సంపూర్ణ సూర్యగ్రహణం ప్రజల ఆలోచనా శక్తిని ప్రభావితం చేస్తుందా? అందరినీ ఏకతాటిపైకి తెస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, డేవిడ్ రాబ్సన్
- హోదా, బీబీసీ ప్రతినిధి
అంతరిక్షంలో జరిగే అద్భుత సంఘటనలు మనుషుల ఆలోచనలపై బలమైన ముద్ర వేస్తాయి.
క్రీస్తు పూర్వం 585, మే 28న ప్రస్తుత తుర్కియేలోని అనటోలియాలో జరిగినది ఇది.
ఆధునిక ఇరాన్‌లో నివశించిన పురాతన జాతి మెడిస్, దక్షిణ తుర్కియేలోని లైడియన్స్ ఆరేళ్లు యుద్ధం చేశారు.
“యుద్ధంలో ఏ పక్షం కూడా ముందడుగు వేయలేని సమయంలో యుద్ధం ముగుస్తుందనే చిన్న ఆశ ఏర్పడింది. అదేమిటంటే ఆ రోజు ఏర్పడిన సూర్యగ్రహణం ఈ రక్తపాతానికి ముగింపు పలికింది” అని గ్రీకు చరిత్రకారుడు హెరిడోటస్ రాశారు.
“యుద్ధం తీవ్రంగా మారుతున్న తరుణంలో, ఆ రోజు హఠాత్తుగా చీకటి పడింది” అని హెరిడోటస్ రాశారు. “ఈ మార్పు గమనించిన మెడిస్, లైడియన్స్ యుద్ధం ఆపేసి శాంతి ఒప్పందం గురించి చర్చించేందుకు ఆత్రుతతో ముందుకు వచ్చారు.”
ఇప్పుడు ఉత్తర అమెరికాలో సంపూర్ణ సూర్యగ్రహణం విషయంలో అంత నాటకీయతను మనం చూడకపోవచ్చు. అయితే సూర్యగ్రహణం లాంటి ఖగోళ అద్భుతాలు మనలో విస్మయాన్ని, భావోద్వేగాన్ని కలిగించడం ద్వారా మన సైకాలజీపై శక్తిమంతమైన ప్రభావాన్ని చూపుతాయని ఇటీవలి పరిశోధనలు సూచిస్తున్నాయి.
సంపూర్ణ సూర్యగ్రహణంతోపాటు మనల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఖగోళ పరిణామాలు చాలా ఉన్నాయి. అది భూమికి దూరంగా చంద్రుడు తన కక్ష్యలో పరిభ్రమిస్తూ సూర్యుడికి ఎదురుగా వచ్చి సూర్య కాంతి కొన్ని క్షణాలపాటు భూమిని చేరకుండా అడ్డుకునే సందర్భం కావచ్చు. అలాంటి కొన్ని అద్భుతమైన దృశ్యాలను చూడటం మనల్ని ఉత్తేజపరుస్తుందని, సమాజం పట్ల వినయం, శ్రద్ధను ప్రదర్శించేలా చేస్తుందని అధ్యయనంలో తేలింది.
“ప్రజలు ఒకరికొకరు చాలా అనుబంధంతో ఉండవచ్చు. తమకు సామాజికంగా అనేక సంబంధాలు ఉన్నాయని చెప్పవచ్చు. తాము సమూహాలతో కనెక్ట్ అయ్యామని భావించవచ్చు” అని హాప్కిన్స్ యూనివర్సిటీలో సైకాలజిస్టు సీన్ గోల్డీ చెప్పారు.
2017లో వచ్చిన సంపూర్ణ సూర్యగ్రహణం ప్రజల భావోద్వేగాలపై చూపించిన ప్రభావం గురించి ఆయన పరిశోధన చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
పరిశోధనలో నిర్ఘాంతపరిచే అంశాలు వెల్లడి
శాస్త్రీయ అధ్యయనాలు సుదీర్ఘకాలంగా నిర్లక్ష్యం చేసిన అంశం ఇది. గత రెండు దశాబ్దాలుగా శాస్త్రీయ అధ్యయనాల్లో అద్భుతం అనేది ఫ్యాషన్‌గా మారడం పెరిగింది. గ్రహణాన్ని ఆశ్చర్యం, అబ్బురపరచడం అనే కోణంలో విశ్లేషించారు. ఇలా ఎందుకు జరిగిందంటే దీనికున్న విస్తృతి పోలికలో అది చిన్నదిగా కనిపిస్తోంది.
"విశాలమైన ప్రపంచం గురించి మీ దృక్కోణాన్ని సవాలు చేసే విషయాన్ని గ్రహించినప్పుడు మీరు అనుభూతి చెందే భావోద్వేగం ఇది" అని టొరంటో విశ్వవిద్యాలయంలో సైకాలజిస్టు జెన్నిఫర్ స్టెల్లార్ చెప్పారు. "ఇది ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల మీకున్న గ్రహణశక్తికి మించి అసాధారణమైనది."
దీని ఫలితం జీవితాన్ని మార్చగలదు.
యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఆఫ్ బర్క్‌లేలో సైకాలజిస్టుగా పని చేస్తున్న డాచెర్ కెల్ట్‌నర్ తన పుస్తకం “ఆవ్”లో ఇలా రాశారు:
అద్భుతానికి సంబంధించిన భావన “ఎప్పుడూ ఏదో ఒకటి చేయాలని వేధించడం, ఆత్మవిమర్శ, మితిమీరిన గర్వం, మన గొంతు విని అవతలి వాళ్లు ఏమనుకుంటారో అనే ఆందోళన, అహంకారంలాంటి వాటి నుంచి ఒకరితో ఒకరు కలిసి ఉండటానికి, ఆశ్చర్యాన్ని స్వాగతించేందుకు మన మైండ్‌ను తెరచి ఉంచడానికి, జీవితపు లోతుల నమూనాలను చూడటానికి మనల్ని ఉత్తేజ పరుస్తుంది.’’
ఇలా చెప్పడం చాలా గొప్పగా అనిపించవచ్చు.
అయితే కెల్ట్‌నర్, ఆయన సహచరులు ఇందుకు సంబంధించి పెద్ద మొత్తంలో ఆధారాలను సేకరించారు. ఒక ప్రయోగశాలలో కొంత మందిపై పరిశోధనలు జరిపారు.
ఈ పరిశోధనల్లో పాల్గొన్నవారిని తమకు అందించిన ప్రశ్నావళిని పూర్తి చెయ్యడం, వారి మానసిక స్థితి, ప్రవర్తనను మార్చుకునే ముందు అద్భుతం అనిపించే వీడియోలను చూడాలని అడిగారు.
అంతరిక్ష అద్భుతాల ప్రభావం గురించి 2018లో జరిగిన ఓ అధ్యయనాన్ని చూద్దాం.
ఈ అధ్యయనంలో పాల్గొన్న వారిలో కొంత మందిని విశాల విశ్వంలో నుంచి భూమి మీదకు జూమ్ చేస్తూ ఉన్న ఓ చిన్న వీడియోను చూడాలని పరిశోధన బృందం కోరింది.
మిగతావారిని కంచె ఎలా వేయాలనే ఒక ఉల్లాసభరిత వీడియోనూ చూడాలని కోరింది.
వీడియోలు చూడటం పూర్తైన తర్వాత రెండు గ్రూపుల వారు తమ శక్తియుక్తులు, బలహీనతల గురించి రెండు నిముషాల పాటు రాయాలని కోరారు. ఊహించినట్లుగానే విశ్వానికి సంబంధించిన వీడియో చూసినవాళ్లు తాము అద్భుతమైన అనుభూతిని పొందినట్లు తమ స్టేట్‌మెంట్‌లో రాశారు. వాళ్లు తమకున్న బలహీనతలను అభివర్ణించడానికి ముందే తమకున్న కొద్ది పాటి శక్తియుక్తుల గురించి అందులో గొప్పగా ప్రస్తావించారు.
దీనికి సంబంధించిన మరో అధ్యయనంలో అందులో పాల్గొన్న వారిలో మూడొంతుల మందికి ‘వావ్’ అని అనిపించిన క్షణం ఏది అని అడిగారు.
మూడొంతుల మంది తమకు ఎదురైన ఓ తమాషా ఘటనను గుర్తు చేసుకున్నారు. మిగతావారు పచారీ సామాన్లు తెచ్చుకోవడానికి వెళ్లిన అనుకోని ప్రయాణాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నారు.
ఆ తర్వాత వారిని అనేక ప్రశ్నలు అడుగుతూ సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. అందులో తమ జీవితంలో సాధించిన విజయాల గురించి సున్నా నుంచి వంద వరకు ఎన్ని మార్కులు ఇస్తారని ప్రశ్నించారు.
ఆ విజయాల సాధనలో వారికున్న ప్రతిభ లేదా అదృష్టం లేదా దేవుడి దయ వల్ల అవి దక్కాయా అనే అంశాన్ని కూడా చేర్చారు.
కొంత మంది వ్యక్తులు బయటి శక్తులను గుర్తిస్తారని మీరు అనుకోవచ్చు. ఈ పరిశోధనల్లో పాల్గొన్న వారిలో మొదట ‘వావ్’ అని భావించిన వారిలో పరిశోధకులు మొదటగా గుర్తించిన అంశం ఇదే.
“మనలోని గర్వం మన ఆలోచనల్ని, నిర్ణయాలు తీసుకునే శక్తిని ప్రభావితం చేస్తుంది. అయితే మీరు ఒక అద్భుతాన్ని అనుభూతి చెందినప్పుడు మన కంటే గొప్ప శక్తి ఉందని అనిపిస్తుంది” అని స్టెల్లార్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
అస్పష్టమైన సరిహద్దులు
మన శక్తియుక్తుల పట్ల మనల్ని విధేయులుగా మార్చడంతోపాటు మనలోని గర్వం తొలగిపోవడం వల్ల మనం ఇతరుల్లో కొత్త వెలుగును చూడగలుగుతాము.
“నేను నాపై శ్రద్ధ తగ్గించుకున్నప్పుడు నీకు నాకు మధ్య ఉన్న గీత మసకమసకగా కనిపిస్తుంది. అప్పుడు మనం అంతా మానవత్వం అనే సాలెగూడులో భాగమేనని తెలుస్తుంది” అని స్టెల్లార్ చెబుతారు.
ఈ వాక్యాలతోపాటు తమ సమూహం గురించి వివరించాలని ఇందులో పాల్గొన్న వారిని పరిశోధకులు కోరారు.
వారికి ఒక జత సర్కిల్స్‌ను ఇచ్చారు. అందులో ఒకటి వారికి ప్రాతినిధ్యం వహిస్తుంది. మరొకటి వారి చుట్టు ఉన్న వారికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఆ చిత్రం వెన్ డయాగ్రమ్‌లా ఉంది.
అందులో తమ చుట్టూ ఉన్న సమూహం శక్తిని, ఆ సమూహంలో తమ ప్రాధాన్యాన్ని చూపిస్తుంది.
అద్భుతమైన, ఉత్తేజాన్ని పెంచే వీడియో చూసిన తర్వాత సామాజిక సంబంధాలను తెలుసుకునేందుకు ఇది స్థిరమైన విధానం. ఈ ప్రయోగంలో పాల్గొన్నవారు పెద్దగా ఉన్న సర్కిల్స్‌ను ఎంచుకున్నారు.
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్‌లో సైకాలజిస్ట్ ఎస్.కేథరిన్ నెల్సన్- కాఫే, ఆమె సహచరుల అధ్యయనంలోనూ మనం ఇలాంటి ఫలితాలనే చూడవచ్చు.
ఈ పరిశోధనలో పాల్గొన్న 47 మందిని కార్ల్ సాగన్ రాసిన పేల్ బ్లూడాట్ పుస్తకంలో కొన్ని పంక్తులను వివరించే ఆడియో క్లిప్ వింటూ వర్చువల్ స్పేస్ వాక్ చేయాలని కోరారు.
“నేను మిగతావారికి మొత్తం మానవాళికి దగ్గరగా ఉన్నాను” అని ఈ స్పేస్‌వాక్‌లో పాల్గొన్నకొంత మంది తెలిపారు.
అద్భుతాన్ని అనుభవించిన వారు ప్రజల పట్ల మరింత పరోపకార ధోరణితో వ్యవహరిస్తారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో సైకాలజీ ప్రొఫెసర్ పాల్ పిఫ్, ఆయన సహచరులు కొంత మందిని బీబీసీ ఎర్త్ సిరీస్ వీడియోలను చూడాలని అడిగారు.
బీబీసీ కామెడీ వాక్ ఆన్ ద వైల్డ్ సైడ్ దృశ్యాలను చూసిన వారి కంటే బీబీసీ ప్లానెట్ ఎర్త్ సిరీస్ చూసినవారు లాటరీ టికెట్లను ఎక్కువకు కొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
నేనే గ్రహణాన్ని అయితే..
ఈ ప్రయోగాలు ఆసక్తికరంగా ఉన్నా, పరిశోధనా కేంద్రాల బయట ప్రజల సహజమైన తక్షణ స్పందనలను ప్రతిబింబించకపోవచ్చు.
సీన్ గోల్డీ తన పీహెచ్‌డీని ప్రారంభించినప్పుడు ఆయనలో దీనికి సంబంధించి ఆందోళన మొదలైంది.
“నేను నిజంగా అలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న వ్యక్తులను అధ్యయనం చేసే మార్గాన్ని వెతుకుతున్నాను” అని ఆయన చెప్పారు.
2017లో వచ్చిన గ్రహణం దీనికి సమాధానం చెప్పింది.
సూర్యుడు, చంద్రుడు అరుదుగా ఒకే మార్గంలోకి వచ్చే అద్భుతమైన దృశ్యం అనేక మందిని సంభ్రమాశ్చర్యాల్లో పడేసింది.
ఈ ఘటన సామాజిక మాధ్యమాల్లో పోస్టులను కూడా గట్టిగానే ప్రభావితం చేసింది. అనేక మంది సోషల్ మీడియాలో తమ తక్షణ స్పందనను పోస్ట్ చేయడంతో అద్భుత దృశ్యం పట్ల వారు ఎలా స్పందించారో అధ్యయనం చేసేందుకు వీలు కలిగింది.
ఈ డేటాను సేకరించేందుకు గోల్టీ ప్రస్తుతం ‘ఎక్స్(ట్విటర్)’ను ఆశ్రయించారు. యూజర్ల ఫ్రొఫైల్స్‌లో పేర్కొన్న లొకేషన్ల ఆధారంగా ఏ ప్రాంతంలో ప్రజలు పూర్తిస్థాయి గ్రహణాన్ని చూశారో అంచనా వేయగలిగారు.
ఎవరు సంపూర్ణ గ్రహణాన్ని చూడలేకపోయారో కూడా తెలుసుకున్నారు. తర్వాత ఆయన ఆ పోస్టులలో ఉన్న అంశాలను విశ్లేషించారు.
“అద్భుతం లేదా మైండ్‌బ్లోయింగ్’’ లాంటి పదాలను అందులో గుర్తించారు. అలాగే, అయి ఉండవచ్చు, కావచ్చు అనే పదాలను వినయానికి గుర్తుగా భావించారు.
“కేర్” లాంటి పదాలు రాసిన వాళ్లలో కృతజ్ఞత, ప్రేమకు చిహ్నంగా డీ కోడ్ చేశారు.
ఫలితాలు వాళ్లు ఆశ్చర్యపడేంత గొప్పగా ఉన్నాయి. గ్రహణం చూసి ట్వీట్లు చేసిన యూజర్లంతా తాము ఊహించిన దాని కంటే రెండు రెట్లు అధికంగా ఆశ్చర్యపోయినట్లు తమ సందేశాలలో తెలిపారు.
ఊహించినట్లుగానే సమూహం పట్ల గొప్ప వినయం కనిపించింది.
గ్రహణం చూసిన వారంతా నన్ను, నేను అని కాకుండా మేము, మాకు అని తమ సందేశాలలో ప్రకటించారు.
ఒక అద్భుతం జరిగినప్పుడు ప్రజల మధ్య సంబంధాలు మరింత బలపడతాయని ఇది రుజువు చేసింది.
అయితే ఈ ప్రభావం చాలా స్వల్పకాలం ఉంటుందని గోల్డీ నొక్కి చెప్పారు.
“ఇది కేవలం 24 గంటలు మాత్రమే ఉంటుంది” అని ఆయన అన్నారు.
అయితే అది దైనందిన జీవితంలోని ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగిస్తుందనే విషయాన్ని మనం స్వాగతించాలి.
ప్రజల మధ్య విద్వేషాలు, అసమానతలు పెరిగిపోయిన ఈ తరంలో మన చుట్టూ ఉన్న విశ్వంలో ఒక అద్భుతాన్ని వీక్షించేందుకు మనం అంతా ఒక్కటి అని చెప్పేందుకు ఇదొక అవకాశం.
మీరు సూర్యగ్రహణాన్ని చూసి ఉంటే ఆ అద్భుత క్షణాలను భద్రపరచుకోవడంలో విజయం సాధించినట్లే.
ఇవి కూడా చదవండి:
- సూర్యగ్రహణం సమయంలో కొన్ని జంతువులు ఎందుకు వింతగా ప్రవర్తిస్తాయి?
- కుమారుడు ప్రేమ వివాహం చేసుకున్నాడని తల్లి మీద దాడి చేసి, అర్ధనగ్నంగా పరుగెత్తించారు... వీడియో తీసి వైరల్ చేశారు
- పురుగులు పట్టిన బియ్యం తింటే ఏమవుతుంది? పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలి?
- సంపూర్ణ సూర్యగ్రహణం: ఆ 4 నిమిషాలు నాసాకు ఎందుకంత కీలకం?
- ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు 15 ఏళ్లలో రెట్టింపు అవుతాయన్న లాన్సెట్ నివేదిక, ఈ క్యాన్సర్ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














