బేగం ఖలీదా జియా కన్నుమూత: పశ్చిమ బెంగాల్‌లో పుట్టి, బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధాని అయిన నేత

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ(బీఎన్‌పీ) నేత బేగం ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. కొద్దిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స పొందుతూ మరణించారని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) స్టాండింగ్ కమిటీ సభ్యుడు సలావుద్దీన్ అహ్మద్ బీబీసీకి చెప్పారు.
మంగళవారం ఉదయం 6 గంటలకు రాజధానిలోని ఎవర్‌కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఖలీదా జియా మరణించారని అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో బీఎన్‌పీ ట్వీట్ చేసింది.
మూత్రపిండాలు, గుండె సంబంధిత సమస్యలతో ఖలీదా జియా గత నెల రోజులుగా చికిత్స పొందుతున్నారు.
ఛాతీలో ఇన్ఫెక్షన్ కారణంగా నవంబర్ 23న ఆమెను ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. తర్వాత ఆరోగ్యం మరింత విషమించడంతో కరోనరీ కేర్ యూనిట్‌కు తరలించారు.
ఖలీదా జియా మరణించిన సమయంలో ఆమె కుమారుడు, బీఎన్‌పీ తాత్కాలిక చైర్మన్ తారిక్ రెహమాన్, కోడలు జుబైదా రెహమాన్, మనవరాలు జైమా రెహమాన్, పార్టీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ సహా ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రి వద్దే ఉన్నారని బీఎన్‌పీ పేర్కొంది.


ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని
ఖలీదా జియా బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధాన మంత్రి. ఆమె భర్త, బంగ్లాదేశ్ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించిన జియాఉర్ రెహ్మాన్ 1977లో ఆ దేశ అధ్యక్షుడిగా ఉన్ననాటికి ఖలీదా జియా ఇంకా రాజకీయాల్లోకి రాలేదు.
ఆ సమయంలో ఆమె తన ఇద్దరు కొడుకులు, ఇంటి బాధ్యతలను చూసుకునేవారు.
1981లో జియాఉర్ రెహ్మాన్ హత్యకు గురైన తరువాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని నడిపించే బాధ్యతను ఆమె తీసుకున్నారు.
అనంతరం ఆమె రెండుసార్లు ప్రధానమంత్రిగా పనిచేశారు. 1991లో తొలిసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఖలీదా జియా, 2001 సంవత్సరంలో రెండోసారి ప్రధానిగా పనిచేశారు.
అయితే, అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న ఆమె, చాలా ఏళ్లు జైలులో ఉన్నారు.
అనంతరం ఆమె రాజకీయ ప్రత్యర్థి షేక్ హసీనా తన పదవిని కోల్పోయిన తరువాత 2024లో ఖలీదాపై అభియోగాలను ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
పశ్చిమ బెంగాల్‌లో పుట్టి..
బేగం ఖలీదా జియా 1945లో పశ్చిమ బెంగాల్‌లో జన్మించారు. ఆమె తండ్రి తేయాకు వ్యాపారి. దేశ విభజన తరువాత ఆమె కుటుంబం అప్పటి తూర్పు పాకిస్తాన్, ప్రస్తుత బంగ్లాదేశ్‌కు వెళ్లిపోయింది.
తన పదిహేనేళ్ల వయసులో ఖలీదా జియా.. జియాఉర్ రెహ్మాన్‌ను పెళ్లాడారు. అప్పటికి జియాఉర్ రెహ్మాన్ సైనికాధికారిగా పనిచేస్తుండేవారు.
1971లో జియాఉర్ రెహ్మాన్ పశ్చిమ పాకిస్తాన్ బలగాలకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం ప్రకటించుకున్నారు.
1977లో సైన్యం అధికారం చేజిక్కించుకున్న తరువాత అప్పటికి 'ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్'గా ఉన్న జియాఉర్ రెహ్మాన్ తనను తాను బంగ్లాదేశ్‌కు అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు.
అనంతరం రాజకీయ పార్టీలకు, మీడియాకు బంగ్లాదేశ్‌లో మళ్లీ స్థానం కల్పించారు.
ఆయన సుమారు 20 సైనిక తిరుగుబాట్లను ఎదుర్కోవడమే కాకుండా వాటన్నింటినీ కఠినంగా అణచివేశారు. ఆయా సందర్భాలలో సైనికుల సామూహిక హత్యలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలున్నాయి.
1981లో చిట్టగాంగ్‌లో కొందరు సైనికాధికారుల చేతిలో ఆయన హత్యకు గురయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
భర్త మరణం తరువాత..
భర్త మరణించేవరకు ఖలీదా జియా పెద్దగా జనంలోకి వచ్చింది లేదు. జియాఉర్ రెహ్మాన్ మరణం తరువాత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీలో సభ్యత్వం తీసుకున్న ఆమె అనంతరం పార్టీకి వైస్ చైర్మన్ అయ్యారు.
1982 నుంచి తొమ్మిదేళ్ల పాటు బంగ్లాదేశ్‌లో సైనిక పాలన కొనసాగింది. ఆ సమయంలో ఖలీదా జియా ప్రజాస్వామ్యం కోసం పోరాడారు.
ఖలీదా జియా ఉద్యమాల కారణంగా సైనిక ప్రభుత్వం బంగ్లాదేశ్‌లో ఎన్నికలు నిర్వహించింది.
ఫలితంగా 1991లో ఆమె నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. దాంతో ఆమె ప్రధాన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
బంగ్లాదేశ్ చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా ఆమె గుర్తింపు పొందారు. ఆమె పదవి చేపట్టిన తరువాత ఆ దేశంలో ప్రాథమిక విద్యను ఉచితంగా అందించడమే కాకుండా తప్పనిసరి చేశారు.
అయితే, అయిదేళ్ల తరువాత జరిగిన ఎన్నికల్లో ఆమె పార్టీ ఓటమి పాలైంది. ఆ ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ విజయం సాధించింది.
మళ్లీ 2001 ఎన్నికల నాటికి ఖలీదా జియా అక్కడి ఇస్లామిక్ పార్టీలతో కూటమి ఏర్పాటు చేసుకుని విజయం సాధించి రెండోసారి ప్రధాని పదవి చేపట్టారు.
రెండోసారి తన పదవీకాలంలో ఆమె బంగ్లాదేశ్ పార్లమెంటులో 45 ఎంపీ సీట్లను మహిళలకు రిజర్వ్ చేస్తూ రాజ్యాంగ సవరణను ప్రవేశపెట్టారు.
అప్పటికి 70 శాతం మంది మహిళలు విద్యకు నోచుకోని బంగ్లాదేశ్‌లో బాలికలు, యువతులు చదువుకునేలా ఖలీదా జియా కృషి చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
2008లో నిర్బంధం ఎత్తివేసినా...
2006 ఎన్నికలకు ముందు పదవి నుంచి వైదొలగారు ఖలీదా జియా. అయితే, ఎన్నికలు ఆలస్యమయ్యాయి. అప్పటి తాత్కాలిక ప్రభుత్వం దేశంలో రాజకీయ కార్యకలాపాలను పెద్ద ఎత్తున నియంత్రించడమే కాకుండా అవినీతికి వ్యతిరేకంగా చర్యలు ప్రారంభించింది.
ఏడాది తరువాత దోపిడీ, అవినీతి ఆరోపణలతో ఖలీదా జియా అరెస్టయ్యారు.
అప్పుడు ఆమె రాజకీయ ప్రత్యర్థి షేక్ హసీనా కూడా నిర్బంధంలో ఉన్నారు.
ఇలా రెండు దశాబ్దాల పాటు బంగ్లాదేశ్‌లో మార్చి మార్చి అధికారంలో ఉన్న ఇద్దరు మహిళా నేతలు కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు.
అనంతరం 2008లో ఖలీదా జియాపై నిర్బంధం ఎత్తివేశారు. సైనిక నియంత్రణలో జరిగిన అప్పటి ఎన్నికల్లో ఖలీదా జియా పార్టీ ఓటమి పాలైంది. షేక్ హసీనా ప్రభుత్వం ఏర్పాటు చేశారు.
2011లో యాంటీ కరప్షన్ కమిషన్ ఖలీదా జియాపై ఒక కేసు నమోదు చేసింది. మృతి చెందిన తన భర్త పేరిట ఉన్న చారిటీ సంస్థకు భూములు కొనుగోలు చేయడానికి వినియోగించిన డబ్బు ఎక్కడ నుంచి వచ్చిందనేది ఖలీదా వెల్లడించలేదన్నది ప్రధాన ఆరోపణ.
ఆ కేసులో అరెస్టైన ఖలీదా జియా చాలాకాలం జైలులో ఉన్నారు. ఆ కాలంలో పార్టీని నడిపించడం కూడా ఆమెకు కష్టతరమైంది.
షేక్ హసీనాకు చెందిన అవామీ లీగ్ రిగ్గింగ్‌కు పాల్పడుతోందంటూ ఖలీదా జియా మద్దతుదారులు 2014 బంగ్లాదేశ్ సాధారణ ఎన్నికలను బహిష్కరించారు. ఆ ఎన్నికల్లో అనేక స్థానాల్లో అవామీ లీగ్ అభ్యర్థులు పోటీ లేకుండా ఏకగ్రీవంగా గెలిచారు.
ఈ ఎన్నికల బహిష్కరణ జరిగిన ఏడాది తరువాత హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలకు ఖలీదా జియా ప్లాన్ చేశారు. కానీ, బంగ్లాదేశ్ భద్రతాబలగాలు ఆమెను ఢాకాలోని తన పార్టీ కార్యాలయం నుంచి బయటకు రాకుండా తలుపులు మూసేశారు. నగరంలో నిరసన ప్రదర్శనలపై నిషేధం విధించారు.

ఫొటో సోర్స్, Getty Images
‘ఢాకా పాత జైలులో ఒంటరి ఖైదీగా’
రెండోసారి అధ్యక్షురాలిగా ఉన్న సమయంలోనూ ఖలీదా జియాపై ఆరోపణలొచ్చాయి. చిన్న కొడుకు అరాఫత్ రహ్మాన్ కోకో ఒత్తిడితో 2003లో కార్గో టెర్మినల్స్‌కు సంబంధించిన ఒప్పందాలను కుదుర్చుకున్నారని ఆరోపణలు వినిపించాయి.
ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో ఒక అనాథ శరణాలయానికి ఇవ్వాల్సిన దాదాపు రెండున్నరకోట్ల డాలర్ల నిధులను దుర్వినియోగం చేశారన్న కేసులో 2018లో ఆమె దోషిగా తేలారు. కోర్టు ఆమెకు ఐదేళ్ల జైలుశిక్ష విధించింది.
ఢాకాలో ప్రస్తుతం వాడకంలోలేని పాత జైలులో ఆమె ఒక్కరే ఖైదీగా ఉండేవారు. జైలు శిక్ష కారణంగా ఆమె ఎన్నికల్లో పోటీ చేయలేకపోయారు.

ఫొటో సోర్స్, Getty Images
ఖలీదా జియాపై ఆంక్షలు ఎత్తివేత
తనపై వచ్చిన ఆరోపణలు రాజకీయ ప్రేరేపితమైనవని ఖలీదా ఆరోపించారు.
తీవ్ర ఆర్థరైటిస్, నియంత్రణలోకి రాని డయాబెటిస్‌తో బాధపడుతున్న 73ఏళ్ల ఖలీదాజియాను తర్వాతి ఏడాది చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్య కారణాలతో ఆమెను జైలు నుంచి విడుదల చేసినప్పటికీ గృహనిర్బంధంలో ఉంచారు.
ప్రజల తిరుగుబాటుతో షేక్ హసీనా ప్రభుత్వం 2024లో కుప్పకూలింది.
ప్రధాని పదవికి రాజీనామా చేసి షేక్ హసీనా భారత్‌కు వచ్చారు. తాత్కాలిక ప్రభుత్వం ఖలీదా జియాను విడుదల చేయాలని, స్తంభించిన ఆమె ఖాతాలను అన్ ఫ్రీజ్ చేయాలని ఆదేశాలిచ్చింది.
ఆ సమయానికి ఖలీదా జియా కాలేయంతో పాటు కిడ్నీకి సంబంధించిన తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
2025 జనవరిలో ఖలీదా జియాపై ప్రయాణ ఆంక్షలు ఎత్తివేశారు. చికిత్స కోసం ఆమె లండన్ వెళ్లడానికి అనుమతించారు. ఈలోగానే ఆమె కన్ను మూశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














