సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసినందుకు బంగ్లాదేశ్ విద్యార్థి హత్య

ఫొటో సోర్స్, ABRAR FAHAD/FACEBOOK
సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శించిన అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థి హత్యకు గురయ్యారు.
హత్యకు ముందు అతడ్ని కొన్ని గంటలపాటు భౌతికంగా హింసించారని ప్రత్యక్ష సాక్షులు బీబీసీకి చెప్పారు. ఈ ఘటన బంగ్లాదేశ్ దేశ రాజధాని ఢాకాలోని బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో ఆదివారం జరిగింది.
బంగ్లాదేశ్ కాలమానం ప్రకారం సుమారు రాత్రి 8 గంటల సమయంలో అబ్రార్ ఫహద్‌ను అతని గది నుంచి బయటకు తీసుకెళ్లి, దాదాపు నాలుగు గంటల పాటు కొట్టారని సహచర విద్యార్థులు తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు, శరీరంపై తీవ్రంగా కొట్టిన ఆనవాళ్లు ఉన్నాయని ధ్రువీకరించారు.
21 ఏళ్ల ఫహద్ ఢాకాలోని బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్ విద్యార్థి.
ఈ హత్యతో సంబంధం ఉందని భావిస్తున్న కొంతమందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారంతా పాలక పార్టీ అవామీ లీగ్‌కు చెందిన యువజన విభాగం బంగ్లాదేశ్ ఛత్రా లీగ్ (బీసీఎల్)లో సభ్యులు.

విద్యార్థులను హింసిస్తూ, వారిని దోపిడీ చేస్తున్నట్లు బీసీఎల్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
వసతిగృహంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా, కొందరు వ్యక్తులు ఫహద్‌ను మోసుకెళుతున్నట్లు కనిపించింది.
ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు బీసీఎల్ కార్యకర్తలతో సహా మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం నాటికి 13 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు చెప్పారు. వారంతా యూనివర్సిటీకి చెందినవారేనని చెప్పారు.
ఫహద్‌ను కొట్టి చంపారని ఢాకా డిప్యూటీ పోలీస్ కమిషనర్ మున్తాసిరుల్ ఇస్లాం తెలిపారు.
ఫహద్ మృతదేహాన్ని పరీక్షించిన ఢాకా మెడికల్ కళాశాల ఆసుపత్రి ఫోరెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సోహెల్ మహమూద్ బీబీసీతో మాట్లాడుతూ, ''అతని శరీరంపై తీవ్ర గాయాలున్నాయి. ఆ గాయాల కారణంగానే మరణించాడని మేం భావిస్తున్నాం'' అని చెప్పారు.
ఇస్లామిస్ట్ పార్టీతో సంబంధాలున్నాయని ఫహద్‌ను బీసీఎల్ సభ్యులు ప్రశ్నించారని, కొట్టారని స్థానిక మీడియా తెలిపింది.
భారత్‌తో బంగ్లా చేసుకున్న నదీ జలాల ఒప్పందంపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఫహద్ పోస్ట్ చేసిన తర్వాత ఈ ఘటన జరిగింది.
విచారణ అనంతరం యూనివర్సిటీకి చెందిన తమ కార్యకర్తలు 11 మందిని సంస్థ నుంచి బహిష్కరించినట్లు బీసీఎల్ తెలిపిందని బీడీన్యూస్24.కామ్ నివేదించింది.

ఫొటో సోర్స్, EPA
'దయచేసి నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లండి'
రాత్రి రెండు గంటల వరకు ఫహద్ బతికే ఉన్నాడని పేరు వెల్లడించడానికి ఇష్టపడని యూనివర్సిటీ విద్యార్థి ఒకరు బీబీసీకి చెప్పారు.
''నేను రాత్రి రెండు గంటలకు చూసినప్పుడు అబ్రార్ తన గదిలో కొనప్రాణంతో ఉన్నాడు. జూనియర్ల సహకారంతో అతడ్ని గది నుంచి బయటకు తీసుకొచ్చాను. అప్పుడు తనను త్వరగా ఆస్పత్రికి తీసుకెళ్లాలంటూ ప్రాధేయపడ్డాడు'' అని ఆ విద్యార్థి తెలిపారు.
ఈ హత్యకు సంబంధించిన వార్తలు రాగానే ఢాకా, ఇత పట్టణాల్లో సోమవారం ఆందోళనలు మొదలయ్యాయి.
దేశ రాజధానిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులు నినాదాలు చేశారు. రహదారులను దిగ్భందించారు. ఫహద్ హత్యకు కారకులైన వారిని వెంటనే శిక్షించాలని ఆందోళనను కొనసాగించారు.
బంగ్లాదేశ్ యూనివర్సిటీ ఆఫ్ ఇంజినీరింగ్‌లో నిర్వహించిన ధర్నాలో వర్సిటీ పూర్వ విద్యార్థులు, టీచింగ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
ఇదేమీ కొత్త విషయం కాదు
ఢాకాలోని బీబీసీ బెంగాలీ ప్రతినిధి మిర్ సబ్బిర్ విశ్లేషణ
పాలక పార్టీ విద్యార్థి విభాగం సభ్యులు యూనివర్సిటీల్లో దాడులు చేయడం కొత్త విషయమేం కాదు.
వసతి గృహాల్లో ఉండటం కోసం కొత్తగా వచ్చే విద్యార్థులు బీసీఎల్ పిలుపునిచ్చిన సమావేశాలు, ర్యాలీలకు బలవంతంగా హాజరుకావాల్సి వస్తుంది. భిన్న అభిప్రాయాలను కలిగి ఉన్న లేదా తమ నేతలను ధిక్కరించిన విద్యార్థులను బీసీఎల్ సభ్యులు కొట్టడం, బెదిరించడం సర్వసాధారణం.
2018లో పాఠశాల విద్యార్థులు రోడ్డు భద్రతపై ఆందోళన నిర్వహించినప్పుడు హెల్మెట్‌లు పెట్టుకొచ్చిన కొందరు వారిపై దాడి చేశారు. బీసీఎల్ కార్యకర్తలే ఈ దాడి చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలొచ్చాయి.
రాజకీయ పార్టీలు చాలా ఏళ్లుగా తమ విద్యార్థి విభాగాలను బలప్రదర్శన కోసం వినియోగించుకుంటున్నాయి. పార్టీలు అధికారికంగా విద్యార్థి విభాగాలు ఏర్పాటు చేయడానికి అనుమతి లేకపోయినప్పటికీ వాటి ఉనికి యూనివర్సిటీలలో కనిపిస్తూనే ఉంది.
అధికార అవామీ లీగ్ పార్టీ సీనియర్ నాయకుడొకరు బీబీసీ బంగ్లాతో మాట్లాడుతూ.. ''ఇప్పుడు ఈ రకమైన రాజకీయాలకు మద్దతు ఇవ్వాలా లేదా అనేది పునరాలోచించాల్సిన సమయం ఆసన్నమైంది. బంగ్లాదేశ్‌లో చాలా మంది ఇదే అభిప్రాయంతో ఉన్నారు'' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- పర్యటకానికి కశ్మీర్ సిద్ధమేనా?
- "మోదీకి లేఖ రాసిన 49మందిపై దేశద్రోహం కేసులో ఆధారాలు లేవు"
- 97 ఏళ్ల వయసులో నోబెల్... విజేతల చరిత్రలోనే అత్యధిక వయస్కుడు జాన్ గుడ్ఇనఫ్
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- మోదీ Vs. ఇమ్రాన్ ఖాన్: ఐరాస వేదికపై ఎవరిది విజయం
- ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు.. ఆయన చరిత్ర ఏంటి?
- చమురు వరమా, శాపమా?.. ప్రపంచాన్ని అది ఎలా మార్చింది
- వృద్ధురాలి వంటగదిలో దొరికిన రూ.46 కోట్ల విలువైన కళాఖండం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








