బంగ్లాదేశ్‌తో సంబంధాలు భారత్‌కు ఎంత ముఖ్యం... ప్రధాని మోదీ పర్యటన ఎందుకంత కీలకం?

భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు

ఫొటో సోర్స్, PRAKASH SINGH/GETTY IMAGES

    • రచయిత, సల్మాన్ రావి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోవిడ్19 మహమ్మారి మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ విదేశీ పర్యటనకూ వెళ్లలేదు. ఇప్పుడు ఆయన మొదటిసారి బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లబోతున్నారు.

బంగ్లాదేశ్‌ స్వతంత్రం సంపాదించి ఈ ఏడాదితో 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వీటిలో అత్యంత ముఖ్యమైన కార్యక్రమం 'ముజీబ్ దివస్' అంటే 'ముజీబ్ దినోత్సవం'. దీనిని బంగ్లాదేశ్ జాతిపిత షేక్ ముజీబ్ ఉర్ రహమాన్‌ గౌరవార్థం జరుపుకుంటున్నారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొనడానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ వెళ్లనున్నారు. అక్కడ ఆయన మార్చి 25, 26న రెండు రోజులపాటు పర్యటించనున్నారు.

ఇంతకు ముందు, ఇదే ఏడాది జనవరి 26న భారత గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో బంగ్లాదేశ్ సైన్యంలోని ఒక దళం కూడా పాల్గొంది.

బంగ్లాదేశ్‌కు 1971లో స్వాతంత్ర్యం వచ్చింది. ఇందులో భారత సైన్యం కీలక పాత్ర పోషించింది. అప్పటి బంగ్లాదేశ్‌లోని పాకిస్తాన్ సైన్యం, ఇండియన్ ఆర్మీ జనరల్ జగ్జీత్ సింగ్ అరోడా ముందు లొంగిపోయింది. ఆ తర్వాత స్వతంత్ర బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చింది.

భారత రిపబ్లిక్ పరేడ్‌లో బంగ్లాదేశ్ సైనిక దళం పరేడ్

ఫొటో సోర్స్, JEWEL SAMAD/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, భారత రిపబ్లిక్ పరేడ్‌లో బంగ్లాదేశ్ సైనిక దళం పరేడ్

జనవరి 26న భారత రాజధాని న్యూదిల్లీ రాజ్‌పథ్‌లో బంగ్లాదేశ్ సైనిక దళం పరేడ్ చేస్తూ ముందుకు సాగుతున్నప్పుడు ఆ క్షణాన్ని దౌత్యవర్గాలు రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఒక కొత్త ప్రారంభంగా చూశారు.

రెండు దేశాల మధ్య పెండింగులో ఉన్న ఎన్నో సమస్యలు, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ హయంలో పరిష్కారం అయ్యాయి. ఇందులో అత్యంత ప్రధానమైనది రెండు దేశాల మధ్య ఎన్‌క్లేవ్ అంశం పరిష్కారం.

అయితే, గత ఏడాది 2019లో కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ చట్టాన్ని సవరించినపుడు బంగ్లాదేశ్, భారత్ సంబంధాలు మళ్లీ బీటలువారాయి.

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ చట్టాన్ని అనవసరమైనదని అన్నారు. తర్వాత రెండు దేశాల మధ్య ప్రతిపాదిత ఎన్నో ద్వైపాక్షిక పర్యటనలు, సమావేశాలు రద్దు అయ్యాయి.

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా కొన్ని నెలల వరకూ అక్కడ ఉన్న భారత హై కమిషనర్‌ను కలవడానికి కూడా నిరాకరించారు. కొత్త చట్టం ద్వారా "తమ దేశంలో ఉంటున్న 9 శాతం హిందూ మైనారిటీలు సురక్షితం కాదు" అనే సందేశాన్ని భారత్ ఇవ్వాలనుకుంటున్నట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం భావించింది.

అది కాకుండా కరోనా కాలంలో కూడా ఎన్నో సార్లు ఇలాంటి పరిస్థితి ఏర్పడింది దానివల్ల రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి.

గత ఏఢాది సెప్టెంబర్‌లో భారత్ ఉల్లిపాయల ఎగుమతులపై నిషేధం విధించింది. ప్రతి ఏటా బంగ్లాదేశ్, భారత్ నుంచి దాదాపు 3.5 లక్షల టన్నుల ఉల్లిపాయలు దిగుమతి చేసుకుంటుంది.

బంగ్లాదేశ్ నిరసనలు

ఫొటో సోర్స్, MUNIR UZ ZAMAN/GETTY

తర్వాత ఇదే ఏడాది ప్రారంభంలో భారత్‌లో అందరికీ కరోనా వైరస్ వ్యాక్సీన్ వేసేవరకూ టీకాను ఎగుమతి చేయలేమని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ బంగ్లాదేశ్‌కు చెప్పింది.

అది, బంగ్లాదేశ్‌కు కోపం తెప్పించింది. ఎందుకంటే అది అంతకు ముందు ఏడాదే భారత్ నుంచి 3 కోట్ల టీకా డోసుల ఒప్పందం చేసుకుంది.

తర్వాత, ఆ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్‌కు తాము కరోనా వ్యాక్సీన్ సరఫరా చేస్తామని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది.

బంగ్లాదేశ్‌తో దౌత్య సంబంధాలను మెరుగుపరచుకోడానికి భారత్ కరోనా కాలంలోనే తెర వెనుక ప్రయత్నాలు మొదలు పెట్టిందని విదేశీ వ్యవహారాల నిపుణులు చెబుతున్నారు.

ఫలితంగానే, బంగ్లాదేశ్ వెళ్లిన భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు వ్యూహాత్మక కోణంలోనే కాదు, అంతకు మించి బలోపేతం అయ్యాయని అన్నారని వారు చెబుతున్నారు.

భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్

ఫొటో సోర్స్, HINDUSTAN TIMES/GETTY

ఫొటో క్యాప్షన్, భారత విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్

దక్షిణాసియాలోనే కాదు, మొత్తం ఇండో-పసిఫిక్ ప్రాంతంలోనే బంగ్లాదేశ్ భారత్‌కు ఒక ముఖ్యమైన మిత్రదేశంగా మారిందని కేంద్ర మంత్రి జయశంకర్ అన్నారు.

దీనిపై వ్యూహాత్మక, విదేశాంగ అంశాల నిపుణులు మనోజ్ జోషి వివరంగా చెప్పారు.

"భారత్‌కు బంగ్లాదేశ్ అత్యంత దగ్గరగా ఉంది. ఎందుకంటే రెండు దేశాల సరిహద్దు చాలా ఎక్కువ ఉంది. బంగ్లాదేశ్, భారత్ మధ్య 4,096 కిలోమీటర్ల సరిహద్దు ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు కూడా చెబుతున్నాయి" అన్నారు.

"సంబంధాల్లో హెచ్చుతగ్గులు ఉంటుంటాయి. కానీ, భారత్, బంగ్లాదేశ్ ఒకదానికొకటి చాలా ముఖ్యమైనవి. బంగ్లాదేశ్ ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి భారత్‌తో దాని సంబంధాలు ఎప్పుడూ ఆందోళనకరంగా, ఉద్రిక్తంగా లేవు" అని చెప్పారు.

"బంగ్లాదేశ్, భారత్ రెండూ పరస్పరం తమ దేశానికి వచ్చే పొరుగు దేశం నేతలకు స్వాగతం పలుకుతాయి. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్కడకు వెళ్తుంటే అదే జరుగుతుంది" అని జోషి అన్నారు.

అయితే, "రెండు దేశాల మధ్య పరిష్కారం కాని సమస్యలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిలో తీస్తా నదీ జలాల పంపకం చాలా ముఖ్యమైనది" అని ఆయన అభిప్రాయపడ్డారు.

భారత్ బంగ్లాదేశ్ సంబంధాలు

ఫొటో సోర్స్, NURPHOTO/GETTY

కానీ, తీస్తా నదీ జలాల పంపకం సమస్య అంత త్వరగా పరిష్కారం అయ్యేది కాదు. ఎందుకంటే, ఆ చర్చల్లో కేంద్ర ప్రభుత్వం, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం, బంగ్లాదేశ్ అనే ముగ్గురు భాగస్వాములు ఉంటారు.

కేంద్రం, బంగ్లాదేశ్‌తో మాట్లాడి పరిష్కరించుకునే ఎన్‌క్లేవ్ పంపకం లాంటివి సమస్యలు పరిష్కారం అయ్యాయి. తీస్తా ఇంకా ఎందుకు పెండింగులో ఉందంటే, ఇప్పుడు రెండు దేశాల్లో నాలుగు సీజన్లలో పంటలు వేస్తున్నారు. ఈ పంటల కోసం చాలా నీళ్లు అవసరం అవుతాయి.

గత ఏఢాది డిసెంబర్‌లో కూడా రెండు దేశాల మధ్య వర్చువల్ సమావేశం జరిగింది. అందులో వాణిజ్యం, రాకపోకలు, పెట్టుబడుల గురించి చర్చలు జరిగాయి. కానీ, భారత్, బంగ్లాదేశ్ మధ్య తీస్తా నదీ జలాల అంశంపై ఎలాంటి చర్చలూ జరగలేదు.

తీస్తా జలాలను బంగ్లాదేశ్‌తో పంచుకుంటే పశ్చిమ బెంగాల్లో కరువు పరిస్థితి తలెత్తుతుందని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ భావిస్తోంది.

భారత్-బంగ్లాదేశ్ సంబంధాలను నిశితంగా గమనిస్తున్న కింగ్స్ కాలేజ్ లండన్‌లోని విదేశీ వ్యవహారాల ప్రొఫెసర్ హర్ష్ వీ పంత్ దీనిపై బీబీసీతో మాట్లాడారు.

"రెండు దేశాల మధ్య ఉన్న ఆర్థిక సరఫరా లింకును మరింత దృఢంగా, విస్తృతంగా చేసుకోవడం ఎలా అనేది ఇప్పుడు భారత్-బంగ్లాదేశ్‌కు చాలా ముఖ్యం" అని ఆయన చెప్పారు.

"బంగ్లాదేశ్ విషయంలో ఇలా దౌత్యపరమైన చిక్కుగా మారగలిగే ఎన్నో అంశాలపై భారత్ ఓపికగా పనిచేసింది. అందుకే, రెండు దేశాల మధ్య సంబంధాలు ఎప్పుడూ పాడవలేదు" అని ఆయన చెప్పారు.

పంత్ దీనికి బంగ్లాదేశ్ తీర సరిహద్దు సమస్యను ఒక ఉదాహరణగా చెప్పారు.

"ఈ అంశంలో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ బంగ్లాదేశ్ తరఫున తీర్పు వినిపించింది. కానీ, భారత్ ఆ తీర్పును గౌరవించింది" అని ఆయన తెలిపారు.

దక్షిణాసియా, ఆగ్నేయాసియాలో తీవ్రవాద సంస్థల కార్యకలాపాలు వ్యాపించడం భారత్‌కు అత్యంత ఆందోళనకరమైన అంశం. భారతదేశానికి ప్రమాదం ముంచుకొచ్చేలా బంగ్లాదేశ్‌లో ఆ సంస్థల కార్యకలాపాలు పెరగాలని భారత్ కోరుకోదు. ముఖ్యంగా రెండు దేశాల సరిహద్దుల్లో అలాంటి సంకేతాలు లభించాయి. కానీ షేక్ హసీనా ప్రభుత్వం వాటిని చాలావరకూ అణచివేసే ప్రయత్నాలు చేసింది కూడా అని ప్రొఫెసర్ పంత్ అన్నారు.

నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, MUNIR UZ ZAMAN/GETTY

పంత్, విదేశాంగ అంశాల్లో మిగతా నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్‌కు బంగ్లాదేశ్‌తో బలమైన, మెరుగైన సంబంధాలు చాలా ముఖ్యం. దానివల్ల రెండు దేశాలు బలోపేతం అవుతాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన వల్ల ఈ సంబంధాలు మరింత మెరుగుపడడం చూడవచ్చని నిపుణులు చెబుతున్నారు.

భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు ఇప్పుడు ఏ స్థాయికి చేరుకున్నాయంటే, రెండు దేశాలూ తమ ఏ సమస్య గురించైనా ఇప్పుడు బాహాటంగా తమ అభిప్రాయాలను ఇచ్చిపుచ్చుకోగలిగేలా ఉన్నాయి అని మాజీ దౌత్యవేత్త నవతేజ్ సర్నా అన్నారు.

బంగ్లాదేశ్ ఎప్పుడూ భారత్‌తో సంబంధాలు పాడు చేసుకోలేదు. తమకు విముక్తి లభించడంలో ప్రధానంగా భారత్ సహకారం ఉందని బంగ్లాదేశ్ ఎప్పుడూ భావిస్తూనే ఉంది.

భారత్-బంగ్లాదేశ్ మధ్య దౌత్య, వ్యూహాత్మక సంబంధాలకు ఇది 50వ వార్షికోత్సవం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇప్పుడు అక్కడికి వెళ్లడం చాలా అవసరం. ఆయన పర్యటన అన్ని రకాలుగా చాలా కీలకమైనది. ఎందుకంటే, ఏడాది తర్వాత ఆయన వేరే దేశానికి వెళ్తున్నారు. బంగ్లాదేశ్, భారత్ పరస్పరం కీలకమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ కనిపిస్తున్నాయి. వారి స్వాతంత్ర్య 50వ వార్షికోత్సవం భారత్, బంగ్లాదేశ్ రెండింటికీ చాలా ముఖ్యమైనది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)