‘‘రూ.3 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బు కోసం తండ్రిని కట్లపాముతో కరిపించారు’’- పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారంటే..

పాముకాటు, బీమా సొమ్ము

ఫొటో సోర్స్, Thiruvallur District Police/GettyImages

    • రచయిత, విజయానంద అరుముగం
    • హోదా, బీబీసీ ప్రతినిధి

(హెచ్చరిక: ఈ కథనంలోని అంశాలు మిమ్మల్ని కలచివేయవచ్చు)

బీమా సొమ్ము కోసం తండ్రిని కట్ల పాముతో కరిపించి ఆయన మరణానికి కారణమైన కేసులో ఇద్దరు కొడుకులు సహా ఆరుగురు నిందితులను పోలీసులు డిసెంబర్ 19వ తేదీన చెన్నై సమీపంలో అరెస్టు చేశారు.

బాధితుడు మరణించిన విధానంపై బీమా కంపెనీకి సందేహం రావడంతో, అసలు నిజం వెలుగులోకి వచ్చిందని తిరువళ్లూరు జిల్లా ఎస్పీ వివేకానంద శుక్లా చెప్పారు.

తండ్రి పేరు మీదున్న రూ.3 కోట్లకుపైగా బీమా సొమ్మును దక్కించుకోవడానికే కొడుకులు ఈ దారుణానికి ఒడిగట్టారని ఎస్పీ అన్నారు.

తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా, తిరుత్తణి తాలూకా కేంద్రానికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనున్న పోతాదుర్‌పేట్ గ్రామంలో అక్టోబర్ 22వ తేదీన 56 ఏళ్ల గణేశన్ అనే వ్యక్తి పాము కాటు కారణంగా మరణించారు.

గణేశన్ కుమారులు ఇచ్చిన సమాచారం మేరకు అసహజ మరణం కింద పోతాదుర్‌పేట్ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదు చేశారని ఎస్పీ వివేకానంద చెప్పారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తిరువళ్లూరు జిల్లా ఎస్పీ వివేకానంద శుక్లా

ఫొటో సోర్స్, Thiruvallur District Police

ఫొటో క్యాప్షన్, తిరువళ్లూరు జిల్లా ఎస్పీ వివేకానంద శుక్లా

బీమా కంపెనీ ఫిర్యాదుతో వెలుగులోకి...

పోతాదుర్‌పేట్‌లోని ప్రభుత్వ బాలికల ప్రాథమికోన్నత పాఠశాలలో ల్యాబ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు గణేశన్.

ఆయన మృతిపై ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు విడుదల చేసిన ప్రకటనలో, ఈ ఘటన పాము కాటు కారణంగా జరిగిన అసహజ మరణంలా కనిపిస్తోందని పేర్కొన్నారు.

ఈ సంఘటన తర్వాత కొన్ని రోజుల వ్యవధిలోనే, గణేశన్ భార్య సుమతి, కుమారులు బీమా పాలసీలకు సంబంధించిన సొమ్ము కోసం ప్రైవేట్ బీమా కంపెనీకి క్లెయిమ్ దాఖలు చేశారు.

గణేశన్ పేరు మీదనున్న నాలుగు పాలసీల సహా ఆయన కుటుంబం మొత్తం 11 బీమా పాలసీలను తీసుకున్నారని ఎస్పీ వివేకానంద చెప్పారు.

టర్మ్ ఇన్సూరెన్స్ సహా రూ.3 కోట్ల కంటే ఎక్కువ మొత్తానికి గణేశన్ బీమా చేయించారని ఆయన తెలిపారు.

అయితే, గణేశన్ మరణం అనుమానాస్పదంగా ఉందంటూ బీమా కంపెనీ తమిళనాడు నార్త్ జోన్ ఐజీ ఆసరా గార్గ్‌కు ఫిర్యాదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు.

దీంతో, ఈ కేసులో సమగ్ర విచారణ కోసం డిసెంబర్ 6వ తేదీన గుమ్మిడిపూండి డీఎస్పీ జయశ్రీ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేశారు ఎస్పీ.

సిట్ దర్యాప్తుతో పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గణేశన్ కుటుంబం భారీగా అప్పులు చేసిందని, పెద్ద మొత్తంలో బీమా పాలసీలు తీసుకుందని వెల్లడైంది.

ఒక సాధారణ ప్రభుత్వ ఉద్యోగి ఇన్ని కోట్ల రూపాయల బీమా పాలసీలను ఎలా కొనుగోలు చేశారనే కోణంలో దర్యాప్తు జరుగుతోందని ఎస్పీ వివేకానంద విలేఖరుల సమావేశంలో చెప్పారు.

''కుటుంబ ఆదాయ వనరులతో పోలిస్తే, గణేశన్ కుటుంబం తీసుకున్న అప్పులు, బీమా పాలసీల కోసం చెల్లిస్తున్న ప్రీమియం అధికంగా ఉండటం గణేశన్ మరణంపై సందేహాలను రేకెత్తించింది'' అని ఎస్పీ అన్నారు.

''సాధారణంగా బీమా కంపెనీలు క్లెయిమ్ సొమ్మును చెల్లించే ముందు విచారణ చేస్తాయి. ఆ ప్రక్రియలోనే ఈ మరణంపై వారికి అనుమానం కలిగింది'' అని డీఎస్పీ జయశ్రీ బీబీసీతో అన్నారు.

ఎస్పీ వివేకానంద డిసెంబర్ 19వ తేదీన విలేఖరులతో మాట్లాడుతూ, ప్రత్యేక ఇంటెలిజెన్స్ బృందం కొన్నివారాలుగా దర్యాప్తు చేస్తోందని, గణేశన్ కుటుంబ ఆర్థిక లావాదేవీలు, బీమా పాలసీలకు సంబంధించిన అన్ని వివరాలను సేకరించిందని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తండ్రిని హత్య చేయడానికి కుట్ర...

బీమా సొమ్ము దక్కించుకోవాలనే ఉద్దేశంతోనే గణేశన్‌ను హత్య చేయడానికి ఆయన కుమారులు మోహన్‌రాజ్, హరిహరన్ కుట్ర పన్నారని పోలీసులు చెబుతున్నారు.

''తమ పథకం అమలుకోసం వారిద్దరూ బాలాజీ, ప్రశాంత్, దినకరన్, నవీన్‌కుమార్ అనేవారిని సంప్రదించారు. వారు గణేశన్‌ను చంపడానికి ఒక పామును సంపాదించారు. ఆ తర్వాత అది ప్రమాదవశాత్తూ తమ తండ్రిని కాటేసినట్లు అందర్నీ నమ్మించాలని చూశారు’’ అని పోలీసులు ఒక ప్రకటనలో వెల్లడించారు.

గణేశన్‌ను హత్య చేయడానికి వారి కుమారులు రెండుసార్లు ప్రయత్నించారని పోలీసులు తెలిపారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గణేశన్ చనిపోవడానికి వారం రోజుల ముందే దినకరన్ అనే వ్యక్తి వద్ద ఒక నాగుపామును కొనుగోలు చేశారు. ఆ పాముతో గణేశన్ కాలిపై కరిపించారు.

కానీ గణేశన్ చనిపోలేదు.

మళ్లీ అక్టోబర్ 22వ తేదీ తెల్లవారుజామున ఒక కట్లపామును తీసుకొచ్చారు. గణేశన్ నిద్రిస్తున్న సమయంలో ఆయన మెడపై ఆ పాముతో కరిపించారు.

''ఈ కేసులోని ఆరుగురు నిందితులలో ఒకరికి పాములను పట్టుకోవడం, వాటిని ఆడించడం తెలుసు. గణేశన్‌ను కరిచిన పాము సుమారు మూడు అడుగుల పొడవు ఉంది. కరిపించిన వెంటనే ఆ నిందితుడు ఆ పామును అక్కడే చంపేశాడు'' అని ఎస్పీ చెప్పారు.

''పాము కరిచిన తర్వాత గణేశన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లే విషయంలో నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేశారని దర్యాప్తులో తేలింది. అది పక్కాప్లాన్ ప్రకారం జరిగిన హత్య అనడానికి ఇదొక బలమైన సాక్ష్యం'' అని పోలీసులు తెలిపారు.

ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు

ఫొటో సోర్స్, Thiruvallur District Police

ఫొటో క్యాప్షన్, ఈ కేసులో అరెస్టు అయిన నిందితులు

ఇద్దరు కొడుకులు సహా ఆరుగురి అరెస్టు

గణేశన్ బంధువు గణపతి మాట్లాడుతూ, ''గణేశన్ 2018లో తన తండ్రి నుంచి భూమి కొనుగోలు చేసి, అందులో రెండు అంతస్తుల ఇల్లు నిర్మించారు. ఆయన ఇద్దరు కుమారుల్లో ఒకరు చెన్నైలోని ఒక కంపెనీలో పనిచేస్తుండగా, మరొకరు మెకానిక్'' అని చెప్పారు.

''వారిద్దరికీ కొన్నేళ్ల కిందటే వివాహం చేశారు. ఇద్దరికీ పిల్లలు ఉన్నారు. వారిమధ్య ఎప్పుడూ గొడవలు జరగలేదు. వారికి అంత అప్పు ఉందని మాకు అస్సలు తెలియదు. డిసెంబర్ 19న ఆ ఇద్దరు కొడుకులను అరెస్టు చేసినప్పుడే మాకు అసలు విషయం తెలిసింది’’ అని ఆయన అన్నారు.

ఈ కేసులో ఆరుగురు నిందితులు- హరిహరన్, మోహన్‌రాజ్, ప్రశాంత్, నవీన్ కుమార్, బాలాజీ, దినకరన్‌లను పోలీసులు అరెస్టు చేశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)