బంగ్లాదేశీ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి తప్పించాలని కేకేఆర్‌కు బీసీసీఐ ఆదేశం.. బంగ్లాదేశ్ ఏమందంటే..

There was a controversy surrounding Mustafizur Rahman

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వివాదాలు చుట్టుముట్టిన ముస్తాఫిజుర్ రెహమాన్

ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ తీసుకున్న బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కేకేఆర్‌ను ఆదేశించింది.

ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ 9 కోట్ల రూపాయలకుపైగా చెల్లించి కొనుగోలు చేసింది. బాలీవుడ్ సూపర్‌స్టార్ షారుఖ్ ఖాన్ ఈ జట్టు యజమానులలో ఒకరు.

ఇటీవలి పరిణామాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవ్‌జిత్ సైకియా వార్తా సంస్థ ఏఎన్ఐకు తెలిపారు.

ముస్తాఫిజుర్ రెహమాన్ స్థానంలో మరో ఆటగాడిని తీసుకోవడానికి నైట్‌రైడర్స్‌కు బోర్డు అనుమతిస్తుందని ఆయన అన్నారు.

అంతకుముందు,కేకేఆర్ జట్టులోకి ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తీసుకోవడంపై షారుఖ్ ఖాన్‌పై మితవాద సంస్థలు, కొందరు బీజేపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే షారుఖ్‌ఖాన్‌ను లక్ష్యంగా చేసుకోవడాన్ని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని భారతదేశ భిన్నత్వంపై దాడిగా అభివర్ణించారు.

ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి తప్పించాలని కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బీసీసీఐ ఆదేశించడంపై బంగ్లాదేశ్ స్పందించింది. "మతతత్వ గ్రూపుల విధానాన్ని అంగీకరించడం ద్వారా రెహమాన్‌ను జట్టు నుంచి తప్పించాలని ఆదేశించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా" అంటూ ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Devkinandan Thakur has also questioned KKR's decision

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, కేకేఆర్ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న దేవకీనందన్ ఠాకూర్

షారుఖ్ ఖాన్‌ను లక్ష్యంగా చేసుకుని రాంభద్రాచార్య వార్తా సంస్థ పిటిఐతో మాట్లాడుతూ, కెకెఆర్‌లో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను చేర్చడం 'దురదృష్టకరం' అన్నారు.

అంతకుముందు బంగ్లాదేశ్‌లో హిందువులపై హింస జరుగుతోందనే ఆరోపణలను చూపుతూ దేవకీనందన్ ఠాకూర్ కూడా కేకేఆర్ నిర్ణయాన్ని ప్రశ్నించారు.

"బంగ్లాదేశ్‌లో హిందువులు దారుణంగా హత్యకు గురవుతున్నారు. వారి ఇళ్ళు తగలబెడుతున్నారు. వారి తల్లులు, కుమార్తెలు అత్యాచారానికి గురవుతున్నారు. ఇంత దారుణమైన హత్యలను చూసిన తర్వాత కూడా ఆ దేశానికి చెందిన క్రికెటర్‌ను, తమ జట్టులో చేర్చుకునేంత కఠినంగా ఎలా ఉంటారు అని ఆయన వార్తా సంస్థ ఏఎన్ఐతో అన్నారు.

దేవకీనందన్ ఠాకూర్ షారూఖ్‌ఖాన్ గురించి ప్రస్తావిస్తూ "ఈ దేశం నిన్ను హీరోగా, సూపర్ స్టార్ గా చేసింది, నీకు నీ సొంత క్రికెట్ జట్టు ఉండేంత శక్తినిచ్చింది. అంతకు ముందు నువ్వు ఏంటి? టీవీ సీరియల్స్ లో పనిచేస్తూ రోజుకు ఐదువందల రూపాయల నుంచి వెయ్యి రూపాయల దాకా సంపాదించేవాడివి''అన్నారు.

'ఆ క్రికెటర్'ను కేకేఆర్ యాజమాన్యం నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ, ముస్తాఫిజుర్ రెహమాన్‌కు చెల్లించాల్సిన రూ.9.2 కోట్లను బంగ్లాదేశ్‌లో మరణించిన వారి పిల్లలకు ఇవ్వాలని'' దేవకీనందన్ ఠాకూర్ డిమాండ్ చేశారు.

BJP leader Sangeet Som has said that Shahrukh Khan has done wrong by including the Bangladeshi cricketer in the team

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బీజేపీ నాయకుడు సాంగీత్ సోమ్

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టులో ముస్తాఫిజుర్ రెహమాన్‌ను చేర్చుకున్నందుకు షారుఖ్ ఖాన్‌ను 'దేశద్రోహి' అని యూపీలోని సర్ధానాకు చెందిన బీజేపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే సంగీత్ సింగ్ సోమ్ విమర్శించారు. షారుఖ్ ఖాన్ కు భారతదేశంలో నివసించే హక్కు లేదని ఆయన అన్నారు.

కేకేఆర్ ఫ్రాంచైజీ యజమానులుగా షారుఖ్ ఖాన్, నటి జూహి చావ్లా ఆమె భర్త జే మెహతా ఉన్నారు.

"ఒకవైపు బంగ్లాదేశ్‌లో హిందువులను ఊచకోత కోస్తున్నారు, మరోవైపు ఐపీఎల్ వేలంలో క్రికెటర్లను కొనుగోలు చేస్తున్నారు. రెహమాన్‌ను కొనడానికి షారుఖ్ ఖాన్ 9 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. బంగ్లాదేశ్‌లో భారత వ్యతిరేక నినాదాలు చేస్తున్నారు, ప్రధానమంత్రిని దుర్భాషలాడుతున్నారు, కానీ షారుఖ్ ఖాన్ వంటి దేశద్రోహులు వారికి సహాయం చేయడానికి 9 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు" అని సంగీత్ సోమ్ మీరట్‌లో అన్నారు

ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టులో కొనసాగించడంపై విమర్శలు ఎదుర్కొన్న కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్

ఫొటో సోర్స్, SUJIT JAISWAL/AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టులో కొనసాగించడంపై విమర్శలు ఎదుర్కొన్న కేకేఆర్ యజమాని షారుఖ్ ఖాన్

కాంగ్రెస్ నిరసన

ఈ వ్యాఖ్యలను ప్రతిపక్ష నాయకులు, ముస్లిం మత సంస్థలు తీవ్రంగా ఖండించాయి.

కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే మాట్లాడుతూ, "ముందుగా, బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఆ పూల్‌లో ఎవరు పెట్టారోఅడగాలనుకుంటున్నాను. ఈ ప్రశ్న బీసీసీఐ, ఐసీసీని అడుగుతున్నా'' అన్నారు.

"ఐపీఎల్ ఆటగాళ్లను కొనుగోలు చేసి అమ్మే, ఆటగాళ్ల వేలంలో బంగ్లాదేశ్ ఆటగాళ్లను ఎవరు పెట్టారో హోంమంత్రి కుమారుడు జై షా సమాధానం చెప్పాలి. ఆయన ఐసీసీ అధిపతి, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌కు కీలక నిర్ణయాలు తీసుకునే వ్యక్తి వ్యక్తి'' అన్నారు.

షారుఖ్ ఖాన్ పై జరిగిన దాడులను భారతదేశ భిన్నత్వంపై దాడిగా కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ అభివర్ణించారు. గురువారం ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో , "సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్‌ను 'దేశద్రోహి' అని పిలవడం భారతదేశ భిన్నత్వంపై దాడి. ద్వేషం జాతీయతను నిర్వచించలేదు. ఆర్‌ఎస్‌ఎస్ సమాజాన్ని విషపూరితం చేయడం ఆపాలి'' అని రాశారు.

ఇమామ్ అసోసియేషన్ అధ్యక్షుడు మౌలానా సాజిద్ రషీద్ మాట్లాడుతూ, ముస్లిం పేర్లు ఉండటం వల్లే తరచుగా నిరసనలు చెలరేగుతాయని అన్నారు. రాజ్యాంగ క్రీడా నియమాల ప్రకారం తీసుకున్న చట్టబద్ధమైన నిర్ణయాన్ని అభ్యంతరం చెప్పే హక్కు ఎవరికి ఉందని ఆయన ప్రశ్నించారు.

"ఈ దేశంలో ఆలోచించకుండారాజ్యాంగాన్ని అర్థం చేసుకోకుండా దేనినైనా గుడ్డిగా వ్యతిరేకించడం అలవాటుగా మారింది. ముస్లిం పేరు వచ్చినప్పుడల్లా నిరసన తెలపడం చాలా సులభం అవుతోంది" అని ఆయన అన్నారు.

"షారూఖ్ ఖాన్ ముస్లిం, అతను కొన్న బంగ్లాదేశ్ క్రికెటర్ కూడా ముస్లిం, కాబట్టి నిరసనలు అనివార్యం ఎందుకంటే ముస్లింల పట్ల ద్వేషం ఇక్కడ వెంటనే స్పష్టంగా కనిపిస్తుంది. ఇందులో ప్రజల ఆందోళన ఏమిటి? వారు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏదైనా చేస్తే, చట్టం వారిపై చర్య తీసుకుంటుంది. నిరసన తెలిపి షారూఖ్ ఖాన్ ఇలా చేయకూడదని చెప్పడానికి మీరు ఎవరు?"

బంగ్లాదేశ్‌లోని మైనారిటీల భద్రత గురించి భారతీయ ముస్లింలు కూడా అంతే ఆందోళన చెందుతున్నారని, అయితే షారుఖ్ ఖాన్ నిర్ణయం "రాజద్రోహం" కాదని ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ అన్నారు.

బంగ్లాదేశ్ ఏమందంటే..

క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను తప్పించాలంటూ బీసీసీఐ ఇచ్చిన ఆదేశాలపై బంగ్లాదేశ్ క్రీడా మంత్రిత్వ శాఖ సలహాదారు డాక్టర్ ఆసిఫ్ నజ్రుల్ స్పందించారు. ఆయన ఈ మేరకు ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు చేశారు.

"బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను జట్టు నుంచి తప్పించాలని కోల్‌కతా నైట్ రైడర్స్‌ను భారత క్రికెట్ బోర్డు ఆదేశించింది. మతతత్వ గ్రూపుల విధానాన్ని అంగీకరించడం ద్వారా రెహమాన్‌ను జట్టు నుంచి తప్పించాలని ఆదేశించడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నిరసన తెలియజేస్తున్నా" అని ఆయన రాశారు.

అలాగే, క్రీడా మంత్రిత్వ శాఖకు బాధ్యతాయుతమైన సలహాదారుగా ఈ మొత్తం వ్యవహారాన్ని ఐసీసీకి వివరించమని క్రికెట్ కంట్రోల్ బోర్డును కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

"ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ క్రికెటర్‌ భారత్‌లో ఆడలేకపోతే, ప్రపంచ కప్‌ మ్యాచ్‌లకు వెళ్లడం మొత్తం బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు కూడా సురక్షితం కాదు. వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లను శ్రీలంకలో నిర్వహించాలని అభ్యర్థించాలని కూడా బోర్డును ఆదేశించాను" అని ఆయన ఆ పోస్టులో రాశారు.

"బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను కూడా నిలిపేయాలని సమాచార, ప్రసార సలహాదారుడిని కోరుతున్నా. బంగ్లాదేశ్ క్రికెట్‌కు, క్రికెటర్లకు, బంగ్లాదేశ్‌‌కు అవమానం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు" అని ఆయన ఆ పోస్ట్‌లో రాశారు.

ఎవరీ ముస్తాఫిజుర్

ముస్తాఫిజుర్ బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు స్టార్ ఆటగాడు. అతను ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్. అతను 15 టెస్ట్ మ్యాచ్‌ల్లో 31 వికెట్లు 116 వన్డే ఇంటర్నేషనల్స్‌లో 177 వికెట్లు పడగొట్టాడు.

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లలో 158 వికెట్లు పడగొట్టాడు.

ముస్తాఫిజుర్ రెహమాన్ కు ఐపీఎల్‌లోనూ మంచి రికార్డు ఉంది, అందుకే కేకేఆర్ 30 ఏళ్ల ఈ ఆటగాడిని కొనుగోలు చేసింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)