తెలంగాణ: హైదరాబాద్‌లో తయారైన ఈ ప్రైవేట్ రాకెట్ ప్రత్యేకతలేంటి?

- రచయిత, అమరేంద్ర యార్లగడ్డ
- హోదా, బీబీసీ ప్రతినిధి
''ఓపెనింగ్ స్పేస్ ఫర్ ఆల్ (అంతరిక్షంలో అందరికీ అవకాశం)''
ఈ నినాదంతో స్థాపించిన హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ రాకెట్‌ను తయారు చేసింది. ఇది భారతదేశపు తొలి వాణిజ్య ఆర్బిటాల్(భూకక్ష్య ) రాకెట్‌గా ప్రకటించింది.
ఈ రాకెట్‌కు భారత అంతరిక్ష పితామహుడిగా పేరొందిన విక్రమ్ సారాభాయ్ పేరుతో విక్రమ్-1గా నామకరణం చేసింది.
ఇప్పటివరకు రాకెట్లు అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఆధ్వర్యంలోనే తయారయ్యేవి.
అయితే, కేంద్ర ప్రభుత్వం అంతరిక్ష సాంకేతికతలో ప్రైవేట్ సంస్థలకు అవకాశాలు కల్పించడంతో విక్రమ్-1 రాకెట్‌ను తయారు చేసి ప్రయోగానికి సిద్ధమవుతోంది స్కైరూట్ ఏరో స్పేస్ కంపెనీ.


ఏమిటీ స్కై రూట్ కంపెనీ?
ఉపగ్రహాల(శాటిలైట్స్)ను అంతరిక్షంలోకి తీసుకెళ్లడంలో లాంచ్ వెహికల్స్‌దే కీలకపాత్ర.
ఉపగ్రహాల బరువును బట్టి లాంచ్ వెహికల్‌ను ప్రయోగిస్తుంటారు.
ఇస్రో తరఫున పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ), జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ) వంటి వాటిని ఉపయోగిస్తున్నారు.
వీటిల్లో పీఎస్ఎల్వీకి సుమారు 1400 కిలోల బరువు వరకు మోసుకెళ్లే సామర్థ్యం ఉంది.
జీఎస్ఎల్వీకి సుమారు 4 వేల నుంచి 6 వేల కిలోల పేలోడ్ సామర్థ్యం ఉంది.
స్పేస్ టెక్నాలజీలో ప్రైవేటు పెట్టుబడులు లేదా కంపెనీలకు అవకాశం కల్పించాలని జూన్ 2020లో కేంద్ర కేబినెట్ నిర్ణయించడంతో ఈ రంగంలో పెద్దసంఖ్యలో కంపెనీలు ఏర్పాటయ్యాయి.
అప్పటికి రెండేళ్ల కిందటే 2018లో స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ ప్రారంభించారు ఇస్రో మాజీ శాస్త్రవేత్తలు పవన్ కుమార్ చందన, భరత్ కుమార్ డాకా.
''ఆ సమయంలో పెద్దగా ఫండింగ్ లేదు. స్పేస్ టెక్నాలజీలో అంత ప్రతిభ లేదు. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలతో లబ్ధి పొందాం'' అని బీబీసీతో చెప్పారు పవన్ కుమార్.

ఫొటో సోర్స్, skyroot
ఇస్రో రాకెట్లకూ, దీనికీ తేడాలేమిటి?
పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీతో పోల్చితే స్కైరూట్ అభివృద్ధి చేసిన విక్రమ్ -1 లాంచ్ వెహికల్ పే లోడ్ సామర్థ్యం చాలా తక్కువే.
దీని పే లోడ్ సామర్థ్యం 500 కిలోలుగా ఉందని, ప్రాథమికంగా 350 కిలోల పే లోడ్ సామర్థ్యంతో ప్రయోగాలు చేపడతామని పవన్ కుమార్ బీబీసీతో చెప్పారు .
''40 టన్నుల బరువు, 20 మీటర్ల ఎత్తుతో లాంచ్ వెహికల్ ఉంటుంది'' అని చెప్పారు.
భూ ఉపరితలం నుంచి 500 కిలోమీటర్ల వరకు అంతరిక్షంలోకి వెళ్లగలదని స్కైరూట్ కంపెనీ చెబుతోంది.
సెకనుకు 8 కిలోమీటర్ల వెలాసిటీతో శాటిలైట్‌ను ప్రవేశపెట్టే సామర్థ్యం కలిగివుంది.
1.7 మీటర్ల వ్యాసంతో 1200 కేఎన్ థ్రస్ట్ సామర్థ్యంతో లాంచ్ వెహికల్ తయారైంది.
త్రీడీ ప్రింటెడ్ లిక్విడ్ ఇంజిన్ కారణంగా సాధారణ ఇంజిన్‌తో పోలిస్తే 50 శాతం తక్కువ బరువుంటుంది. సాలిడ్ ఫ్యూయెల్ బూస్టర్స్, కార్బన్ కంపోజిట్ స్ట్రక్చర్ (కార్బన్ ఫైబర్‌తో తయారైనవి) కలిగివుంది.

మూడేళ్ల కిందట టెస్ట్ రాకెట్ విజయవంతం
స్కైరూట్ ఏరోస్పేస్ కంపెనీ 2022 నవంబర్ 18న సబ్ ఆర్బిటాల్(భూ ఉప క్షక్ష్య) లాంచ్ వెహికల్‌ను ప్రయోగించింది. దీనికి అప్పట్లో విక్రమ్-ఎస్‌గా నామకరణం చేశారు.
ఇది భూమి ఉపరితలం నుంచి 80 కిలోమీటర్ల వరకు వెళ్లి భూ ఉపకక్ష్యను తాకింది. కానీ, దీనికి శాటిలైట్‌ను ప్రవేశపెట్టే సామర్థ్యం లేదు.
''విక్రమ్- ఎస్ అనేది టెస్ట్ రాకెట్ మాత్రమే'' అని పవన్ చెప్పారు.
ఆ ప్రయోగం విజయవంతం కావడంతో విక్రమ్-1 లాంచ్ వెహికల్ చేపట్టి మూడేళ్లలోనే పూర్తి చేసినట్లుగా పవన్ కుమార్ చందన చెప్పారు .
''భవిష్యత్తులో ప్రతి నెలా ఒక లాంచ్ వెహికల్ తయారు చేసి అందుబాటులోకి తీసుకురావాలనేది మా లక్ష్యంగా పెట్టుకున్నాం'' అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, PMO
ఇండియన్ స్పేస్ పాలసీతో 'ప్రైవేట్'కు బూస్ట్
కేంద్ర ప్రభుత్వం 2023లో ఇండియన్ స్పేస్ పాలసీ తీసుకొచ్చింది.
ప్రభుత్వేతర సంస్థలు కూడా అంతరిక్ష సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు ఈ పాలసీ ఎంతో కీలకంగా మారిందని ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ చెప్పారు.
''స్పేస్ పాలసీ స్కైరూట్ వంటి ఎన్నో సంస్థలకు మరింత చేయూతనిచ్చింది'' అని ఆయన అన్నారు.
ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్(ఇన్ స్పేస్) నిబంధనలకు లోబడి ప్రైవేటు సంస్థలు పనిచేయాల్సి ఉంటుంది.
మూడేళ్ల కిందట ఇన్ స్పేస్ ప్రారంభించడం వెనుక ఉద్దేశం.. ప్రైవేట్ ఎంటర్‌ప్రైజెస్‌కు అవకాశం కల్పించాలన్నదే అని ఇన్ స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా చెప్పారు.

ఫొటో సోర్స్, skyroot
విక్రమ్-2లో మరింత పేలోడ్ సామర్థ్యం
విక్రమ్ -2 లాంచ్ వెహికల్‌ను 2026లో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా భరత్ కుమార్ డాకా చెప్పారు.
కంపెనీ చెబుతున్న వివరాల ప్రకారం, విక్రమ్-2 లాంచ్ వెహికల్ 900 కిలోల పేలోడ్ సామర్థ్యంతో తయారు చేస్తున్నట్లుగా ఉంది. ఇందుకు అడ్వాన్సడ్ క్రయోజెనిక్ ఇంజిన్ తయారు చేస్తున్నట్లగా చెబుతోంది.
భవిష్యత్తులో రీ యూజబుల్ లాంచ్ వెహికల్స్(రాకెట్స్) తయారు చేయాలనే ఆలోచన ఉన్నట్లుగా పవన్ చెప్పారు.
ప్రపంచ దేశాలకు శాటిలైట్స్ లాంచ్ చేయడానికి రాకెట్ల అవసరం చాలా ఉందని, ఆ ఆలోచనతోనే లాంచ్ వెహికల్స్ తయారీకి స్కైరూట్ నిర్ణయించిందని చెప్పారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రైవేటు రాకెట్ తయారీ కంపెనీలు పెద్దయెత్తున వస్తున్నాయి. అమెరికాలో స్పేస్-ఎక్స్ సహా వివిధ సంస్థలున్నాయి. రాకెట్స్ తయారు చేస్తున్నాయి. భారత్‌లో లాంచ్ వెహికల్స్‌ను ప్రైవేటు కంపెనీలు తీసుకురావడం కీలక మలుపుకానుంది.

ఫొటో సోర్స్, skyroot
స్పేస్ టెక్నాలజీలో స్టార్టప్‌ల హవా
2015 నుంచి 2024 మధ్య 393 విదేశీ, మూడు స్వదేశీ కమర్షియల్ శాటిలైట్స్‌ను ఇస్రో ప్రయోగించింది. దీని ద్వారా 439 మిలియన్ యూఎస్ డాలర్ల ఆదాయం సమకూరింది.
భారత స్పేస్ రంగంలో 2024లో వంద శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) అనుమతిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
దేశీయంగా ఇప్పటికే స్పేస్ టెక్నాలజీలో 300కుపైగా స్టారప్‌లు పనిచేస్తున్నాయని పవన్ గోయెంకా చెప్పారు.
ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ డేటా ప్రకారం, సెప్టెంబర్ 30, 2025 నాటికి 376 స్టార్టప్‌లు కేంద్రానికి దరఖాస్తు చేసుకున్నాయి.
2022లో ఒకే ఒక్క స్టార్టప్ ఉండగా , 2024 నాటికి 200 కంపెనీలు వచ్చాయని నిరుడు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రకటించింది.
గ్లోబల్ స్పేస్ ఇండస్ట్రీలో భారత్ వాటా 2021లో రెండు శాతం (8.4 యూఎస్ బిలియన్ డాలర్లు)గా ఉంది.
2033 నాటికి 44 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని, ఎగుమతులు 11 బిలియన్ డాలర్లకు చేరుకుంటాయని భారత ప్రభుత్వం అంచనా వేస్తోంది.
భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ కంపెనీల రాక అంతరిక్ష రంగాన్ని కచ్చితంగా సరికొత్త దిశగా తీసుకెళుతుందని సోమనాథ్ చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














