మోదీకి మూకదాడులపై లేఖ రాసిన 49మందిపై దేశద్రోహం ఆరోపణలకు ఆధారాలు లేవంటూ పిటిషనర్‌పై చర్యలకు సిద్ధమవుతున్న బిహార్ పోలీసులు

- రచయిత, నీరజ్ ప్రియదర్శి
- హోదా, బీబీసీ కోసం
దేశంలో జరుగుతున్న మూకదాడుల గురించి ప్రధాని మోదీకి లేఖ రాసిన వివిధ రంగాలకు చెందిన 49 మంది ప్రముఖులపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని ముజఫర్ పూర్ కోర్టులో పిటిషన్ వేసిన సుధీర్ కుమార్ ఓజాపై చర్యలు తీసుకునేందుకు బిహార్ పోలీసులు సిద్ధమవుతున్నారు.
ముజాఫర్ పూర్ సీజేఎం కోర్టు ఆదేశాలపై విచారణ చేపట్టిన బిహార్ పోలీసులు... 49 మందిపై ఆరోపణలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని తెలిపారు.
చరిత్రకారుడు రామచంద్ర గుహ, చిత్ర దర్శకులు అనురాగ్ కశ్యప్, మణిరత్నం, శ్యామ్ బెనెగల్, నటి అపర్ణా సేన్, గాయని సుధా ముద్గల్ వంటి 49 మంది ఈ సంవత్సరం జులైలో ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. మూకదాడులను అరికట్టాలని వారు ఆ లేఖ ద్వారా మోదీని కోరారు.
సీనియర్ ఎస్పీ మనోజ్ కుష్వాహా ఈ కేసును విచారించారు.
"పిటిషన్ దాఖలు చేసిన సుధీర్ కుమార్ ఓజా మా విచారణ సందర్భంగా ఎలాంటి సాక్ష్యాలను సమర్పించలేకపోయారు. మేం ఈ కేసును తీవ్రంగానే తీసుకున్నాం. కానీ ఓజా చేసిన ఫిర్యాదు నిరాధారమైనదని, ఎలాంటి సాక్ష్యాలు లేవని, దురుద్దేశంతో కూడినదని తేలింది. చట్టాన్ని అనుసరించి, ఐపీసీ సెక్షన్ 211/182 ప్రకారం ఓజాపై చర్యలు తీసుకుంటాం" అని మనోజ్ బీబీసీకి తెలిపారు.

ఫొటో సోర్స్, FACEBOOK
ప్రచారం కోసమే ఇదంతా
సుధీర్ కుమార్ ఓజాకు ప్రచారం కోసం ఇలాంటి చర్యలకు పాల్పడే అలవాటుందని ఈ కేసును విచారణ చేస్తున్న సమయంలో తమకు తెలిసిందని కుష్వాహా తెలిపారు.
"ఈ కేసులో ఎలా అయితే సాక్ష్యాధారాలు లేవో, గతంలో ఆయన దాఖలు చేసిన ఫిర్యాదుల్లో కూడా అలానే ఆధారాలు లేక వాటిని కొట్టివేశారు. ఇలాంటి చర్యల వల్ల పోలీసుల సమయం వృధా అవుతోంది. అందుకే అతనిపై చర్యలు తీసుకోవాలని కోర్టును కోరుతున్నాం" అని ఆయన అన్నారు.
సుధీర్ దాఖలు చేసిన పిటిషన్‌పై స్పందించిన కోర్టు 49మంది ప్రముఖులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆగస్టు 20న పోలీసులను ఆదేశించింది. దీంతో అక్టోబర్ 3న పోలీసులు కేసు నమోదు చేశారు. మత విశ్వాసాలను కించపరిచారనే ఆరోపణలపై కూడా వారిపై కేసులు నమోదయ్యాయి.
మరోవైపు, పోలీసులు ఏ విచారణ నివేదికను కోర్టుకు సమర్పించినా, తన వాదనలను వినిపిస్తానని సుధీర్ అంటున్నారు.
"నాకు వ్యతిరేకంగా కోర్టులో వాదనలు వినిపించే హక్కు పోలీసులకు ఉంటుంది. కానీ నిరసన తెలుపుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే హక్కు నాకు కూడా ఉంటుంది. దీనికి వ్యతిరేకంగా నాపై చర్యలు తీసుకోవాలనే హక్కు పోలీసులకు లేదు" అని ఆయన బీబీసీతో అన్నారు.

"పోలీసులు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా పరువుకు భంగం కలిగిస్తున్నారు. దీనిపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా పోలీస్ అధికారులకు వ్యతిరేకంగా పరువు నష్టం దావా వేస్తాను" అని సుధీర్ కుమార్ అంటున్నారు.
ప్రముఖులకు వ్యతిరేకంగా తప్పుడు కేసులు పెట్టినందుకు గతంలో కూడా సుధీర్‌ను పోలీసులు ప్రశ్నించారు.
సుధీర్ ఇప్పటి వరకూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నితీశ్ కుమార్, అరవింద్ కేజ్రీవాల్, రవీనా టాండన్, సల్మాన్ ఖాన్ వంటి అనేకమంది సెలబ్రిటీలకు వ్యతిరేకంగా కోర్టుల్లో 745 కేసులు వేశారు.
కానీ, ఈసారి పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నారు. ఓజా తన చర్యలతో పోలీసులు, కోర్టు సమయాన్ని వృధా చేస్తున్నారా... అనే ప్రశ్న తలెత్తింది.

"ఎవరికి వ్యతిరేకంగానైనా, ఎవరైనా ఫిర్యాదు చేయవచ్చు. కానీ, ప్రతిసారీ ఒకే వ్యక్తి ఒకే రకమైన కేసును పెడుతుంటే అది అతనికో అలవాటుగా మారిందనేది అర్థమవుతుంది" అని ఎస్ఎస్పీ కుష్వాహా అన్నారు.
ప్రధాని మోదీకి ప్రముఖులు లేఖ రాయడం, దానిపై సుధీర్ ఫిర్యాదు చేయడంతో ఈ అంశానికి ప్రాముఖ్యం వచ్చింది.
ప్రధాని పదవి విలువ తగ్గించేలా ప్రవర్తించారంటూ వీరిపై దాఖలు చేసిన కేసులో పేర్కొన్నారు.
అయితే, ఈ లేఖ రాసిన తర్వతా మరో 61 మంది ప్రముఖులు దానికి జవాబుగా మరో లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుబట్టే చర్యల్లో భాగంగానే చేస్తున్న ప్రయత్నం ఇది అని వారు మొదటి లేఖను విమర్శించారు.
ఈ జవాబు లేఖను రాసినవారిలో లిరిసిస్ట్ ప్రసూన్ జోషి, నిర్మాత మధుర్ భండార్కర్, వివేక్ అగ్నిహోత్రి, సోనాల్ మాన్‌సింగ్ వంటివారున్నారు.
ఇవి కూడా చదవండి.
- కశ్మీర్‌పై చైనా ఎందుకు మాట మార్చింది? పాకిస్తాన్ గురించి ఏమంటోంది?
- యువకుడిలో రొమ్ముల పెరుగుదల.. జాన్సన్ అండ్ జాన్సన్‌కు రూ.57 వేల కోట్ల భారీ జరిమానా
- బంగ్లాదేశ్ యుద్ధంలో భారత పైలట్లు చివరి మూడు నిమిషాల్లో ఏం చేశారు?
- మొండిపాలెంలో పెరుగుతున్న కిడ్నీ రోగులు... ఇది మరో ఉద్దానమా?
- 'ర్యాంకుల కోసం సెక్స్' అంటూ వేధిస్తున్న అధ్యాపకుడిని సస్పెండ్ చేసిన లాగోస్ యూనివర్సిటీ
- బిన్ లాడెన్ ఆచూకీ కనుగొనటంలో సిఐఏకు సాయపడ్డ డాక్టర్ షకీల్ అఫ్రిది... అమెరికాలో హీరో, పాకిస్తాన్లో ద్రోహి
- భారత తొలి రఫేల్ విమానాన్ని ఫ్రాన్స్‌లో అందుకున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
- ఈ రాయల్ తాబేలు 344 ఏళ్లు జీవించిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








