స్మృతి మంధాన: పెళ్లి రద్దు గురించి ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో ఈ క్రికెటర్ ఏం చెప్పారు?

స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్

ఫొటో సోర్స్, Getty Images

పలాష్ ముచ్చల్‌తో తన వివాహం రద్దు చేసుకున్నట్టు భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన తెలిపారు.

ఇటు పలాష్ ముచ్చల్ కూడా వ్యక్తి గత జీవితంలో ముందుకు సాగిపోవాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు.

స్మృతి, పలాష్‌ల పెళ్లి నవంబర్ 23న జరగాల్సి ఉంది, కానీ అదే రోజున వాయిదా పడింది.

పెళ్లి రోజున స్మృతి మంధాన తండ్రి అనారోగ్యం పాలుకావడంతో వివాహం వాయిదా వేసినట్లు అప్పట్లో ఆమె మేనేజర్ ప్రకటించారు.

అప్పటి నుంచి వారి వివాహం గురించి రకరకాల ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. చివరికి వివాహం రద్దు గురించి ఆదివారం నాడు ఇద్దరూ ప్రకటనలు చేశారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
వివాహం రద్దు, భారత్ మహిాళా క్రికెటర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రెండు కుటుంబాల గోప్యతను గౌరవించాలని స్మృతి మంధాన కోరారు.

స్మృతి మంధాన ఏం చెప్పారు?

పలాష్ ముచ్చల్‌తో వివాహం వాయిదాపడిన తర్వాత తొలిసారి స్మృతి మంధాన ప్రకటన విడుదల చేశారు. తమ వివాహం జరగబోవడం లేదని మంధాన తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాశారు.

"గత కొన్ని వారాలుగా, నా వ్యక్తిగత జీవితం గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు దాని గురించి స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం అని నేను భావించా"

"నేను ప్రైవేట్‌గా ఉంటాను. అలాగే ఉండాలని అనుకుంటున్నా. కానీ మా వివాహం జరగబోవడం లేదని స్పష్టం చేయాలనుకుంటున్నా"

"ఈ విషయం ఇక్కడితో ముగిసిపోవాలని నేను కోరుకుంటున్నాను. ఇకపై దీనిగురించి చర్చించవద్దని అందర్నీ అభ్యర్థిస్తున్నాను. దయచేసి ఈ సమయంలో రెండు కుటుంబాల గోప్యతను గౌరవించండి. పరిస్థితిని మాకు మేముగా అర్థం చేసుకుని ముందుకు సాగడానికి కొంత సమయం ఇవ్వండి" అని స్మృతి మంధాన అన్నారు.

"మనందరం ఒక పెద్ద లక్ష్యంతో ముందుకు సాగాలని నేను నమ్ముతా. నాకు మాత్రం అది నా దేశాన్ని ప్రాతినిధ్యం వహించడమే"

"నేను భారతదేశం తరపున ఆడాలని, గెలవాలని, వీలైనంత ఎక్కువ కాలం జట్టుకు నా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. దానిపైనే ఎప్పుడూ నా దృష్టి ఉంటుంది" అని ఆమె చెప్పారు.

ఇన్‌స్టాగ్రామ్‌

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పలాష్ ముచ్చల్ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రకటన విడుదల చేశారు.

పలాష్ ముచ్చల్

వృత్తిరీత్యా సంగీతకారుడైన పలాష్ ముచ్చల్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశారు.

"నా వ్యక్తిగత సంబంధాల నుంచి వెనక్కి తగ్గి, జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా" అని ఆయన రాశారు.

"ఆధారం లేని ఊహాగానాలకు, ముఖ్యంగా నాకు చాలా పవిత్రమైన దాని గురించి కొందరు అంత తేలికగా స్పందించడం నాకు చాలా కష్టంగా ఉంది"

"ఇది నా జీవితంలో అత్యంత కష్టకాలం, నా నమ్మకాలపై దృఢంగా నిలబడి నేను దీనిని గౌరవంగా ఎదుర్కొంటాను. కేవలం గాసిప్స్ ఆధారంగా ఎవరినీ జడ్జ్ చేయవద్దని నేను కోరుకుంటున్నాను"

"మన మాటలు ఇతరులను ఎంత బాధ పెట్టగలవో కొందరికి ఎప్పటికీ అర్థం కాదు. అందుకే, ప్రపంచంలోని చాలామంది ప్రజలు తీవ్ర ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు’’ అని ఆయన రాశారు.

తన గురించి తప్పుగా, ప్రతిష్ఠకు భంగం కలిగించే విషయాలను వ్యాప్తి చేస్తున్నవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని పలాష్ హెచ్చరించారు.

" కష్టసమయంలో నాతోపాటు ఉన్న అందరికి ధన్యవాదాలు" అని ఆయన రాశారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)