సింధు నదిలో గోల్డ్ మైనింగ్: ‘ఒకప్పుడు చేతులతో బంగారాన్ని వెలికి తీసేవాళ్లం, ఇప్పుడు ఒట్టి చేతులే మిగిలాయి’ అని ఆ తెగ ప్రజలు ఎందుకు అంటున్నారంటే..

సింధు నది, బంగారం, యంత్రాలు, పాకిస్తాన్, భారత్, పంజాబ్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, మొహమ్మద్ జుబైర్ ఖాన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

‘‘నేను సింధు నది ఒడ్డున చేతులతో బంగారం కోసం వెతికేవాణ్ని. కొన్నిసార్లు నాకు గ్రాము బంగారం దొరికేది. దాంతో నా కుటుంబాన్ని పోషించడం తేలికయ్యేది. కొన్ని సంవత్సరాల కిందట మా ప్రాంతంలో మెషీన్లతో బంగారం తవ్వకం మొదలయింది''

‘‘శతాబ్దాలుగా నదిలోని ఇసుక నుంచి చేతులతో బంగారాన్ని వెలికితీస్తున్న పురాతన తెగలకు ఇప్పుడు ఆ అవకాశంలేదని నాకనిపించింది''

"ఇప్పుడు నేను యంత్రాలను నడిపేవారికోసం రోజువారీ జీతంతో పని చేస్తున్నా. ఆ జీతం నాకు కొన్నిసార్లొస్తుంది. కొన్నిసార్లురాదు''

పాకిస్తాన్ పాలిత గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని దియామీర్ జిల్లాకు చెందిన హబీబుల్లా ఈ మాటలు అన్నారు.

నది నుంచి బంగారం తీయడాన్ని తన పూర్వీకుల ద్వారా హబీబుల్లా నేర్చుకున్నారు. ఆయనతో సహా ఆయన తెగకు చెందిన చాలామందికి జీవనోపాధి అంటే ఇదే. ఇప్పుడది కనుమరుగవుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
సింధు నది, బంగారం, యంత్రాలు, పాకిస్తాన్, భారత్, పంజాబ్

ఫొటో సోర్స్, Mohammad Ravan

ఫొటో క్యాప్షన్, "సోనేవాల్ తెగ"కు చెందిన వారు తరాలుగా బంగారం వెలికితీస్తున్నారు.

తరతరాలుగా బంగారం అన్వేషణ

గతంలో ఈ పని చేసే కొంతమంది స్థానికులకు సొంత భూమి ఉండేదని, ఇప్పుడు అదే స్థలంలో వారు యంత్రాలను ఏర్పాటు చేసుకుని ఈ పనిచేస్తున్నారని హబీబుల్లా చెప్పారు.

ఈ యంత్రాలు అద్దెకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ వృత్తితో సంబంధం లేని కొంతమంది, తమకు భూమి ఉండడంతో బంగారు గనులు తవ్వేవారితో, యంత్ర యజమానులతో పార్టనర్‌షిప్‌లు పెట్టుకుని ఇందులో భాగస్వాములయ్యారు.

పెద్ద యంత్రాలను కొనే స్థోమత, భూమి లేకపోవడంతో సంవత్సరాలుగా చేతులతో బంగారం వెలికి తీస్తున్న గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని హబీబ్ ఆవేదన వ్యక్తంచేశారు.

"నేను చేతులతో బంగారం వెతికేవాడిని. మాకు సొంత భూమి ఉండటంతో ఇప్పుడు మెషీన్ ఆపరేటర్ల‌తో కలిసి ఈ పని చేస్తున్నాం’’ అని ఆజం ఖాన్ చెప్పారు. ఆయన ప్రసిద్ధ పర్యాటక కేంద్రమైన బాబూసర్ టాప్ వాసి.

సింధు నది, బంగారం, యంత్రాలు, పాకిస్తాన్, భారత్, పంజాబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సింధు తీరంలో వందలాది యంత్రాలు

యంత్రాల ప్రవేశం

గిల్గిట్-బాల్టిస్తాన్ , దియామీర్ జిల్లాలో నది నుంచి ‘సోనేవాల్’ తెగకు చెందినవారు బంగారాన్ని వెలికితీసేవారు. ఈ తెగకు సొంత అసోసియేషన్ ఉంది.

2023 వరకు తమ దగ్గర యంత్రాలేమీ ఉండేవి కాదని దియామీర్ జిల్లాకు చెందిన మొహమ్మద్ రవ్వాన్ చెప్పారు.

''అప్పుడు కొంతమంది స్థానిక భూ యజమానులు యంత్రాలను తీసుకురావడం మొదలుపెట్టారు. ఇప్పుడు నది నుంచి బంగారాన్ని వెలికితీసే వందల యంత్రాలు ఈ ప్రాంతంలో ఉన్నాయి'' అని ఆయన తెలిపారు.

తమ తెగకు చెంది భూమిలో రెండు యంత్రాలను ఏర్పాటు చేసినట్టు స్థానికుడైన ఆజీమ్ ఖాన్ చెప్పారు.

"మా ప్రాంతంలో బంగారం కోసం వెతకడానికి ప్రభుత్వ స్థాయిలో భూమి లేదా ప్రత్యేక స్థలం కేటాయించలేదు. నేను యంత్రాలను అమర్చిన ప్రదేశానికి కొంత దూరంలో, ఇతరులు ఆరు నుంచి ఏడు యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతానికి కొన్ని కిలోమీటర్ల పరిధిలో దాదాపు 150 యంత్రాలున్నాయి" అని ఆయన అన్నారు.

ఒకప్పుడు పాకిస్తాన్ ఉత్తర ప్రాంతాలకు వెళ్లిన వారికి, సింధు నదిలో ఇసుకను జల్లెడపట్టి బంగారాన్ని వెతికే ప్రజలు కనిపించేవారు. కాలక్రమేణా పద్ధతులు మారాయి. ఇప్పుడు సింధు నదీతీరం వెంబడి ముఖ్యంగా దియామీర్ జిల్లాలోని సింధు నది ఒడ్డున భాశా డ్యామ్ రిజర్వాయర్ చుట్టూ ప్రయాణిస్తే ఒకట్రెండు కాదు వందలాది యంత్రాలతో బంగారం తీసే పనులను చూడొచ్చు.

దాదాపు 3,180 కిలోమీటర్ల పొడవున్న సింధు నది, టిబెట్‌లోని మానససరోవర్ సరస్సు నుంచి పుట్టి అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది. పాకిస్తాన్‌కు సాగునీరు అందిస్తుంది.

ఈ నది శతాబ్దాలుగా మనుషుల నాగరికత, సంస్కృతి, జీవనానికి, ఆదాయానికి ప్రధాన వనరు. కొంతమందికి ఈ నది అక్షరాలా బంగారుకొండ. వారి జీవనోపాధి దానిపై ఆధారపడి ఉంది.

సింధు నది, బంగారం, యంత్రాలు, పాకిస్తాన్, భారత్, పంజాబ్

ఫొటో సోర్స్, Mohammad Ravan

ఫొటో క్యాప్షన్, చేతులతో బంగారం వెలికితీసేటప్పుడు కుటుంబానికి రోజుకు ఒక గ్రాము బంగారం దొరికేది.

పర్వతాల లోపల బంగారు నిల్వలు

సింధు నది ఒడ్డున నేల, ఇసుకలో బంగారం సహజంగానే ఉంటుందని అబోటాబాద్ క్యాంపస్‌లోని కోమ్‌సాట్స్ విశ్వవిద్యాలయం పర్యావరణ విభాగం అధిపతి డాక్టర్ ఫరీదుల్లా చెప్పారు.

"సాధారణంగా పర్వతాలలోని లోహ నిక్షేపాల నుంచి బంగారం వస్తుంది. పర్వతాలలోని గనుల నుంచి బంగారు పోగులు, చిన్న కణాలు వివిధ మార్గాల ద్వారా నదులు, ప్రవాహాల్లోకి చేరతాయి. వర్షంనీళ్లు లేదా హిమానీనదాలు పర్వతాల నుంచి ప్రవహించినప్పుడు, అవి పర్వత రాళ్ళు, మట్టితో పాటు చిన్న బంగారు కణాలను నదిలోకి తీసుకువెళతాయి"

"నదీ ప్రవాహ సమయంలో, అలాంటి కణాలు నది ఒడ్డున ఇసుక, మట్టిలో పేరుకుపోతాయి. సింధు నది ఇసుక మట్టిలో చిన్న బంగారు కణాలు కనిపించడానికి కారణం ఇదే" అని ఆయన చెప్పారు.

"ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్‌లో ఆంక్షల తర్వాత బంగారు గని కార్మికులు గిల్గిట్-బాల్టిస్తాన్‌కు వెళ్లారు"

కొన్ని సంవత్సరాల కిందటి వరకు గిల్గిట్-బాల్టిస్తాన్‌లో బంగారం జల్లెడ పట్టే యంత్రాలు చాలా తక్కువ ఉండేవని దియామీర్‌కు చెందిన అబ్దుల్లా చెప్పారు.

గతంలో ఇలాంటి యంత్రాలు ఎక్కువగా ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కాబూల్ నది, పంజాబ్‌లోని సింధు నది వెంబడి ఉండేవని ఆయన తెలిపారు.

"కానీ అక్కడి అధికారులు ఆంక్షలు విధించినప్పుడు గిల్గిట్-బాల్టిస్తాన్‌కు తరలివెళ్లారు. ఇటీవల పంజాబ్‌కు చెందిన ఒక పెట్టుబడిదారుడు నన్ను సంప్రదించి, నా భూమిలో యంత్రాలను ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతిస్తే అద్దె చెల్లిస్తానన్నారు. నా భూమిని అద్దెకు ఇచ్చే బదులు 40శాతం లాభం తీసుకోవడం మంచిదని నాకనిపించింది" అని ఆయన చెప్పారు.

సింధు నది, బంగారం, యంత్రాలు, పాకిస్తాన్, భారత్, పంజాబ్

ఫొటో సోర్స్, Mohammad Ravan

ఫొటో క్యాప్షన్, యంత్రాల వల్ల సంప్రదాయ వృత్తి కనుమరుగవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తంచేశారు.

పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వాలో బంగారు గనుల తవ్వకంపై నిషేధం

సింధు నదిలో యంత్రాలను ఉపయోగిస్తున్నవారిపై, బంగారం కోసం అన్వేషణ చేస్తున్న వారిపై పంజాబ్, ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రభుత్వాలు కొన్నేళ్లగా చర్యలు తీసుకుంటున్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం గత రెండేళ్లలో ఇలాంటి అక్రమ బంగారు తవ్వకాలపై వందకిపైగా కేసులు నమోదయ్యాయి.

గిల్గిట్-బాల్టిస్తాన్‌‌‌లోని బంగారు అన్వేషణపై ఖనిజ శాఖ, చాంబర్ ఆఫ్ కామర్స్, ఇతర అధికారుల నుంచి కచ్చితమైన సమాచారాన్ని పొందేందుకు బీబీసీ ప్రయత్నించింది. కానీ సమగ్ర ప్రభుత్వ డేటా దొరకలేదు.

చేతితో బంగారం తీసేందుకు ప్రయత్నించేటప్పుడు రోజుకు గరిష్టంగా ఒక గ్రాము దొరికేదని ఇప్పుడు తమ కుటుంబానికి చెందిన ఆరుగురు లేదా ఏడుగురు వ్యక్తులు యంత్రాలపై రోజుకు ఆరు నుంచి ఏడు గ్రాముల బంగారాన్ని తీస్తున్నారని ఆజీంఖాన్ చెప్పారు.

సింధు నది, బంగారం, యంత్రాలు, పాకిస్తాన్, భారత్, పంజాబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యంత్రాల వల్ల స్థానికంగా కాలుష్యం పెరుగుతోందని పర్యావరణ వేత్తలంటున్నారు.

సంప్రదాయానికి ముప్పు

శతాబ్దాల నాటి వృత్తి (చేతితో బంగారం తీయడం) అంతరించిపోతోందని దియామీర్ జిల్లాలోని అంజుమన్ 'సోనెవాల్ తెగ' అధిపతి మొహమ్మద్ రవ్వాన్ అన్నారు.

"గతంలో మా ప్రాంతంలో పొగ లేదా గందరగోళం ఉండేది కాదు. కానీ ఇప్పుడు యంత్రాలు, జనరేటర్ల నుంచి నిరంతరం శబ్దం వస్తోంది. పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తూ పోతూ ఉన్నారు. వాహనాల సంఖ్య పెరిగింది. దియామీర్, చిలాస్ ప్రాంతాలలో కొత్త ప్రపంచం ఆవిర్భవిస్తోంది. కానీ మా వృత్తి కనుమరుగవుతోంది'' అని ఆయన తెలిపారు.

"మా వాళ్ళలో కొంతమంది యంత్రాలు, భూమిని అద్దెకు తీసుకొని ఈ పని చేయడానికి ప్రయత్నించారు. కానీ దీనివల్ల ఏ మాత్రం లాభం ఉండడంలేదు. ఖర్చులు కూడా రావడం లేదు. దీంతో వాళ్లు మళ్లీ రోజువారీ సంపాదన కోసం వెతుకుతున్నారు'' అని మొహమ్మద్ రవ్వాన్ అన్నారు.

"నీరు, ఇసుక, మట్టితో పనిచేసే అవకాశాన్ని మాకు కల్పించాలని ప్రభుత్వాన్ని పదే పదే కోరాం. ఈ పురాతన వృత్తి, నైపుణ్యాన్ని సజీవంగా ఉంచేందుకు, ఈ పని చేసే 2,300 కుటుంబాలకు జీవనోపాధిని అందించే వ్యవస్థను సృష్టించాలి. కానీ ఇప్పటివరకు ఎవరూ అలాంటి ప్రయత్నాలు చేయలేదు'' అని ఆయన అన్నారు.

గిల్గిట్-బాల్టిస్తాన్‌‌లోని సింధు నది, దాని ఉపనదుల ఒడ్డున బంగారు తవ్వకం శతాబ్దాల నుంచి జరుగుతోందని కోమ్‌సాట్స్ యూనివర్సిటీ అబోటాబాద్ క్యాంపస్‌లో పర్యావరణ విభాగానికి అధిపతి డాక్టర్ ఫరీదుల్లా చెప్పారు.

ఈ పద్ధతిలో నది ఒడ్డున ఇసుక, కంకర, రాళ్లను సేకరించి ప్లేట్లు, జల్లెడలు, తొట్లు, చిన్న పారలను ఉపయోగించి నీటిలో కడుగుతారని ఆయన వివరించారు.

''తేలికైన మట్టి కొట్టుకుపోతుంది. బరువుగా ఉండే చిన్న బంగారు కణాలు అడుగున మిగిలిపోతాయి. ఈ ప్రక్రియ పర్యావరణానికి తక్కువ నష్టాన్ని కలిగిస్తుంది'' అని ఆయన అన్నారు.

ఇప్పుడు ఈ పని యంత్రాల ద్వారా జరుగుతోందని, భారీ మెషీన్లను ఉపయోగిస్తున్నారని డాక్టర్ ఫరీదుల్లా చెప్పారు.

తక్కువ సమయంలో ఎక్కువ మొత్తంలో ఇసుక, మట్టిని శుభ్రం చేయడం ద్వారా ఎక్కువ బంగారాన్ని పొందవచ్చు.

సింధు నది, బంగారం, యంత్రాలు, పాకిస్తాన్, భారత్, పంజాబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చేతులతో బంగారాన్ని తీయడమే పర్యావరణానికి మేలైన విధానమని నిపుణులు చెప్పారు.

యంత్రాల నుంచి కాలుష్యం

దియామీర్ జిల్లాలోని చాలా యంత్రాలను భాశా డ్యామ్ , దాని పరిసర ప్రాంతాల రిజర్వాయర్‌లో ఏర్పాటు చేశారని గిల్గిట్-బాల్టిస్తాన్‌లోని మినరల్స్ అండ్ మైన్స్ డైరెక్టర్ అహ్మద్ ఖాన్ చెప్పారు.

వాటిలో చాలా యంత్రాలను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై ప్రభుత్వానికి సమాచారమిచ్చామని తెలిపారు.

గిల్గిట్-బాల్టిస్తాన్‌‌లో సింధు నది నుంచి బంగారాన్ని తీయడానికి ప్రత్యేక చట్టాలు లేవు. ఖైబర్ పఖ్తుంఖ్వా, పంజాబ్‌లలో చట్టాలు చేశారు.

డీజిల్‌తో నడిచే జనరేటర్లు, ఎక్స్‌కవేటర్లు, పంపులు, యంత్రాలను బంగారాన్ని వెలికితీసేందుకు ఉపయోగిస్తారని, ఈ యంత్రాల నుంచి వెలువడే పొగలో కార్బన్ డయాక్సైడ్, సల్ఫర్, సూక్ష్మకణాలుంటాయని డాక్టర్ ఫరీదుల్లా చెప్పారు.

ఈ సూక్ష్మ కణాలు గాలిలో వ్యాపించినప్పుడు అవి శ్వాసకోశ వ్యాధులు, కంటి, ఛాతీ సమస్యలకు కారణమవుతాయి.

''అత్యంత ప్రమాదకరమైన విషయం ఏమిటంటే, నల్ల కార్బన్ గాలి ద్వారా ఈ ప్రాంతాల్లోని హిమానీనదాలకు చేరినప్పుడు, హిమానీనదాలు సూర్యుడి నుండి ఎక్కువ వేడిని గ్రహించేలా చేస్తాయి. దీనివల్ల అవి వేగంగా కరుగుతాయి'' అని ఫరీదుల్లా చెప్పారు.

బంగారాన్ని చేతులతో వెలికితీసే సంప్రదాయ పద్ధతిలో జనరేటర్లు లేదా భారీ యంత్రాలను ఉపయోగించరు కాబట్టి వాయు కాలుష్యం చాలా తక్కువగా ఉంటుందని ఆయన అన్నారు.

సింధు నది, బంగారం, యంత్రాలు, పాకిస్తాన్, భారత్, పంజాబ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యంత్రాల వల్ల సింధు నదికి నష్టం వాటిల్లుతోందని స్థానికులు చెబుతున్నారు.

జనరేటర్లు, క్రషింగ్ మెషీన్లు వంటి యంత్రాల ద్వారా మైనింగ్ చేయడం వల్ల నిరంతరం శబ్దం వస్తుంటుందని డాక్టర్ ఫరీదుల్లా అన్నారు.

ఈ శబ్దం స్థానికులకు మానసిక ఒత్తిడి, నిద్ర లేమి, వినికిడి సమస్యలను కలిగించడమే కాకుండా ఈ ప్రాంతాల్లోని వన్యప్రాణులపై కూడా ప్రభావితం చేస్తుందన్నారు.

"పర్వత ప్రాంతాల్లో ఈ శబ్దం చాలా దూరం వినబడుతుంది. నిశ్శబ్ద లోయల సహజ ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది. చేతులతో బంగారాన్ని తీయడం పర్యావరణానికి అంత ప్రమాదకరం కాదు’’ అని డాక్టర్ ఫరీదుల్లా అంటున్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)