్నారు'' అని రాశారు.
భారత విదేశాంగ వ్యవహారాల జర్నల్‌లో స్మృతి ఎస్. పట్నాయక్ రాసిన ఆర్టికల్‌ను కూడా ఈ నివేదిక కోట్ చేసింది.
ఈ జర్నల్‌లోని ఆర్టికల్‌లో, ''ఢాకాలో అవామీ లీగ్ అధికారంలో ఉందా? లేదా? అనేది ద్వైపాక్షిక సంబంధాలను నిర్ణయించే అత్యంత కీలక అంశంగా మారింది. బంగ్లాదేశ్‌లో తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఈ పార్టీని అత్యంత ముఖ్యమైనదిగా భారత్ చూసింది. మరికొన్నిసార్లు, భారత్-బంగ్లాదేశ్‌లు సమతుల్య సంబంధాలను నిర్వహించుకోవడంలో ఇబ్బంది పడ్డాయి. ఒకదానిపై మరొకటి అనుమాన పడటం, రెచ్చగొట్టుకోవడం వంటివి పదేపదే జరిగాయి'' అని రాశారు.
రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించడంపై డిసెంబర్ 22న ఢాకాలోని ప్రముఖ ఆంగ్ల వార్తా పత్రిక 'ది డైలీ స్టార్' ఒక ఎడిటోరియల్‌ను రాసింది.
''షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్‌కు భారత్ ఇచ్చిన స్థిరమైన మద్దతు ద్వారానే ఎన్నో సంవత్సరాలుగా భారత్, బంగ్లాదేశ్ సంబంధాల మధ్య పునాది బలపడిందని పునరుద్ఘాటించడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రస్తుతం ఈ పార్టీ అధికారాన్ని కోల్పోయింది. రెండు దేశాల మధ్య పునాది కూడా తీవ్రంగా దెబ్బతిన్నది'' అని డైలీ స్టార్ రాసింది.
''ఈ దెబ్బతిన్న ప్రాంతంలో ఉన్న ఖాళీని పరస్పర అనుమానం పూరిస్తోంది. బంగ్లాదేశ్‌కు వ్యతిరేకంగా పన్నాగాలు పన్నుతూ, పారిపోయిన వారికి న్యూదిల్లీ సురక్షితమైన ప్రదేశంగా మారిందని ఢాకా భావిస్తోంది. అలాగే, బంగ్లాదేశ్‌లో మెజారిటీ వర్గాల అరాచకం పెరుగుతోందని భారత్ ఆందోళన చెందుతోంది. మైనార్టీల రక్షణ విషయంలో తాత్కాలిక ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భారత్ భావిస్తోంది. వీరి భద్రత విషయంలో ఢాకా భరోసా తగినంతగా లేదని విమర్శిస్తోంది'' అని డైలీ స్టార్ తన ఎడిటోరియల్ కథనంలో రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
హసీనా వైపు మొగ్గు ఎందుకంటే..
జియా-ఉర్-రెహమాన్, ఖలీదా జియాలు భారత్ ప్రయోజనాలు దెబ్బతీస్తుండటంతో, భారత్ తప్పనిసరి పరిస్థితుల్లో షేక్ హసీనాకు మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని దిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని సౌత్ ఏషియన్ స్టడీస్ సెంటర్ ప్రొఫెసర్ మహేంద్ర పీ లామా భావిస్తున్నారు.
''తూర్పు పాకిస్తాన్ కారణంగా భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాలతో దాదాపు సంబంధాలు తెగిపోయాయి. అప్పుడు, బంగ్లాదేశ్ ఏర్పాటు ఒక ఆశను తీసుకొచ్చింది. షేక్ ముజిబుర్ రెహమాన్, షేక్ హసీనా పదవీ కాలాల్లో ఈ ఆశ సజీవంగా మిగిలింది. అయితే, బంగ్లాదేశ్‌లోని జియా-ఉర్-రెహమాన్, హుస్సేన్ మొహమ్మద్ ఇర్షాద్‌లు భారత ప్రయోజనాలను దెబ్బతీశారు. అలాంటి పరిస్థితుల్లో షేక్ హసీనా, అవామీ లీగ్‌ను భారత్ బలపర్చాల్సి వచ్చింది'' అని ప్రొఫెసర్ లామా చెప్పారు.
''కానీ, బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా తనకు తాను ఆదరణ కోల్పోయినప్పుడు, భారత్ తన విధానాన్ని మార్చుకోవాల్సి ఉంది. 2023 ఎన్నికల్లో షేక్ హసీనాను భారత్ సమర్థించి ఉండకూడదు. కుప్పకూలుతుందనే ప్రమాదం ఉన్నప్పటికీ అవామీ లీగ్‌ను గెలిపించేందుకే భారత్ అన్ని విధాలా ప్రయత్నించింది. కేవలం బంగ్లాదేశ్‌లోనే కాదు. మాల్దీవులు, నేపాల్‌లో కూడా ఇలానే చేసింది'' అని అన్నారు.
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య సంబంధాల్లో అపనమ్మకం ఏర్పడేందుకు గల చారిత్రాత్మక కారణాలను కూడా ఐసీజీ తన నివేదికలో ప్రస్తావించింది.
''1975 ఆగస్టులో బంగ్లాదేశ్ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్య్రోద్యమ నాయకుడు షేక్ ముజిబుర్ రెహమాన్‌తో పాటు చాలామంది తన కుటుంబ సభ్యులు సైనిక తిరుగుబాటులో హత్యకు గురయ్యారు. ఈ ఘటన రెండు దేశాలకు టర్నింగ్ పాయింట్ అయింది. ఈ హత్యలు బంగ్లాదేశ్‌లో సైనిక పాలనకు దారితీశాయి. ముఖ్యంగా, 1976 నుంచి 1981 వరకు జియా-ఉర్-రెహమాన్ పాలనలో (ఆ తర్వాత సైన్యంలోని సభ్యులే జియా-ఉర్-రెహమాన్‌ను హత్య చేశారు), ఆ తర్వాత 1982 నుంచి 1990 మధ్య కాలంలో హుస్సేన్ మొహమ్మద్ ఇర్షాద్ పాలనలో బంగ్లాదేశ్ నడిచింది'' అని ఐసీజీ తన నివేదికలో పేర్కొంది.
''ఈ ప్రభుత్వాలు సమతుల్య విధానంలో భాగంగా భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్తాన్‌కు, ఇతర ముస్లిం-మెజార్టీ దేశాలకు, చైనాకు, అమెరికాకు దగ్గర అయ్యేందుకు ప్రయత్నించాయి. వారి పాలనను చట్టబద్ధం చేసుకుని, అవామీ లీగ్‌ను ఎదుర్కొనేందుకు జియా-ఉర్-రెహమాన్, ఇర్షాద్‌లు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ), జతియా పార్టీలను ఏర్పాటు చేశారు. జమాత్ ఏ ఇస్లామీని తిరిగి రాజకీయాల్లోకి అనుమతించడంతో పాటు షేక్ ముజిబుర్ రెహమాన్ ప్రభుత్వ లౌకిక విధానాలను పక్కన పెట్టారు. రాజకీయ లబ్ధి కోసం భారత వ్యతిరేక భావనను రెచ్చగొట్టారు'' అని ఐసీజీ రాసింది.

ఫొటో సోర్స్, Getty Images
ఇరు దేశాల మధ్య అపనమ్మకం
''ఢాకాలో 15 ఏళ్ల సైనిక పాలన కాలంలో.. భారత్-బంగ్లాదేశ్‌లు ఒకదానికొకటి ప్రధానంగా భద్రతా కోణంలోనే చూసుకునేవి. ఇరు దేశాలు తమ భూభాగాల్లో పనిచేసే తిరుగుబాటు గ్రూప్‌లకు మద్దతు ఇచ్చాయి. బంగ్లాదేశ్ చిట్టగాంగ్ కొండ ప్రాంతాల్లో (చిట్టగాంగ్ హిల్ ట్రాక్ట్స్) శాంతి బాహిని సంస్థకు న్యూదిల్లీ మద్దతు ఇచ్చేది'' అని ఐసీజీ రాసింది.
''అలాగే, ఈశాన్య భారత్‌లో ఆపరేట్ అయ్యే తిరుగుబాటుదారులకు ఆయుధాలను సరఫరా చేస్తూ ఢాకా సాయం చేసింది. బంగ్లాదేశీ గడ్డపై క్యాంపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది. 1980లలో, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు భారత్‌లో రాజకీయ సమస్యగా మారాయి. దీనికి స్పందనగా, సరిహద్దుల్లో న్యూదిల్లీ కంచెలు వేసింది. సరిహద్దు భద్రతను కట్టుదిట్టం చేసింది'' అని పేర్కొంది.
1990-91లో బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య పాలన తిరిగి రావడంతో ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడొచ్చన్న ఆశలు భారత్‌లో కలిగాయి. కానీ, బంగ్లాదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం బీఎన్‌పీ నేతృత్వంలో ఏర్పడింది.
ప్రధానమంత్రి ఖలీదా జియా 1992లో భారత్‌ను సందర్శించడం, రెండు దేశాల మధ్య సరికొత్త వాణిజ్య ఒప్పందంవంటి సానుకూల సంకేతాలు ప్రారంభంలో ఉన్నప్పటికీ, ఆ తర్వాత సంబంధాల మెరుగుదల ఆశలు నీరుగారిపోయాయి.
తిరుగుబాటుదారులకు బంగ్లాదేశ్ మద్దతు ఇస్తోందని భారత అధికారులు ఆరోపించారు. నీళ్ల పంపిణీ, సరిహద్దు విభజన వంటి కీలక ద్వైపాక్షిక విషయాల్లో కొంత పురోగతి కనిపించింది.
బీఎన్‌పీ ప్రభుత్వానికి జమాత్ ఏ ఇస్లామీ మద్దతు ఇస్తోందని భారత్ ఆరోపించిన తర్వాత ఈ అపనమ్మకం మరింత పెరిగింది.

ఫొటో సోర్స్, @ChiefAdviserGoB
భారత్‌లోని అంతర్గత రాజకీయాలు కూడా రెండు దేశాల మధ్య సంబంధాలను ప్రభావితం చేశాయి.
హిందూ జాతీయవాద భారతీయ జనతా పార్టీ ప్రభావం పెరగడం, 1992 డిసెంబర్‌లో బాబ్రీ మసీదు కూల్చడం వంటివి బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక భావనను మరింత పెంచాయి.
బాబ్రీ మసీదు కూల్చిన తర్వాత, బంగ్లాదేశ్‌లో హిందూ కమ్యూనిటీకి చెందిన వారిపై దాడులు జరిగాయి. భారత్‌లో హిందూ-ముస్లింల మధ్య మత ఘర్షణలు జరిగాయి.
భారత దేశీయ రాజకీయాల్లో ముస్లింల పట్ల ద్వేష రాజకీయాలు ఉంటే అది బంగ్లాదేశ్‌ను కూడా ప్రభావితం చేస్తుందని, అక్కడ ఉదారవాద ప్రజాస్వామ్యాన్ని ఆశించలేమని ప్రొఫెసర్ లామా అన్నారు.
గత 16 నెలలుగా భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు స్తంభించిపోయాయి. గత 10 రోజులుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
రెండు దేశాలు దౌత్యవేత్తలకు వరుసగా సమన్లు జారీ చేసి, ప్రకటనలు ఇచ్చాయి.
భద్రతా కారణాలతో, భారత్‌లో దిల్లీ సహా నాలుగు ప్రాంతాల్లో వీసా సర్వీసులను ఢాకా నిలిపివేసింది. అలాగే, భారత్ కూడా ఢాకాతో సహా నాలుగు ప్రాంతాల్లో వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ మీడియాలోనూ ఇదే చర్చ
బంగ్లాదేశ్‌లో ప్రముఖ వార్తా పత్రిక ‘ప్రథమ్ ఆలో’ డిసెంబర్ 25నాటి ఇంగ్లీష్ ఎడిషన్‌లో 'విల్ ఇండియా మూవ్ బియాండ్ ఇట్స్ డిపెండెన్సీ ఆన్ ది అవామీ లీగ్? (అవామీ లీగ్‌పై ఆధారపడటానికి మించి భారత్ ముందుకు వెళ్తుందా?)' అనే హెడ్‌లైన్‌తో ఒక కథనాన్ని ప్రచురించింది.
''అంతగా జనాదరణ లేని, తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోన్న ఒక పాలకురాలితో సన్నిహిత సంబంధాలు బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక భావాన్ని మరింత పెంచాయి. ప్రజలు పెద్ద ఎత్తున చేపట్టిన నిరసనల ద్వారా హసీనా అధికారాన్ని కోల్పోయిన తర్వాత భారత్‌కు ఈ పరిస్థితి ప్రతికూలంగా మారింది'' అని ప్రథమ్ ఆలో రాసింది.
హసీనా 15 ఏళ్ల నిరంకుశ పాలనలోని ఢాకా-దిల్లీ సంబంధాల ''గోల్డెన్ చాప్టర్'' భవిష్యత్ ప్రస్తుతం తీవ్ర అనిశ్చిత పరిస్థితిని ఎదుర్కొంటోంది.
గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత, తాత్కాలిక ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ తాత్కాలిక ప్రభుత్వ పాలనలో ద్వైపాక్షిక సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. గతేడాది డిసెంబర్ నుంచి సంబంధాలు క్షీణించాయి. కానీ, ఈ స్థాయిలో కాదు.
''ఢాకా, దిల్లీ మధ్యలో ఇంత అపనమ్మకం, అనుమానాన్ని నేనెప్పుడూ చూడలేదు. అంతర్జాతీయ నిబంధనలు ప్రకారం, ఇరుదేశాలు దౌత్య కార్యాలయాలకు భద్రత కల్పించాలి. రెండు పొరుగుదేశాలు, ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉన్నందున భారత్ వాస్తవాన్ని అంగీకరించి, బంగ్లాదేశ్‌తో ఉన్న సంబంధాల విషయంలో నమ్మకాన్ని పునరుద్ధరించే కార్యక్రమాన్ని చేపట్టాలి'' అని ప్రథమ్ ఆలో పత్రికతో బంగ్లాదేశ్‌కు మాజీ యూఎస్ అంబాసిడర్ అయిన ఎం. హుమాయూన్ కబీర్ చెప్పారు.
బీఎన్‌పీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ తారిఖ్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత డిసెంబర్ 25న లండన్ నుంచి ఢాకాకు తిరిగి వచ్చారు.
బీఎన్‌పీ కనుక అధికారంలోకి వస్తే.. బంగ్లాదేశ్ ప్రధాని రేసులోకి తారిఖ్ రెహమాన్ కూడా అడుగు పెడుతుండొచ్చు.
అయితే, భారత్‌తో బీఎన్‌పీ సంబంధాలే అసలైన ప్రశ్న. ఈ నెల ప్రారంభంలో ఖలీదా జియా ఆరోగ్యం బాగుండాలని, ఆమె చికిత్సకు సాయం చేస్తామని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
''బీఎన్‌పీ అధ్యక్షురాలు బేగమ్ ఖలీదా జియా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్న భారత ప్రధానికి కృతజ్ఞతలు. మద్దతుగా నిలుస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు'' అని మోదీ పోస్ట్‌కు ప్రతిస్పందనగా బీఎన్‌పీ రాసింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














