2025: ఈ ఏడాది తెలుగు రాష్ట్రాల్లో చీకటి వెలుగులివే..

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన 19 మందిలో తనూష, సాయిప్రియ, నందిని అనే ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్లు ఉన్నారు.

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, చేవెళ్ల బస్సు ప్రమాదంలో చనిపోయిన అక్కాచెల్లెళ్లు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్.. ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో 2025 సంవత్సరం చీకటి వెలుగులు నింపింది.

కొన్ని ప్రమాదాలు ప్రజల జీవితాల్లో విషాదం నింపితే, కొన్ని పరిణామాలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూనే, 2025లో జరిగిన కొన్ని సంఘటనలను ఒకసారి గుర్తుచేసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
తిరుపతి తొక్కిసలాట బాధితురాలు

జనవరి 8: తిరుపతిలో తొక్కిసలాట

తిరుమల శ్రీవారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి టోకెన్‌ల జారీ కోసం ఏర్పాటుచేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాట జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్ చేసిన ప్రకటన ప్రకారం ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందారు. 48 మంది గాయపడ్డారు.

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్-ఎస్ఎల్‌బీసీ)

ఫొటో సోర్స్, UGC

ఫిబ్రవరి 22: ఎస్‌ఎల్‌బీసీ సొరంగంలో ప్రమాదం

శ్రీశైలం ఎడమగట్టు కాల్వ (శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్-ఎస్ఎల్‌బీసీ) సొరంగంలో జరిగిన ప్రమాదంలో పలువురు కార్మికులకు గాయాలయ్యాయి.

ఎనిమిది మంది సొరంగం లోపలే చిక్కుకుపోయారు.

తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామం వద్ద సొరంగం తవ్వుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది.

సింహాచలంలో కూలిన గోడ

ఏప్రిల్ 30: సింహాచలంలో కుప్పకూలిన గోడ

చందనోత్సవం రోజున సింహాచలం దేవస్థానంలో గోడ కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు గాయపడ్డారు.

ఈదురుగాలులతో కురిసిన భారీ వర్షానికి అక్కడ కొత్తగా నిర్మించిన గోడ క్యూలైన్‌లో ఉన్న భక్తులపై కూలిపోయింది.

గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం

మే 18: హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీలో చార్మినార్‌కు కూతవేటు దూరంలోనున్న గుల్జార్ హౌస్‌ పక్కనున్న భవనంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది బంధువులు చనిపోయారు.

విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ఘటన సమయంలో బాధితులంతా గాఢ నిద్రలో ఉన్నారు.

ఈ ప్రమాదం నుంచి నలుగురు మాత్రమే బయటపడగలిగారు. చనిపోయినవారిలో ఎనిమిది మంది చిన్న పిల్లలే.

నంబాల కేశవరావు

ఫొటో సోర్స్, Nambala Ramprasad

మే 21: మావోయిస్టు అగ్రనేత నంబాల ఎన్‌కౌంటర్

నక్సల్ ఉద్యమంలో సీనియర్ నేత, సీపీఐ మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవ్ రావు అలియాస్ బసవరాజు ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని నారాయణపూర్‌లో జరిగిన ఆపరేషన్‌లో భద్రతా బలగాల చేతుల్లో మృతి చెందారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.

తెలుగు రాష్ట్రాల్లో నక్సల్ ఉద్యమ మూలాలున్న శ్రీకాకుళం జిల్లాలోని కోటబొమ్మాళి మండలం జియ్యన్నపేట ఆయన స్వస్థలం.

వరంగల్‌లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నప్పుడు ఆయన పీపుల్స్ వార్ పార్టీలో చేరారు.

సిగాచీ పరిశ్రమలో పేలుడు

ఫొటో సోర్స్, Getty Images

జూన్ 30: సిగాచీ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు

హైదరాబాద్ శివారులోని పాశమైలారంలోనున్న సిగాచీ ఇండస్ట్రీస్ అనే ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. ఫలితంగా 54 మంది ప్రాణాలు కోల్పోయారు.

ప్యూర్ డ్రగ్ (ముడి సరుకు) తయారుచేసే ఈ పరిశ్రమలోని డ్రైయర్ చాంబర్‌లో ఈ పేలుడు సంభవించింది.

కర్నూలులో బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

అక్టోబర్ 24: ప్రైవేట్ బస్సు దగ్ధం

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు కర్నూలు జిల్లాలోని కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో ప్రమాదానికి గురై మంటలు అంటుకుంది.

తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది సజీవ దహనమయ్యారు. 27 మంది ప్రాణాలతో బయటపడ్డారు.

కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట

ఫొటో సోర్స్, UGC

నవంబర్ 1: ఆలయంలో తొక్కిసలాట

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పట్టణంలోనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది చనిపోయారు. అనూహ్యంగా భక్తులు పోటెత్తడంతో బారికేడ్లు విరిగిపోయి ఒకరిపై ఒకరు పడిపోయారు.

చేవెళ్ల వద్ద బస్సు ప్రమాదం

ఫొటో సోర్స్, UGC

నవంబరు 3: చేవెళ్ల వద్ద బస్సు ప్రమాదం

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ప్రమాదంలో 19 మంది చనిపోయారు.

ప్రమాదం సమయంలో సుమారు 70 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. టిప్పర్ ట్రక్ భాగం ఆర్టీసీ బస్సు కుడివైపు భాగంలోకి దూసుకుపోయింది.

అమరావతి రాజధాని ప్రాంతం

మే 2: అమరావతి పునర్నిర్మాణ పనులు...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు.

కృష్ణానది తీర ప్రాంతంలో విజయవాడ-గుంటూరు నగరాలకు మధ్య రాజధాని నిర్మించాలని ఏపీ అసెంబ్లీలో 2014 సెప్టెంబర్ 3న బిల్లు ఆమోదించారు.

మిస్ వరల్డ్ 2025 విజేత

ఫొటో సోర్స్, Opal Suchata/ FB

మే 31: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు

హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు మే 7వ తేదీన ప్రారంభమయ్యాయి. మే 31న జరిగిన గ్రాండ్ ఫినాలేలో థాయిలాండ్‌కు చెందిన ఒపల్ సుచాత చౌసీ విజేతగా నిలిచారు.

భారత్‌కు చెందిన నందిని గుప్తా సహా 108 దేశాల నుంచి యువతులు ఈ కిరీటం కోసం పోటీపడ్డారు.

విశాఖలో యోగా డే

ఫొటో సోర్స్, I&PR

జూన్ 21: విశాఖలో యోగా దినోత్సవం

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ సాగర తీరంలో సుమారు 3 లక్షల మంది యోగాసనాలు వేశారు.

'యోగా ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్ప్' అనే థీమ్‌తో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు.

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఆగస్టు 15: ఆంధ్రప్రదేశ్‌లో ‘స్త్రీశక్తి’

ఆంధ్రప్రదేశ్‌లోని ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభమైంది. 'స్త్రీ శక్తి' పేరుతో ఈ పథకాన్ని ప్రభుత్వం అమలుచేస్తోంది.

నాన్ స్టాప్, అల్ట్రా డీలక్స్, సూపర్ లగ్జరీ, గరుడ, ఇంద్ర ఏసీ బస్సులు, తిరుమల ఘాట్ రోడ్డులో వెళ్లే బస్సులకు ఈ పథకం వర్తించదని అధికారులు తెలిపారు.

తర్లువాడ

అక్టోబర్ 14: విశాఖలో గూగుల్ డేటా సెంటర్

ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ సుమారు 15 బిలియన్ డాలర్ల (సుమారు రూ.1.35 లక్షల కోట్ల) పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.

2026లో నిర్మాణ పనులు ప్రారంభించి, 2030 నాటికి డేటా సెంటర్‌ను సిద్ధం చేయాలని గూగుల్ భావిస్తోంది.

దీని నిర్మాణానికి విశాఖ శివారులోని తర్లువాడలో 308 ఎకరాలు, అడవివరంలో 120 ఎకరాలు, అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లిలో 160 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది.

మెస్సీతో రేవంత్ రెడ్డి, రాహుల్

ఫొటో సోర్స్, Telangana CMo

డిసెంబర్ 13: హైదరాబాద్‌లో మెస్సీ మేనియా

ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ఆటగాడు మెస్సీ హైదరాబాద్ పర్యటనతో అభిమానులు సందడి చేశారు.

ఉప్పల్ స్టేడియంలో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో ఆడారు. గ్రౌండ్ అంతా కలయదిరుగుతూ ప్రేక్షకులకు అభివాదం చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కాసేపు మ్యాచ్ ఆడారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)