ఇండిగో సంక్షోభం ప్రభుత్వం తీరుపై ఎలాంటి ప్రశ్నలు లేవనెత్తుతోంది?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఇండిగోకు చెందిన వందలాది విమానాలు రద్దయిన నేపథ్యంలో డైరక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఆ సంస్థ సీఈఓ పీటర్ ఎల్బెర్స్‌కు నోటీసులు జారీచేసింది.
భారీ ఎత్తున విమానాలు రద్దు కావడం, పర్యవేక్షణ, మానవనరుల నిర్వహణలో ప్రణాళికాలోపానికి ఇండిగో కంపెనీనే బాధ్యత వహించాలని డీజీసీఏ చెప్పింది.
కిందటి బుధవారం ఇండిగోకు చెందిన 150 విమానాలు రద్దు కావడం, డజన్లకొద్దీ విమనాలు ఆలస్యం కావడంతో ఈ సంక్షోభం ప్రారంభమైంది. ఒక్క శుక్రవారం రోజునే వెయ్యికి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో ఇతర విమానాయాన సంస్థలు చార్జీలు విపరీతంగా పెరగడంతో కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకుని ధరలపై పరిమితిని నిర్ణయించింది.
పైలట్ల పనిగంటల (ఎఫ్‌డీటీఎల్) నిబంధనలలో మార్పులే సంక్షోభానికి కారణమని ఇండిగో పేర్కొంది. డ్యూటీ చార్టులను మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అయితే సమస్యను పరిష్కరించడానికి కొన్నిరోజుల సమయం పడుతుందని తెలిపింది.
ప్రయాణికులకు తక్షణం రీఫండ్ ఇచ్చే సౌకర్యాన్ని ప్రారంభించామని కూడా ఇండిగో తెలిపింది.
విమాన ప్రయాణ భద్రత రీత్యా 28 రోజులలో పైలట్లు 100 గంటలకు మించి పనిచేయడానికి వీల్లేదని నిబంధనలు చెబుతున్నాయని ఎకనామిక్ టైమ్స్ రాసింది. విమానానికి ఒక గంట ముందు రిపోర్టింగ్ సమయం నుండి డ్యూటీ ప్రారంభమైనట్టుగా పరిగణిస్తారు.
మరోవైపు, ఆదివారం కూడా విమానాల రద్దు, ఆలస్యం కావడం వల్ల విమానాశ్రయాలలో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
ఈ సంక్షోభానికి విమానయాన రంగంలో గుత్తాధిపత్యమే కారణమని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది.
ఇండిగో గందరగోళం ప్రభుత్వ గుత్తాధిపత్య విధానానికి మూల్యం అని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు.
ప్రస్తుతం, ఇండిగో ఒక్కటే దేశీయ విమానయాన రంగంలో 65 శాతానికి పైగా మార్కెట్ వాటాను కలిగి ఉంది. ఇంత భారీ కార్యకలాపాల వాటా కలిగిన సంస్థ సంక్షోభం పెద్దఎత్తున ప్రయాణికులపైనా పడింది.


ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏమంటున్నారు?
"విమానయాన పరిశ్రమలో 65 శాతం వాటా ఉన్న ఇండిగో గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందనేది కొంతవరకు నిజమే కానీ, ఇది ఎన్‌డీఏ ప్రభుత్వ హయాంలో మాత్రమే మొదలవ్వలేదు" అని విమానయాన నిపుణుడు హర్ష్ వర్ధన్ బీబీసీ హిందీకి చెప్పారు.
"మన దేశంలో విమానయాన మార్కెట్ గణనీయంగా పెరిగింది. మరి ఇటువంటి పరిస్థితిలో, 65 శాతం వాటా కలిగిన సంస్థ సమస్యలను ఎదుర్కొంటే, ఈ సంక్షోభం మొత్తం మార్కెట్‌ను కూడా స్తంభింపజేస్తుంది. ఏ రకమైన రవాణా అయినా, ముఖ్యంగా వాయు రవాణా, ఏ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలోనైనా ముఖ్యపాత్ర పోషిస్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థకు రక్తప్రవాహం లాంటిది" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, ANI
గుత్తాధిపత్యం ఎలా మొదలైంది?
ఈ సంక్షోభానికి ప్రభుత్వ విధానాలే కారణమని హర్షవర్ధన్ ఆరోపించారు.
"దీనికి ఎన్‌డీఏ ప్రభుత్వమే కాదు, గతంలోని యూపీఏ ప్రభుత్వం కూడా సమాన బాధ్యత వహించాలి'' అన్నారు.
"కాలక్రమేణా, ఇండిగో గుత్తాధిపత్య స్థితికి చేరుకుంది. కంపెనీ ప్రారంభించినప్పుడు, మార్కెట్లో ఇతర విమానయాన సంస్థలు ఉన్నాయి. జెట్ ఎయిర్‌వేస్, కింగ్‌ఫిషర్, గో ఎయిర్ వంటి చాలా పోటీ ఉంది. క్రమంగా ఈ విమానయాన సంస్థలు ఒక్కొక్కటిగా మూతపడటం ప్రారంభమైంది''
స్పైస్‌జెట్ కూడా ఒక విధంగా తడబడుతోంది.
"కానీ ఇదే సమయంలో ఇండిగో తన విస్తరణను కొనసాగించింది. ఇతర ఎయిర్‌లైన్స్ సంస్థలు పోటీ పోటీ పడలేని స్థిరమైన ఛార్జీల విధానాన్ని అభివృద్ధి చేసింది. పైగా నిర్వహణ వ్యయం కూడా పెరుగుతూ వచ్చింది. వ్యయ నిర్వహణలో ఇండిగో విధానాన్ని మిగతా ఎయిర్‌లైన్స్ కొనసాగించలేకపోయాయి'' అని ఆయన అన్నారు.
"ఇంధన ధరలు పెరిగినప్పుడల్లా ప్రభుత్వం ఖర్చులను పెంచుతుంది. కానీ ఇంధన ధరలు తగ్గినప్పుడు కూడా ప్రభుత్వం పన్నులు విధిస్తుంది. రూపాయి కూడా క్షీణిస్తూనే ఉంది. అటువంటి పరిస్థితిలో, ఛార్జీలను పెంచడానికి ఆపరేటర్లకు ఎక్కువ అవకాశం దొరకదు''
రూపాయి విలువ నిరంతరం తగ్గుతూ ఉండటం, ఈ భారం పెరుగుతుండటం వల్ల, విమానయాన కార్యకలాపాలలో 60 శాతం చెల్లింపులు విదేశీ కరెన్సీలో జరుగుతుండటం కూడా ఖర్చులు పెరగడానికి ఒక కారణమని నిపుణులు భావిస్తున్నారు.
ఈ పరిస్థితులలో, ఇతర విమానయాన సంస్థలు మనుగడ సాగించలేకపోయాయి. దీంతో ఇండిగో గుత్తాధిపత్యం సాధించింది.
అయితే, మార్కెట్ ఆధారిత ఛార్జీల విధానంలో ఇండిగో కూడా బాగానే పనిచేసింది, ఇండిగో ఛార్జీలను ఎక్కువగా పెంచలేదు. అలా చేస్తే విమాన ప్రయాణానికి డిమాండ్ తగ్గిపోతుందనే భయాలు ఉండేవి.
"విమానయాన రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రభుత్వం విఫలమైంది. గతంలో, యూపీఏ ప్రభుత్వ సమయంలో, ఒక సంస్థ మూతపడితే మరొకటి వచ్చేది. 2013లో ఇండిగో మార్కెట్ వాటా దాదాపు 32 శాతంగా ఉంది, అది ఇప్పుడు 65 శాతానికి చేరింది.

ఫొటో సోర్స్, Getty Images
విమానయాన రంగంలో గుత్తాధిపత్యానికి సంబంధించి భారతదేశంలో స్పష్టమైన నియమాలు లేవు.
" గుత్తాధిపత్యానికి సంబంధించి ఒక కంపెనీ ఒక నిర్దిష్ట పరిమితి వరకు మాత్రమే వెళ్ళగలిగేలా ప్రభుత్వం కఠినమైన నియమాలను రూపొందించాలి. గతంలో, గుత్తాధిపత్యాన్ని నిరోధించడానికి చర్యలు తీసుకునేవారు. కానీ ఇప్పుడు వారికి స్వేచ్ఛ లభించింది. సంబంధిత కమిషన్ అధికారిక చర్య తీసుకుంటుంది కానీ ఎటువంటి అన్యాయమైన ప్రయోజనాలను ఆపదు'' అని హర్షవర్థన్ అన్నారు.
ప్రభుత్వ విధానమే గుత్తాధిపత్యానికి అనుకూలంగా మారిందని, షిప్పింగ్ రంగం, విమానాశ్రయాలు వంటి అనేక ఇతర రంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత గుత్తాధిపత్యం ఏర్పడుతున్నట్టు కనిపిస్తోందని ఆయన అన్నారు.
"ఇది ఆయా రంగాలను గుత్తాధిపత్యం గుప్పట్లోకి చేరేలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని సూచిస్తోంది . దీనిపై ప్రభుత్వం ఎటువంటి పరిమితులు విధించడం లేదు. ఒక కంపెనీకి రూ. 200 కోట్ల వరకు పెట్టుబడి పెట్టడానికి అనుమతి ఉందని అనుకుందాం, కానీ అంతకు మించి పెట్టుబడులకు ప్రత్యేక అనుమతి పొందవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, గుత్తాధిపత్యాన్ని నివారించవచ్చు’’ అన్నారు.
ఒకే ఆపరేటర్‌కు ఇంత స్వేచ్ఛ ఎలా ఇచ్చారు, నేడు అది గుత్తాధిపత్యంగా ఎలా మారిందని ఆయన ప్రశ్నించారు.ప్రస్తుతం, ఆపరేటర్లు తమకు కావలసినంత పెట్టుబడి పెట్టవచ్చు లేదా విస్తరించవచ్చు అనే పరిస్థితి ఉంది.
ఇక్కడ టిక్కెట్ ధరలు మార్కెట్ పోటీపై ఆధారపడి ఉండటం వల్ల గుత్తాధిపత్య ప్రభావం పూర్తిగా కనిపించదు. రెండవది, మార్కెట్లో 65 శాతం వాటా తక్కువ ధరల విమానసేవలదే కాబట్టి, ధరలను పెంచేందుకు పెద్దగా అవకాశం కూడా లేదు.
గుత్తాధిపత్యం వల్ల కలిగే అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే, ఆ కంపెనీ మూతపడితే, ఆ ప్రభావంతో మొత్తం విమానయాన రంగం కూలిపోతుంది.

ఫొటో సోర్స్, Getty Images
పరిష్కారాలు ఏమిటి?
భారతదేశ విమానయాన పరిశ్రమ ఏటా 10 నుండి 12 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది, ఇది సాధారణంగా ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైనదిగా అంగీకారం పొందింది. దీనికి అనుగుణంగా కొత్త పెట్టుబడులను ఆకర్షించాలి.
గుత్తాధిపత్యాన్ని నివారించడానికి రెండు మార్గాలు ఉన్నాయంటారు హర్ష్‌వర్థన్.
"ముందుగా, ప్రభుత్వం దాని వ్యయ నిర్మాణాన్ని హేతుబద్ధీకరించాలి. ప్రస్తుతం, అధిక పన్నులు ఉన్నాయి విమానాశ్రయ నిర్వాహకులు ప్రయాణికుల నుండి వివిధ రుసుములు వసూలు చేస్తున్నారు. జీఎస్‌టీ మొదలైన వాటి పేరుతో కూడా వివిధ పన్నులు ఉన్నాయి. ఈ కారణాలన్నింటీ వల్ల, ఈ రంగంలోకి కొత్త పెట్టుబడులు రావడం లేదు" అన్నారు హర్ష్‌వర్థన్. ''ప్రభుత్వం పెట్టుబడులు వచ్చే వాతావరణం సృష్టిస్తే తప్ప ఈ పరిస్థితులలో మార్పురాదని ఆయన చెప్పారు. అలాగే ఎవరూ 30 శాతం మించకుండా మార్కెట్ వాటాను పరిమితం చేయాలి'' ఆయన సూచించారు.

ఫొటో సోర్స్, Getty Images
ఈ సంక్షోభం ఎలా మొదలైంది?
నవంబర్ 1 నుండి పైలట్లకు విధి నిర్వహణా ప్రమాణాలను పూర్తిగా అమలు చేయడంతో మొదలుపెట్టడంతో ఈ సంక్షోభం మొదలైంది.
విమానయాన సంస్థలు కొత్త నిబంధనలకు అనుగుణంగా తమ సిబ్బంది విధులను అమలు చేసేందుకు ప్రభుత్వం ఏడాదిపాటు నిబంధనల అమలును వాయిదా వేసింది. ఈ నిబంధనల అమలు వల్ల విమానాలు విస్తృతంగా రద్దు అవుతాయని విమానయాన సంస్థలు హెచ్చరించాయి.
అయితే పైలట్ అసోసియేషన్లు దిల్లీ హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నిబంధనలను అమలు చేయాలంటూ కోర్టు ఆదేశించింది.
ఢిల్లీ హైకోర్టు ఏప్రిల్ 2025 ఆదేశించిన ప్రకారం దీనిని రెండు దశల్లో అమలు చేయాల్సి ఉంది. వారపు విశ్రాంతి గంటలను 36 నుండి 48 గంటలకు పెంచడం వంటి అనేక నిబంధనలు జూలై 1 నుండి అమలు అయ్యాయి. ఇక రాత్రివేళ పైలట్ల డ్యూటీలను నిషేధించే మిగిలిన నిబంధనలు నవంబర్ 1 నుండి అమల్లోకి వచ్చాయి.
"ఈ తుది నిబంధనల అమలు నుండి, విమానయాన సంస్థలు పైలట్ల కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. ఆ సంస్థలు పైలట్లను తమ సెలవులను రద్దు చేసుకోవాలని అభ్యర్థిస్తున్నాయి. కానీ సంవత్సరాల తరబడి అసంతృప్తి కారణంగా, పైలట్లు సహకరించడానికి ఇష్టపడటం లేదు’’ అని ది హిందూ రాసింది.
"డీజీసీఏ నిబంధనల ప్రకారం 13 గంటల డ్యూటీ పీరియడ్‌కు మించి పనిచేయడం, రూ. 7,000 కోట్ల లాభం ఉన్నప్పటికీ జీతాల పెంపు లేకపోవడం, కొత్త పైలట్ డ్యూటీ నిబంధనలను ఎయిర్‌లైన్ తమకు అనుకూలంగా వ్యాఖ్యానించడంపై పైలట్లు ఆగ్రహంగా ఉన్నారు’’ అని పేర్కొంది.
ప్రభుత్వం విమాన ఛార్జీలను పరిమితం చేసిన తర్వాత, ఇండిగో శనివారం కార్యకలాపాలను సాధారణ స్థితికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలిపింది.
ప్రస్తుతం విమానాల రద్దు 850 కంటే తక్కువగా ఉన్నాయని ఇండిగో చెప్పింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














