అంత్యక్రియల కోసం తీసుకెళ్తుంటే, శవపేటిక నుంచి శబ్దాలు.. అసలేం జరిగిందంటే..

ఫొటో సోర్స్, Getty Images
అంత్యక్రియల కోసం ఓ మహిళను శవపేటికలో థాయిలాండ్‌లోని బ్యాంకాక్ నగర శివారులో ఉన్న ఓ బౌద్ధ మందిరానికి తీసుకొచ్చారు. అయితే, ఆమె ప్రాణాలతోనే ఉన్నట్లు ఆఖరి నిమిషంలో ఆ మందిరం సిబ్బంది గుర్తించారు.
శవపేటిక లోపలి నుంచి ఎవరో కొడుతున్నట్లు శబ్దం రావడంతో అంతా ఆశ్చర్యపోయారని అసోసియేటెడ్ ప్రెస్‌తో వాట్ రాట్ ప్రఖోంగ్ థామ్ మందిరం జనరల్ మేనేజర్ పైరత్ సూద్‌థూప్ చెప్పారు.
శవపేటిక తెరిచి చూసినప్పుడు, ఆ మహిళ కళ్లు కొద్దిగా తెరిచి, శవపేటికను తట్టడం కనిపించిందని సూద్‌థూప్ అన్నారు.
తన సోదరి చనిపోయిందని స్థానిక అధికారులు తనతో చెప్పారని ఆమె 65 ఏళ్ల సోదరుడు చెప్పారు. అయితే, ఆయన వద్ద మరణ ధ్రువీకరణ పత్రం లేదని మేనేజర్ తెలిపారు.
డెత్ సర్టిఫికెట్ ఎలా తీసుకోవాలో ఆయనకు సూద్‌థూప్ వివరిస్తున్న క్రమంలో, శవపేటిక లోపలి నుంచి శబ్దం రావడం ఆలయ సిబ్బంది గమనించారు.

ఆమె బతికే ఉన్నట్లు తేలడంతో, వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలని ఆ బౌద్ధమఠం అధిపతి చెప్పారు.
హైపోగ్లైసేమియాతో (అంటే, రక్తంలో చక్కెర స్థాయిలు అత్యల్ప స్థాయికి పడిపోయే స్థితి) ఆమె బాధపడుతున్నట్లు డాక్టర్ ధ్రువీకరించినట్లు స్థానిక కథనాలు పేర్కొన్నాయి.
ఆ కథనాల ప్రకారం.. ఆమెకు శ్వాసకోశ వైఫల్యం, లేదా గుండెపోటు అవకాశాలను డాక్టర్ తోసిపుచ్చారు.
తన సోదరి రెండేళ్లుగా మంచంపైనే ఉందని, ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో పాటు శనివారం రోజు శ్వాస తీసుకోవడం కూడా ఆగిపోయినట్లు కనిపించిందని ఆమె సోదరుడు చెప్పినట్లు మఠం నిర్వాహకులు తెలిపారు.
అంత్యక్రియలు జరిపించడం కోసం ఫిట్సానులోక్ ప్రావిన్స్‌కు చెందిన ఆ కుటుంబం దాదాపు 500 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














