ఆధార్-పాన్ లింక్ కోసం 2 సులువైన మార్గాలు.. డిసెంబర్ 31లోపు లింక్ చేయకపోతే ఏం జరుగుతుంది?

ఆధార్ , పాన్ అనుసంధానం

ఫొటో సోర్స్, Getty Images

ఆదాయ పన్ను పత్రాలు దాఖలు చేయాలన్నా, బ్యాంకు ఖాతా తెరవాలన్నా, మరేదైనా ఆర్థిక లావాదేవీలను నిర్వహించాలన్నా పర్మినెంట్ అకౌంట్ నంబర్-పాన్ తప్పనిసరి అయ్యింది.

కానీ, మీ ఆధార్ నంబర్‌ను పాన్‌తో అనుసంధానం (లింక్) చేసుకోవడంలో నిర్లక్ష్యం చేస్తే, 2026 జనవరి 1 నుంచి పాన్ అకౌంట్ డీయాక్టివేట్ అయిపోతుంది.

పాన్ కార్డు ఉన్నవారంతా తమ ఆధార్, పాన్ నంబర్‌లను అనుసంధానం చేసుకోవడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) 2025, డిసెంబర్ 31వ తేదీ వరకూ గడువు ఇచ్చింది.

అప్పట్లోగా ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే, వారి పాన్ ఖాతా నిలిచిపోతుంది.

ఆ తర్వాత, అన్ని ఆర్థిక లావాదేవీల నిర్వహణలో ఇబ్బందులు తలెత్తవచ్చు.

పాన్-ఆధార్ లింక్‌కు సంబంధించి 2025 ఏప్రిల్ ప్రారంభంలోనే నోటిఫికేషన్ జారీచేసినప్పటికీ, 2025, డిసెంబర్ 31వ తేదీ వరకూ గడువు ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు.

సీబీడీటీ ఇచ్చిన గడువులోపు మీరు మీ పాన్-ఆధార్‌ను లింక్ చేయకపోతే, మీ పాన్ నంబర్‌ను తిరిగి యాక్టివేట్ చేసుకోవడానికి రూ.1,000 వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

అంతేకాదు, దాని రీయాక్టివేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత, పాన్ మళ్లీ పనిచేయడానికి ఒక వారం నుంచి ఒక నెల రోజుల వరకు సమయం పట్టవచ్చు.

మరి పాన్ నంబరు యాక్టివ్‌గా ఉండటానికి మీరు ఏం చేయాలో తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
పాన్ కార్డులు

ఫొటో సోర్స్, Getty Images

పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏమవుతుంది?

ప్రస్తుత రోజుల్లో పాన్ లేకుండా ఆర్థిక వ్యవహారాలు నిర్వహించడం అసాధ్యం, ఎందుకంటే చాలాచోట్ల పాన్ నంబర్, ఆధార్ కార్డు రెండూ అవసరం.

ఉదాహరణకు,

  • మీ పాన్ నంబర్ డియాక్టివేట్ అయిపోతే, మీరు బ్యాంక్ ఖాతాను తెరవలేరు. డీమ్యాట్ ఖాతాను కూడా తెరవలేరు. అంటే మీరు స్టాక్ మార్కెట్ లేదా ఈటీఎఫ్‌లలో వ్యాపారం చేయలేరు. రూ.50,000 కంటే ఎక్కువ ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు చేయాలన్నా కూడా పాన్ అవసరం.
  • కొన్ని ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను పొందడానికి పాన్ నంబర్‌తో పని ఉంటుంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు ఇది లేకుండా దరఖాస్తు చేసుకోలేరు.
  • పాన్ లేకుండా మీరు బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థల నుంచి రుణం కూడా పొందలేరు.
  • వాహనం లేదా ఇల్లు కొనాలన్నా పాన్ కార్డ్ తప్పనిసరి.
  • దీన్ని డియాక్టివేట్ చేస్తే సమస్య పెరుగుతుంది.
  • 50 వేల రూపాయల కంటే ఎక్కువ విదేశీ కరెన్సీ లావాదేవీలు చేయాలన్నా చెల్లుబాటు అయ్యే పాన్ నంబర్ ఉండటం అవసరం.
  • పాన్ స్తంభింపజేస్తే, ట్యాక్స్ రిఫండ్స్ చేసుకోలేం. పెండింగ్‌లో ఉన్న పన్ను వాపసులపైనా వడ్డీ రాదు.
  • అలాగే, మీ టీడీఎస్, టీసీఎస్ అధిక రేటుతో మినహాయిస్తారు.
మీరు ఆన్‌లైన్‌లో పాన్, ఆధార్‌ సులభంగా లింక్ చేయవచ్చు.

ఫొటో సోర్స్, incometax.gov.in

ఫొటో క్యాప్షన్, మీరు ఆన్‌లైన్‌లో పాన్, ఆధార్‌ సులభంగా లింక్ చేయవచ్చు.

పాన్ నంబర్‌ను ఆధార్‌తో ఎలా లింక్ చేయాలి?

పాన్, ఆధార్ నంబర్లను లింక్ చేయడం చాలా సులభం.

  • ముందుగా, ఆదాయపు పన్ను శాఖ ఇ-ఫైలింగ్ వెబ్‌సైట్ www.incometax.gov.in/iec/foportal/ ఓపెన్ చేయండి.
  • అక్కడ, ఎడమ వైపున, మీకు 'లింక్ ఆధార్' కోడ్ కనిపిస్తుంది.
  • దానిపై క్లిక్ చేసి మీ పాన్ నంబర్, ఆధార్ నంబర్‌లను నమోదు చేయండి.
  • తరువాత 'వెరిఫై' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
  • ఒకవేళ అప్పటికే మీ పాన్-ఆధార్ లింక్ చేసి ఉంటే, మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది.
  • లింక్ కాకపోతే, మీ మొబైల్ నంబర్ అడుగుతారు.
  • ఆ తర్వాత, ఆ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది.
  • ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత, మీ పాన్, ఆధార్ కార్డు లింక్ అవుతాయి.
సెల్‌ఫోన్ సద్వినియోగం

ఫొటో సోర్స్, Getty Images

ఎస్‌ఎంఎస్ ద్వారా కూడా లింక్ చేయవచ్చు...

మీరు మీ మొబైల్ ఫోన్‌ నుంచి ఎస్ఎంఎస్ పంపడం ద్వారా మీ పాన్ నంబర్‌ను ఆధార్‌తో లింక్ చేయవచ్చు.

  • మీరు టెక్స్ట్ మెసేజ్ ద్వారా కూడా పాన్, ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చు.
  • దీన్ని చేయడానికి, మీ మొబైల్ ఫోన్‌లో దిగువ విధంగా టైప్ చేయండి.
  • UIDPAN <స్పేస్>12 అంకెల ఆధార్ నంబర్> <స్పేస్>10 అంకెల పాన్ నంబర్>
  • తరువాత 567678 లేదా 56161కు టెక్స్ట్ చేయండి.

ఉదాహరణకు: UIDPAN 111122223333 AAAPA9999Q

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)