అబ్దుల్ కరీం జమాల్: బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి, భారతీయ కంపెనీని కాపాడటానికి సర్వస్వం ఒడ్డిన గుజరాతీ వ్యాపారి

ఫొటో సోర్స్, Puneet Kumar/BBC
- రచయిత, అర్జవ్ పరేఖ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గుజరాత్‌కు వ్యాపారానికి మధ్య అవిభాజ్య సంబంధముంది. 18వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం చివరి వరకు, గుజరాతీలు ప్రత్యేకంగా నిలిచారు. గుజరాతీ వ్యాపారులు దశాబ్దాలపాటు సముద్రయానం చేసి, అరబ్ దేశాలు మొదలుకుని తూర్పు ఆఫ్రికా దేశాల దాకా వ్యాపారం చేసి, అక్కడ స్థిరపడి, పెద్ద సామ్రాజ్యాలను నిర్మించారు.
"అందమైన భారతదేశంలోని ఒక భాగమైన ముంబయిలో ఒక విలాసవంతమైన భవనం దగ్గర వరుసగా కార్లు, మోటార్ సైకిళ్లున్నాయి. అక్కడ ఓ పెద్ద పండుగ జరుపుకుంటున్నారు. అనేక మంది ప్రత్యర్థులు, శత్రువులతో తీవ్రమైన పోటీలో స్థిరంగా నిలిచిన ఒక సంస్థ తన వాణిజ్యసామ్రాజ్య భవనాన్ని నిర్మించుకుంది. గుజరాత్ గర్వంగా భావించే సర్దార్ వల్లభాయ్ దానిని ప్రారంభించబోతున్నారు. బంగారు తాళాన్ని, పసిడి తాళంచెవితో తెరిచి భవనాన్నిప్రారంభించారు. సింథియా షిప్పింగ్ కంపెనీ వైభవానికి సంబంధించిన విజయ గంట ప్రతిచోటా మోగింది. ఒక వ్యాపార వీరుడి ధైర్యం ఆ వైభవం పునాదిలో దాగి ఉంది. ఆ వ్యాపారి భారీ నష్టాన్ని చవిచూసి కూడా ఆ వ్యాపార సంస్థను కాపాడారు’’
ఆయనే గుజరాతీ వ్యాపారి అబ్దుల్ కరీం జమాల్. బ్రహ్మదేశ్ (ప్రస్తుత మియన్మార్)లో ఆయన తన సామ్రాజ్యాన్ని స్థాపించారు.
అబ్దుల్ కరీం జమాల్ జీవితంపై మాధవరావు కార్నిక్ 'షా సోదాగర్ జమాల్' పేరుతో రాసిన ఓ చిన్నపుస్తకంలో ఈ సంఘటనను ఉదహరించారు.


ఫొటో సోర్స్, GURJAR PUBLICATION
సింథియా స్టీమ్ నావిగేషన్ కంపెనీని ఎలా నిలబెట్టారంటే..
షిప్పింగ్ వ్యాపారం 20వ శతాబ్దం ప్రారంభంలో బాగా అభివృద్ధి చెందింది. కొంతమంది భారతీయులు కలిసి 'సింథియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ'ని స్థాపించారు. కానీ ఈ కంపెనీ పురోగతి ఇతర పోటీదారులకు నచ్చలేదు. భారతీయ పోటీదారు ఆవిర్భావం, లాభాలలో భాగస్వామ్యం వారికి నచ్చలేదు.
కోల్‌కతా,ముంబయి,రంగూన్(మియన్మార్) మధ్య ఈ కంపెనీ నౌకలను నడపడం ప్రారంభించింది. ఈ పురోగతిని అడ్డుకోవడానికి విదేశీ కంపెనీలు కలిసికట్టుగా పనిచేశాయి. తమ స్టీమర్లలో వస్తువులను పంపిన వారికి పెద్ద మొత్తంలో డిస్కౌంట్లు ఇవ్వడం ప్రారంభించాయి. దీంతో చాలా మంది భారతీయ వ్యాపారులు కూడా వాటిలో వస్తువులను పంపడం ప్రారంభించారు. సింథియా కంపెనీని మూసివేయాల్సిన సమయం ఆసన్నమైంది.
"భారతదేశాన్ని వాణిజ్యం, పరిశ్రమలతో సుసంపన్నం చేయాలని ఆశించిన అబ్దుల్ కరీం జమాల్ వంటి దేశభక్తులు దీనిని చూడలేకపోయారు. 1921లో, షిప్పింగ్ కంపెనీల మధ్య పోటీ తీవ్రమైనప్పుడు, ఆ సంవత్సరం ఏ ఒక్క వ్యాపారి కూడా సింథియా స్టీమర్‌లకు ఒక్క పైసా విలువైన పని కూడా ఇవ్వలేదు. అప్పుడు జమాల్ సేథ్ లాభాల గురించి పట్టించు కోకుండా, సింథియా సంస్థకు చెందిన ప్రతి స్టీమర్‌ను తన వస్తువులతో నింపాలని నిర్ణయించుకున్నారు. దాని వల్ల ఆర్థికంగా ఎంతో నష్టపోయారు. అయినా, వారికి ఏడాది పొడవునా పని ఇచ్చి బ్రహ్మదేశ్‌లోని సింథియా సంస్థ వాణిజ్యాన్ని కొనసాగేలా చేశారు" అని మాధవరావు కార్నిక్ రాశారు.
ఫలితంగా జమాల్ సేథ్ బియ్యం వ్యాపారం దాదాపు దివాళాతీసింది. కానీ ఆయన చేసిన సాయం సింథియా కార్యనిర్వాహకులకు ధైర్యాన్నిచ్చింది. వారు పెద్ద ట్రిప్పులకు సిద్ధమయ్యారు. కంపెనీ పురోగతి ప్రారంభమైంది. అలా గుజరాతీ వ్యాపారవేత్త అబ్దుల్ కరీం జమాల్ ఒక భారతీయ కంపెనీని కాపాడటానికి ప్రతిదీ త్యాగం చేయడానికి సిద్ధమయ్యారు.

ఫొటో సోర్స్, Getty Images
ఆరేళ్ల వయసులో తండ్రితో బర్మాకు..
కరాచీలోని వరల్డ్ మెమన్ సంస్థ ప్రచురించిన 'మెమన్ ఆలం' పత్రిక ఆగస్టు 2013 సంచికలో సర్ అబ్దుల్ కరీం జమాల్ జీవితంపై ఒక వ్యాసం ఉంది.
అబ్దుల్ కరీం జమాల్ 1862లో జామ్‌నగర్‌లో జన్మించారు.
'మెమన్ ఆలం' అందించిన సమాచారం మేరకు , "ఆరేళ్ల వయసులో ఆయనను తండ్రి రంగూన్‌కు తీసుకెళ్లారు. ఆయన అక్కడే స్థిరపడ్డారు. సంప్రదాయ ఇస్లామిక్ విద్య చదివిన తర్వాత, ఆయన రంగూన్ కళాశాలలో చేరారు. అదే సమయంలో తండ్రి వ్యాపారంపైనా ఆసక్తి పెంచుకున్నారు.’’
‘‘అబ్దుల్ కరీం చదువుకుంటున్న సమయంలో, ఆయన తండ్రి జమాల్ బ్రదర్స్ & కో అనే సంస్థను నడిపేవారు. అది ఎక్కువగా పట్టు వ్యాపారంతో పాటు ఇతర చిన్న, పెద్ద వస్తువుల వాణిజ్యం చేసేది’’
ఆయన తండ్రి 1884లో వ్యాపారం నుంచి తప్పుకున్నారు. 1886 నాటికి అబ్దుల్ కరీం వ్యాపారాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకున్నారు.
"అబ్దుల్ జమాల్ వస్త్ర వ్యాపారంతో తన ప్రస్థానం ప్రారంభించారు .తక్కువ సమయంలోనే ఆ దుకాణం రంగూన్‌లో ఒక చిన్న దుస్తుల మార్కెట్‌గా మారింది. ఆయన చాలా లాభాలు సాధించారు'' అని మాధవరావు కార్నిక్ రాశారు.
ప్రసిద్ధ పత్రిక ఎకనామిస్ట్ గోయింగ్ గ్లోబల్ పేరుతో ఒక ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. "19వ శతాబ్దపు వాణిజ్యంలో గుజరాతీలు బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన కెన్యా, దక్షిణాఫ్రికా కాలనీల్లో అపూర్వమైన ఆధిపత్యాన్ని సాధించారు. కుచ్చి మెమన్ సమాజానికి చెందిన చాలా మంది బర్మా వెళ్లి అక్కడ సంపన్నులయ్యారు. వారిలో ఎక్కువ మంది అక్కడ టేకు, బియ్యం, టీ వ్యాపారం చేశారు"
"ఈ బర్మీస్ వ్యాపారులలో అత్యంత విజయవంతమైన, ధనవంతుడైన వ్యక్తి సర్ అబ్దుల్ కరీం జమాల్"
"ఆ కాలంలో భారతీయ వ్యాపారులు ప్రపంచవ్యాప్తంగా తమ నిజాయితీ లేని వ్యాపార పద్ధతులతో అపఖ్యాతి పాలయ్యారు. కానీ జమాల్ సేథ్ ఈ కళంకాన్ని నివారించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన వ్యాపార విధానాలు చాలా స్వచ్ఛంగా, నిజాయితీగా ఉండేవి. త్వరలోనే ఆయన రంగూన్ వ్యాపారులతో 'షా సోదాగర్ జమాల్' అని పిలిపించుకున్నారు. ఆయన దుకాణం నుంచి వస్తువులను కొనుగోలు చేసిన వ్యాపారులు ఇకపై మోసపోతారని భయపడాల్సిన అవసరం లేదు. చిన్న వ్యాపారులు ఆయనతో వ్యాపారం చేయడం ప్రారంభించారు" అని మాధవరావు రాశారు.
"ఆ సమయంలో, బ్రహ్మదేశ్ (మియన్మార్) ప్రజల పరిస్థితి బాగా లేదు. విదేశీయులు ఆ దేశంలో అడుగుపెట్టారు. వారిలో చాలామంది భారీ లాభాలను ఆర్జించి డబ్బునుతమ ఇళ్లకు తీసుకువెళ్లారు. కానీ జమాల్ సేథ్ పరోపకారం చేయాలని భావించారు’’

ఫొటో సోర్స్, Getty Images
బర్మా 'రైస్ కింగ్'
"విదేశీయులతో పోటీలో, బ్రహ్మదేశ్ రైతులు తమ కష్టానికి పూర్తి ప్రతిఫలం పొందడం లేదని జమాల్ సేథ్ భావించారు. ఇక్కడి రైతులు తమ కష్టానికి పూర్తి ప్రతిఫలం పొందే విధంగా బియ్యం వ్యాపారాన్ని అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని అనుకున్న జమాల్ బియ్యం వ్యాపారాన్ని ప్రారంభించారు" అని మాధవరావు కార్నిక్ రాశారు.
రంగూన్ 19, 20వ శతాబ్దాలలో అతిపెద్ద బియ్యం కేంద్రంగా ఉండేది.
''మొదట్లో, జమాల్ ఈ వ్యాపారంలో ఆశించిన ఆదాయం పొందలేదు, కానీ ఆయన దాన్ని వదిలిపెట్టలేదు. క్రమంగా, ఆయన దేశం మొత్తంమీద బియ్యం వ్యాపారంపై గుత్తాధిపత్యం సాధించారు. బియ్యం చౌకగా లభించేలా చేయడానికి, పెద్ద ఎత్తున బియ్యం మిల్లులను ప్రారంభించారు. విదేశీ వ్యాపారులు కూడా ఆయన మద్దతు కోరడం ప్రారంభించారు. అంతకుముందు ఏ వ్యాపారి అయినా స్వతంత్రంగా బియ్యం ధరను నిర్ణయించగల పరిస్థితి ఉండేది. ఆ తర్వాత అది మారిపోయింది. సొంత రైతులు, సొంత మిల్లులు, వ్యాపార మేధస్సు ఫలితంగా ఆయన బియ్యం వాణిజ్యంపై నియంత్రణ సాధించారు.’’
‘‘బియ్యం మార్కెట్‌పై ఉన్న పట్టుతో ఆయన బ్రహ్మదేశం అంతటా 'బియ్యం రాజు'గా ప్రసిద్ధి చెందారు'' అని మాధవరావు రాసిన పుస్తకంలో ఉంది.
అడుగుపెట్టిన అన్ని రంగాల్లో విజయం
‘‘తరువాత ఆయన దృష్టి చమురు వ్యాపారంపైకి మళ్లింది. కిరోసిన్ వ్యాపారంలోకి అడుగుపెట్టాలనుకున్నారు. కానీ ఆ పని చాలా కష్టం. విదేశీ కంపెనీలకు లక్షల విలువైన మూలధనం, అధికారం, వ్యాపార చతురత ఉన్నాయి. ఒక భారతీయ వ్యాపారవేత్త దానిలోకి అడుగుపెట్టి విజయం సాధించడం పూర్తిగా అసాధ్యం అనిపించింది. అయినప్పటికీ జమాల్ కిరోసిన్ వ్యాపారంపై ఆసక్తి కనబర్చారు.’’
కానీ బర్మా అంతటా పర్యటించిన తర్వాత, ఆయన 'ది ఇండో బర్మా పెట్రోలియం కంపెనీ' అనే వ్యాపార సంస్థను స్థాపించారు. వందలాది కిరోసిన్ బావులను సొంతం చేసుకున్నారు. కంపెనీ అభివృద్ధి చెందింది.
ఆయన ఈ కంపెనీని స్థాపించినప్పుడు దానిలో ఉన్న మూలధనం మొత్తాన్ని బట్టి ఆయన బియ్యం వ్యాపారం నుంచి ఎంత సంపాదించారో, ఆయన ఎంత ధనవంతుడో అంచనా వేయవచ్చు.
'మెమన్ ఆలం'లో సమాచారం మేరకు "జమాల్ బ్రదర్స్ కంపెనీ లిమిటెడ్‌ను ఆయన ఒక కోటి రూపాయల మూలధనంతో స్థాపించారు. అదేవిధంగా, ఇండో-బర్మా పెట్రోలియం కంపెనీ లిమిటెడ్‌ను కూడా ఒక కోటి మూలధనంతో స్థాపించారు. జమాల్ కాటన్ ప్రొడ్యూస్ కంపెనీని 30 లక్షల మూలధనంతో స్థాపించారు"
ఆయన పత్తి, పెట్రోలియం డ్రిల్లింగ్, చమురు బావులు, రబ్బరు తోటలు, రిఫైనరీలు, తేయాకు, కలప, చక్కెర, ఇనుప కర్మాగారాలు, జిన్నింగ్, మైనింగ్, రైస్ మిల్లులు వంటి అనేక వ్యాపార రంగాలలోకి ప్రవేశించి విజయం సాధించారు.

ఫొటో సోర్స్, Getty Images
బ్రిటిష్‌వారి బిరుదులు పొందినా భారత కంపెనీవైపే మొగ్గు
బ్రిటిష్ ప్రభుత్వం 1920లో ఆయన్ను 'నైట్ హుడ్' బిరుదుతో సత్కరించింది. అంతకు ముందు, 1915లో, ఆయనను సీఐఈతో (భారత ప్రభుత్వ సహచరుడు)తో గౌరవించింది. యుద్ధ నిధుల సేకరణ, ఇతర మానవతా సేవలకు గానూ ఆయనకు ఇవి లభించాయి.
ఆయన ఈ నైట్‌హుడ్‌ను అందుకున్న మరుసటి సంవత్సరం, 1921లో 'సింథియా స్టీమ్ నావిగేషన్ కంపెనీ' సంఘటన జరిగింది.
మెమన్ ఆలం అందించిన సమాచారం మేరకు , "1920లో ఆయనకు నైట్‌హుడ్ హోదా ఇచ్చిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను హెచ్చరించింది. కానీ ఆయన దాన్ని పట్టించుకోకుండా భారతీయ కంపెనీ సింథియా స్టీమ్‌కు మద్దతు, సహాయం కొనసాగించారు.’’
‘‘చివరకు, బ్రిటిష్ పార్లమెంట్‌లో జరిగిన ఒక చరిత్రాత్మక సమావేశంలో, సర్ జమాల్ వ్యాపారాన్ని కఠినంగా అడ్డుకోవాలని నిర్ణయించారు. పంటకోత సమయంలో బర్మా నుంచి బియ్యం ఎగుమతిని బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. దీంతో అబ్దుల్ జమాల్ భారీ నష్టాలను చవిచూశారు’’
దీనివల్ల ఆయన ఎనిమిది కోట్ల రూపాయల అప్పు చేశారని, తర్వాత దానిని తీర్చివేశారని మెమన్ ఆలం తెలిపింది. .
రంగూన్ (ఇప్పుడు యాంగోన్) లోని ఒక వీధికి ఆయన పేరు పెట్టారని ది ఎకనామిస్ట్ తెలిపింది.
లెక్కకు అందని దానాలు
ఆయన ఎంత డబ్బు విరాళాలుగా ఇచ్చారో లెక్కకు అందదు. కొన్ని వ్యాపారాలలో నష్టాలు వచ్చినప్పటికీ, మిగిలిన వ్యాపారాల నుంచి ఆయన లక్షలాది రూపాయలు సంపాదించారు.
"ఆయన చాలా నిజాయితీ, నైతికత కలిగిన వ్యక్తి. ఇతర ధనవంతుల మాదిరిగా ఆయన తన జీవితాన్ని సుఖాల్లో గడపలేదు. తన సంపదను దేశానికి సేవ చేయడంలో, వాణిజ్యాన్ని, విద్యను ప్రోత్సహించడంలో విస్తృతంగా ఉపయోగించారు’’ అని మాధవరావు కార్నిక్ రాశారు.
‘‘ఆయన తన సొంత ఖర్చుతో రంగూన్‌లో పెద్ద బాలికల పాఠశాలను నడిపారు. రంగూన్‌లో పర్షియన్ భాషా విద్యార్థులు లేకపోవడాన్ని సాకుగా చూపుతూ ప్రభుత్వం దానిపై డబ్బు ఖర్చు పెట్టలేదు. దీంతో ఆయన నెలకు 400 రూపాయలు చెల్లించి రంగూన్‌లో పర్షియన్ భాషా విద్యను ఏర్పాటు చేశారు.’’
‘‘ఆయన విద్య కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారని చెబుతారు. భారతదేశం లేదా బ్రహ్మదేశ్ నుంచి ఏ విద్యావేత్త కూడా ఆయన దగ్గరకు వెళ్లి విరాళం తీసుకోకుండా తిరిగి రాలేదని, ఆయన ఇచ్చిన విరాళాల మొత్తాన్ని లెక్కించడం కష్టం అని అంటారు. ఆయన విరాళాలు ఇచ్చే తీరును ఆయన సహచరులు 'ధుని' అని పిలిచేవారు" అని మాధవరావు రాశారు.

ఫొటో సోర్స్, MEMON WORLD
నిరాడంబర జీవితం
"మహాత్మా గాంధీ, సర్ అగా ఖాన్, సీనియర్ బ్రిటిష్ అధికారులు తరచుగా ఆయన ప్రసిద్ధ బంగ్లా 'జమాల్ విల్లా'ను సందర్శించేవారు. భారతదేశంలోని చాలా రాష్ట్రాల రాజులు ఆయనను తమ స్నేహితునిగా భావించారు. ఆయన జన్మస్థలమైన జామ్‌నగర్‌ను సందర్శించినప్పుడు, మహారాజా రంజిత్ సింగ్ రైల్వే స్టేషన్‌లో ఆయనకు స్వాగతం పలకడానికివచ్చారు" అని మెమన్ ఆలమ్ రాసింది.
‘‘సంపన్నుడైన వ్యాపారవేత్త అయినప్పటికీ, ఆయన చాలా నిరాడంబరంగా జీవించేవారు. అయితే ముస్లిం సమాజంలో మహిళలు బురఖా ధరించే వ్యవస్థను ఆయన సమర్థించారని చెబుతారు"
"1911లో ఐదవ కింగ్ జార్జ్ భారతదేశానికి వచ్చినప్పుడు, దిల్లీలో జరిగిన వేడుకకు జమాల్ హాజరయ్యారు. రాజు వెళ్లిపోయిన తర్వాత, సర్ జమాల్ ఆయన ప్రత్యేక కారును కొనుగోలు చేశారు" అని మెమన్ ఆలమ్‌లో రాసి ఉంది.
తన వ్యాపారం కారణంగా ఆయన తరచుగా ముంబయికి వచ్చేవారు. అక్కడి వ్యాపార వర్గాలలో కూడా ఆయనకు మంచి పేరుంది. 1924లో ఆయన చనిపోయారు. 71ఏళ్లు జీవించిన జమాల్ గొప్ప పరోపకారి, వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు.
తన స్వస్థలమైన జామ్‌నగర్‌కు దూరంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించినప్పటికీ, ఆయన తన సంప్రదాయ గుర్తింపుకు దూరం జరగలేదు.
"ప్రతి సందర్భంలోనూ, ఆయన కుచ్చి మెమన్ ముస్లింల దుస్తులను ధరించారు. గుజరాతీ గుర్తింపును కొనసాగించారు. తలపై కుచ్చి మెమన్ ఫెంటో లేదా తలపాగా, కోటు ధరించేవారు"
‘‘ఆయన రక్తం గుజరాతీతత్వంతో నిండి ఉంది. ఆయన దేశభక్తిగల వ్యాపారిగా జీవించారు. తన వ్యాపారాన్ని విజయవంతంగా నడిపించారు. గొప్ప వ్యాపారి అనే కీర్తిని సంపాదించారు. ఇప్పుడు ఆయన ఈ ప్రపంచంలో లేరు కానీ ఆయన కీర్తి ఇప్పటికీ భారతదేశం అంతటా ఉంది. గుజరాతీ వ్యాపారి గర్వాన్ని చాటుతుంది" అని మాధవరావు కార్నిక్ రాశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














