నరేంద్ర మోదీ-నవాజ్ షరీఫ్ ఆలింగనం చేసుకున్న రోజు.. పదేళ్ల కిందట లాహోర్‌లో ఏం జరిగింది?

లాహోర్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2015లో మోదీ లాహోర్‌లో అడుగుపెట్టినప్పుడు నవాజ్ షరీఫ్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు
    • రచయిత, వకార్ ముస్తఫా
    • హోదా, జర్నలిస్ట్, పరిశోధకులు

పదేళ్ల కిందట 2015 డిసెంబర్ 25న అప్పటి పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ తన పెద్ద మనవరాలు మెహరున్నీసా వివాహానికి హాజరయ్యేందుకు వచ్చి లాహోర్‌లోని తన ఇంటికి వెళ్తుండగా.. ఆయన ఫోన్ మోగింది. ఆ కాల్ భారత ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వచ్చింది.

డిసెంబర్ 25న పాకిస్తాన్ అంతటా క్రిస్మస్, పాకిస్తాన్ వ్యవస్థాపకుడు ముహమ్మద్ అలీ జిన్నా పుట్టినరోజు సందర్భంగా సెలవు దినం.

2015లో, అదే రోజు నవాజ్ షరీఫ్ 66వ పుట్టినరోజు కూడా.

"భారత ప్రధానమంత్రి మోదీ మొదట నవాజ్ షరీఫ్‌కు ఫోన్‌లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి, ఆపై అఫ్గానిస్తాన్ అధికారిక పర్యటన నుంచి దిల్లీకి తిరిగి వచ్చేటప్పుడు పాకిస్తాన్‌లో ఆగవచ్చా అని అడిగారు" అని అప్పటి పాకిస్తాన్ విదేశాంగ కార్యదర్శి ఎజాజ్ చౌధరి గుర్తు చేసుకున్నారు.

"దయచేసి రండి, మీరు మా అతిథి. వచ్చి నాతో టీ తాగండి" అని ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్ బదులిచ్చారని చెప్పారు.

అనంతరం మోదీ.. "ఈ రోజు లాహోర్‌లో ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను కలవాలనుకుంటున్నాను. దిల్లీకి తిరిగి వెళ్ళేటప్పుడు అక్కడకు వస్తాను" అని ట్విట్టర్‌(ఇప్పుడు ఎక్స్)లో పోస్ట్ చెయడంతో భారత ప్రధాని పాకిస్తాన్‌లో వెళ్లనున్న విషయం ప్రజలకు తెలిసింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాకిస్తాన్ పర్యటన

ఫొటో సోర్స్, PIB

ఫొటో క్యాప్షన్, 2015 డిసెంబర్ 25న అప్పటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని స్వాగతించడానికి విమానాశ్రయానికి వచ్చారు.

మోదీ పర్యటన ఖరారవడానికి, ఆయన పాకిస్తాన్ చేరడానికి మధ్య చాలా తక్కువ సమయం మాత్రమే ఉండటంతో పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల మంత్రి సర్తాజ్ అజీజ్, విదేశీ వ్యవహారాల సలహాదారు తారిక్ ఫాతమీ, జాతీయ భద్రత సలహాదారు నాసిర్ జంజువా ఇస్లామాబాద్ నుంచి లాహోర్‌కు సమయానికి వెళ్లలేకపోయారు.

అయితే.. "నవాజ్ షరీఫే మోదీని లాహోర్‌కు రమ్మని ఆహ్వానించారన్న భావన పూర్తిగా తప్పు" అని సర్తాజ్ అజీజ్ తన 'బిట్వీన్ డ్రీమ్స్ అండ్ రియాలిటీస్' పుస్తకంలో రాశారు.

"అలా జరిగి ఉంటే, నేను లేదా తారిక్ ఫాతమీ లాహోర్‌లోనే ఉండేవాళ్లం. కేవలం మూడు గంటలే సమయం ఉంది. అది చాలా తక్కువ. కానీ విదేశాంగ కార్యదర్శి ఎజాజ్ చౌధరి అప్పటికే లాహోర్‌లో ఉన్నారు కాబట్టి ఆయన సమావేశానికి హాజరయ్యే అవకాశం కలిగింది" అని ఆయన రాశారు.

ఆ సమయంలో సెలవుల కారణంగా తన బంధువులను కలవడానికి లాహోర్‌లో ఉన్నట్టు ఎజాజ్ చౌధరి తెలిపారు.

ఉదయం 11 గంటల ప్రాంతంలో తాను గోల్ఫ్ ఆడడానికి వెళుతున్నప్పుడు ఇస్లామాబాద్‌లో భారత హైకమిషనర్ టీసీఏ రాఘవన్ నుంచి ఫోన్ వచ్చిందనీ, దిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో ప్రధాని మోదీ లాహోర్‌లో కొద్దిసేపు ఆగాలని భావిస్తున్నట్లు తనకు సమాచారం అందిందని ఎజాజ్ చౌధరి తాను రాసిన 'డిప్లమాటిక్ ఫుట్‌ప్రింట్స్' అనే పుస్తకంలో పేర్కొన్నారు.

"లాహోర్ వెళ్లడానికి తాను అప్పటికే తన కారు ఎక్కానని రాఘవన్ నాకు చెప్పారు. ఆయన సమయానికి విమానాశ్రయానికి చేరుకోలేరు కాబట్టి నేరుగా రైవిండ్(దక్షిణ లాహోర్‌లో పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నివాసం)కి వెళ్లారు" అని ఆయన పుస్తకంలో రాశారు.

"నేను వెంటనే నవాజ్ షరీఫ్ సైనిక కార్యదర్శికి ఫోన్ చేశాను. ఆయన ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ను అడిగిన తర్వాత.. మోదీ కొన్ని గంటల్లో వస్తున్నారని, నన్ను సమావేశానికి హాజరు కావాలని అడిగారు" అని రాశారు.

"సమావేశం లాహోర్‌లో ఉండటం, సమయం తక్కువగా ఉండటం వల్ల, సర్తాజ్ అజీజ్ లేదా తారిక్ ఫాతమీ సమయానికి చేరుకోవడం సాధ్యం కాలేదు" అని ఆయన పుస్తకంలో రాశారు.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఫొటో సోర్స్, Getty Images

మోదీని కౌగిలించుకున్న నవాజ్ షరీఫ్

అక్కడికి సుమారు నాలుగు గంటల తర్వాత నరేంద్ర మోదీ లాహోర్‌లో అడుగుపెట్టారు. నవాజ్ షరీఫ్ లాహోర్ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు.

"నవాజ్ షరీఫ్.. నరేంద్ర మోదీని కౌగిలించుకున్నారు" అని రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది.

"ఇది అధికారిక పర్యటన కాదు, చాలా తక్కువ సమయం మాత్రమే ఉంది. మేం రెడ్ కార్పెట్ మాత్రమే పరిచాం, సమయం చాలక ‘గార్డ్ ఆఫ్ ఆనర్’కు ఇవ్వలేకపోయాం" అని ఎజాజ్ చౌధరి రాశారు.

"ఎట్టకేలకు మీరొచ్చారు" అని మోదీతో నవాజ్ షరీఫ్ అన్నారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు చెప్పినట్లు రాయిటర్స్ పేర్కొంది.

"అవును,నిజమే. నేను వచ్చాను" అని మోదీ బదులిచ్చారు.

ఇద్దరూ చేయిచేయి కలిపి నవ్వుతూ ముందుకు నడిచారు. వారు హెలికాప్టర్ ఎక్కి రైవిండ్‌లోని నవాజ్ షరీఫ్ ఫామ్‌హౌస్‌కు చేరుకున్నారు.

రైవిండ్‌కు బయలుదేరే ముందు, రెండు హెలికాప్టర్లలో ప్రతినిధి బృందం రెండు సార్లు లాహోర్‌పై ఏరియల్ రెక్కీ చేసింది. ఒకదాంట్లో ఆయన స్వయంగా ప్రయాణించినట్టు ఎజాజ్ చౌధరి చెప్పారు.

"ఆ సాయంత్రం లాహోర్ అందంగా కనిపించింది. ప్రతినిధి బృందంలోని కొంతమంది సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు. వారు గగనతలంనుంచి ఫోటోలు కూడా తీశారు. ముఖ్యంగా లాహోర్‌కు దక్షిణంగా ఉన్న బహ్రియా టౌన్‌లో ఉన్న ఐఫిల్ టవర్ నమూనాని ఫోటోలు తీశారు" అని ఆయన చెప్పారు.

మోదీ పాకిస్తాన్ పర్యటనకు ముందు సుమారు దశాబ్ద కాలంగా భారత ప్రధానులెవరూ ఆ దేశంలో పర్యటించలేదు.

ఆ రోజు నవాజ్ షరీఫ్ పుట్టినరోజు.. మరుసటి రోజు ఆయన మనవరాలి పెళ్లి కూడా ఉండడంతో ఆయన నివాసాన్ని కూడా దీపాలతో అలంకరించారు.

ప్రతినిధుల సమావేశం కోసం సిటింగ్ రూమ్‌లోని సోఫాలను తిరిగి అమర్చారు. "ప్రధానమంత్రి (నవాజ్ షరీఫ్)తో పాటు ఆయన ఇద్దరు కుమారులు.. ఆయన సోదరుడు, పంజాబ్(పాకిస్తాన్‌లోని) ముఖ్యమంత్రి షాబాజ్ షరీఫ్.. అప్పటి ఆర్థిక మంత్రి ఇషాక్ దార్, నేను ఉన్నాం. అలాగే మోదీతో పాటు ఆయన జాతీయ భద్రత సలహాదారు అజిత్ డోభాల్, విదేశాంగ కార్యదర్శి జై శంకర్, హైకమిషనర్ రాఘవన్ ఉన్నారు. వారు అప్పటికే లాహోర్ చేరుకున్నారు" అని ఆయన పుస్తకంలో రాశారు.

"మొదట, ఇద్దరు ప్రధానులు సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావాల్సిన అవసరం గురించి మాట్లాడుకున్నారు. తర్వాత, ఇద్దరూ తమ ప్రతినిధి బృందాలను పరిచయం చేసుకున్నారు"

"ప్రధాని నవాజ్ షరీఫ్ అడగంతో.. ఇటీవలి ద్వైపాక్షిక సంబంధాల గురించి నేను ఆయనకు వివరించాను. ఆందోళనలను పరిష్కరించడం, ఉద్రిక్తతలను తగ్గించడానికి రెండు వైపులా పరస్పర అవగాహనను ప్రోత్సహించాల్సిన అవసరాన్ని చెప్పాను" అని ఆయన రాశారు.

నవాజ్ షరీఫ్ నివాసం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నవాజ్ షరీఫ్ నివాసంలో కూర్చున్న ప్రధాని మోదీ (ఫైల్ ఫోటో)

‘యుద్ధం ముగిసిపోయింది’

ఆ కాలంలో మారుతున్న చర్చల వాతావరణం గురించి సర్తాజ్ అజీజ్ తన పుస్తకంలో ఇలా రాశారు..

"2014 మే నెలలో మోదీ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన నవాజ్ షరీఫ్‌తో మాట్లాడి ఆ ఏడాది ఆగస్ట్‌లో రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమావేశం నిర్వహించేలా నిర్ణయించారు. కానీ పాకిస్తాన్ రాయబారి న్యూదిల్లీలో కశ్మీరీ హురియత్ నేతలతో సమావేశం కావడాన్ని నిరసిస్తూ భారత్ ఈ సమావేశాన్ని రద్దు చేసుకుంది"

"అనంతరం 2015 జులైలో రష్యాలో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో నిర్వహించాల్సిన జాతీయ భద్రత సలహాదారుల సమావేశం కూడా రద్దయింది’

"2015 నవంబర్‌లో అంతర్జాతీయ ఒత్తిడి కారణంగా.. పారిస్ వాతావరణ సదస్సు సందర్భంగా మోదీ.. నవాజ్ షరీఫ్‌తో, 'మనం కొత్త ఆరంభం చేద్దాం' అని అన్నారు"

"డిసెంబర్ 9న ఇస్లామాబాద్‌లో జరిగే 'హార్ట్ ఆఫ్ ఆసియా' సమావేశానికి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌ను స్వాగతించడానికి నవాజ్ షరీఫ్ అంగీకరించారు. రెండు దేశాల జాతీయ భద్రత సలహాదారులు ముందుగానే సమావేశమైతేనే ఇది సాధ్యమవుతుందని మోదీ అన్నారు. రెండు దేశాల సలహాదారులు డిసెంబర్ 6న బ్యాంకాక్‌లో సమావేశమయ్యారు. సుష్మా స్వరాజ్ ఇస్లామాబాద్ సమావేశానికి హాజరయ్యారు" అని అజీజ్ తన పుస్తకంలో రాశారు.

అలాగే.. ద్వైపాక్షిక సమావేశంలో చర్చ తర్వాత ఏం జరిగిందో సర్తాజ్ అజీజ్ పుస్తకంలో రాశారు.

"మేం ఎనిమిది అంశాల కింద అన్ని సమస్యలపై సమగ్ర చర్చలు జరపడానికి అంగీకరించాం.16 రోజుల తర్వాత ప్రధాన మంత్రి మోదీ లాహోర్‌ను సందర్శించినప్పుడు ఈ పర్యటన నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు మరింత బలపడ్డాయి"

లాహోర్‌లో మోదీ ప్రతినిధి బృందంలో భాగమైన విదేశాంగ కార్యదర్శి ఎస్ జైశంకర్ "నా బ్రీఫింగ్‌తో ఏకీభవించారు. చర్చల ప్రక్రియను మొదలుపెట్టడానికి జనవరి మధ్యలో ఇస్లామాబాద్‌కు రావడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు"

"మా బ్రీఫింగ్ ముగిసినప్పుడు మోదీ ఆలోచనలో మునిగిపోయారు, రెండు ప్రతినిధి బృందాల మధ్య ఉన్న టేబుల్ వైపు చూశారు. తరువాత తల పైకెత్తి మమ్మల్ని చూసి ఇలా అన్నారు: 'యుద్ధం ముగిసిపోయింది. ఇక యుద్ధం జరగదు" అన్నారని అజీజ్ రాశారు.

"యుద్ధాలు పేదరికం, వనరుల వృధా తప్ప మరేమీ ఇవ్వలేదని, యుద్ధాల వల్ల మనం ఏమీ పొందలేమని నవాజ్ షరీఫ్ అన్నారు"

"విపత్తు నిర్వహణ వంటి రంగాలలో సార్క్ వేదికను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని మోదీ నొక్కి చెప్పారు. ప్రాంతీయ సహకారం కోసం యూరోపియన్ అనుభవం నుంచి మనం నేర్చుకోవచ్చని నవాజ్ షరీఫ్ అన్నారు"

"భారతదేశం, పాకిస్తాన్, బంగ్లాదేశ్ సంయుక్తంగా 1857 స్వాతంత్ర్య యుద్ధ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని మోదీ ప్రతిపాదించారు. ఈ మూడు దేశాల ప్రజలు కలిసి పోరాడారు. దానికి నవాజ్ షరీఫ్ తల ఊపారు కానీ ఏం మాట్లాడలేదు"

"అప్పుడు మోదీ నవాజ్ షరీఫ్ వైపు నేరుగా చూసి, 'మీరు వాజపేయీజీతో కూడా మంచి సంబంధాలను పెంచుకున్నారు కదా?' అని అన్నారు"

"నవాజ్ షరీఫ్ అంగీకారంగా తల ఊపారు. 1999 ప్రారంభంలో వాజపేయీ లాహోర్ పర్యటన ద్వైపాక్షిక సహకారానికి కొత్త మార్గాలను ఎలా తెరిచిందో గుర్తుచేసుకున్నారు"

భారతదేశం, ప్రధానమంత్రి మోదీ, ట్వీట్లు, లాహోర్‌

ఫొటో సోర్స్, Getty Images

పర్యటన గురించి ట్వీట్లు

ఈ సందర్భంగా 'హై టీ' కోసం అన్ని ఏర్పాట్లు జరిగాయి.

టీ అందిస్తున్న సమయంలో నవాజ్ షరీఫ్, "ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడానికి మనం నిర్దిష్టమైన, ఫలితాల ఆధారిత నిర్ణయాలు తీసుకోవాలి" అని చెప్పారని ఎజాజ్ చౌధరి రాశారు.

"మోదీ అంగీకరిస్తున్నట్లుగా తల ఊపి, పొరుగువారి మధ్య సంబంధాలు సాధారణ స్థితికి రావాలని అన్నారు. ప్రజల మధ్య పరస్పర చర్యను ప్రోత్సహిద్దాం అన్నారు"

"ఆ తర్వాత మోదీ చైనాతో భారతదేశ సంబంధాలను ఉదహరిస్తూ, అక్కడ సమస్యలు ఉన్నప్పటికీ, వాణిజ్య సంబంధాలు కూడా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. పాకిస్తాన్ విషయంలో కూడా అదే జరగవచ్చని చెప్పారు"

ఎజాజ్ చౌధరి చెప్పిన ప్రకారం.. సమావేశం సుమారు నలభై నిమిషాలు కొనసాగింది."తర్వాత మోదీ నవాజ్ షరీఫ్ మనవరాలి వివాహానికి శుభాకాంక్షలు చెప్పడానికి పక్కనే ఉన్న గదికి వెళ్లారు.

"కొన్ని నిమిషాల తర్వాత, అందరూ మళ్ళీ హెలికాప్టర్ ఎక్కి అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. ప్రధానమంత్రి మోదీకి వీడ్కోలు పలికిన తర్వాత, ఇది సద్భావన పర్యటన అని మీడియాకు తెలియజేయమని ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ నన్ను కోరారు. సంభాషణలోని ముఖ్యాంశాలను నేను మీడియాకు అందించాను"

"కానీ మోదీ పర్యటన ఆయనకు, నవాజ్ షరీఫ్‌కు మధ్య జరిగిన రహస్య ఒప్పందం ఫలితమని మీడియా అప్పటికే ఊహాగానాలు మొదలుపెట్టింది. కానీ ఈ పర్యటన అకస్మాత్తుగా జరిగిందని నేను నమ్ముతున్నా" అని ఆయన రాశారు.

భారతదేశానికి చేరుకున్న తర్వాత, ప్రధానమంత్రి మోదీ అనేక ట్వీట్లలో లాహోర్ 'వామ్ ఈవెనింగ్'ని గుర్తు చేసుకున్నారు.

ఒక ట్వీట్లో, నవాజ్ షరీఫ్ సాహబ్ ప్రేమపూర్వక ఆదరానికి తాను ముగ్ధుడినయ్యాననీ, లాహోర్ విమానాశ్రయంలో తనను స్వాగతించారనీ, తిరిగి వచ్చేటప్పుడు కూడా వీడ్కోలు చెప్పడానికి స్వయంగా విమానాశ్రయానికి వచ్చారని మోదీ రాశారు.

నవాజ్ షరీఫ్, మోదీ బహుమతి

ఫొటో సోర్స్, Social Media

ఫొటో క్యాప్షన్, మోదీ బహుమతిగా ఇచ్చిన గులాబీ రాజస్థానీ తలపాగాను నవాజ్ షరీఫ్ తన మనవరాలి పెళ్లిలో ధరించారు.

గులాబీరంగు రాజస్థానీ తలపాగా

అయితే.. "ట్వీట్ల ద్వారా ఈ సందర్శన గురించి తెలుసుకోవడం దురదృష్టకరం. మరొక దేశం నుంచి తిరిగి వచ్చేటప్పుడు అక్కడ ఆగేంత స్నేహపూర్వకంగా పాకిస్తాన్‌తో భారతదేశ సంబంధాలు లేవు" అని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అన్నారు.

మోదీ పాకిస్తాన్ పర్యటనను వ్యతిరేకిస్తూ న్యూదిల్లీలో కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసి, మోదీ పోస్టర్లను తగలబెట్టారు.

పాకిస్తాన్‌లోని చాలా ప్రతిపక్ష పార్టీలు మోదీ పర్యటనను స్వాగతించాయి. ఇది సంబంధాలను మెరుగుపరుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాయి.

పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నాయకుడు ఐత్జాజ్ అహ్సాన్ ప్రైవేట్ టీవీ చానెల్ జియోతో మాట్లాడుతూ "ఈ రోజు పాకిస్తాన్, భారత్ రెండింటికీ మంచి రోజు" అని అన్నారు.

ఈ ప్రతీకాత్మక చర్య అణ్వాయుధాలున్న రెండు పొరుగు దేశాల మధ్య శాంతి ప్రయత్నాలు ప్రారంభించడానికి ప్రేరణనిచ్చే బలమైన అడుగుగా భావించవచ్చు.

"కుట్రపూరిత అంశాలకు ఎటువంటి అవకాశం ఇవ్వకుండా, చర్చలకు రాజకీయ శక్తిని అందించడం ఈ పర్యటన ఉద్దేశం" అని విశ్లేషకులు సి.రాజమోహన్ అన్నారు.

నవాజ్ షరీఫ్ పుట్టినరోజు ప్రధానమంత్రి లాహోర్ సందర్శించడానికి ఒక మంచి కారణమైంది. భారత ప్రధానమంత్రి పాకిస్తాన్ గడ్డపై జరిపిన పర్యటనలు కచ్చితంగా చాలా అరుదు. దశాబ్దాలలో ఇది ఎనిమిదవసారి మాత్రమే, 11 ఏళ్లలో ఒక భారత ప్రధానమంత్రి చేసిన మొదటి పర్యటన.

"ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తన మనవరాలి వివాహంలో మోదీ బహుమతిగా ఇచ్చిన గులాబీ రంగు రాజస్థానీ తలపాగాను ధరించారు. ఈ చర్య ఇద్దరు నాయకుల మధ్య ఉన్న సద్భావన, నమ్మకాన్ని ప్రతిబింబిస్తుంది" అని పత్రికలు రాశాయి.

కానీ ఈ ఆశావహ వాతావరణం ఎక్కువ కాలం కొనసాగలేదు.

"2016 జనవరి 2న, పఠాన్‌కోట్‌లో ఉగ్రవాద దాడి జరిగింది. భారతదేశం మరోసారి విదేశాంగ కార్యదర్శుల సమావేశాన్ని రద్దు చేసింది. సమగ్ర చర్చల షెడ్యూల్‌ను ఖరారు చేయడానికి ఈ సమావేశం ఏర్పాటుచేశారు" సర్తాజ్ అజీజ్ పుస్తకంలో రాశారు.

"అప్పుడు జులై 8న బుర్హాన్ వానిని భద్రతా దళాలు హతమార్చాయి. పెద్దఎత్తున ఆందోళన జరిగింది"

"ఈ సంఘటన, ఆ తరువాతి సంవత్సరం జరిగిన ఉరి దాడి భారతదేశం, పాకిస్తాన్ మధ్య సంబంధాలను మళ్లీ పాత పరిస్థితికే తెచ్చాయి" అని అజీజ్ తన పుస్తకంలో రాశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)