షేక్ హసీనా: బంగ్లాదేశ్ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం

ఫొటో సోర్స్, Getty Images
బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని షేక్ హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీ భారీ మెజారిటీతో గెలిచింది. దీంతో ఈమె వరుగా మూడో సారి విజయం సాధించినట్టయింది.
350 పార్లమెంట్ స్థానాలకు గాను ఈమె పార్టీ 281 చోట్ల గెలిచిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు.
ప్రతిపక్షం కేవలం ఏడు సీట్లలోనే గెలుపొందింది.
పోలింగ్ ఆదివారం ముగిసింది. దేశవ్యాప్తంగా పలు చోట్ల అధికార, విపక్ష పార్టీల మద్దతుదారుల మధ్య జరిగిన ఘర్షణల్లో 17 మంది చనిపోయారు.
ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. చిట్టగాంగ్‌లోని ఒక పోలింగ్ కేంద్రంలో పోలింగ్ ప్రారంభం కాకముందే బ్యాలెట్ బాక్సులు నిండిపోయి ఉండటాన్ని బీబీసీ ప్రతినిధి ఒకరు కళ్లారా చూశారు.
దేశవ్యాప్తంగా రిగ్గింగ్ ఆరోపణలు వస్తున్నాయని బంగ్లాదేశ్ ఎన్నికల సంఘం రాయిటర్స్ వార్తా సంస్థతో చెప్పింది. ఈ ఆరోపణలపై దర్యాప్తు జరుపుతామని తెలిపింది.
ఈ ఎన్నికలను రద్దు చేయాలని, కొత్తగా పోలింగ్ నిర్వహించాలని ప్రతిపక్షం డిమాండ్ చేస్తోంది. ‘‘ఈ బూటకపు ఫలితం చెల్లదని తక్షణం ప్రకటించాలని ఎన్నికల సంఘాన్ని వేడుకుంటున్నాం’’ అని ప్రతిపక్ష నాయకుడు కమల్ హొస్సైన్ అన్నారు.
షేక్ హసీనాకు చెందిన ఆవామీ లీగ్ పార్టీ 2009 నుంచి బంగ్లాదేశ్‌ను పాలిస్తోంది.
ముస్లిం మెజార్టీ దేశమైన బంగ్లాదేశ్‌లో 16 కోట్ల మందికి పైగా ప్రజలు వాతావరణ మార్పులు, ఇస్లామిస్ట్ మిలిటెన్సీ, పేదరికం, అవినీతి మొదలైన సమస్యలను ఎదుర్కొంటున్నారు.
లక్షలాది మంది రోహింజ్యా ముస్లింలు మియన్మార్ నుంచి వలస రావటంతో బంగ్లాదేశ్ అంతర్జాతీయంగా చర్చనీయాంశం అయ్యింది.
ఈ ఏడాది మొదల్లో అవినీతి ఆరోపణలతో షేక్ హసీనాకు దీర్ఘకాలంగా ప్రత్యర్థిగా ఉన్న ఖలీదా జియా జైలు పాలయ్యారు. దీంతో ఆమె ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కోల్పోయారు. అయితే, ఇదంతా రాజకీయ దురుద్దేశ్యంతో జరిగిన వ్యవహారమని ఖలీదా జియా అప్పట్లో అన్నారు.
బంగ్లాదేశ్ నేషనల్ పార్టీకి చెందిన ఖలీదా జియా పోటీలో లేకపోవటంతో.. ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన, షేక్ హసీనాకు మిత్రపక్షంగా మెలిగిన కమల్ హొస్సైన్ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయ్యారు. జతియా ఒక్య ఫ్రంట్‌కు ఆయనే నాయకత్వం వహిస్తున్నారు. ఈ కూటమిలో ఖలీదా జియా పార్టీ కూడా ఉంది.
అయితే, 81 ఏళ్ల వయసున్న కమల్ హొస్సైన్ ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఈయన న్యాయవాది. బంగ్లాదేశ్ రాజ్యాంగాన్ని రచించిన వారిలో ఒకరు.
కాగా, 2014లో ఓటింగ్‌ను బాయ్‌కాట్ చేసిన బీఎన్పీ ఈ సారి ఎన్నికల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో గత 10 ఏళ్లలో తొలిసారి అన్ని జాతీయ పార్టీలూ పాల్గొన్న సార్వత్రిక ఎన్నికలుగా ఆదివారం జరిగిన పోలింగ్‌కు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇవి కూడా చదవండి:
- BBC EXCLUSIVE: బంగ్లాదేశ్ మొదటి హిందూ చీఫ్ జస్టిస్ దేశ బహిష్కరణ
- బంగ్లాదేశ్: ఇద్దరి మరణం.. ఉద్యమానికి ఊపిరి పోసింది
- బంగ్లాదేశ్: ఖలేదా జియాకు ఏడేళ్ల జైలు శిక్ష
- సామాన్యుడి కాపురంలో నిప్పులు పోసిన ‘హీరో’
- రోహింజ్యాలను వెనక్కు పంపేందుకు కుదిరిన ఒప్పందం
- బంగ్లాదేశ్ యుద్ధంలో 'రా' చీఫ్ రామేశ్వర్నాథ్దే కీలక పాత్ర!
- ‘రేపిస్టులకు మరణశిక్ష’ చట్టంతో అత్యాచారాలు ఆగుతాయా?
- విషాన్ని శుద్ధి చేసే గుళికలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










