మియన్మార్ సంక్షోభం: సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా వెల్లువెత్తుతున్న నిరసనలు

ఫొటో సోర్స్, EPA
2007 తర్వాత మియన్మార్‌లో మరో భారీ ప్రజా ఉద్యమం మొదలైంది. సైనిక పాలనకు వ్యతిరేకంగా, ఆంగ్ సాన్ సూచీకి మద్దతుగా వేలమంది ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు
‘‘మాకు సైనిక పాలన వద్దు, ప్రజాస్వామ్యం కావాలి’’ అంటూ యాంగాన్ నగర వీధుల్లో నినాదాలు మిన్నంటాయి. దేశంలోని అనేక పట్టణాలలో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి.
నిన్నటి నుంచి ఆగిపోయిన ఇంటర్నెట్ సర్వీసులను ఆదివారం పునరుద్ధరించారు. అయితే ఈ నిరసనలపై సైనిక నాయకత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు.
యాంగాన్ నగరంలో ఆందోళనకారులు ఎర్ర చొక్కాలు, ఎర్ర రిబ్బన్లు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. “మేం వేసిన ఓటుపై మాకు నమ్మకం ఉంది” అంటూ బ్యానర్లు ప్రదర్శిస్తూ గత ఎన్నికల్లో అక్రమాలు జరిగాయన్న సైన్యం ఆరోపణలను తప్పుబట్టారు.
ఆదివారంనాడు జరిగిన ఆందోళనను 'కాషాయ విప్లవం'గా ఆందోళనకారులు అభివర్ణించారు. 2007లో అప్పటి మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా బౌద్ధ సన్యాసులు భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిలో జరుగుతున్న ఉద్యమం ఇదేనని చెబుతున్నారు.
యాంగాన్ యూనివర్సిటీ దగ్గర పెద్ద ఎత్తున సైనికులు, పోలీసులు మోహరించారు. అయితే వారిని లెక్కచేయకుండా ఆందోళనకారులు ర్యాలీ నిర్వహిస్తూ సూలే పగోడా వైపు కదిలారు. ఆందోళనల్లో ఎక్కడా ఘర్షణలు జరగలేదు.
“మాకు మళ్లీ మిలిటరీ పాలన వద్దు. భయం లేకుండా బతకాలనుకుంటున్నాం. మా అమ్మలాంటి ఆంగ్‌సాన్ సూచీని నిర్బంధం నుంచి బైటికి తీసుకురావాలి” అని ఓ నిరసనకారుడు బీబీసీతో అన్నారు.
“సైనికులు ప్రజలను పాలించే విధానాలను తుడిచి పెట్టాలని కోరుతున్నాం”అని ఆ నిరసనకారుడు వ్యాఖ్యానించారు.
“సూచీ మా అసలైన నాయకురాలు. మాకు ప్రజాస్వామ్యం కావాలి. ఆమెకు ఏదైనా జరిగితే మా భవిష్యత్తు ఏంటి? ఆమెను వెంటనే విడుదల చేయాలి’’ అని మరో నిరసనకారుడు డిమాండ్ చేశారు.
రాజధాని నేపీడాతోపాటు మాండలే నగరంలో కూడా చిన్న చిన్న నిరసన ప్రదర్శనలు జరిగాయి. మైవాడీ పట్టణంలో కాల్పులు జరిగినట్లు వార్తలు వచ్చాయి. పోలీసులు అక్కడక్కడా రబ్బర్ బుల్లెట్లు వాడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.

ఫొటో సోర్స్, EPA
పైకి ధైర్యం...లోలోపల కాస్త భయం...
నైయిన్ చాన్, బీబీసీ బర్మీస్, యాంగాన్
యాంగాన్‌లో కేవలం విద్యార్ధులే కాక, అనేక వర్గాల ప్రజలు సైనిక తిరుగుబాటుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నారు. 1988లో మిలిటరీ పాలనకు వ్యతిరేకంగా సాగిన విద్యార్ధి ఉద్యమ పాటలు పాడుకుంటూ సైన్యం పాలన పోవాలంటూ నినాదాలు చేశారు.
పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నచోట కూడా పోలీసుల ఆదేశాలను ధిక్కరిస్తూ ప్రజలు ఆందోళన సాగించారు. కొన్నిచోట్ల ప్రజలు భయపడటం కూడా కనిపించింది. సైనికులు ఎదురైనప్పడు “మీరు ట్రైనింగ్ తీసుకున్న సైనికులు. సామాన్యులను చంపడం సరికాదు” అంటూ ఆందోళనకారులు నినాదాలు చేయడం కనిపించింది.
ఇంటర్నెట్ సర్వీసుల పునరుద్ధరణ
మధ్యాహ్నం 2 గంటలకల్లా ఇంటర్నెట్ వినియోగం 50శాతానికి చేరుకుందని, అయితే ఫేస్‌బుక్, ట్విటర్‌లాంటి సోషల్ మీడియా సైట్‌లపై నిషేధం కొనసాగిందని నెట్‌బ్లాక్స్ ఇంటర్నెట్ అబ్సర్వేటరీ వెల్లడించింది.
ఇలా ఇంటర్నెట్‌ను బ్లాక్ చేయడం హీనమైన చర్య అని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ విమర్శించింది. ఇది మానవహక్కుల ఉల్లంఘన కిందికే వస్తుందని హెచ్చరించింది.
ఇక్కడ జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక సెషన్ నిర్వహించాల్సిందిగా ఐక్యరాజ్య సమితిలో మియన్మార్ వ్యవహారాలు చూసే టామ్ ఆండ్రూస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్‌ను కోరారు. సైనిక పాలకులు హద్దు మీరరాదని ఆయన అన్నారు

ఫొటో సోర్స్, AFP
మియన్మార్ ఎక్కడుంది?
మియన్మార్‌కు 'బర్మా' అని కూడా మరో పేరు ఉంది. దక్షిణాసియా దేశాలలో థాయ్‌లాండ్, లావోస్, బంగ్లాదేశ్, చైనా, ఇండియాలతో మియన్మార్‌కు సరిహద్దులు ఉన్నాయి.
సుమారు 5.40 కోట్ల జనాభా ఉన్న మియన్మార్‌లో ఎక్కువమంది బర్మీస్ భాష మాట్లాడతారు. మరికొన్ని భాషలు కూడా వాడుకలో ఉన్నాయి. యాంగాన్ సిటీ దేశంలోనే అతి పెద్ద నగరం కాగా, నేపీటా ఆ దేశానికి రాజధాని నగరం.
ఇక్కడ ఎక్కువమంది బౌద్ధ మతాన్ని ఆచరిస్తారు. రోహింజ్యా ముస్లింలతోపాటు మరికొన్ని తెగల ప్రజలు కూడా మియన్మార్‌లో నివసిస్తున్నారు.
1948లో బ్రిటీష్ సామ్రాజ్యం నుంచి స్వాతంత్ర్యం పొందిన మియన్మార్ 1962 నుంచి 2011 వరకు సైనిక పాలనలోనే ఉంది. ఆంగ్ సాన్ సూచీ నాయకత్వంలో 2011లో ప్రజాస్వామ్య పాలన అమలులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి:
- ఎర్రకోటను షాజహాన్ ఎందుకు కట్టించారు.. చరిత్రలో అక్కడ జరిగిన రాజకీయ కుట్రలెన్ని.. తెగిపడిన తలలెన్ని
- దీప్ సిద్ధూ ఎవరు? ఎర్రకోట ఘటన తరువాత చర్చల్లోకి ఎందుకొచ్చారు?
- ‘18 మందిని చంపిన సీరియల్ కిల్లర్’: ఒంటరి మహిళలతో మాట కలుపుతాడు... కోరిక తీర్చుకుని కడతేరుస్తాడు...
- బడ్జెట్ 2021-22: సామాన్యులకు ఈ బడ్జెట్‌తో చేకూరే ప్రయోజనాలు ఇవే..
- పాకిస్తాన్ గురించి నేపాల్ ప్రజలు ఏమనుకుంటారు?
- తీరా కామత్: రూ.16 కోట్ల ఇంజెక్షన్ ఈ పాపాయిని కాపాడుతుందా?
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









