ఉన్నావ్ అత్యాచార కేసు: కుల్దీప్ సింగ్ సెంగర్ శిక్ష సస్పెన్షన్.. బాధితురాలు ఏమంటున్నారు?

ఉన్నావ్ అత్యాచారం కేసు, కుల్దీప్ సింగ్ సెంగర్, దిల్లీలో నిరసనకారులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఉన్నావ్ అత్యాచారం కేసులో నిందితుడైన సెంగర్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దిల్లీలో నిరసనకారులు (ఫైల్ ఫోటో)

ఉన్నావ్ అత్యాచారం కేసులో ట్రయల్ కోర్టు బీజేపీ మాజీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్‌కు 2019లో జీవిత ఖైదు విధించింది.

జీవిత ఖైదు విధించిన ఆరేళ్ల తర్వాత, దిల్లీ హైకోర్టు మంగళవారం ఆయన శిక్షను సస్పెండ్ చేసింది.

రూ. 15 లక్షల వ్యక్తిగత బాండ్, అదే మొత్తానికి ముగ్గురు పూచీకత్తు సమర్పించాలని జస్టిస్ సుబ్రమణియం ప్రసాద్, జస్టిస్ హరీష్ వైద్యనాథన్‌తో కూడిన ధర్మాసనం మాజీ ఎమ్మెల్యేను ఆదేశించింది.

సెంగర్ శిక్షను సస్పెండ్ చేసిన కొన్ని గంటల తర్వాత, బాధితురాలు, ఆమె తల్లి, మహిళా హక్కుల కార్యకర్త యోగితా భయాన మంగళవారం ఇండియా గేట్ వద్ద నిరసన తెలిపారు. ఇండియా గేట్ కాంప్లెక్స్‌లో కూర్చున్న బాధితురాలు, 2027 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సెంగర్‌కు బెయిల్ మంజూరు చేశారని ఆరోపించినట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.

"ఈ తీర్పు తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది" అని బాధితురాలు తెలిపారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

" ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆయన భార్య పోటీ చేయడానికి వీలుగా సెంగర్‌కు బెయిల్ మంజూరు చేశారని, తనకు అన్యాయం జరిగిందని" బాధితురాలు ఆరోపించారు.

'ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బయట ఉంటే, నాకు రక్షణ ఎలా ఉంటుంది' అని ఆమె ప్రశ్నించారు.

సెంగర్‌ విడుదలైన తర్వాత తాను "భయపడ్డానని" చెబుతూ, ఆయన బెయిల్ రద్దు చేయాలని కూడా బాధితురాలు కోరారు.

న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, ఈ విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని ఆమె చెప్పారు.

నిందితుడు, కోర్టు, శిక్ష, సస్పెండ్

ఫొటో సోర్స్, Getty Images

అసలేం జరిగింది?

ఉత్తరప్రదేశ్ రాజధాని లఖ్‌నవూ నుంచి కేవలం 66 కిలోమీటర్ల దూరంలో జరిగిన ఈ నేరం వెలుగులోకి రావడానికి దాదాపు 10 నెలలు పట్టింది. ఆ తర్వాత బాధితురాలి తండ్రిపై దాడి జరిగింది. తరువాత ఆయనను అరెస్ట్ చేశారు. కస్టడీలో అనుమానాస్పద పరిస్థితులలో ఆయన మరణించారు.

సెంగర్‌ బెయిల్ సమయంలో బాధితురాలి ఇంటికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండాలని, దిల్లీలోనే ఉండాలని దిల్లీ హైకోర్టు మంగళవారం షరతు విధించింది. ప్రతి సోమవారం పోలీసుల ఎదుట హాజరు కావాలని కూడా ఆదేశించిందని ‘బార్ & బెంచ్’ రిపోర్ట్ చేసింది.

"వీటిలో ఏ షరతు ఉల్లంఘించినా, బెయిల్ (శిక్ష సస్పెన్షన్) రద్దవుతుంది" అని కోర్టు పేర్కొంది.

17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినందుకు దోషిగా నిర్ధరిస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సెంగర్‌ సవాలు చేశారు. ట్రయల్ కోర్టు ఆయనకి జీవిత ఖైదుతోపాటు రూ. 25 లక్షల జరిమానా విధించింది.

ఉన్నావ్ అత్యాచారం కేసులో బాధితురాలు మైనర్. 2017 జూన్ 11 నుంచి 20 మధ్య సెంగర్‌ ఆ బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.

ఆ తర్వాత అత్యాచార బాధితురాలిని బెదిరించి, పోలీసు అధికారులను మౌనంగా ఉండమని హెచ్చరించినట్టుగా ఆరోపణలున్నాయి.

అనంతరం, సెంగర్‌పై అత్యాచారం, కిడ్నాప్, క్రిమినల్ బెదిరింపు అభియోగాలతో పాటు లైంగిక నేరాలు, పోక్సో చట్టం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. అలహాబాద్ హైకోర్టు ఆదేశం మేరకు ఆయన్ని అరెస్ట్ చేశారు.

2019 ఆగస్ట్‌లో ఉన్నావ్ అత్యాచార కేసుకు సంబంధించిన నాలుగు కేసుల విచారణను సుప్రీంకోర్టు దిల్లీకి బదిలీ చేసి, రోజువారీ ప్రాతిపదికన విచారణ జరిపి 45 రోజుల్లోపు పూర్తి చేయాలని ఆదేశించింది.

బాధితురాలిపై దాడి, పోక్సో

ఫొటో సోర్స్, Getty Images

బాధితురాలిపై దాడి

2019 డిసెంబర్‌లో, ట్రయల్ కోర్టు అత్యాచారం కేసులో సెంగర్‌ను దోషిగా నిర్ధరించి జీవిత ఖైదు విధించింది. బాధితురాలు, ఆమె కుటుంబాన్ని, స్వేచ్ఛగా జీవించడానికి తగిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సురక్షితమైన వసతితోపాటు గుర్తింపు మార్చాలని ట్రయల్ కోర్టు సీబీఐని ఆదేశించింది.

సెంగర్‌కు గరిష్ట శిక్ష విధిస్తూ, ఈ శిక్ష తగ్గించే ప్రసక్తే లేదని ట్రయల్ కోర్టు పేర్కొంది. ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజా సేవకులైన వారు ప్రజల విశ్వాసాన్ని సంపాదిస్తారు. కానీ దానిని ఆయన ఉల్లంఘించారని కోర్టు పేర్కొంది.

మరోవైపు, బాధితురాలు ప్రయాణిస్తున్న కారును లైసెన్స్ ప్లేట్ లేని ట్రక్కు ఢీకొట్టడంతో కేసు వివాదాస్పద మలుపు తిరిగింది. ఈ ఘటనలో బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడగా, బాధితురాలి ఇద్దరు అత్తయ్యలు మరణించారు.

ఈ విషయంలో సెంగర్‌పై స్పెషల్ కేసు నమోదైంది. 2021 డిసెంబర్‌లో, దిల్లీ కోర్టు ఈ కేసులో సెంగర్‌ను నిర్దోషిగా విడుదల చేసింది. ఈ ప్రమాదానికి ఆయనే కుట్ర పన్నారనేందుకు ప్రాథమిక ఆధారాలు లభించలేదని పేర్కొంది.

తొమ్మిదేళ్లుగా ఉన్నావ్ కేసులో ఏం జరిగింది?

  • 2017 జూన్ 4: ఒక బాలిక ఉద్యోగం కోసం మాట్లాడడానికి ఉన్నావ్‌కు చెందిన అప్పటి బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమెపై 'అత్యాచారం' జరిగింది.
  • 2017 జూన్ 11 - జూన్ 20: ప్రాణాలతో బయటపడిన ఆమెను మఖి గ్రామం నుంచి శుభమ్ సింగ్, బ్రిజేష్ యాదవ్, అవధ్ నారాయణ్ కిడ్నాప్ చేశారు. ఆమెకు మత్తుమందు ఇచ్చి చాలా రోజుల పాటు సామూహిక అత్యాచారం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
  • 2017 జూన్ 20: బాధితురాలు, ఆమె తండ్రి ఫిర్యాదుతో శుభమ్ సింగ్, బ్రిజేష్ యాదవ్, అవధ్ నారాయణ్‌లపై ఐపీసీ సెక్షన్లు 363, 366, 376, 506 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
  • 2017 జూన్ 22: వైద్య పరీక్షల్లో జాప్యం జరిగిందనే ఆరోపణలతో బాధితురాలిని ఆమె బంధువులతో నివసించడానికి దిల్లీకి పంపారు.
  • 2017 ఆగస్టు: బాధితురాలు ఉన్నావ్‌కు తిరిగి వచ్చి సెంగర్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడానికి ప్రయత్నించారు. ఎమ్మెల్యే పేరు చెప్పకుండా పోలీసులు ఆమెను అడ్డుకున్నారని ఆరోపించారు. అదే నెలలో దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో ఆయన పేరు చేర్చలేదు.
  • 2018 ఫిబ్రవరి: సెంగర్‌ పేరును చేర్చాలని బాధితురాలు కోర్టును ఆశ్రయించారు.
  • 2018 ఏప్రిల్ 3: సెంగర్ మనుషులు బాధితురాలి తండ్రిపై దాడి చేసి, ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత ఆమె కుటుంబం.. నలుగురిపై ఫిర్యాదు దాఖలు చేసింది.
  • 2018 ఏప్రిల్ 5: సెంగర్ సహచరుల ఫిర్యాదు ఆధారంగా, బాధితురాలి తండ్రిని అరెస్టు చేశారు. ఆయుధాల చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
  • 2018 ఏప్రిల్ 8: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి నివాసం వెలుపల బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేశారు.
  • 2018 ఏప్రిల్ 9: బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో చనిపోయారు. జైలు అల్లర్లలో ఆయన గాయపడ్డారని పోలీసులు పేర్కొన్నారు. పోస్టుమార్టంలో 14 గాయాలు బయటపడ్డాయి, వాటిలో రాపిడి, వాపు, గాయాలు ఉన్నాయి.
  • 2018 ఏప్రిల్ 10: ఉత్తరప్రదేశ్ డీజీపీ ఆదేశాల మేరకు, క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఎమ్మెల్యే సోదరుడు అతుల్ సెంగర్‌ను అరెస్టు చేశారు. అత్యాచారం కేసు, కస్టోడియల్ మరణంపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. మఖి పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ అశోక్ కుమార్ సింగ్‌ను సస్పెండ్ చేశారు.
  • 2018 ఏప్రిల్ 11: సిట్ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.
  • 2018 ఏప్రిల్ 12: కేసును సీబీఐకి బదిలీ చేశారు. సెంగర్‌పై ఐపీసీ సెక్షన్లు 363, 366, 373, POCSO చట్టం కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
  • 2018 ఏప్రిల్ 13: సీబీఐ సెంగర్‌ను ప్రశ్నించేందుకు అదుపులోకి తీసుకుంది. అలహాబాద్ హైకోర్టు ఆయన్ను తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించింది. దర్యాప్తు పూర్తి చేయడానికి గడువు విధించింది. సెంగర్‌ను ఏడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి అప్పగించారు.
  • 2018 ఏప్రిల్ 15: ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి బాధితురాలిని సెంగర్ ఇంటికి రప్పించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న శశి సింగ్ అరెస్ట్ అయ్యారు.
  • 2018 ఏప్రిల్ 18: బాధితురాలు, ఆమె తల్లి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 కింద తమ వాంగ్మూలాలను నమోదు చేశారు. బాధితురాలి వయస్సు 19 సంవత్సరాలుగా సీబీఐ నిర్ధరించి, పోక్సో చట్టాన్ని రద్దు చేయాలని భావించింది. బాధితురాలి తండ్రి అనుమానాస్పద మరణంలో కీలక సాక్షి అయిన యూనస్ కూడా మృతి చెందారు.
  • 2019 మే: లోక్‌సభ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఉన్నావ్‌కు చెందిన బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ సెంగర్‌ను కలిశారు.
  • 2019 జూలై 28: బాధితురాలు రాయ్ బరేలికి వెళుతుండగా ఆమె కారును ట్రక్కు ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆమె ఇద్దరు అత్తయ్యలు మరణించారు. బాధితురాలు, ఆమె న్యాయవాది తీవ్రంగా గాయపడ్డారు.
  • 2019 జూలై 29: రోడ్డు ప్రమాద కేసులో సెంగర్, మరో తొమ్మిది మందిపై ఎఫ్ఐఆర్ నమోదు.
  • 2019 జూలై 30: బాధితురాలు భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖ బయటకొచ్చింది.
  • 2019 జూలై 31: సుప్రీంకోర్టు ఆ లేఖను సుమోటోగా స్వీకరించింది.
  • 2019 ఆగస్టు 1: ఈ విషయానికి సంబంధించిన ఐదు కేసులను దిల్లీకి బదిలీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
  • 2019 డిసెంబర్ 20: సెంగర్‌కు జీవిత ఖైదు, రూ. 25 లక్షల జరిమానా విధిస్తూ తీర్పు.
  • 2025 డిసెంబర్ 23: సెంగర్ శిక్షను దిల్లీ హైకోర్టు బెంచ్ సస్పెండ్ చేసింది.
  • ఆత్మహత్య ఆలోచనలు కలిగితే దాన్నుంచి బయటపడేందుకు భారత ప్రభుత్వానికి చెందిన జీవన్ సాథీ హెల్ప్ లైన్ 18002333330కి ఫోన్ చేయండి.
  • సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖ కూడా 18005990019 హెల్ప్ లైన్‌ను 13 భాషల్లో నిర్వహిస్తోంది.
  • నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ హెల్ప్ లైన్ నంబర్ 08026995000

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)