కలెక్టర్ టీనా డాబీనీ ‘రీల్ స్టార్’ అని పిలవడం వెనుక వివాదం ఏంటి, విద్యార్థులేమంటున్నారు?

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA
- రచయిత, మోహర్ సింగ్ మీనా
- హోదా, బీబీసీ ప్రతినిధి
రాజస్థాన్‌లోని బాడ్మేర్ జిల్లా కలెక్టర్ టీనా డాబీ పతాక శీర్షికల్లో నిలిచారు. జిల్లాలోని మహిళా పీజీ కాలేజీలో నిరసనకు దిగిన విద్యార్థినులు టీనా డాబీని 'రీల్ స్టార్' అని పిలవడం కలకలం రేపింది.
ఈ సంఘటన తర్వాత పోలీసులు కొంతమంది విద్యార్థినులను అరెస్ట్ చేయడంతో విషయం మరింత సున్నితంగా మారింది.
విద్యార్థినుల ఆరోపణలపై స్పందన కోసం జిల్లా కలెక్టర్ టీనా డాబీ, అసిస్టెంట్ కలెక్టర్ రాజేంద్ర సింగ్, మరి కొందరు అధికారులను బీబీసీ ఫోన్‌లో సంప్రదించింది. కానీ అధికారులెవరూ స్పందించలేదు.
"ఈ విషయం సోషల్ మీడియాలో మాత్రమే చర్చల్లో ఉంది. సోషల్ మీడియాలో జరిగే చర్చ చౌకబారు ప్రచారం, ప్రతిష్ఠను దిగజార్చేందుకు చేసే ప్రయత్నం మాత్రమే" అని టీనా డాబీ ఒక ప్రైవేట్ చానల్‌కు ఇచ్చిన లిఖితపూర్వక ప్రకటనలో తెలిపారు.
టీనా డాబీ రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆమె 2015లో సివిల్స్ టాపర్‌గా నిలిచారు.
పరిపాలనా పరమైన నిర్ణయాలు వల్ల కొన్ని సార్లు, రీల్స్ వల్ల మరి కొన్ని సార్లు ఆమె వార్తల్లో నిలిచారు.
అయితే ఇప్పుడు విద్యార్థినులు ఆమెను రోల్ మోడల్‌గా భావించడం లేదని, ఆమెను రీల్ స్టార్ అని పిలవడంతో వివాదం తలెత్తింది. ఇందులో పోలీసుల జోక్యంతో ఇది మరింత ముదిరింది.


ఫొటో సోర్స్, Getty Images
వివాదం దేనికి?
జోధ్‌పూర్ యూనివర్సిటీ పరీక్ష ఫీజులను పెంచడాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ నిరసనలో బాడ్మేర్‌లోని పీజీ మహిళా కళాశాల విద్యార్థినులు కూడా పాల్గొన్నారు. వీరిలో ఏబీవీపీ ఆఫీసు బేరర్లు, ఆ సంస్థతో సంబంధం ఉన్న విద్యార్థినులు కూడా ఉన్నారు.
"పెంచిన ఫీజులను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మేం ఉదయం 9 గంటల నుంచి కాలేజీలో శాంతియుతంగా నిరసనకు దిగాం. మా నిరసన మొదలైన నాలుగు గంటల తర్వాత సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ మా దగ్గరకు వచ్చి హామీ ఇచ్చారు" అని ఎంఏ హిస్టరీ చదువుతున్న విద్యార్థిని దీపు చౌహాన్ బీబీసీకి చెప్పారు.
"ఈ జిల్లా కలెక్టర్ మహిళ, ఆమె మాతో ఎందుకు మాట్లాడరు? ఆమె ఇక్కడకు వచ్చి మేం చెప్పేది వినాలి" అని విద్యార్థినులందరూ డిమాండ్ చేశారు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA
అయితే అక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విద్యార్థినులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
"కలెక్టర్ గురించి మీరు అలా మాట్లాడకూడదు. ఆమె మీకు ఆదర్శం. ఆమెకు ప్రోటోకాల్ ఉంది. ఆమె ఇక్కడకు వచ్చి మీతో ఎలా మాట్లాడతారు" అని అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారి తమకు చెప్పారని దీప్తి చౌహాన్ వివరించారు.
దీంతో విద్యార్థినులందరూ "మీరు ఆమెను రోల్‌మోడల్‌గా మాపైన రుద్దకండి. ఆమె రోల్‌మోడల్ అయితే, మా వద్దకు వచ్చి మా డిమాండ్లను వినేవారు. మనలో స్ఫూర్తి నింపే వ్యక్తి మనకు రోల్‌మోడల్. ఆమె మాకు రోల్‌మోడల్ కాదు" అని దీపు చౌహాన్ అన్నారు.
"మా రోల్‌మోడల్ టీనా డాబీ కాదు. అహల్యబాయి, రాణి లక్ష్మీ బాయి, రాణి పద్మిని, పన్నాథాయి వంటి ధైర్యవంతులైన మహిళలు మాకు రోల్‌మోడల్స్" అని నిరసనలో పాల్గొన్న విద్యార్థిని సునీతా జాంగిద్ అన్నారు.
"ఫీజుల తగ్గింపుపై అధికారులు హామీ ఇవ్వడంతో మేం నిరసన ముగించి వెళ్లిపోయాం" అని దీపు చౌహాన్ చెప్పారు.
నిరసన చేస్తున్న వారిలో చాలా మంది వెళ్లిపోవడంతో పోలీసులు "కలెక్టర్ గురించి అలాంటి మాటలు ఎలా చెబుతారు?" అంటూ విద్యార్ధినులు, ఏబీవీపీ ప్రతినిధులను కొత్వాలి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA
పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎస్పీ
తమను 4 గంటలు పోలీస్ స్టేషన్‌లో ఉంచారని, స్టేషన్‌లో మహిళా పోలీసులు లేరని విద్యార్థినులు ఆరోపించారు. విద్యార్ధులు పోలీ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగారు. ప్రజాస్వామ్యంలో మా అభిప్రాయాలను చెప్పే హక్కు మాకు లేదా అని ప్రశ్నించారు.
విద్యార్ధులు ధర్నాకు దిగిన తర్వాత విద్యార్థుల తల్లిదండ్రులు, ఏబీవీపీ ప్రతినిధులు, పోలీసు అధికారులు స్టేషన్ వద్దకు వచ్చారు.
బాడ్మేర్ ఎస్పీ స్టేషన్ వద్దకు వచ్చి విద్యార్థినులతో "తప్పు జరిగిందని అంగీకరిస్తున్నాం" అని చెబుతున్న వీడియో బయటకు వచ్చింది
"పోలీసు స్టేషన్‌లో 4 గంటల ధర్నా తర్వాత అధికారులు అక్కడకు వచ్చారు. ఎస్పీ తమ తప్పును అంగీకరించి క్షమాపణలు చెప్పారు" అని దీపు చౌహాన్ బీబీసీతో అన్నారు.
అయితే తాము ఎవరినీ అరెస్ట్ చేయలేదని కలెక్టర్ టీనా డాబీ ఓ ప్రైవేట్ చానల్‌తో చెప్పారు.

ఫొటో సోర్స్, MOHAR SINGH MEENA
పోలీసులు ఏం చెప్పారు?
"ఈ విషయంలో ఎటువంటి ఫిర్యాదు నమోదు కాలేదు. నిరసన స్థలంలో అలాంటి భాషను ఉపయోగించవద్దని మేం విద్యార్థులకు చెప్పాం. మేం విద్యార్థినులను తీసుకురాలేదు. వారికి పరిస్థితిని వివరించి అక్కడి నుండి వెనక్కి పంపించాం" అని కొత్వాలి పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ మనోజ్ కుమార్ బీబీసీతో అన్నారు.
"అధికారులు తమకు క్షమాపణ చెప్పాలని విద్యార్థులు అడిగారు. వారిని బలవంతంగా తీసుకువచ్చాం. స్టేషన్‌లో ఉంచాం అనేది నిజం కాదు" అని ఆయన తెలిపారు.
"పీజీ కాలేజీ, డిగ్రీ కాలేజీ పెద్ద కాలేజీలు. వీటిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం మేం నిరసనకు దిగాం. సమస్య తీవ్రతను జిల్లా కలెక్టర్‌కు వివరించే ప్రయత్నం చేశాం. కానీ ఆమె మమ్మల్ని ఎప్పుడూ కలవలేదు" అని కళాశాల నుండి పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఏబీవీపీ ప్రతినిధి పవన్ ఐచెరా బీబీసీతో అన్నారు.
కలెక్టర్ టీనా డాబీ గతంలోనూ వార్తల్లో నిలిచారు.
ఇటీవల జరిగిన బాడ్మేర్ దిశ కమిటీ సమావేశంలో ఆమె సమాధానాలపై ఎంపీ, ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు.
"సమోసాలు తినడానికి సమావేశానికి పిలిచారా?" అని వాళ్లు కలెక్టర్‌ను ప్రశ్నించారు.
అంతకుముందు బాడ్మేర్‌లో నమో బాడ్మేర్ ప్రచారానికి గానూ టీనా డాబీని దిల్లీలో రాష్ట్రపతి సత్కరించారు.
క్లీన్లీనెస్ డ్రైవ్ సందర్భంగా టీనా దాబీ నటించిన అనేక వీడియోలు, రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
లక్షల మంది ఆ వీడియోలను చూశారు. పరిశుభ్రత కాపాడుకోవాలని స్థానిక దుకాణదారులు, నివాసితులకు ఆమె వ్యంగ్యంగా సలహా ఇస్తున్న వీడియోలు కూడా వైరల్‌గా మారాయి.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














