‘ఒకే దేశం, ఒకే కార్డు’: ‘పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, ఆధార్, బ్యాంక్ అకౌంట్.. అన్నిటికీ ఒకే కార్డు’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, Facebook/Election Commission of India
డిజిటల్ రూపంలో జనాభా లెక్కల సేకరణ వల్ల పౌరుల ఆధార్, పాస్‌పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, బ్యాంకు ఖాతాలు వంటి వాటిని ఒకే కార్డులో నిక్షిప్తం చేయటడానికి వీలు కలుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పినట్లు ‘ఈనాడు’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. ‘బహుళ ప్రయోజన గుర్తింపు కార్డు’ను జారీ చేసే ఆలోచనను అమిత్ షా తెరపైకి తెచ్చారు. 2021 జనాభా లెక్కలలో తొలిసారిగా మొబైల్ యాప్‌ను ఉపయోగించబోతున్నట్లు ఆయన తెలిపారు. దీనిద్వారా ప్రజలు సొంతంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చునని పేర్కొన్నారు.
దిల్లీలో రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అండ్ సెన్సస్ కమిషనర్ కార్యాలయం కొత్త భవనానికి శంకుస్థాపన చేశారు.
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత చేపట్టబోతున్న 8వ జనాభా లెక్కల సేకరణ 2021 మార్చి 1 అర్థరాత్రి 12 గంటలకు ముగుస్తుందని అమిత్ షా తెలిపారు. జనగణన, జాతీయ జనాభా పట్టిక (ఎన్‌పీఆర్) తయారీకి ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు ఖర్చు చేయబోతోందని చెప్పారు.
‘‘ఆధార్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, బ్యాంకు ఖాతాలు వంటి సేవలను ఒక్క కార్డులోనే ఎందుకు పెట్టలేం? వాటి డేటాను ఒకే కార్డులో పొందుపరిచే వ్యవస్థ ఉండాలి. ఇది సాధ్యమే. ఇప్పటివరకూ అలాంటి ఆలోచనేదీ ప్రభుత్వ మదిలో లేకపోయినా అటువంటిది సాధ్యమే అని చెబుతున్నా’’ అని షా వ్యాఖ్యానించారు.

ఫొటో సోర్స్, @AndhraPradeshCM
సీఎం హెలికాప్టర్ ల్యాండింగ్ కో ఆర్డినేట్స్ సమాచారం తప్పు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌హోహన్‌రెడ్డి ప్రయాణించిన హెలికాప్టర్ దిగటానికి అవసరమైన కో-ఆర్డినేట్స్ సమాచారాన్ని అధికారులు తప్పుగా ఇచ్చారని.. దీనిపై సీఎంవో నివేదిక కోరిందని ‘సాక్షి’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. కర్నూలు జిల్లా నంద్యాల డివిజన్‌లో వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శనివారం ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి.. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ముందుగా నంద్యాలకు హెలికాప్టర్‌లో వచ్చారు.
స్థానికంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ ల్యాండ్ కావాల్సి ఉండగా కో ఆర్డినేట్స్ (అక్షాంశాలు, రేఖాంశాలు) సమాచారం తప్పుగా ఉండటంతో దాదాపు 10 నిమిషాల పాటు హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొట్టింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న ముఖ్యమంత్రి కార్యాలయం కర్నూలు జిల్లా కలెక్టర్ నుంచి నివేదిక కోరింది.
దీంతో కలెక్టర్ జి.వీరపాండియన్ డీఆర్వో వెంకటేశంను విచారణాధికారిగా నియమించినట్లు తెలుస్తోంది. కోఆర్డినేట్స్ నివేదికను ల్యాండ్స్ అండ్ సర్వే విభాగం డిగ్రీలు, నిమిషాలు, సెకన్లలో ఇవ్వాలి. అది కూడా సీఎంవో అడిగిన రెండు ఫార్మాట్లలో పంపాలి.
సర్వే డిపార్టుమెంట్‌కు చెందిన ఏడీ హరికృష్ణ ఈ పనిని నంద్యాల డివిజన్ డీఐ వేణుకు అప్పగించినట్లు తెలుస్తోంది. ఆయన కేవలం ఒకే ఫార్మాట్‌లో అది కూడా 15, 4, 326 అని నివేదించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో ల్యాండ్స్ అండ్ సర్వే శాఖ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేటతెల్లమవుతోంది.

ఫొటో సోర్స్, Alamy
ఆపిల్‌ను మించిన ఉల్లి ధరలు.. పలు రాష్ట్రాల్లో కిలో ధర రూ.60పైనే
ఉల్లి ధరలు మరోసారి ఘాటెక్కుతున్నాయని.. డిమాండ్ మేరకు సరఫరా లేకపోవడంతో ఆపిల్ ధరలను మించుతున్నాయని ‘నమస్తే తెలంగాణ’ ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. దేశంలోని పలు రాష్ట్రాల ఉల్లి మార్కెట్లలో రిటైల్‌గా కేజీ రూ. 60కిపైగా ధరతో అమ్ముతున్నారు. ఈ సీజన్‌లో లభించే ఆపిల్ ధరలు ఇంచుమించు ఉల్లి ధరలతో సమానంగా ఉంటున్నాయి.
పంజాబ్‌లో ఆపిల్ ధర కేజీ రూ. 60 ఉండగా ఉల్లి ధరలు రూ. 60-70 మధ్య ఉంటున్నాయి. అలాగే ఆపిల్ మార్కెట్‌కు కేంద్రమైన హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో ఆపిల్ ధర కేజీ రూ. 30 నుంచి ఉండగా, ఉల్లి ధర రూ. 60గా ఉంది.
ఆ రాష్ట్రంలోని ధర్మశాలలో మేలిమి రకం ఆపిల్ పండ్లు కేజీ రూ. 90 ధర పలుకుతుండగా దీనికి దీటుగా ఉల్లి ధరలు రూ. 60కుపైగా ఉంటున్నాయి. మధ్యప్రదేశ్‌తోపాటు దక్షిణాది రాష్ర్టాల్లో భారీ వర్షాల కారణంగా ఉల్లి సరఫరాకు ఆటంకం ఏర్పడినట్లు తెలుస్తున్నది. కొత్తగా వేసిన ఉల్లి పంటలు వర్షాలకు దెబ్బతిన్నాయి.
ఇక మంచి రకం ఉల్లిని పండించే నాసిక్‌లో వర్షాల కారణంగా పంటలు వేయడం ఆలస్యమైంది. దీంతో దిగుబడికి కొంత సమయం పట్టవచ్చని తెలుస్తున్నది. మరోవైపు దేశంలో నెలకొన్న ఉల్లి కొరతను అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నది.
ఆఫ్ఘనిస్థాన్, ఈజిప్టు నుంచి దిగుమతికి చర్యలు చేపట్టింది. ఆఫ్ఘనిస్థాన్‌కు చెందిన ఉల్లిపాయలు పాకిస్థాన్ మీదుగా త్వరలో పంజాబ్‌లోని అమృతసర్ ఉల్లి మార్కెట్‌కు రానున్నాయి. అలాగే అక్టోబర్ 15 నాటికి ఈజిప్ట్ నుంచి ఉల్లి దిగుబడులు భారత్‌కు చేరనున్నాయి. దీంతో అక్టోబర్ నెలాఖరుకు ఉల్లి కొరత సమస్య చాలా వరకు తీరుతుందని అధికారులు భావిస్తున్నారు.

ఫొటో సోర్స్, PRESS ASSOCIATION
మొబైల్ ఇంటర్నెట్ వేగం: శ్రీలంక, పాక్ తర్వాతి స్థానంలో భారత్!
ఇంటర్నెట్ వినియోగంలో దూసుకుపోతున్నట్లు భావిస్తున్న భారతదేశం.. మొబైల్ ఇంటర్నెట్ వేగంలో అట్టడుగున ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోందని ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఆగస్టు నెలకు గాను మొబైల్ ఇంటర్నెట్ వేగంపై మొత్తం 145 దేశాల్లో జరిగిన అధ్యయనంలో భారతదేశం 131 స్థానంలో ఉందని ఊక్లాకు చెందిన 'స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్' వెల్లడించింది.
ఈ జాబితాలో దక్షిణ కొరియా సగటున 111 ఎంబీపీఎస్ వేగంతో అగ్రస్థానంలో ఉంది. అంతేకాదు, రెండో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో పోలిస్తే ఇది దాదాపు రెండింతలు కావడం విశేషం. 66.45 ఎంబీపీఎస్ వేగంతో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉండగా, ఖతర్, నార్వే, యూఏఈలు వరుసగా 65.62 ఎంబీపీఎస్, 65.35 ఎంబీపీఎస్, 64.11 ఎంబీపీఎస్ వేగంతో మూడు, నాలుగు, ఐదు స్థానాలను దక్కించుకున్నాయి.
ఈ జాబితాలో అమెరికా టాప్-10లో చోటు దక్కించుకోలేకపోవడం గమనార్హం. సగటున 36.23 ఎంబీపీఎస్ వేగంతో 35వ స్థానంలో నిలిచింది. భారత్ పేరు తొలి వంద స్థానాల్లోనూ కనిపించలేదు. సగటున 10.65 ఎంబీపీఎస్ వేగంతో 131 స్థానంలో నిలిచింది.
అయితే, సగటు డౌన్‌లోడు స్పీడు మాత్రం 9.15 ఎంబీపీఎస్ నుంచి 10.65 ఎంబీపీఎస్‌కు పెరగడం కొంత ఊరటనిచ్చే అంశం. అప్‌లోడ్ వేగం కూడా 3.48 ఎంబీపీఎస్ నుంచి 4.23 ఎంబీపీఎస్‌కు పెరిగింది. అన్నింటికంటే తక్కువగా సగటున 4.7 ఎంబీపీఎస్ వేగంతో తూర్పు తైమూర్ అట్టడుగున నిలిచింది.
భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక, పాకిస్థాన్, నేపాల్‌లు ఇంటర్నెట్ వేగంలో మనకంటే మెరుగ్గా ఉండడం గమనార్హం. శ్రీలంక 22.04 ఎంబీపీఎస్ వేగంతో 83వ స్థానంలోను, పాకిస్థాన్ 13.08 ఎంబీపీఎస్ వేగంతో 118 స్థానంలోనూ, నేపాల్ 10.78 ఎంబీపీఎస్ వేగంతో 130 స్థానంలోనూ నిలిచాయి.
ఊక్లా గతేడాది డిసెంబరులోనూ ఇటువంటి గణాంకాలే విడుదల చేసింది. అప్పట్లో మొత్తం 123 దేశాల్లో భారత్ 111వ స్థానంలో నిలిచింది. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వేగంలో 126 దేశాల్లో 65వ స్థానం దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








