సింధు లోయ: వందల ఏళ్ల కరువే ఈ నాగరికతను అంతం చేసిందా, తాజా పరిశోధనలో ఏం తేలింది?

సింధు లోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, అవతార్ సింగ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

సింధు లోయ నాగరికత ఎప్పుడు, ఎలా అంతమైందన్నది ఎప్పుడూ ఒక మిస్టరీయే. ఈ రహస్యాన్ని ఛేదించేందుకు ఎప్పటికప్పుడు అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి.

అయితే, 'హరప్పా నాగరికత కేవలం ఒక్క విపత్తు సంఘటన వల్ల అంతరించిపోలేదు. శతాబ్దాల పాటు సాగిన, పదేపదే వచ్చిన సుదీర్ఘ నదీతీర కరువుల వల్ల ఈ నాగరికత అంతరించిపోయింది' అని తాజాగా ఒక అధ్యయనం వెల్లడించింది.

సింధు లోయ నాగరికత ఎలా అంతరించిపోయిందనే దానికి అంతకుముందు ఎన్నో సిద్ధాంతాలను చరిత్రకారులు ప్రతిపాదించారు.

యుద్ధం వల్ల, ప్రకృతి విపత్తుల వల్లని, సింధు నదికి వరదలు వచ్చి, అది గమనాన్ని మార్చుకోవడం వల్ల...ఇలా పలు సిద్ధాంతాలు తెరపైకి వచ్చాయి.

ఆ సమయంలో ఘగ్గర్ అనే మరొక నది ఎండిపోవడం వల్ల, అక్కడ నివసిస్తోన్న ప్రజలు వలస వెళ్లిపోయారనే సిద్ధాంతం కూడా ఉంది.

ఐఐటీ గాంధీనగర్‌కు చెందిన పరిశోధకులు, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు ఒక బృందంగా ఏర్పడి నిర్వహించిన తాజా పరిశోధన కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (ఏ నేచర్ పబ్లికేషన్ జర్నల్)లో ప్రచురితమైంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ అధ్యయనం ప్రకారం.. ప్రాచీన సింధు లోయ నాగరికత అభివృద్ధికి కీలకమైనదిగా సింధు నది ఉండేది. వ్యవసాయానికి, వాణిజ్యానికి, కమ్యూనికేషన్‌కు స్థిరమైన నీటి వనరులను ఈ నది అందించేది.

ఈ నాగరికత 5000 ఏళ్ల క్రితం సింధు నది, దాని ఉపనదుల చుట్టూ పరిఢవిల్లింది. కాలక్రమేణా ఇది పరిణామం చెందుతూ వచ్చింది.

హరప్పా కాలంలో (ఇప్పటికి 4500-3900 ఏళ్ల ముందు) సింధు లోయ నాగరికత ప్రణాళికబద్ధమైన నగరాలకు, మంచి నీటి నిర్వహణ వ్యవస్థలకు, అధునాతన లిపికి పెట్టింది పేరుగా నిలిచింది. 3900 ఏళ్ల క్రితం నుంచి హరప్పా నాగరికత మెల్లగా అంతరించడం మొదలైంది. కాలక్రమేణా అది కనుమరుగైంది.

ఈ నాగరికత అవశేషాలను ప్రస్తుత పాకిస్తాన్‌లో, వాయువ్య భారత దేశంలో చూడొచ్చు.

సింధు లోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మూడో కరువు వచ్చినప్పుడు వార్షిక వర్షపాతంలో 13 శాతం తగ్గుదల కనిపించిందని తాజా పరిశోధన తెలిపింది.

కరువులపై పరిశోధన ఏం తెలియజేసింది?

హరప్పా నాగరికత ప్రారంభ కాలాన్ని ఆధారంగా చేసుకుని తాజాగా 11 పేజీల రిపోర్టును ప్రచురించారు. దానిలో, సింధు లోయ నాగరికత నాలుగు అతిపెద్ద కరువులను ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.

ఈ రీసర్చ్ పేపర్ ప్రకారం.. ''హరప్పా కాలం ఉన్నతదశలో, చివరి దశలో ఉన్నప్పుడు ఏర్పడిన నాలుగు భయంకరమైన కరువులను మేం గుర్తించాం. మూడు తీవ్రమైన కరువులు 4445-4358 ఏళ్ల మధ్య , 4122-4021 ఏళ్ల మధ్య , 3826-3636 ఏళ్ల మధ్య ఏర్పడ్డాయి. నాలుగవ కరువు 3531-3418 ఏళ్ల మధ్య ఏర్పడింది. మూడు కరువులు 85 శాతం ఈ నాగరికతను ప్రభావితం చేశాయి'' అని వెల్లడించింది.

''తీవ్రమైన ఈ కరువుల్లో రెండోది 102 ఏళ్ల పాటు, మూడోది 164 ఏళ్ల పాటు కొనసాగింది'' అని పేర్కొంది.

మూడో కరువు వచ్చినప్పుడు వార్షిక వర్షపాతంలో 13 శాతం తగ్గుదల కనిపించిందని తెలిపింది.

''ఇంతకుముందు చాలా అధ్యయనాలు జరిగాయి. వారు సింధు లోయ నాగరికత ప్రాంతాలకు వెళ్లి, అక్కడ నేల, పురాతన చెట్లు వంటి డేటాను సేకరించారు. గతంలో జరిగిన పరిశోధనలు కేవలం గుణాత్మక డేటాను మాత్రమే ఇచ్చేవి. ఎక్కువ లేదా తక్కువ వర్షపాతం ఉండేదా అనేది మాత్రమే ఆ డేటాలు చూపించాయి. కానీ, ఆ సమయంలో ఎంత శాతంలో వర్షపాతం తగ్గింది, కరువులు ఏర్పడిన సమయం ఏంటి అనేది మేం గుర్తించాం'' అని ఈ పరిశోధన రచనకు నాయకత్వం వహించిన హీరేన్ సోలంకి చెప్పారు.

'' అంతకుముందు హరప్పా నాగరికత పశ్చిమ ప్రాంతంలో ఉండేది. కానీ, కరువులు రావడంతో, ఈ నాగరికత సింధు లోయ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత మధ్య ప్రాంతంలో అంటే సింధు నది వైపూ కరువులు వచ్చాయి. ఈ కరువుల తర్వాత ప్రజలు తొలుత సౌరాష్ట్ర (గుజరాత్) వైపుకు, రెండోసారి నదులు ప్రవహించే హిమాలయాల దిగువ ప్రాంతాలకు తరలి వెళ్లారు'' అని హీరెన్ సోలంకి తెలిపారు.

''దీనికి ముందు ఉన్న ఎన్నో సిద్ధాంతాలు సింధు లోయ నాగరికత ఒక్కసారిగా అంతరించిపోయిందని చెప్పాయి. కానీ, అలా జరగలేదని ఈ పరిశోధనలో చూపించాం. అనేక వందల ఏళ్ల పాటు కొనసాగిన వరుస కరువుల వల్ల ఈ నాగరికత కనుమరుగైందని తెలిసింది. సగటున ఒక్కో కరువు 85 ఏళ్లకు పైననే కొనసాగింది. కొన్ని అయితే, సగటున 100 నుంచి 120 ఏళ్ల పాటు ఉన్నాయి'' అని ఈ పరిశోధన పత్రం అసోసియేట్ ఆథర్, ప్రొఫెసర్ విమల్ మిశ్రా తెలిపారు.

''అంతకుముందులా కాకుండా మేం తొలిసారి నదుల ప్రవాహంపై అధ్యయనం చేశాం. నీరు లభ్యమయ్యే ప్రదేశాలు ఎలా మారిపోయాయో గమనించాం. దీనితో పాటు వలసలను కూడా పరిశీలించాం'' అని విమల్ మిశ్రా చెప్పారు.

సింధు లోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సింధు లోయ నాగరికతపై పర్యావరణ కోణం నుంచి ఈ పరిశోధన నిర్వహించారు.

ఉష్ణోగ్రతలు పెరగడంతో నీటి కొరత

సింధు లోయ నాగరికతపై ఈ పరిశోధన పర్యావరణ కోణంలో నిర్వహించారు. ట్రాన్సియంట్ క్లైమేట్ సిమ్యులేషన్స్ , హైడ్రలాజికల్ మోడలింగ్ రెండింటినీ కలిపి ఈ పరిశోధన చేశారు.

సుదీర్ఘ కరువుల సమయంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 0.5 డిగ్రీల సెల్సియస్ పెరిగిందని శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల, నీటి కొరత మరింత తీవ్రమైందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

''ఈ సమయంలో ఉష్ణోగ్రత పెరిగినట్లు మేం గుర్తించాం. దీనివల్ల, గ్లేసియర్ (మంచు పర్వతం) కరిగి, నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది. నీటి లభ్యతతో ప్రజలు హిమాలయాల వైపుకు తరలి వెళ్లారు. మరోవైపు, ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త మెరుగైన వర్షపాతం కారణంగా సౌరాష్ట్ర వైపుకు కూడా వెళ్లారు. సౌరాష్ట్రలో ట్రేడ్ నెట్‌వర్క్ అనుసంధానమై ఉంది'' అని హీరెన్ సోలంకి చెప్పారు.

''ఈ ప్రాంతం పూర్తిగా కనుమరుగైందని మేం చెప్పడం లేదు. కానీ, వాతావరణ మార్పుల వల్ల ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరోై ప్రాంతానికి తరలి వెళ్లారు'' అని ఆయన తెలిపారు.

పర్యావరణం, సింధు లోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నదుల్లో నీళ్లు తగ్గడంతో వ్యవసాయం దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.

పంటల మార్పు

రుతుపవనాలు సరిగ్గా లేకపోవడం, నదీ ప్రవాహం తగ్గడం వల్ల వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిందని తాజా పరిశోధన వెల్లడించింది.

''ప్రజలు గోధుమ, బార్లీ పంటల నుంచి ఇతర పంటలకు మారారు. అంటే, నీటి లభ్యత తగ్గడం వల్ల, హరప్పా ప్రజలు తక్కువ నీరు అవసరమయ్యే పంటలకు మారాల్సి వచ్చింది'' అని ఈ పరిశోధన పేర్కొంది.

కరువును తట్టుకునే సజ్జ వంటి పంటలు వేయడం మొదలుపెట్టారని సోలంకి వివరించారు.

''తొలుత కరువు వచ్చినప్పుడు ప్రజలు ఈ పద్ధతిని అనుసరించారు. కానీ, కరువు మరింత తీవ్రమై, నీరు తగ్గిపోవడం ప్రారంభమైనప్పుడు, ఈ ప్రాంతాల ప్రజలు పెద్ద నుంచి చిన్న పట్టణాలకు మారారు. ఆ తర్వాత చిన్న ప్రాంతాలకు తరలివెళ్లారు'' అని చెప్పారు.

సింధు లోయ నాగరికత

ఫొటో సోర్స్, Getty Images

ప్రకృతి ఉత్పాతాన్ని వివరించే పరిశోధన

''కరువు ప్రతి దగ్గరా ఉంది. కానీ, వ్యవస్థ ఎక్కడైతే బాగుంటుందో, ప్రజలు అక్కడ నివసించగలుగుతారు. మూడో, నాలుగో కరువులు వచ్చినప్పుడు.. ప్రజలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లారు'' అని సోలంకి తెలిపారు.

''హరప్పా నాగరికత ప్రజలు ఒక దగ్గర్నుంచి మరో దగ్గరికి ఎలా వెళ్లారో మనం చూశాం. అది అంతరించిపోయేందుకు లేదా పతనానికి కారణాలేంటి ? ఈ నాగరికత ముగిసిపోయేందుకు ఒక్క పర్యావరణం మాత్రమే కారణం కాదు. దీంతో పాటు మరెన్నో కారణాలు ఉన్నాయి. వీటి మధ్యలో కరువులు సంభవించాయి'' అని హీరెన్ సోలంకి తెలిపారు.

''అనేక దశాబ్దాల పాటు కొనసాగిన ప్రకృతి ఉత్పాతం గురించి ఈ పరిశోధన తెలియజేస్తుంది'' అని సౌత్ ఏషియా నెట్‌వర్క్ ఆన్ డ్యామ్స్, రివర్స్, పీపుల్ కోఆర్డినేటర్ హిమాన్షు థక్కర్ అంటున్నారు.

''నేడు మన భూగర్భ జలాలు, నదులు, అడవులు వేగంగా ధ్వంసమవుతున్నాయి. అప్పట్లో సహజసిద్ధంగా జరిగితే, ఇప్పుడు జరిగేది మానవ చర్యల కారణంగా ఏర్పడుతున్న పరిస్థితి. ఇది మరింత ప్రమాదకరం'' అని హిమాన్షు థక్కర్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)