రెండు సార్లు గడువు పొడిగించినా 4 ప్రైవేట్ మెడికల్ కాలేజీల పీపీపీ బిడ్డింగ్‌కు ఒక్క దరఖాస్తు మాత్రమే ఎందుకొచ్చింది? బెదిరింపులే కారణమని మంత్రి ఎందుకన్నారు?

ఫొటో సోర్స్, UGC
- రచయిత, గరికిపాటి ఉమాకాంత్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్ర ప్రదేశ్‌లో మెడికల్ కాలేజ్‌లను పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మించేందుకు ప్రభుత్వం టెండర్లు పిలవగా, ఒకే ఒక్క సంస్థ బిడ్ దాఖలు చేయడం ఇప్పుడు చర్చనీయంగా మారింది. నాలుగు కళాశాలలను నిర్మించేందుకు టెండర్లు పిలిస్తే ఒక్క కాలేజ్‌కి ఒక్క సంస్థ మాత్రమే బిడ్ వేయడం ప్రభుత్వవర్గాలతో పాటు రాజకీయవర్గాల్లోనూ చర్చకు తెరలేపింది.
రాష్ట్రంలో పులివెందుల, ఆదోని, మార్కాపురం, మదనపల్లె కాలేజీల నిర్మాణాలను మొదటి విడతలోనూ.. పెనుకొండ, పాలకొల్లు, అమలాపురం, నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురం కాలేజ్‌ల నిర్మాణాలను రెండో విడతలోను పీపీపీకి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీవో నెంబర్ 590ని విడుదల చేసింది.
ఆ క్రమంలో ముందుగా ఆదోని, మార్కాపురం, మదనపల్లి, పులివెందుల కళాశాలలను యాన్యువల్ కన్సెషన్ ఫీ మోడల్ విధానంలో పీపీపీ పద్ధతిన నిర్మించేందుకు ఆంధ్రప్రదేశ్ వైద్యసేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ( ఏపీఎంఎస్‌ఐడీసీ) సెప్టెంబర్ 16న టెండర్లను ఆహ్వానించింది.
దీనికి సంబంధించిన గడువు డిసెంబర్ 22తో ముగిసింది. అప్పటికే రెండుసార్లు అక్టోబర్‌లో ఓసారి, నవంబర్‌లో మరోసారి గడువును పొడిగించి చివరగా డిసెంబర్ 22ను తుది గడువుగా ఖరారు చేశారు.
అయితే ఈ నాలుగు కాలేజీల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా ఆదోనిలో మెడికల్ కాలేజీకి మాత్రమే ఒక బిడ్ దాఖలైంది. మార్కాపురం, మదనపల్లి, పులివెందులలో కళాశాలలను నిర్మించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

ఆదోని కాలేజ్‌కు టెండర్ వేసింది ఎవరు?
కాగా ఆదోనిలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి హైదరాబాద్‌కు చెందిన కిమ్స్ బిడ్డింగ్ వేసినట్లు తొలుత కొందరు నాయకులు వెల్లడించారు.
అయితే, తాము ఎలాంటి బిడ్డింగ్ వేయలేదని కిమ్స్ స్పష్టం చేసింది.
తాము ఏపీలో పీపీపీ పద్ధతిలో హాస్పిటల్ నిర్మాణానికి ఎటువంటి టెండర్ వేయలేదని కిమ్స్ పీఆర్‌ఓ శ్రీకర్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
కిమ్స్ హాస్పిటల్‌లో పనిచేసే ఒక వైద్యుడు వ్యక్తిగతంగా ఆ టెండర్ దాఖలు చేశారని, దానికి కిమ్స్ యాజమాన్యానికి సంబంధం లేదని శ్రీకర్ ‘బీబీసీ’తో చెప్పారు.
టెండర్ దాఖలు చేసిన డాక్టర్ ఆదోనికి చెందినవారు కావడంతో వ్యక్తిగత ఆసక్తితో ఆ టెండర్ వేశారని వివరించారు.
కాగా ఇదే విషయాన్ని మంత్రి సత్య కుమార్ కూడా ధ్రువీకరించినట్లు మీడియాలో వార్తలు వెల్లడయ్యాయి.. దీనిపై సత్య కుమార్ తో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు.
‘బెదిరింపుల వల్లే టెండర్లు దాఖలు కాలేదు’ - మంత్రి సత్యకుమార్
ఒక్క కాలేజ్ నిర్మాణానికే టెండర్ దాఖలు కావడంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ స్పందించారు. రెండురోజుల కిందట విజయవాడ సిద్ధార్ధ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమం తర్వాత తనను కలిసిన మీడియాతో ఆయన మాట్లాడారు.
మాజీ ముఖ్యమంత్రి, విపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేరును ప్రస్తావించనప్పటికీ.. పరోక్షంగా ఆయనే కారణమంటూ సత్యకుమార్ ఆరోపించారు.
''వ్యక్తిగతంగా కూడా ఫోన్ చేసి బెదిరించారనేది తెలుస్తోంది. ఇటువంటి ఆటవిక సంస్కృతి రావడం అనేది దారుణం. ముందుకొస్తున్న వాళ్లను బెదిరించడం అనేది దేశచరిత్రలో ఏనాడూ జరగలేదు. టెండర్లు వేసిన వాళ్లను ఆయన (వైఎస్ జగన్‌ను ఉద్దేశించి) జైలుకు పంపిస్తానని అంటున్నారు. అసలు ఏవిధంగా పంపిస్తారు.. ఏ సెక్షన్ల ప్రకారం పంపిస్తారు.. అసలు ఆ అవకాశమే లేదు.. వారికి అవగాహన ఉందా, ఏమైనా లీగల్ ఒపీనియన్ తీసుకున్నారా.. ఇటువంటి చర్యలకు పాల్పడటం వల్ల తాత్కాలికంగా భయం సృష్టించవచ్చేమో కానీ... ఇది విధానపరమైన నిర్ణయం.. దీన్ని ఎవ్వరూ ఆపలేరు'' అని సత్యకుమార్ వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, YS Jagan Mohan Reddy/ facebook
మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న వైఎస్ జగన్
రాష్ట్రంలో కొత్త మెడికల్ కళాశాలలను పీపీపీ పద్ధతిలో నిర్మించాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు.
పేదలకు నాణ్యమైన వైద్యం, వైద్య విద్య అందించాలన్నదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని అందులో భాగంగా మెడికల్ కాలేజ్‌లను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచాలన్నదే తమ పార్టీ విధానమని స్పష్టం చేశారు.
ఈమేరకు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రైవేటీకరణపేరుతో ప్రభుత్వం స్కాములకు పాల్పడుతోందని విమర్శించారు. పీపీపీ విధానానికి వ్యతిరేకంగా ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కోటి సంతకాల సేకరణను వైసీపీ చేపట్టింది. ఈ సంతకాల సేకరణ ప్రతులతో వైఎస్ జగన్ డిసెంబర్ 18న రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను లోక్‌భవన్‌లో కలిశారు. కోటి సంతకాల సేకరణ ప్రతులతో పాటు ప్రజల నిరసనలకు సంబంధించిన ఆధారాలను గవర్నర్‌కు సమర్పించినట్టు ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ జగన్ చెప్పారు.
ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ల ప్రైవేటీకరణ దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కాం అని ఆరోపించారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం ద్వారా పేదల నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం కల్పిస్తోందని ఆరోపించారు. మెడికల్ కాలేజ్‌లను ప్రైవేటీకరణ చేస్తే జరిగే నష్టాల్ని గవర్నర్‌కు వివరించామన్నారు.
‘మేం అధికారంలోకి రాగానే రెండు నెలల్లో జైలు’
ఆ తర్వాత జగన్ తమ పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ''మనం ఇన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత కూడా చంద్రబాబు ముందుకు వెళ్తే.. కాలేజ్‌లను తీసుకున్నోళ్లను మాత్రం మనం అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు నెలలు తిరక్కుండానే జైల్లో పెడతాం'' అని వ్యాఖ్యానించారు.
‘బెదిరింపులపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటాం’
ఈ నేపథ్యంలో మూడు చోట్ల కాలేజ్‌ల నిర్మాణాలకు ఒక్క టెండర్ కూడా రాకపోవడంపై మంత్రి సత్యకుమార్.. విపక్ష నేత జగన్ వ్యాఖ్యలనే ప్రస్తావించారు.
బెదిరింపులపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
టెండర్ల గడువు మళ్లీ పొడిగిస్తామని రెండురోజుల కిందట మీడియాతో మాట్లాడుతూ ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, UGC
వెనక్కి తగ్గేది లేదన్న సీఎం చంద్రబాబు
మరోవైపు పీపీపీ విషయంలో వెనక్కి తగ్గేదిలేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
మన రాష్ట్రం ఒక్క చోటే కాదని, దేశవ్యాప్తంగా పీపీపీ విధానం అమల్లో ఉందని ఆయన తెలిపారు.
రెండురోజుల కిందట వైద్యఆరోగ్యశాఖపై సమీక్ష నిర్వహించిన చంద్రబాబు టెండర్ ప్రక్రియకు సంబంధించి బిడ్డర్స్‌తో మరోసారి సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.
ఇంత జరిగినా ఎలా ముందుకెళ్తారు: వైసీపీ
కోటి సంతకాలు చేసిన ప్రజాభిప్రాయాన్ని లెక్క చేయకుండా పీపీపీ పద్ధతిలోనే మెడికల్ కాలేజీలను నిర్మించాలని ముందుకు వెళ్లడం దారుణమని వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డి విమర్శించారు.
కాకాణి మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా వ్యతిరేకతను గుర్తించి ప్రైవేట్ సంస్థలు ముందుకు రావడం లేదనీ, కానీ చంద్రబాబు మాత్రం ముందుకెళ్తున్నారని అన్నారు. కమీషన్ల కోసం ప్రజా సందపను ప్రైవేటుకు దోచిపెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు., ప్రజాభిప్రాయాలను ధిక్కరిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
ఒక్కో మెడికల్ కాలేజీకి జీతాల రూపంలో రెండేళ్లలో సుమారు రూ. 140 కోట్లు.. పది మెడికల్ కాలేజీలకు రూ. 1400 కోట్లతోపాటు వయొబిలిటీ గ్యాప్ ఫండ్ ఇవ్వడానికి సిద్ధపడిన సీఎం చంద్రబాబు ఆ డబ్బుతో మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి ఎందుకు ప్రయత్నం చేయడం లేదని ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, APMSIDC
పీపీపీ ప్రాజెక్టులకు కేంద్ర సాయం: మంత్రి సత్యకుమార్
మరోవైపు ఆరోగ్య సేవల రంగంలో పీపీపీ పద్ధతిన చేపట్టే ప్రాజక్టులకు కేంద్రం నుంచి సాయం అందుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేసినట్టు రాష్ట్ర మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
ఈ మేరకు కేంద్ర మంత్రి నుంచి లేఖ వచ్చినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ డిసెంబర్ 25న మీడియాకి వివరాలు వెల్లడించింది.
''ఇప్పటి వరకు వివిధ రంగాల్లో మౌలిక సదుపాయాల విస్తృతికి భారీగా తోడ్పడిన పీపీపీ విధానాన్ని వైద్యారోగ్య రంగంలో కూడా విరివిగా వాడుకోవాలి, ఈ మేరకు మూడేళ్లలో చేపట్టే ప్రణాళికలను వెంటనే రూపొందించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సూచించింది.
వైద్యారోగ్య రంగంలో పీపీపీని ప్రోత్సహించేందుకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) పథకం కింద వైద్య కళాశాలల ఏర్పాటు, ఇతర మౌలిక సదుపాయాలకల్పనకు మొత్తం ప్రాజెక్టు వ్యయంలో 60 శాతం సహాయం అందుతుందని కేంద్ర మంత్రి నడ్డా తన లేఖలో పేర్కొన్నారు.
పైలట్ ప్రాజెక్టు వ్యయంలో మొత్తం ఖర్చులో 80 శాతం, మొదటి ఐదేళ్లకు నిర్వహణ వ్యయంలో 50 శాతం వీజీయఫ్ లభిస్తుందని కూడా వివరించారు.
వీజీఎఫ్ సహాయంలో కేంద్రం, రాష్ట్రాలు చెరి సగం భరిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు వైద్యారోగ్య రంగంలో పీపీపీ కింద చేపట్టే ప్రాజెక్టులకు 30 నుంచి 40 శాతం కేంద్ర సాయం అందుతుందని వెల్లడించారు.
కాగా, రాష్ట్రంలో పీపీపీ విధానంలో పది వైద్య కళాశాలలను అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వ ప్రయత్నాలను వివరించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ కేంద్ర సహాయాన్ని కోరుతూ ప్రతిలేఖ రాసినట్టు మంత్రి కార్యాలయం వెల్లడించింది.
విద్యావేత్తల్లో భిన్నాభిప్రాయాలు
కాగా, ఈ విషయమై రాజకీయపరంగా అధికార, విపక్షాలు పూర్తి భిన్న వాదనలు వ్యక్తం చేస్తుండగా, విద్యావేత్తల్లోనూ అదే మాదిరిగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రభుత్వం మరోసారి టెండర్లను పిలవరాదని, మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతికి స్వస్తి పలకాలని డిమాండ్ చేస్తూ.. గుంటూరులో ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిరక్షణ కమిటీ ఏర్పడింది.
ఈ కమిటీ రాష్ట్ర కో కన్వీనర్, శాసనమండలి మాజీ సభ్యుడు కె.ఎస్ లక్ష్మణరావు బీబీసీతో మాట్లాడుతూ.. ప్రజాభిప్రాయాన్ని గుర్తించే టెండర్లలో ఎవరూ పాల్గొనలేదనీ, దీన్ని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
టెండర్ల నిబంధనలను సరళం చేసి, ప్రైవేట్ వైద్య సంస్థలకు మొదటి రెండు సంవత్సరాలు వైద్యులకు, సిబ్బందికి జీతభత్యాలను ప్రభుత్వమే చెల్లిస్తుందని ప్రకటించినా బడా ప్రైవేట్ వైద్య కళాశాలల యాజమాన్యాలు ప్రజాభిప్రాయాన్ని గమనించి, రాజకీయ వ్యతిరేకతను గమనించి టెండర్లలో పాల్గొనకపోవడం హర్షణీయమన్నారు.
అయినాసరే ప్రభుత్వం ముందుకు వెళ్తే తమ కమిటీ తరఫున నిరసనలు చేపడతామని చెప్పారు.
మరోవైపు ఇదే విషయమై నాగార్జున విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేసి రిజైన్ చేసిన వేమా వెంకట సుబ్బారావు బీబీసీతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించారు. వైద్య విద్య అందరికీ అందబాటులోకి రావాలంటే పీపీపీ పద్దతిలో వెళ్లడం తప్పు కాదని అభిప్రాయపడ్డారు. అయితే నాణ్యత ప్రమాణాల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటే పీపీపీ పద్ధతి మంచిదేనని ఆయన అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














