ఫుజియాన్‌: చైనా కొత్త యుద్ధనౌక అమెరికాకు పెను సవాలు కాగలదా?

ఫుజియాన్‌, చైనా, యుద్ధనౌక

ఫొటో సోర్స్, CCTV

    • రచయిత, బెన్నీ లూ
    • హోదా, బీబీసీ చైనీస్ సర్వీస్

అత్యాధునిక విమాన వాహక నౌక ఫ్యుజియాన్‌ను ఈ యేడాది నవంబర్‌లో చైనా ప్రారంభించింది. ఇది మునుపటి రెండు నౌకల కంటే చాలా అధునాతనమైనదని నిపుణులు అంటున్నారు.

విమానాలు ఎక్కువ వేగంతో ఎగరడానికి సహాయపడే ఎలక్ట్రోమాగ్నెటిక్ క్యాటపుల్ట్ టెక్నాలజీ ఉన్న యుద్ధనౌక ఫుజియాన్.

పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో అమెరికా ఆధిపత్యాన్ని సవాలు చేయాలనే చైనా లక్ష్యాన్ని ఈ యుద్ధనౌక మరింత దగ్గర చేస్తుందని నిపుణులంటున్నారు.

ఫుజియాన్ అని పిలిచే ఈ నౌక బరువు 80 వేల టన్నులు. తైవాన్‌కు దగ్గరగా ఉన్న చైనా ప్రావిన్స్ పేరును దీనికి పెట్టారు. ఇది 70 విమానాలను మోసుకెళ్లగలదు.

ఇది మోసుకెళ్లగలిగే వాటిలో యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, హెచ్చరిక విమానాలు ఉన్నాయి. ఇవి సుదూర ప్రాంతాలలోని ముప్పును గుర్తించగలవు. వాయుసేనతో సమన్వయం చేసుకుని, కచ్చితమైన దాడులను నిర్వహించగలదు ఫుజియాన్.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
చైనా నౌకాదళం, విమాన వాహక నౌక, షాన్‌డాంగ్, స్కీ-ప్లాట్‌ఫారమ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చైనా రెండో విమాన వాహక నౌక, షాన్‌డాంగ్‌ను స్కీ-ప్లాట్‌ఫాంలాంటి డెక్ డిజైన్‌తో రూపొందించారు.

ఫుజియాన్ ప్రత్యేకత ఏంటి?

చైనా నౌకాదళానికి ఫుజియాన్ కొత్త పరిధిని, వెసులుబాటును ఇవ్వడంతో పాటు, చైనా వ్యూహాత్మక లక్ష్యాలేంటో స్పష్టంగా సూచిస్తుంది.

ఇది చైనాలో ఫ్లాట్ ఫ్లైట్ డెక్, ఎలక్ట్రోమాగ్నటిక్ కాటపుల్ట్ టెక్నాలజీ ఉన్న మొట్టమొదటి విమాన వాహక నౌక ఇది. భారీ విమానాలను లాంచ్ చేయడానికి, అలాగే ఎక్కువ ఇంధనం, ఆయుధాలను తీసుకెళ్లడానికి వీలు కల్పిస్తుంది.

ప్రపంచంలో ఒక్క అమెరికా దగ్గరే ఈ సామర్ధ్యం ఉంది.

చైనాలోనే నిర్మించిన ఈ యుద్ధనౌక, భారీ ఆయుధాలు, ఇంధనంతో కూడిన విమానాలను మోసుకెళ్లగలదు, టేకాఫ్ చేయగలదు. చాలాదూరం నుంచే శత్రువులపై దాడిచేయగలదు.

చైనా దగ్గరున్న రెండు యుద్ధనౌకలు లియానింగ్, షాన్డాంగ్ కంటే ఇది శక్తివంతమైనది. ఆ రెండింటినీ రష్యా సహాయంతో నిర్మించారు.

చైనా నౌకాదళ అభివృద్ధిలో ఫుజియాన్‌ "ఒక మైలురాయి" అని చైనా మీడియా అభివర్ణించింది.

ఇంధనం, డీజిల్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, చైనాకు చెందిన మూడు విమాన వాహక నౌకలు డీజిల్ ఇంజిన్లతో నడుస్తాయి.

"చైనా ఇప్పుడు అమెరికా లాగా "గన్‌బోట్ డిప్లమసీ" నడిపించగలదు. న్యూయార్క్ టైమ్స్ చెప్పినట్లుగా, ఇది ‘‘రక్షణాత్మక ఆధునీకరణ’’ నుంచి "శక్తిని శత్రువుకి చూపించే దిశగా చైనా అడుగులు వేస్తోందన్నదానికి సంకేతం’’ అని తైవాన్ జాతీయ భద్రత, రక్షణ పరిశోధన సంస్థకు చెందిన విలియం సి చుంగ్ బీబీసీతో అన్నారు.

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒక ప్రకటన చేస్తూ, "పసిఫిక్ మహాసముద్రం చాలా పెద్దది. అమెరికా, చైనా రెండింటికీ అక్కడ స్థానం ఉంది" అని అన్నారు. ఈ ప్రకటన తాను అమెరికాతో సమానంగా ఉండాలన్న చైనా ఉద్దేశాన్ని ప్రతిబింబిస్తుంది.

షీ జిన్‌పింగ్ నాయకత్వంలో చైనా తన నౌకాదళాన్ని వేగంగా విస్తరించింది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో నౌకలు చైనా దగ్గరే ఉన్నాయి. ఇది అమెరికాకు, దాని మిత్రదేశాలకు కలవరం కలిగించే అంశం.

చైనా జాతీయ మీడియా చెప్పినదాని ప్రకారం, ఫుజియాన్‌లో విద్యుదయస్కాంత కాటపుల్ట్‌ను ఏర్పాటు చేయాలని షీ జిన్‌పింగ్ స్వయంగా నిర్ణయం తీసుకున్నారు. హైనాన్ ప్రావిన్స్‌లో ఘనంగా జరిగిన ప్రారంభోత్సవానికి జిన్‌పింగ్ అధ్యక్షత వహించారు.

డెక్ మీద నిలబడిన జిన్‌పింగ్‌ సైనిక యూనిఫాంలో ఉన్న నావికులను ఉద్దేశించి మాట్లాడారు. ‘‘పార్టీ ఆదేశాలను పాటించండి, విజయం కోసం పోరాడండి, అద్భుతమైన నడవడికను కొనసాగించండి’’ అని అన్నారు.

ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్, తైవాన్, షీ జిన్‌పింగ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఇతర పది అమెరికా విమాన వాహక నౌకల మాదిరిగానే, అబ్రహం లింకన్ కూడా అణుశక్తితో నడిచేది.

ప్రాముఖ్యత, పరిమితులు

ఫుజియాన్ గురించి చెబుతూ, ‘‘వేగంగా ప్రతిచర్యలను నిరోధించగల సామర్ధ్యం దీనికి ఉంది. దీనిపై ఫైటర్ జెట్లు మోహరించగలవు. భూమి మీద నుంచి, సముద్రం మీద నుంచి దాడులు చేయగలదు’’ అని ఆస్ట్రేలియన్ స్ట్రాటజిక్ పాలసీ ఇన్‌స్టిట్యూట్ పేర్కొంది.

తైవాన్‌ తన భూభాగమని చైనా భావిస్తోంది. బలప్రయోగం అవసరం అయినప్పటికీ, ఏ సమయంలోనైనా దానిని ‘విలీనం’ చేసుకోవాలనే ఉద్దేశ్యాన్ని వ్యక్తం చేసింది.

హడ్సన్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన సటోరో నాగావో మాట్లాడుతూ, ఫుజియాన్ వల్ల తైవాన్ తూర్పు తీరానికి ముప్పు ఉంది. అయితే, ఒకినావా, దక్షిణ కొరియా, గువామ్, ఫిలిప్పీన్స్‌లోని అమెరికా సైనిక స్థావరాలకు చైనాపై ప్రతీకారం తీర్చుకోగల సామర్ధ్యం ఉంది. పైగా అమెరికాకు చెందిన 11 విమాన వాహక నౌకలు అణుశక్తితో నడిచేవే.

ఇందుకు భిన్నంగా, చైనా మూడు విమాన వాహక నౌకలు డీజిల్ ఇంజిన్లతో నడుస్తాయి. వీటికి తరచుగా ఇంధనం నింపడం అవసరం. అందువల్ల వాటి పోరాట సామర్థ్యానికి కొన్ని పరిమితులు ఉన్నట్లే.

జపాన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ డిఫెన్స్ స్టడీస్‌కు చెందిన ఐటా మోరికి అక్టోబర్‌లో వేసిన అంచనా ప్రకారం, టెక్నాలజీ, హ్యూమన్ రీసోర్సెస్ విషయంలో చైనా ఇప్పటికీ సవాళ్లు ఎదుర్కొంటోంది.

"ఫుజియాన్‌తోపాటు చైనా దగ్గరున్న అన్ని విమాన వాహక నౌకల మొత్తం పోరాట సామర్థ్యం కూడా ఇప్పటికీ అమెరికాకంటే తక్కువే" అని చుంగ్ అంగీకరించారు.

‘‘వాళ్ల దగ్గర మూడే విమాన వాహక నౌకలు ఉన్నాయి. మా దగ్గర 11 ఉన్నాయి. మేం దశాబ్దాలుగా వీటిని వాడుతున్నాం’’ అని వాషింగ్టన్ పోస్ట్‌తో యుఎస్ రియర్ అడ్మిరల్ బ్రెట్ మియోట్స్ అన్నారు.

మరోవైపు చైనా తన నాలుగో విమాన వాహక నౌకను కూడా నిర్మిస్తోందని, భవిష్యత్తులో అణుశక్తితో నడిచే వాహక నౌకను ప్రవేశపెట్టే ప్రయత్నాలు చేస్తోందని ఉపగ్రహ చిత్రాల ద్వాారా తెలుస్తోంది.

అమెరికా, చైనా మధ్య నౌకాయుధ పోటీ రాబోయే సంవత్సరాల్లో తీవ్రమవుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)