''భారత్‌తో యుద్ధం మొదలైంది, బంకర్‌లో దాక్కుందాం'' అని పాక్ అధ్యక్షుడికి సూచించిన వేళ..

ఫొటో సోర్స్, Getty Images
మేలో భారత్‌తో సైనిక వివాదం మొదలైనప్పుడు బంకర్‌లోకి వెళ్లాలని తనకు సలహా ఇచ్చారని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చెప్పారు. అయితే ఈ సలహాను తాను అంగీకరించలేదని జర్దారీ అన్నారు.
"నాయకులు యుద్ధభూమిలో మరణిస్తారు, బంకర్లలో కాదు" అని తన సహాయకుడికి చెప్పానని జర్దారీ తెలిపారు. ఒక కార్యక్రమంలో జర్దారీ ఈ విషయం వెల్లడించారు.
ఏప్రిల్‌లో పహల్గాం కాల్పుల తరువాత మే 6-7 తేదీల రాత్రి పాకిస్తాన్, పాకిస్తాన్ పాలిత కశ్మీర్‌పై భారత్ సైనిక చర్య చేపట్టింది.
దీనికి 'ఆపరేషన్ సిందూర్' అని పేరు పెట్టింది
ఇందులో భాగంగా 9 ప్రాంతాల్లో 'ఉగ్రవాద శిబిరాలపై' దాడి చేసినట్టు భారత సైన్యం ప్రకటించింది. ప్రతీకారంగా 'ఆపరేషన్ బనియాన్-ఉన్-మర్సూస్'తో భారత్‌కు చెందిన 26 సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు పాకిస్తాన్ సైన్యం తెలిపింది.


ఫొటో సోర్స్, Getty Images
జర్దారీ ఏం చెప్పారు?
తన భార్య, మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో 18వ వర్ధంతి సందర్భంగా సింధ్ ప్రావిన్స్‌లోని లర్కానా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ హాజరయ్యారు.
"నా సహాయకుడు ఇక్కడే ఉన్నారు. 'సార్, యుద్ధం మొదలైంది, బంకర్‌లోకి వెళదాం' అని ఆయన నాతో చెప్పారు. నిజానికి, యుద్ధం జరుగుతుందని నేను నాలుగు రోజుల కిందటే ఆయనతో చెప్పాను'' అని ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ జర్దారీ తెలిపారు.
"బలిదానం కావాల్సి వస్తే, అది ఇక్కడినుంచే జరుగుతుందని నేను ఆయనకు చెప్పాను. నాయకులు బంకర్లలో చనిపోరు. యుద్ధభూమిలో మరణిస్తారు. పాకిస్తాన్ కోసం ఎప్పుడవసరమైనా నా ప్రాణాలను, ఆస్తిని పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నా అని నేను ఆయనతో చెప్పాను" అని జర్దారీ అన్నారు.
"ఇక్కడ చేస్తున్న యుద్ధాల్లోకి తమ పిల్లలను నెట్టాలని ఎవరూ కోరుకోరు. కానీ మనం పోరాడుతాం. మన భవిష్యత్ తరాలు కూడా పోరాడతాయి. మనం భయపడం. అయితే మనకు యుద్ధం అంటే ఇష్టం లేదు" అని జర్దారీ ఈ సందర్భంగా అన్నారు.
"మనం ఏ దేశంతోనూ పోరాడాలని కోరుకోవడం లేదు. కానీ మన వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మనం వారిని ఓడిస్తాం" అని అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
‘మనం యుద్ధం చేయాల్సి రావచ్చు’
పాకిస్తాన్‌ను తప్పుడు ఉద్దేశంతో ఎవరు చూసినా వారికి గుణపాఠం నేర్పుతామని జర్దారీ అన్నారు.
"పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్ నౌకా దళం, పాకిస్తాన్ వైమానిక దళం వారికి గట్టి గుణపాఠం నేర్పుతుంది. మనం ఇప్పటికే దీని కోసం ఏర్పాట్లు చేసాం" అని ఆయన అన్నారు.
"మనం పోరాటానికి సిద్ధమయ్యాం. పాకిస్తాన్‌ను రక్షించడంపై మనకు తగినంత అవగాహన ఉంది. మనం సిద్ధంగా లేకపోతే, శత్రువు మనల్ని చెడు దృష్టితో చూసేవారు"
"వారు దాడి చేయడానికి వచ్చేటప్పటికే గగనతలంలో మనం వేచి చూస్తున్నాం. పాకిస్తాన్ వైమానిక దళాన్ని చూసినప్పుడు వారికి ఈ విషయం తెలిసింది. వారిని షూట్ చేయమని కమాండ్ వచ్చినప్పుడు వారికి అర్ధమైంది" అని జర్దారీ చెప్పారు.
ఈ వార్త రాసే సమాయానికి ఆసిఫ్ అలీ జర్దారీ మాటలపై భారత్ స్పందించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
ఏప్రిల్-మే నెలల్లో ఏం జరిగింది?
ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన కాల్పుల తర్వాత భారతదేశం, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు మే నెలలో సైనిక ఘర్షణకు దారితీశాయి.
రెండు దేశాల మధ్య వివాదం నాలుగు రోజుల పాటు కొనసాగింది. కాల్పుల విరమణ తర్వాత భారత త్రివిధ దళాలు మే 11న విలేఖరుల సమావేశం నిర్వహించాయి.
"ఆపరేషన్ సిందూర్ లక్ష్యం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన వారిని, ప్రణాళిక వేసిన వారిని శిక్షించడం, ఉగ్రవాదుల స్థావరాలను నాశనం చేయడం" అని భారత సైన్యం డీజీఎంఓ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ చెప్పారు.
"సరిహద్దు వెంబడి తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకున్న తర్వాత మే 7న సాయంత్రం భారత పశ్చిమ సరిహద్దుకు ఆనుకొని ఉన్న అనేక ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో పాకిస్తాన్ మానవరహిత వైమానిక వాహనాలు, చిన్న డ్రోన్లు కనిపించాయి" అని అదే ప్రెస్‌మీట్‌లో ఎయిర్ మార్షల్ ఏకే భారతి చెప్పారు.
"ఇవి నివాస ప్రాంతాలు, సైనిక స్థావరాలపై కనిపించాయి. భారత సైన్యం వాటిని విజయవంతంగా అడ్డుకుంది" అని ఎయిర్ మార్షల్ ఏకే భారతి అన్నారు.
ఈ దాడుల్లో కొన్ని టార్గెట్‌లను రీచ్ అయ్యాయని, కానీ పెద్దగా నష్టం కలిగించలేదని తెలిపారు.
"ఇక్కడ తేడా ఏమిటంటే మేం వారి ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకున్నాం. వారు మన పౌరులను, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నారు" అని ఏకే భారతి ఆరోపించారు.
"వైమానిక స్థావరాలు సహా భారత్‌కు చెందిన 26 సైనిక స్థావరాలను పాకిస్తాన్ లక్ష్యంగా చేసుకుంది. ఈ స్థావరాలు సూరత్‌గఢ్, సిర్సా, ఆదంపుర్, భుజ్, నాలియా ససస, బఠిండా, బర్నాలా, హర్వాడా, అవంతిపొరా, శ్రీనగర్, జమ్మూ, అంబాలా, ఉధంపుర్, పఠాన్‌పుర్‌లలో ఉన్నాయి" అని పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి అహ్మద్ షరీఫ్ చౌధరి చెప్పారు.
"పాకిస్తాన్ డ్రోన్లు కశ్మీర్ నుంచి భారత రాజధాని దిల్లీ, గుజరాత్ వరకు ఎగురుతూనే ఉన్నాయి. పాకిస్తాన్ సైన్యం కూడా అనేక సైబర్ దాడులను నిర్వహించింది. ప్రజలను లక్ష్యంగా చేసుకోకుండా పాకిస్తాన్ చాలా సమర్థవంతంగా అన్ని దాడులు చేసింది'' అని ఆయన అన్నారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














