సూర్యుడి ధృవాలు మారేవేళ ఏం జరగనుంది, అక్కడి అలజడితో ఉపగ్రహాలకు ముప్పా, ఆదిత్య ఎల్1 ఏం చేయనుంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, గీతా పాండే
- హోదా, దిల్లీ
భారతదేశ తొలి సౌర పరిశీలన మిషన్ ఆదిత్య-ఎల్1కు , 2026 చాలా ప్రత్యేకమైన సంవత్సరమని భావిస్తున్నారు.
గతేడాది కక్ష్యలో ప్రవేశపెట్టిన ఈ ఉపగ్రహం భానుడు గరిష్ఠ చురుకుదన దశలోకి ప్రవేశించే సమయాన్ని ప్రత్యక్షంగా గమనించనుంది.
"భూమి.. ఉత్తర, దక్షిణ ధ్రువాల స్థానాలను మార్చుకున్నట్టుగా...సుమారు ప్రతి 11 ఏళ్లకు ఒకసారి సూర్యుని అయస్కాంత ధ్రువాలు మారుతుంటాయి" అని నాసా తెలిపింది.
ఇది సూర్యుడి శక్తి గరిష్ఠస్థాయిలో ఉండే సమయం. ప్రశాంత దశనుంచి తుపాన్ల దశకు మారే సమయం. సౌర తుపానులు, కరోనల్ మాస్ ఎజెక్షన్(సీఎమ్ఈ)లు అంటే సూర్యుని బాహ్య పొర అయిన కరోనా నుంచి బయటకు వెదజల్లే ప్లాస్మా బుడగల రూపంలో ఉండి, అగ్నిగోళాల్లా కనిపిస్తాయి.
విద్యుత్ శక్తి కణాలతో తయారైన ఒక సీఎమ్ఈ, ఒక ట్రిలియన్ కిలోగ్రాముల వరకు బరువు ఉండవచ్చు. ఇది సెకనుకు 3,000 కి.మీ (1,864 మైళ్ళు) వేగంతో ప్రయాణించగలదు. ఇది భూమి వైపుతోపాటు ఏ దిశలోనైనా ముందుకు వెళ్లగలదు. భూమి-సూర్యుడి మధ్య 150 మిలియన్ కిలోమీటర్ల దూరాన్నిఇది కేవలం 15 గంటల్లో చేరుతుంది.


ఫొటో సోర్స్, Getty Images
"సాధారణ లేదా తక్కువ చురుకుదనం ఉన్న సమయాల్లో, సూర్యుడు రోజుకు రెండు నుంచి మూడు సీఎమ్ఈలను వెదజల్లే అవకాశం ఉంది. అయితే రాబోయే ఏడాదిలో, అవి రోజుకు 10 లేదా అంతకంటే ఎక్కువ ఉంటాయని అంచనావేస్తున్నాం" అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ ప్రొఫెసర్ ఆర్. రమేష్ చెప్పారు.
ఆదిత్య-ఎల్1 లోని ఏడు సాంకేతిక పరికరాలలో అతి ముఖ్యమైన విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్ లేదా వెల్క్‌పై ప్రొఫెసర్ రమేష్ ప్రధాన పరిశోధకునిగా పనిచేస్తున్నారు. ఈ ఉపగ్రహం పంపిచే డేటాను ఆయన నిరంతరం విశ్లేషిస్తున్నారు.
భారత తొలి సౌర మిషన్ అతి ముఖ్యమైన లక్ష్యాలలో సీఎమ్‌ఈలను అధ్యయనం చేయడం ఒకటి అని ఆయన చెప్పారు. మన సౌర వ్యవస్థ కేంద్రకంలో ఉన్ననక్షత్రం గురించి తెలుసుకోవడానికి ఈ ఎజెక్షన్లు అవకాశాన్ని కల్పిస్తాయి, అలాగే సూర్యుడి నుంచి వెలువడే వేడి భూమిపైనా, అంతరిక్షంలోని మౌలిక సదుపాయాలకు ముప్పు కలిగిస్తుందన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
సీఎమ్‌ఈలతో ప్రమాదమా?
సీఎమ్ఈలు అరుదుగా మానవ ప్రాణాలకు ప్రత్యక్ష ముప్పు కలిగిస్తాయి, అయితే అవి భూమి చుట్టూ ఉన్న అంతరిక్ష వాతావరణాన్ని ప్రభావితం చేస్తాయి. భూమి చుట్టూ ప్రస్తుతం 11వేల ఉపగ్రహాలు ఉన్నాయి. అందులో 136 ఉపగ్రహాలు భారతదేశానికి చెందినవి ఉన్నాయి.
"సీఎమ్ఈలవల్ల ఏర్పడే అద్భుతమైన ప్రకృతి దృశ్యం ఆరోరా’’ అని ప్రొఫెసర్ రమేష్ చెప్పారు. ఇవి సూర్యుడి నుంచి వెలువడే విద్యుత్‌శక్తి కణాలు భూమిపైకి ప్రయాణిస్తున్నట్టు స్పష్టంగా చూపిస్తాయి" అని రమేష్ వివరించారు.
"అయితే అవి ఉపగ్రహంలోని అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా చేయగలవు, విద్యుత్ గ్రిడ్‌లను కూల్చివేయగలవు, వాతావరణ, సమాచార ఉపగ్రహాలను ప్రభావితం చేయగలవు" అని ఆయన వివరించారు.
చరిత్రలో నమోదైన అత్యంత శక్తిమంతమైన సౌర తుపాను 1859లో జరిగిన కారింగ్టన్ ఈవెంట్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెలిగ్రాఫ్ వ్యవస్థలను దెబ్బతీసింది. అలాగే 1989లో కెనడాలోని క్యూబెక్ పవర్ గ్రిడ్‌లో కొంత భాగం దెబ్బతిన్నందున 60 లక్షలమంది మంది తొమ్మిది గంటల పాటు విద్యుత్ లేకుండా ఉండాల్సి వచ్చింది. నవంబర్ 2015లో, సౌర కార్యకలాపాలు ఎయిర్ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించాయి. ఇది స్వీడన్, కొన్ని ఇతర యూరోపియన్ విమానాశ్రయాలలో గందరగోళానికి దారితీసింది.
ఫిబ్రవరి 2022లో, ఒక సీఎమ్ఈ కారణంగా 38 వాణిజ్య ఉపగ్రహాలు దెబ్బతిన్నాయని నాసా నివేదించింది .
"సూర్యుని కరోనాపై ఏం జరుగుతుందో మనం చూడగలిగితే, సౌర తుపాను లేదా కరోనల్ మాస్ ఎజెక్షన్‌ను గుర్తించగలిగితే, దాని ఉష్ణోగ్రతను నమోదు చేసి, దాని ప్రయాణ మార్గాన్ని చూడడం వీలైతే.. విద్యుత్ గ్రిడ్‌లు, ఉపగ్రహాలను ఆపివేసి, వాటిని ప్రమాదంనుంచి దూరంగా జరపడానికి ముందస్తు హెచ్చరికగా పని చేస్తుంది" అని ప్రొఫెసర్ రమేష్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
సూర్యుడిని పరిశీలిస్తున్న మరికొన్ని మిషన్లు ఉన్నప్పటికీ, కోరోనాను పరిశీలించడంలో ఆదిత్య-ఎల్1 కి ప్రత్యేక ప్రయోజనం ఉంది. ఇది నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కలిసి పంపిన సౌర, హెలియోస్ఫెరిక్ ఆబ్జర్వేటరీతో పోలిస్తే కూడా మెరుగ్గా పని చేస్తుంది.
"ఆదిత్య-ఎల్1 కరోనాగ్రాఫ్ సరైన పరిమాణంలో ఉంది. ఇది చంద్రుడిలా సూర్యుడి ఫోటోస్పియర్‌ను పూర్తిగా కప్పి, కోరోనాను 24 గంటలు, 365 రోజులు, గ్రహణాలు లేదా అడ్డంకులు ఉన్నప్పటికీ విరామం లేకుండా పరిశీలించగలదు" అని ప్రొఫెసర్ రమేష్ చెప్పారు.
మరోలా చెప్పాలంటే, కరోనాగ్రాఫ్ ఒక కృత్రిమ చంద్రుడిలా పనిచేస్తుంది, సూర్యుని ప్రకాశవంతమైన ఉపరితలాన్ని అడ్డుకుని, శాస్త్రవేత్తలు మసకగా ఉండే దాని బాహ్య కరోనాను నిరంతరం గమనించడానికి వీలు కల్పిస్తుంది. నిజమైన చంద్రగ్రహం గ్రహణాల సమయంలో మాత్రమే ఇలా చేస్తుంది.
"అంతేకాకుండా కంటికి కనిపించే కాంతిలో.. విస్ఫోటనాలను అధ్యయనం చేయగల ఏకైక మిషన్ ఇదే. సీఎమ్‌ఈ ఉష్ణోగ్రత, ఉష్ణశక్తిని కొలవడానికి వీలు కల్పిస్తుంది. ఒక సీఎమ్‌ఈ భూమి వైపు వెళితే ఎంత బలంగా ఉంటుందో చూపించే కీలక ఆధారాలు ఇవి" అని ప్రొఫెసర్ రమేష్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
వచ్చే ఏడాది గరిష్ట సౌర కార్యకలాపాల కాలానికి సిద్ధం కావడానికి, ఆదిత్య-ఎల్1 ఇప్పటివరకు నమోదు చేసిన అతిపెద్ద సీఎమ్ఈలలో ఒకదాని నుంచి సేకరించిన డేటాను నాసాతో కలిసి ఐఐఏ అధ్యయనం చేసింది.
ఇది 2024 సెప్టెంబర్ 13న భారత కాలమానం ప్రకారం ఉదయం 6 గంటలకు మొదలైందని ప్రొఫెసర్ రమేష్ చెప్పారు. దీని ద్రవ్యరాశి 270 మిలియన్ టన్నులు. టైటానిక్‌ను ముంచిన మంచుకొండ 1.5 మిలియన్ టన్నులే అని ఆయన పోల్చి చెప్పారు.
ప్రారంభంలో, దాని ఉష్ణోగ్రత 1.8 మిలియన్ డిగ్రీల సెల్సియస్, దీని శక్తి 2.2 మిలియన్ మెగాటన్నుల టీఎన్‌టీకి సమానం. హిరోషిమా, నాగసాకిపై పడిన అణు బాంబులు వరుసగా 15 కిలోటన్నులు, 21 కిలోటన్నులు మాత్రమే.
ఈ సంఖ్యలు చాలా పెద్దవిగా అనిపించినా, ఇది మధ్యస్థ పరిమాణ సీఎమ్ఈ అని ప్రొఫెసర్ రమేష్ వివరించారు.
భూమిపై డైనోసార్లను తుడిచిపెట్టిన గ్రహశకలం 100 మిలియన్ మెగాటన్నుల శక్తి కలిగి ఉండేదని ఆయన తెలిపారు. సూర్యుడి అత్యధిక క్రియాశీలత సమయంలో, అంతకంటే ఎక్కువ శక్తి కలిగిన సీఎమ్ఈలు కూడా కనిపించవచ్చని ఆయన చెప్పారు.
"మేం అంచనా వేసిన సీఎమ్ఈ సూర్యుడు సాధారణ క్రియాశీల దశలో ఉన్నప్పుడు సంభవించిందని భావిస్తున్నాను. ఇప్పుడు సూర్యుడి అత్యధిక క్రియాశీలత దశలో ఏం జరుగుతుందో అంచనా వేయడానికి మేం దీన్ని ప్రామాణికంగా ఉపయోగిస్తాం" అని ఆయన చెప్పారు.
"దీని నుంచి నేర్చుకున్న విషయాలు భూమి సమీప అంతరిక్షంలో శాటిలైట్లను రక్షించడానికి తీసుకోవాల్సిన చర్యలను రూపొందించడంలో మాకు సాయపడతాయి. అలాగే, భూమి సమీప అంతరిక్షాన్ని బాగా అర్థం చేసుకోవడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి" అని ఆయన తెలిపారు.

ఫొటో సోర్స్, ISRO
అసలేంటీ ఆదిత్య ఎల్ 1?
సూర్యుడి మీద పరిశోధనల కోసం 2023 సెప్టెంబర్ 2న ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట స్పేస్ స్టేషన్ నుంచి ఇస్రో ఆదిత్య ఎల్ 1ను ప్రయోగించింది.
ఇస్రో ప్రయోగించిన ఈ ఆదిత్య ఎల్1 మిషన్ చంద్రయాన్-3 మాదిరిగానే భూమి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ క్రమంగా తన అపహేళిని పెంచుకుని సూర్యుడి దిశగా సుదీర్ఘంగా ప్రయాణించి భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలో లెగ్రాంజ్ పాయింట్ వన్ దగ్గరకు చేరుకుంది.
లెగ్రాంజ్ పాయింట్ దగ్గర భూమి, సూర్యుడి గురుత్వాకర్షణ శక్తులు శూన్యమవుతాయి. కాబట్టి ఆ ప్రదేశంలో ఏదైనా వస్తువును ఎలాంటి శక్తి ప్రయోగం లేకుండా స్థిరంగా ఉంచవచ్చు.
అందుకే ఇస్రో ఆదిత్య ఎల్ 1ను అక్కడకు పంపించింది. కానీ అక్కడ కూడా ఆదిత్య ఎల్ 1 మీద చంద్రుడు, ఇతర గ్రహాల గురుత్వాకర్షణ శక్తులు పనిచేస్తాయి. అందుకే ఆదిత్య ఎల్ 1ను ఆ లెగ్రాంజ్ పాయింట్ చుట్టూ ఉన్న శూన్య కక్ష్యలో ప్రవేశపెట్టింది. అక్కడ ఇది ఐదేళ్ల పాటు నిరంతరాయంగా పనిచేస్తుందని ఇస్రో వెల్లడించింది.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














