కల్నల్ సంతోష్ బాబు మరణానికి కారణమైన గల్వాన్ లోయ ఘటన నేపథ్యంతో సల్మాన్ ఖాన్ సినిమా, చైనా మీడియా ఏం ప్రచారం చేస్తోంది..

ఫొటో సోర్స్, SKF
సల్మాన్ ఖాన్ కొత్త సినిమా ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ ను విమర్శిస్తూ చైనా ప్రభుత్వ మీడియా కథనం రాసింది.
'వాస్తవాలను వక్రీకరిస్తోంది' అని ఆరోపిస్తూ చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే గ్లోబల్ టైమ్స్ దినపత్రిక ఈ చిత్రంపై ఒక కథనాన్ని ప్రచురించింది.
2020లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణకు సంబంధించిన కథాంశంతో ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ తెరకెక్కుతోంది.
ఇందులో సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రాన్ని 2026 ఏప్రిల్ 17న విడుదల చేయనున్నారు.

సల్మాన్ పుట్టిన రోజైన డిసెంబర్ 27న ఈ సినిమా టీజర్ రిలీజైంది.
2020 మేలో తూర్పు లద్దాఖ్‌లోని ప్యాంగ్యాంగ్ ట్సో సరస్సు ఉత్తర ఒడ్డున భారత్, చైనా సైనికులు తలపడ్డారు.
ఈ సంఘటనలో రెండు వైపులా సైనికులకు గాయాలయ్యాయి.
తర్వాత జూన్ 15న మళ్లీ గల్వాన్ లోయలో ఇరుదేశాల సైనికులు ఘర్షణ పడ్డారు.
దీనికి సంబంధించి జూన్ 16న భారత సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ ఘర్షణలో 20 మంది భారతీయ సైనికులు మరణించారని తెలిపింది.
తమ సైనికులు ఎంతమంది చనిపోయారో చైనా ఇప్పటికీ చెప్పలేదు.

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA
గ్లోబల్ టైమ్స్ కథనంలో ఏం రాశారు?
చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ మంగళవారం ఒక కథనాన్ని ప్రచురించింది.
వాస్తవాలను వక్రీకరించడం వల్ల బాలీవుడ్ చిత్రం బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ వివాదాల్లో చిక్కుకుంది అని ఆ కథనానికి హెడ్లైన్ పెట్టింది.
"చైనా ప్రేక్షకులకు సల్మాన్ ఖాన్ బజరంగీ భాయిజాన్ హీరోగా తెలుసు. సాధారణ కథల్లో కూడా అజేయుడిలా కనిపించే పాత్రలను పోషించినందుకు చైనీస్ ఇంటర్నెట్‌లో ఆయన్ని ట్రోల్ చేస్తుంటారు" అని ఆ కథనం పేర్కొంది.
"బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ చిత్రంలో సల్మాన్ ఖాన్ కల్నల్ బిక్కుమళ్ల సంతోష్ బాబుగా నటించారు. 2020లో గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలో ఆయన కీలక పాత్ర పోషించారని భారతీయ మీడియా రాసింది. ఇది బాలీవుడ్‌ను ఆకర్షించింది" అని గ్లోబల్ టైమ్స్ కథనం తెలిపింది.
"బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా వినోద ఆధారిత భావోద్వేగ కథలతో వస్తాయి. అయితే ఎంత అతిశయోక్తితో చెప్పినా సినిమాలు చరిత్రను తిరగరాయలేవు. చైనా సార్వభౌమాధికారం కింద ఉండే భూభాగాన్ని రక్షించాలనే పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సంకల్పాన్ని కదిలించలేవు" అని చైనాకు చెందిన నిపుణుడొకరు చెప్పినట్లు ఈ కథనం పేర్కొంది.
గల్వాన్ లోయ ఘర్షణలో చైనా సైనికులు ఎంత మంది చనిపోయారనే దాని గురించి ఆ దేశ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పష్టంగా చెప్పలేదు.
ఈ సంఘటన జరిగిన చాలా రోజుల తర్వాత 2021లో గల్వాన్ లోయ ఘర్షణలో చనిపోయినవారు అంటూ నలుగురు సైనికులకు మరణానంతర పతకాలను ప్రకటించింది చైనా ప్రభుత్వం.
"ప్రజల్లో జాతీయవాద భావాలను రేకెత్తించడానికి భారత ప్రభుత్వం బాలీవుడ్ సినిమాలను ఉపయోగించుకోవడం ఆశ్చర్యం కలిగించదు. ఇది లోతుగా పాతుకుపోయిన సాంస్కృతిక- రాజకీయ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది" అని చైనా సైనిక నిపుణుడు సాంగ్ జాంగ్‌పింగ్ గ్లోబల్ టైమ్స్‌తో అన్నారు.
సినిమాల్లో నాటకీయత, అతిశయోక్తి ఎంతగా ఉన్నా, గల్వాన్ లోయ సంఘటన ప్రాథమిక వాస్తవాలను మార్చలేదని ఆయన అన్నారు.
"పర్వత ప్రాంతాల్లో ప్రతికూల పరిస్థితుల్లో చైనా సైనికులు విధులు నిర్వర్తిస్తూ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ఇది ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతుంది" అని ఆయన చెప్పారు.

గల్వాన్ లోయపై ఎవరి వాదనేంటి?
"ఈ సినిమా కథనం, అది విడుదలవుతున్న సమయం సరైంది కాదు. భారత్ చైనా మధ్య ఉద్రిక్తతలు చల్లబడిన సమయంలో ఒకవైపు మాత్రమే చూపించడం వల్ల శత్రుత్వం పెరగవచ్చు" అని గ్లోబల్ టైమ్స్‌తో చైనా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌లోని ఆసియా- పసిఫిక్ స్టడీస్ విభాగం డైరెక్టర్ లాన్ క్వియాన్‌క్యూ చెప్పారు.
గ్లోబల్ టైమ్స్ కథనంపై భారత విదేశాంగ శాఖ ఇంకా స్పందించలేదు.
గల్వాన్ లోయలో జరిగిన ఘర్షణలకు సంబంధించి రెండు దేశాలు తమ భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు ప్రత్యర్థి ప్రయత్నించినట్లు ఆరోపించుకున్నాయి.
"పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన 45 మంది సైనికులు చనిపోయారు. గల్వాన్‌లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు మేజర్ జనరల్ స్థాయి చర్చలు జరుగుతున్నాయి. భారతీయ సైనికులెవరూ మిస్సవలేదు" అని సైనిక వర్గాలను ఉటంకిస్తూ భారత ప్రభుత్వ వార్తా సంస్థ ప్రసార భారతి అప్పట్లో ట్వీట్ చేసింది.
ఈ ఘర్షణలో మరణించిన 16వ బిహార్ రెజిమెంట్‌కు చెందిన కల్నల్ సంతోష్ బాబుకు భారత ప్రభుత్వం 2021 జనవరిలో మరణానంతరం మహావీర్ చక్రను ప్రదానం చేసింది.
మహావీర్ చక్ర పురస్కార ప్రశంసా పత్రంలో ఇలా ఉంది.
"2020 జూన్ 15న కల్నల్ సంతోష్ బాబు 16వ బిహార్ రెజిమెంట్ బృందానికి నాయకత్వం వహిస్తున్నప్పుడు ఆపరేషన్ స్నో లెపర్డ్ కింద శత్రువులను గమనించేందుకు ఒక అబ్జర్వేషన్ పోస్ట్ ఏర్పాటు చేసే బాధ్యత అప్పగించారు. తన సైనికులకు సూచనలు ఇవ్వడం ద్వారా కల్నల్ సంతోష్ బాబు ఈ పని పూర్తి చేశారు"
"తమ స్థావరాన్ని కాపాడుకునేందుకు చేసిన పోరాటంలో అతనికి శత్రువుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. శత్రువులు ప్రాణాంతక, పదునైన ఆయుధాలు ఉపయోగించారు. పై నుంచి రాళ్లు విసిరారు. శత్రు సైనికుల హింసాత్మక, దూకుడు చర్యలకు భయపడకుండా సంతోష్ బాబు తన విధ్యుక్త ధర్మాన్ని నిర్వరిస్తూ భారత సైనికులను వెనక్కి నెట్టడాన్ని ప్రతిఘటించారు. ఈ ఘర్షణలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చివరి శ్వాస వరకు ఆయన తన సైనికులను నడిపిస్తూనే ఉన్నారు" అని పేర్కొన్నారు.
గల్వాన్ లోయ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత క్షీణించాయి.
తర్వాత కొన్ని రోజులకు వివిధ స్థాయిలలో చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి.
ప్రస్తుతం పరిస్థితి కొంత మెరుగ్గా ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
భారతదేశంలో సోషల్ మీడియాలో ఏం చర్చ జరుగుతోంది?
'బ్యాటిల్ ఆఫ్ గల్వాన్' టీజర్ విడుదలయ్యాక సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.
సినిమా టీజర్ విడుదలైన మూడు రోజుల్లోనే యూట్యూబ్‌లో రెండు కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి.
"ఈ నినాదాలు వేర్వేరుగా వినిపిస్తున్నాయి. బిర్సా ముండా కీ జై, బజరంగ్ బలీకి జై, భారత్ మాతా కీ జై. సల్మాన్ కత్తితో (కర్ర పట్టుకున్నా ఇది కత్తి లాంటిదే)...రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి" అని మధుర్ అనే యూజర్ ఎక్స్‌లో రాశారు.
"సల్మాన్ ఖాన్ రాబోయే సినిమా బ్యాటిల్ ఆఫ్ గల్వాన్‌ను కొంతమంది ఎగతాళి చేస్తున్నారు. ఈ సినిమా శక్తి ఏంటో అవసరమైనచోట అవసరమైన వారికి తెలిసింది. చైనా వణుకుతోంది" అన రోహిత్ జైశ్వాల్ అనే యూజర్ ఎక్స్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు.
"బ్యాటిల్ ఆఫ్ గల్వాన్ అనేది ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అనడంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు" అని సునీల్ యాదవ్ మెసేజ్ పెట్టారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














