‘మేమూ భారతీయులమే, దేశాన్ని అంతే ఎక్కువగా ప్రేమిస్తాం’.. దెహ్రాదూన్‌లో హత్యకు గురైన త్రిపుర విద్యార్థి సోదరుడి ఆవేదన

ఫొటో సోర్స్, Asif Ali
- రచయిత, అసిఫ్ అలీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దెహ్రాదూన్‌లో త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థి ఏంజల్ హత్యకు గురయ్యారు.
ఈ ఘటన ఉత్తర భారతదేశంలో ఈశాన్య భారత విద్యార్థులు వివక్ష ఎదుర్కొంటున్నారనే ఆరోపణలు మరోసారి వినిపించాయి.
ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న త్రిపురకు చెందిన విద్యార్థి ఏంజల్ చక్మాపై డిసెంబర్ 9న దెహ్రాదూన్‌లో దాడి జరిగింది.
అక్కడి సేలాకుయ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక మార్కెట్‌లో ఈ దాడి జరగ్గా.. ఆ సమయంలో ఆయన తమ్ముడు మైఖేల్ కూడా సంఘటన స్థలంలోనే ఉన్నారు.
ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఏంజల్, 16 రోజుల పాటు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడి మరణించారు.
దెహ్రాదూన్ పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఈ కేసులో ఇప్పటివరకు ఇద్దరు మైనర్లు సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.
పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ తెలిపిన వారికి రూ. 25వేల నగదు బహుమతి ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
ఈ సంఘటన తర్వాత దెహ్రాదూన్, పరిసర ప్రాంతాలలో నివసిస్తున్న ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులలో ఆందోళన నెలకొంది.


ఫొటో సోర్స్, Asif Ali
ఏంజల్ సోదరుడు ఏం చెప్పారు?
త్రిపుర రాజధాని అగర్తలలోని నందనగర్‌కు చెందిన ఏంజల్, ఆయన తమ్ముడు మైఖేల్ దెహ్రాదూన్‌లో చదువుతున్నారు.
ఏంజల్ ఎంబీఏ ఫైనల్ ఇయర్ విద్యార్థి కాగా, మైఖేల్ ఉత్తరాఖండ్ విశ్వవిద్యాలయంలో బీఏ ఫస్ట్ ఇయర్ విద్యార్థి.
మైఖేల్ 'బీబీసీ న్యూస్ హిందీ'తో మాట్లాడుతూ, డిసెంబర్ 9 సాయంత్రం 6.30 గంటల సమయంలో తన అన్నయ్య ఏంజల్, ఆయన ఇద్దరు స్నేహితులతో కలిసి తాను సేలాకుయ్ మార్కెట్‌కు వెళ్లినట్లు చెప్పారు.
మార్కెట్లో ఒకచోట పార్క్ చేసిన మోటార్ సైకిల్‌ను ఏంజల్ తీస్తున్న సమయంలో, తాను ఫోన్‌లో మాట్లాడుతున్నానని మైఖేల్ చెప్పారు.
సమీపంలో నిలబడి ఉన్న యువకుల బృందం తమపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ప్రారంభించారని గుర్తుచేసుకున్నారు.
''వారు ఏంజల్‌ను 'చిక్నా', 'చింకీ', 'చైనీస్' అని పిలవడమే కాకుండా జాతి వివక్షతో కూడిన పదజాలాన్ని ఉపయోగించారు. ఏంజల్ మొదట్లో వాటిని పట్టించుకోలేదు, కానీ మోటార్ సైకిల్‌పై కూర్చున్నప్పుడు, ఆ యువకులు ఎదురుగా వచ్చి దుర్భాషలాడడం ప్రారంభించారు" అని మైఖేల్ చెప్పారు.
ఎందుకు దుర్భాషలాడారని అడగగానే, ఆ యువకులు తనపై దాడి చేశారని మైఖేల్ వెల్లడించారు. తనను రక్షించడానికి వచ్చిన ఏంజల్‌పై దాడి చేశారని చెప్పారు.
"మమ్మల్ని కిందపడేసి కాళ్లతో తన్నారు. ఒక యువకుడు కడా (కడియం)తో ఏంజల్ తలపై బలంగా కొట్టాడు. దీంతో ఏంజల్ స్పృహ కోల్పోయాడు. కొంత సమయం తర్వాత స్పృహలోకి వచ్చినప్పటికి, అతని తల నుంచి రక్తం కారుతోంది'' అని మైఖేల్ వివరించారు.
"రాత్రి 7 గంటల సమయంలో, ఏంజల్‌ను అంబులెన్స్‌లో సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగలిగాం. ఏంజల్ తలపై కొట్టడమే గాక, అతని వీపు దిగువ భాగంలో పొడిచినట్లు ఆసుపత్రిలో పరీక్షించిన తర్వాత తెలిసింది'' అని చెప్పారు.
"ఒక భారతీయుడిని 'చైనీస్' అని పిలవడమే వివాదాస్పదమైన విషయం. మేం కూడా భారతీయులమే. మన దేశాన్ని అంతే ఎక్కువగా ప్రేమిస్తాం" అని మైఖేల్ అన్నారు.
ఏంజల్ డిసెంబర్ 26న మరణించారు. ఉనకోటి జిల్లాలోని ఆయన స్వగ్రామం మచ్మరాలో డిసెంబర్ 28న ఆయన అంత్యక్రియలు డిసెంబర్ 28న నిర్వహించారు.
ఏంజల్ తండ్రి తరుణ్ ప్రసాద్ చక్మా మణిపుర్‌లో బీఎస్ఎఫ్ 50వ బెటాలియన్‌లో హెడ్ కానిస్టేబుల్.
కుమారుడి మరణంతో దిగ్భ్రాంతికి గురైన తరుణ్ ప్రసాద్ దంపతులు మాట్లాడే స్థితిలో లేరు.

ఫొటో సోర్స్, Asif Ali
పోలీసు తీరుపై పలు ప్రశ్నలు
ఏంజల్ చక్మా హత్య తర్వాత పోలీసుల తీరుపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తాయి. డిసెంబర్ 9న దాడికి సంబంధించి మైఖేల్ చక్మా ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, గుర్తు తెలియని వ్యక్తులు మద్యం మత్తులో ఉద్దేశపూర్వకంగా దాడి చేశారంటూ సాధారణ సెక్షన్ల కింద పోలీసులు డిసెంబర్ 12న కేసు నమోదు చేశారు.
ఏంజల్ చక్మాపై కత్తి, రాడ్‌తో దాడి చేయడం, గొడవ సమయంలో జాతి వివక్ష వ్యాఖ్యలు చేయడంపై మైఖేల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా, హత్యాయత్నానికి సంబంధించిన సెక్షన్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చలేదు.
"డిసెంబర్ 10న ఫిర్యాదు చేయడానికి సెలాకుయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాను. కానీ అక్కడ పోలీసులు ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. పైగా, జాతుల విషయం ఎందుకు తెస్తున్నారని నాపై అసహనం వ్యక్తం చేశారు" అని మైఖేల్ చక్మా బీబీసీతో అన్నారు.
ఈ కేసులో పోలీసు తీరుపై ఆల్ఇండియా చక్మా స్టూడెంట్స్ యూనియన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బిపుల్ చక్మా ఫిర్యాదు మేరకు జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ (ఎన్‌సీఎస్‌టీ) కూడా స్పందించింది. డిసెంబర్ 23న ఉత్తరాఖండ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, దెహ్రాదూన్ జిల్లా మేజిస్ట్రేట్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌లకు నోటీసులు జారీ చేసింది.

ఫొటో సోర్స్, Asif Ali
పోలీసులు ఏం చెప్పారు?
దెహ్రాదూన్ ఎస్పీ (సిటీ) ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ''ఇద్దరు మైనర్లు సహా ఐదుగురు నిందితులను అరెస్టు చేశాం. మైనర్లను జువెనైల్ కోర్టులో హాజరుపరిచిన తర్వాత రిఫార్మ్ హోమ్‌కు పంపాం. మరో ముగ్గురు నిందితులను కోర్టులో హాజరుపరిచాం. ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు" అని చెప్పారు.
"మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. అతను వేరే దేశంలో నివసిస్తున్నాడు. పోలీసులతో పాటు ఎస్‌వోజీ బృందాలు అతన్ని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి" అని తెలిపారు.
ఏంజల్ చక్మా మరణం తర్వాత, ఈ కేసులో హత్యానేరం సెక్షన్ కూడా జోడించినట్లు ఆయన చెప్పారు.

ఫొటో సోర్స్, Asif Ali
విద్యార్థుల భద్రతపై ఆందోళన...
ప్రస్తుతం త్రిపురకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు దెహ్రాదూన్‌లో చదువుతున్నారు. అలాగే, ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల నుంచి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినవారి సంఖ్య దాదాపు 500 వరకు ఉంటుందని అంచనా.
యూనిఫైడ్ త్రిపుర స్టూడెంట్ అసోసియేషన్ ఇక్కడ విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై పనిచేస్తోంది.
త్రిపురకు చెందిన టాంగ్‌క్వచాంగ్ దెహ్రాదూన్‌లోనే బి.ఫార్మా పూర్తి చేసి, ప్రస్తుతం సమీపంలోని ఒక ఫార్మసీ కంపెనీలో పనిచేస్తున్నారు.
ఆయన బీబీసీతో మాట్లాడుతూ, ''ఏంజల్ చాలా మంచివాడు. ఎవరితోనూ గొడవ పడ్డాడని నేను ఎప్పుడూ వినలేదు. అతన్ని హత్య చేసినవారికి కఠిన శిక్ష విధించాలి. మాకు న్యాయం కావాలి" అని అన్నారు.
ఏంజల్ విషయంలో ఆయన చదువుతున్న కళాశాల యాజమాన్యం ఎలాంటి సహకారం అందలేదని చెప్పారు.
దెహ్రాదూన్‌లోనే గాకుండా దిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో కూడా ఈశాన్య ప్రాంతాల ప్రజలు వివక్షను, జాత్యహంకారాన్ని ఎదుర్కొంటున్నారని ఆయన ఆరోపించారు.
"మేం కూడా భారతీయులమే. మమ్మల్ని 'చైనీస్' అని పిలవకూడదని ఒక చట్టం ఉండాలి" అని టాంగ్‌క్వచాంగ్ అన్నారు.
త్రిపురలోని ప్రాంతీయ పార్టీ టిప్రా మోతా పార్టీకి చెందిన టిప్రా మహిళా సమాఖ్య పశ్చిమ జిల్లా కార్యదర్శి నైషా మారి దేబ్ బర్మ స్పందిస్తూ, ఏంజల్ చక్మా మరణాన్ని చాలా విచారకరమైన సంఘటన అన్నారు.
ఈశాన్య ప్రాంత ప్రజలను 'చైనీస్', 'చింకీ', 'చింకూ' వంటి పదాలతో పిలవడం చాలా బాధాకరమని చెప్పారు.
టిప్రా మోతా పార్టీ వ్యవస్థాపకుడు ప్రద్యుత్ కిషోర్ మాణిక్య, ఏంజల్ కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు.
ఏంజల్ హత్యను "ద్వేషపూరితమైన నేరం"గా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ అభివర్ణించారు.
'ద్వేషం రాత్రికి రాత్రే పుట్టదు' అంటూ ఆయన 'ఎక్స్'లో పోస్ట్ చేశారు.
సమాజ్‌వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ కూడా స్పందించారు.
"దెహ్రాదూన్‌లో త్రిపుర విద్యార్థి హత్య ద్వేషపూరిత మనస్తత్వ ఫలితం" అని ఇన్‌స్టాగ్రామ్‌లో రాశారు.
కాంగ్రెస్ నాయకురాలు గరిమా మెహ్రా స్పందిస్తూ, ఈ సంఘటనను ఉత్తరాఖండ్ రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి, పరిపాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు.
రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు ఆమోదయోగ్యం కాదని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ పేర్కొన్నారు.
"అరాచక శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోం. ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్న ప్రతి పౌరుడి భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది" అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














