ఆధార్‌ కార్డులో మార్పులు, ఇక కార్డుపై ఆధార్ నెంబర్ ఉండదా?

ఆధార్ కార్డు, యూఐడీఏఐ, ఆధార్ యాప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆధార్ కార్డులో నెంబర్, అడ్రస్, పుట్టిన తేదీని తొలగించాలని యూఐడీఏఐ భావిస్తోంది.

ఇప్పుడు అనేక ప్రయోజనాలు ఆధార్ కార్డుతోనే ముడిపడి ఉన్నాయి. గుర్తింపు కార్డుగా, చిరునామాకు రుజువుగా ఇలా అనేక విధాలుగా ఈ కార్డు ఉపయోగపడుతోంది.

బ్యాంకులోన్, పాస్‌పోర్ట్, పాన్‌కార్డ్ ఇలా ఏది కావాలన్నా ఆధార్ కార్డ్ తప్పనిసరి. స్కూలు పిల్లలు కూడా ఆధార్ కార్డులు తీసుకున్నారు.

విస్తృతంగా ఉపయోగించడం వల్ల ఆధార్ కార్డు దుర్వినియోగంపైనా ఫిర్యాదులు వస్తున్నాయి.

ఎందుకంటే ఇందులో ఒక వ్యక్తి గుర్తింపు, పుట్టిన తేదీ, చిరునామా మొదలైన వాటి గురించి సమాచారం ఉంటుంది.

ఆధార్ కార్డును దుర్వినియోగం చేయకుండా ఉండేలా కొత్త గుర్తింపు కార్డు ప్రవేశ పెట్టాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆలోచిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కొత్తగా ఇచ్చే గుర్తింపు కార్డులో అతిపెద్ద మార్పు ఏమిటంటే కార్డు హోల్డర్ పేరు మీద సదరు వ్యక్తి చిరునామా లేదా పుట్టిన తేదీ అందులో కనిపించదు.

కొత్త ఆధార్ కార్డులో ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉంటాయి. కార్డు మీద ప్రస్తుతం ఉన్న 12 అంకెల ఆధార్ నెంబర్ కొత్తగా వచ్చే కార్డు మీద ఉండదని ఆధార్ అధికారులు చెబుతున్నారు.

ఆధార్ కార్డు, యూఐడీఏఐ, ఆధార్ యాప్

ఫొటో సోర్స్, BBC, GETTY IMAGES

ఆధార్ కార్డులో ఏం మారుతాయి?

డిసెంబర్ నుంచి కొత్త నిబంధనలను అమలు చేయాలని భావిస్తున్నట్లు యూఐడీఏఐ సీఈఓ భువనేష్ కుమార్ ఇటీవలి ఆన్‌లైన్ సమావేశంలో తెలిపారు.

ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ తగ్గించడమే దీని లక్ష్యం. ముఖ్యంగా హోటళ్లు, ఈవెంట్ నిర్వహకులు ఆధార్‌లో వివరాలను ఆఫ్‌లైన్ ద్వారా ధృవీకరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొత్త కార్డుల ద్వారా దీనిని తగ్గించాలని యూఐడీఏఐ భావిస్తోంది.

ఆన్‌లైన్ ద్వారా ఆధార్‌ ధృవీకరణ జరిగినప్పుడే వ్యక్తుల గోప్యతకు భద్రత ఉంటుంది.

"ఆధార్ కార్డులో ఎలాంటి సమాచారం ఉండాలో మేం పరిశీలిస్తున్నాము. అందులో ఫోటో, క్యూఆర్ కోడ్ మాత్రమే ఉండాలి" అని భువనేష్ కుమార్ అన్నారు.

"మనం ఫోటో, క్యూఆర్‌తో పాటు ఇతర సమాచారం కూడా ముద్రించడం కొనసాగిస్తే, ధృవీకరణ కోసం కార్డుల్ని తీసుకునే వారు ఆ సమాచారాన్ని దుర్వినియోగం చేస్తూనే ఉంటారు" అని ఆయన చెప్పారు.

ఆధార్ కార్డు, యూఐడీఏఐ, ఆధార్ యాప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆధార్ కార్డు దుర్వినియోగాన్ని అరికట్టేలా మార్పులు చేయనున్నారు.

ఆధార్ ప్రామాణికతకు కొత్త యాప్

ఆధార్ కార్డులో వివరాలను ఆఫ్‌లైన్ ద్వారా ధృవీకరించుకునేందుకు ఆధార్ నంబర్ లేదా బయోమెట్రిక్ సమాచారాన్ని నిల్వ చేయడం, ఉపయోగించడం లేదా సేకరించడాన్ని నిషేధించేందుకు ఆధార్ చట్టంలో నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా కొత్త మార్పులు ఉంటాయి.

మీరు చాలా చోట్ల ఇప్పటికే మీ ఆధార్ కార్డుల ఫోటో కాపీలను ఇచ్చి ఉండవచ్చు. ఉదాహరణకు హోటల్‌లో చెక్ ఇన్ సమయంలో హోటల్ సిబ్బంది మీ ఆధార్ కార్డు తీసుకుని దాని ఫోటో కాపీని సేవ్ చేసుకుంటారు. దీని ద్వారా హోటల్ వద్ద మీ వ్యక్తిగత సమాచారం ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఇది దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.

ఆధార్ కార్డుల్లో కొత్తగా చేసే మార్పుల వల్ల హోటళ్లతో పాటు ప్రైవేటు వ్యక్తులకు ఫోటో కాపీని ఇవ్వాల్సిన అవసరం లేకుండా కొత్త నియమం వచ్చే అవకాశం ఉంది.

ఈ ప్రతిపాదనపై డిసెంబర్ 1న సమీక్షిస్తారు.

ఆధార్‌ను ఎప్పుడూ ఒక పత్రంగా ఉపయోగించకూడదని, అవి నకిలీవి అయ్యే అవకాశం ఉందని యూఐడీఏఐ సీఈఓ భువనేశ్వర్ కుమార్ చెప్పారు.

ఆధార్ కార్డు నిజమైనదా కాదా అనేది ఆధార్ నంబర్ లేదా క్యూఆర్ కోడ్ ద్వారా మాత్రమే తేల్చుకోవాలి.

యూఐడీఏఐ కొత్త ఆధార్ యాప్‌ను కూడా ప్రారంభించింది. వ్యక్తులు తమ చిరునామా రుజువును సమర్పించడానికి లేదా మార్చుకోవడానికి, మొబైల్ ఫోన్లు లేని కుటుంబ సభ్యులను జోడించడానికి, ఫేస్ రికగ్నిషన్ ఉపయోగించి వారికి మొబైల్ నంబర్‌లను జోడించడానికి ఉపయోగపడుతుంది.

రానున్న రోజుల్లో ఆధార్ యాప్ ద్వారా సినిమా థియేటర్లలోకి, ఏదైనా కార్యక్రమాలకు హాజరయ్యేందుకు, హోటళ్లలో చెక్-ఇన్ చేయడానికి, విద్యార్థుల ధృవీకరణకు, ఇళ్లు అద్దెకు తీసుకున్నప్పుడు ఇంటి యజమానికి చూపించడానికి కూడా ఉపయోగించవచ్చు.

ఆధార్ కార్డు, యూఐడీఏఐ, ఆధార్ యాప్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, యూఐఏడీఐ కొత్త ఆధార్ యాప్ తీసుకురానుంది.

ఆధార్ రుజువు దేనికి?

ఆధార్ కార్డును దేని కోసం ఉపయోగించాలనే దానిపై ఇప్పటికీ గందరగోళం ఉంది.

నిజానికి ఆధార్‌ ఒక గుర్తింపు కార్డు మాత్రమే. ఇది పౌరసత్వానికి ఆధారం కాదు. పుట్టిన తేదీని నిర్ధరించడానికి కూడా పని చేయదు.

ఆధార్ నంబర్ ఆధారంగా మాత్రమే ఒకరి పేరును ఓటరు జాబితాలో చేర్చలేమని ఇటీవల ఎన్నికల సంఘం సుప్రీంకోర్టుకు తెలిపింది.

ఆధార్ చిరునామాకు రుజువు కాదని, పాస్‌పోర్ట్‌లు, విద్యుత్ బిల్లులు, బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు, అద్దె ఒప్పందాలు మొదలైన వాటిని చిరునామాకు రుజువుగా పరిగణిస్తామని కమిషన్ వాదించింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)