‘‘40 యుద్ధాల వార్తలు రాశా, 2025 లాంటి ఏడాదిని ఎప్పుడూ చూడలేదు’’ అంటున్న ఓ సీనియర్ జర్నలిస్టు అనుభవాలు

- రచయిత, జాన్ సింప్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
గమనిక: ఈ కథనంలో కలవరపరిచే అంశాలున్నాయి.
నా కెరీర్‌లో భాగంగా 1960ల నుంచి ప్రపంచవ్యాప్తంగా జరిగిన 40కి పైగా యుద్ధాలను కవర్ చేశాను. ప్రచ్ఛన్నయుద్ధం పతాక స్థాయికి చేరడాన్ని, అది ఆ తర్వాత ఆవిరై పోవడాన్నీ చూశా.
అయితే 2025 లాంటి భయంకరమైన సంవత్సరాన్ని ఎప్పుడూ చూడలేదు. ఎందుకంటే ఈ ఏడాదిలో జరుగుతున్నది కేవలం యుద్ధాలే కాదు.
వాటిలో ఒకటి అసమాన ప్రాముఖ్యత ఉన్న భౌగోళిక, రాజకీయ పరిస్థితులతో ముడిపడి ఉంది.
తమ దేశంలో ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందని యుక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలియెన్‌స్కీ హెచ్చరించారు.
దాదాపు 60 ఏళ్లుగా వివిధ రకాల యుద్ధాలను గమనించిన నాకు, ఆయన చెప్పింది నిజమేనని అనిపిస్తోంది.
పశ్చిమ దేశాలకు ఎలక్ట్రానిక్ ట్రాఫిక్ తీసుకెళ్లే సముద్ర గర్భ కేబుళ్లను రష్యా కట్ చేస్తుందేమోననే ఆందోళనలతో నేటో సభ్య దేశాలు అప్రమత్తంగా ఉన్నాయి.
తమ దేశాల రక్షణ వ్యవస్థలపై రష్యా డ్రోన్లు నిఘా పెడుతున్నాయంటూ విమర్శలు చేస్తున్నాయి.
హ్యాకర్లకు చిక్కకుండా ఉండేందుకు ఆ దేశాల మంత్రుల కార్యాలయాలు, అత్యవసర సేవలు, భారీ సంస్థలు కొత్త మార్గాలను కనుక్కునే ప్రయత్నాలు చేస్తున్నాయి.


ఫొటో సోర్స్, AFP via Getty Images
ప్రపంచంలో మూడు ప్రధాన యుద్ధాలు
2025లో మూడు వేర్వేరు యుద్ధాలు జరుగుతున్నాయి. యుక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధంలో 14వేల మంది చనిపోయారని ఐక్యరాజ్య సమితి చెబుతోంది.
2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో 1200 మంది చనిపోయారు. 251 మందిని హమాస్ బందీలుగా తీసుకెళ్లింది. దీనికి హమాస్‌పై "ప్రతీకారం తీర్చుకుంటామని" ఇజ్రాయల్ ప్రధానమంత్రి నెతన్యాహు ప్రకటించారు.
అప్పటి నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన సైనిక చర్యలో 70వేల మంది చనిపోయారు. ఇందులో 30వేల మంది మహిళలు, చిన్నారులు ఉన్నారని గాజాలోని హమాస్ నాయకత్వంలోని ఆరోగ్య శాఖ తెలిపింది. ఐక్య రాజ్య సమితి ఈ గణాంకాలను నమ్మదగినవిగా పేర్కొంది.
సూడాన్‌లో రెండు సైనిక గ్రూపుల మధ్య తీవ్ర స్థాయిలో పౌర యుద్ధం జరుగుతోంది. రెండేళ్లుగా అక్కడ లక్షన్నర మంది పౌరులు చనిపోయారు. కోటి 20 లక్షల మంది తమ ఇళ్లను ఖాళీ చేయాల్సి వచ్చింది.
2025లో ప్రపంచంలో ఇదొక్కటే యుద్ధం జరుగుతుంటే, దీన్ని ఆపేందుకు ప్రపంచం గట్టిగా ప్రయత్నించి ఉండేది. అయితే అలాంటి పరిస్థితి లేదు.
"యుద్ధాలను పరిష్కరించడంలో నేను గొప్పవాడిని" అని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ చెప్పుకున్నారు. గాజాలో కాల్పుల విరమణ గురించి చర్చల తర్వాత ఆయన విమానంలో ఇజ్రాయెల్ వెళ్లారు.
గాజాలో ప్రస్తుతం చనిపోతున్న వారి సంఖ్య తక్కువగా ఉందనేది వాస్తవం. కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ గాజా యుద్ధం పరిష్కారమైనట్లు అనిపించడం లేదు.
మిడిల్ ఈస్ట్‌లో ప్రజలు పడుతున్న బాధలను చూస్తే యుక్రెయిన్‌లో యుద్ధం దీనికి భిన్నంగా ఉందని చెప్పడం వింతగా అనిపించవచ్చు. కానీ ఇది నిజం.

ఫొటో సోర్స్, Getty Images
ప్రచ్ఛన్నయుద్ధాన్ని పక్కన పెడితే, కొన్నేళ్లుగా నేను కవర్ చేసిన యుద్ధాలు ప్రమాదకరమైనవి కావచ్చు కానీ ప్రపంచ శాంతికి ముప్పు కలిగించేంత తీవ్రమైనవి కావు.
రాబోయే సంవత్సరంలో, యూరప్ మీద అమెరికా అధ్యక్షుడికి ఆసక్తి తగ్గిందని రష్యా గమనిస్తే యూరప్ మీద అది మరింత ఆధిపత్యం కోసం ప్రయత్నించవచ్చు.
యూరప్ మీద దాడి చేసే ఉద్దేశం తనకు లేదని, అయితే యూరోపియిన్లు కోరుకుంటే ఇప్పుడే వారితో యుద్ధానికి తాము సిద్ధమని డిసెంబర్ ప్రారంభంలోనే రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు.
"మీరు మా పట్ల గౌరవంతో వ్యవహరిస్తే, మా ప్రయోజనాల విషయంలో సానుకూలంగా ఉంటే, గతంలో మాదిరిగానే మేం కూడా మీపట్ల అదే గౌరవంతో వ్యవహరిస్తాం" అని ఆయన టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అమెరికా దూరం జరుగుతోందా?
యూరోపియన్ యూనియన్ దేశాల ఆర్థిక వ్యవస్థలు రష్యా కంటే 10 రెట్లు పెద్దవి. బ్రిటన్‌ను కలుపుకుంటే అది ఇంకా పెద్దగా ఉంటుంది.
యూరోపియన్ యూనియన్ జనాభా 45 కోట్లు. రష్యా జనాభా 14.5 కోట్లు. అంటే రష్యా జనాభా కంటే యూరోపియన్ దేశాల జనాభా మూడు రెట్లు ఎక్కువ.
అయినప్పటికీ పశ్చిమ యూరప్ భయపడుతోంది.
తమ భద్రతకు అండగా ఉంటామని అమెరికా హామీ ఇచ్చే వరకు పశ్చిమ యూరప్ దేశాలు నేటోలో తమ వాటా చెల్లించేందుకు ఇటీవలి వరకు ఇష్టపడలేదు.
అమెరికా వైఖరి కూడా ఇప్పుడు భిన్నంగా ఉంది. బయటి ప్రపంచం మీద తక్కువగా, స్వదేశంలో వ్యవహారాల మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది.
నా కెరీర్ మొత్తంలో నేను రిపోర్టింగ్ చేసిన అమెరికాకు, ప్రస్తుత అమెరికాకు చాలా తేడా ఉంది. 1920, 30లలో మాదిరిగానే అమెరికా తన ప్రయోజనాల మీదనే దృష్టి పెట్టాలనుకుంటోంది.
2026లో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ తన రాజకీయ బలాన్ని కోల్పోయినా, ఆయన అమెరికా ప్రయోజనాల మీదనే దృష్టి పెట్టవచ్చు.
2028లో నేటోకు సానుకూలంగా ఉండే అమెరికా అధ్యక్షుడు వచ్చినా, యూరప్‌కు సాయం చేయడం కష్టం కావచ్చు.
ఈ పరిణామాలను వ్లాదిమిర్ పుతిన్ గమనించడంలేదని అనుకోలేం.

ఫొటో సోర్స్, Global Images Ukraine via Getty Images
యుద్ధాలు తీవ్రం అవుతాయా?
ఏ విధంగా చూసినా 2026 కీలకమైనదిగా కనిపిస్తోంది. యుక్రెయిన్ భూభాగంలో ఎక్కువ భాగాన్ని వదిలేయాల్సిన శాంతి ఒప్పందానికి అంగీకరించాల్సి ఉంటుందని జెలియెన్‌స్కీ భావించవచ్చు.
అయితే రానున్న కొన్నేళ్లలో పుతిన్ మరోసారి యుద్ధానికి రాకుండా ఆపగలిగే హామీలు ఉంటాయా?
యుక్రెయిన్‌తో పాటు తాము కూడా రష్యాతో యుద్ధం చేస్తున్నట్లు భావిస్తున్న కొన్ని యూరోపియన్ దేశాలు ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనదని భావిస్తున్నాయి.
రష్యాపై యుక్రెయిన్ చేస్తున్న యుద్ధంలో యూరప్ దేశాలు ఎక్కువ వాటా తీసుకోవాల్సి రావచ్చు.
అయితే యుక్రెయిన్ విషయంలో కొన్నిసార్లు బెదిరించినట్లుగా, అమెరికా వెనక్కి తగ్గితే అది యుక్రెయిన్‌తో పాటు యూరప్ దేశాలకు పెద్ద భారం అవుతుంది.
రష్యా- యుక్రెయిన్ యుద్ధం అణు యుద్ధానికి దారి తీస్తుందా?
పుతిన్ గ్యాంబ్లర్ అని మనకు తెలుసు. ఆయన జాగ్రత్తపరుడైతే 2022 ఫిబ్రవరిలో యుక్రెయిన్ మీద దాడికి దూరంగా ఉండేవారు.
రష్యా దగ్గరున్న ఆధునిక ఆయుధాల సాయంతో బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలను ప్రపంచ పటం నుంచి తుడిచి పెట్టేస్తామని ఆయన అనుచరులు బెదిరిస్తూ ఉంటారు. అయితే పుతిన్ మరింత సంయమనంతో వ్యవహరిస్తున్నారు.
అమెరికా నేటోలో సభ్యురాలు కావడంతో, రష్యా దాడి చేస్తే నేటో అణ్వస్త్రాలతో ప్రతిస్పందించే అవకాశం ఇప్పటికైతే ఎక్కువగానే ఉంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images, Sputnik, Pool
చైనా ప్రపంచ పెద్దన్న పాత్ర
చైనా విషయానికొస్తే, స్వయంపాలిత ద్వీపం తైవాన్‌కు వ్యతిరేకంగా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కొన్ని ప్రత్యక్ష బెదిరింపులకు దిగారు.
2027 నాటికి తైవాన్‌ను ఆక్రమించడానికి సిద్ధంగా ఉండాలని పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని షీ జిన్‌పింగ్ ఆదేశించారని బైడెన్ పదవీ కాలంలో సీఐఏ డైరెక్టర్‌గా పని చేసిన విలియమ్ బర్న్స్ రెండేళ్ల కిందటే చెప్పారు.
తైవాన్‌ను స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకోకపోతే, అది తమ బలహీనతగా షీ జిన్‌పింగ్ భావించవచ్చు. ఆయన బలహీనుడిగా కనిపించాలని కోరుకోవడం లేదు.
చైనా చాలా బలంగా, సంపన్నంగా ఉందని దేశ ప్రజల మనసులో ఏముందోనన్న భయం దానికి లేనేలేదని మీరు అనుకోవచ్చు. కానీ అది నిజం కాదు.
1989లో డెంగ్ జియావో పింగ్‌కు వ్యతిరేకంగా మొదలైన ప్రజా ఉద్యమం తియనాన్మెన్ స్క్వేర్‌లో ఊచకోతతో ముగిసింది. అప్పటి నుంచి చైనా నాయకులు ప్రజా స్పందనను అత్యంత నిశితంగా గమనిస్తూ ఉన్నారు.
తియనాన్మెన్ స్క్వేర్ దగ్గర జరిగిన సంఘటనలను నేను ప్రత్యక్షంగా చూశాను. వాటి గురించి రిపోర్టింగ్ చేశాను. కొంతకాలం పాటు అక్కడ ఉన్నాను.
1989 జూన్ 4న జరిగిన సంఘటనలు మనం అనుకున్నంత తేలికైనవి కాదు. నిరాయుధులైన విద్యార్థులపై సాయుధ సైనికులు కాల్చి చంపారు.
అదే సమయంలో బీజింగ్‌తో పాటు ఇతర నగరాల్లో మరో పోరాటం జరిగింది. తియనాన్మెన్‌లో విద్యార్థుల మీద జరిగిన దాడిని స్ఫూర్తిగా తీసుకుని చైనా కమ్యూనిస్ట్ పార్టీ అధిపత్యాన్ని పడగొట్టాలని భావించి... వేలమంది కార్మికులు వీధుల్లోకి వచ్చారు.
రెండు రోజుల తర్వాత నేను కారులో వీధుల్లోకి వెళ్లినప్పుడు ఐదు పోలీస్ స్టేషన్లు, మూడు స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్లు కాలిపోతూ ఉండటం చూశాను.
శివారు ప్రాంతంలో ఆగ్రహంతో ఉన్న జన సమూహం పోలీస్ అధికారిని తగలబెట్టి గోడకు వేలాడదీసింది. అతని తల మీద టోపీని మూలవాటంగా పెట్టింది. నల్లగా మారిన అతని పెదాల మధ్య సిగరెట్ ఇరుక్కుపోయి ఉంది.
దీనినిబట్టి చూస్తే, చైనా కేవలం విద్యార్ధుల ఉద్యమాలనే కాక, సామాన్యులు చేసే తిరుగుబాట్లను కూడా ఎంత క్రూరంగా అణచివేసిందో, దానిపై ఎంత ప్రజాగ్రహం ఉందో అర్ధం చేసుకోవచ్చు.
చైనా ప్రభుత్వం ఇప్పటికీ 36 ఏళ్ల కిందటి జ్ఞాపకాల నుంచి బయటకు రాలేకపోతోంది. ఎక్కడ అసమ్మతి పేట్రేగుతుందోనని జాగ్రత్తగా గమనిస్తోంది. అది ఫలూన్ గాంగ్ కావచ్చు, ఇండిపెండెంట్ క్రిస్టియన్ చర్చ్ లాంటి సంస్థలు కావచ్చు, హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య ఉద్యమాలు కావచ్చు లేదంటే అవినీతికి వ్యతిరేకంగా ప్రజలు చేసే చిన్న చిన్న ఉద్యమాలు కూడా కావచ్చు. వాటిని కఠినంగా అణచివేయడానికి ప్రయత్నిస్తోంది.
1989 నుంచి చైనా ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడంపై రిపోర్టింగ్ చేయడంలో చాలా సమయం గడిపాను. షీ జిన్‌పింగ్ ప్రత్యర్థి గురించి కూడా నాకు తెలిసింది.
ఆయన పేరు బో షిలాయ్. ఆయన ఇంగ్లిష్ కల్చర్‌ను ఇష్టపడుతూ చైనా రాజకీయాల గురించి బహిరంగంగా మాట్లాడేవారు.
"ప్రజలతో ఎన్నిక కాకుండా ఏర్పడిన ప్రభుత్వం ఎంత అభద్రతలో ఉంటుందో మీకు తెలియదు’’ అని ఆయన ఒకసారి నాతో చెప్పారు.
బో షిలాయ్ విషయానికొస్తే 2013లో లంచం తీసుకోవడం, అధికార దుర్వినియోగానికి పాల్పడిన కేసులో ఆయనకు యావజ్జీవ శిక్ష విధించారు.

మొత్తంగా చూస్తే 2026 చాలా ముఖ్యమైన సంవత్సరంగా కనిపిస్తోంది.
చైనా శక్తి పెరుగుతుంది. తైవాన్ విషయంలో దాని వ్యూహం ఏంటనే దానిపైనా స్పష్టత రావచ్చు.
పుతిన్ కోరుకున్నట్లుగా, ఆయనకు అనుకూలంగా యుక్రెయిన్ యుద్ధానికి పరిష్కారం లభించవచ్చు.
ఆయన కోరుకున్నప్పుడల్లా యుక్రెయిన్‌లోని మరిన్ని భూభాగాలను ఆక్రమించుకోవడానికి రావచ్చు.
2026 నవంబర్‌లో అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో డోనల్డ్ ట్రంప్ రెక్కలు కత్తిరించినా, యూరప్ నుంచి అమెరికా దూరంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
యూరోపియన్ కోణంలో చూస్తే, వారికిది మరింత ఆందోళకరంగా మారవచ్చు.
మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని, పిల్లలు బొమ్మ తుపాకులతో ఆడుకున్నట్లు దేశాలు అణు బాంబులు విసురుకుంటాయని మీరు అనుకుంటే అది పొరపాటే. అది దౌత్య, సైనిక విన్యాసాల సమాహారంగా ఉండే అవకాశం ఉంది. దీనివల్ల నియంతృత్వ ధోరణులు మరింత పెరగవచ్చు. చివరికది యూరోపియన్ యూనియన్‌ను ముక్కలు చేసే పరిస్థితికి కూడా దారి తీయొచ్చు.
ఆ ప్రక్రియ ఇప్పటికే మొదలైంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










