పుతిన్, మోదీ సంయుక్త ప్రకటనలోని అంశాల అమలు సాధ్యమేనా? సవాళ్లు ఉన్నాయా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, జుగల్ పురోహిత్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- నుంచి, దిల్లీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రెండ్రోజుల భారత్ పర్యటన ముగింపు సందర్భంగా, ఉభయ దేశాలు ఒక సంయుక్త ప్రకటనను విడుదల చేశాయి.
ఈ ప్రకటనలో 70 పాయింట్లు ఉన్నాయి. ఆర్థిక భాగస్వామ్యాన్ని శిఖర స్థాయికి తీసుకెళ్లాలని ఉభయ దేశాలు ఆశిస్తున్నాయనేది అందులో సారాంశం.
వాణిజ్యం, అణుశక్తి, చమురు సరఫరా, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం, నైపుణ్యం కలిగిన కార్మికులను పంపించడం, రక్షణ సహకారం తదితర అంశాలపై రెండు దేశాల మధ్య చర్చలు జరిగాయి.
ప్రధాన నిర్ణయాలను సాకారం చేయడంలో రెండు దేశాలకు ఎలాంటి సవాళ్లు ఎదురుకావచ్చు? పాశ్చాత్య దేశాలు, ముఖ్యంగా అమెరికా ఈ పర్యటనను ఎలా చూస్తున్నాయి?


ఫొటో సోర్స్, AFP via Getty Images
వాణిజ్యానికి అత్యధిక ప్రాధాన్యం
రెండు దేశాల సంయుక్త ప్రకటనలో వాణిజ్యం, ఆర్థిక భాగస్వామ్యానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
భారత్ నుంచి రష్యాకు ఎగుమతులు పెంచడం, టారిఫ్‌లు తగ్గించడం, వాణిజ్యానికున్న అడ్డంకులు తొలగించడం, క్రిటికల్ మినరల్స్‌పై సహకారం, జాతీయ కరెన్సీతోనే వాణిజ్య లావాదేవీలు తదితర అంశాలు అందులో ఉన్నాయి.
పుతిన్ పర్యటనపై భారత్ విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ''ఈ పర్యటనలో ప్రధానంగా ఆర్థికపరమైన అంశాలపై దృష్టి సారించారు. పారిశ్రామిక, పెట్టుబడి భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే మా లక్ష్యం'' అని చెప్పారు.
''ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా సప్లై చైన్స్, వాణిజ్య సంబంధాలు ఒత్తిడిలో ఉన్నాయి. పెట్టుబడులు అనిశ్చితి దశలోకి మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రెండు దేశాలు దృష్టిపెట్టడం ఒక సందేశం'' అని మిస్రీ వ్యాఖ్యానించారు.
నైపుణ్యం కలిగిన కార్మికులను పంపించే ప్రక్రియను సులభతరం చేసే ఒప్పందాలను రెండు దేశాల నాయకులు ప్రశంసించారు.
2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లు ( ప్రస్తుత విలువ ప్రకారం సుమారు 8,99,585 కోట్ల రూపాయలు) స్థాయికి తీసుకెళ్లాలనేది లక్ష్యం. ఈ సందర్భంగా చూస్తే, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రెండు దేశాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయిలో 68.7 బిలియన్ డాలర్ల (దాదాపు 6,18,015 కోట్ల రూపాయల)కు చేరుకుంది.
''2030 నాటికి 100 బిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరువకావాలని గత ఏడాది మేం నిర్దేశించుకున్నాం. కానీ ప్రస్తుత అవకాశాలను చూస్తే, ఆ లక్ష్యాన్ని సాధించడానికి మేం అంతకాలం వేచి చూడాల్సిన అవసరం లేదు'' అని ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జరిగిన ఇండియా-రష్యా బిజినెస్ ఫోరంలో అన్నారు.
రష్యాలో పనిచేయడానికి తగిన భాష, వృత్తిపరమైన నైపుణ్యాలు కలిగినవారిని (రష్యా రెడీ వర్క్‌ఫోర్స్)ను సిద్ధం చేస్తామని ఆయన చెప్పారు.
కానీ,దీనిపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
జేఎన్‌యూకు చెందిన డాక్టర్ అమితాబ్ సింగ్ బీబీసీ హిందీతో మాట్లాడుతూ, ''100 బిలియన్ డాలర్ల లక్ష్యం కష్టమే కానీ అసాధ్యమేమీ కాదు. కానీ అందుకు రెండు దేశాలు చాలా కృషి చేయాల్సి ఉంటుంది'' అని అన్నారు.
''ప్రస్తుతం వాణిజ్యంలో చమురు ప్రధాన పాత్ర పోషిస్తోంది. భారత్‌కు రష్యా నుంచి చమురు అమ్మకాన్ని కొనసాగించాలని పుతిన్ కోరుకుంటున్నారు. కానీ, ఆ చమురు కొనుగోలు విషయంలో భారత్‌కు అమెరికా ఆంక్షలు అడ్డంకులను సృష్టిస్తాయి. ఆ ఆంక్షల వల్ల తాము నష్టపోతామేమోనని బ్యాంకులు, కంపెనీలు భయపడుతున్నాయి. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకూ రష్యా నుంచి చమురును భారత్ ఎలా కొనుగోలు చేయగలుగుతుంది?'' అని సందేహం వ్యక్తం చేశారు.
గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషీయేటివ్ (జీటీఆర్ఐ) డేటా ప్రకారం, చమురు దిగుమతుల ప్రభావం వాణిజ్యం ఎంతమేర ఉందో అంచనా వేయవచ్చు.
2024 సంవత్సరంలో, రష్యా నుంచి 52.7 బిలియన్ డాలర్ల విలువైన చమురును భారత్ దిగుమతి చేసుకుంది.
చమురు ప్రాముఖ్యతను తగ్గించడానికి భారత్, రష్యా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)పై కృషి చేస్తున్నాయి. ఈ ఒప్పందంలో రష్యాతో పాటు యూరేషియా ఎకనామిక్ యూనియన్ దేశాలు కూడా ఉంటాయి. చమురు గాకుండా ఇతర వస్తువుల మార్పిడిని ఇది సులభతరం చేస్తుంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
రక్షణ, వ్యూహాత్మక సంబంధాలు...
రక్షణ ఒప్పందాలు ఏమైనా ప్రకటిస్తారనే ఊహాగానాలు వచ్చాయి. అయితే చెప్పుకోదగినవేవీ లేవు. ఉమ్మడిగా ఉత్పత్తి, సాంకేతిక బదిలీ, మిత్ర దేశాలకు ఎగుమతుల గురించి ఆ ప్రకటనలో ప్రస్తావించారు.
''ఉభయ దేశాల మధ్య రక్షణ సహకారం తాలూకా సుదీర్ఘ చరిత్ర, బలం గురించి మోదీ, పుతిన్ చర్చించారు. రక్షణ రంగంలో 'మేకిన్ ఇండియా' కార్యక్రమాల్లో రష్యా పాలుపంచుకుంటోంది'' అని మిస్రీ అన్నారు.
అయితే, మీడియాలో తరచుగా చర్చ జరుగుతున్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను అందివ్వడంలో జాప్యమవుతోంది.
రష్యా నుంచి ఒక అణు జలాంతర్గామి (న్యూక్లియర్ సబ్‌మెరైన్) ఈ సంవత్సరం అందుతుందని భారత్ ఆశించింది. కానీ అది 2028 నాటికి వస్తుందని భావిస్తున్నారు.
కొత్త ఆర్డర్లు ఇవ్వడానికి ముందు, ఇప్పటికే ఉన్న ఆర్డర్లు పూర్తయ్యేవరకూ భారత్ వేచి చూస్తుందా అనేదీ స్పష్టత లేదు. డిసెంబర్ 4న రెండు దేశాల రక్షణ మంత్రుల సమావేశంలోనూ ఈ విషయంలో ఎటువంటి స్పష్టత రాలేదు.
ఈ సంబంధం కొనుగోలు, అమ్మకాల గురించి మాత్రమే కాదని, ఇకపై ఉమ్మడి ఉత్పత్తి గురించి కూడా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.
బ్రహ్మోస్ ఏరోస్పేస్ మాజీ సీఈవో సుధీర్ కుమార్ మిశ్రా పీటీఐ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడుతూ, ''భారతదేశ డిఫెన్స్ సప్లయ్ చైన్‌లో కొనసాగాలంటే ఉమ్మడి ఉత్పత్తిని, సాంకేతిక బదిలీని ప్రోత్సహించాల్సి ఉంటుందని రష్యా ఇప్పుడు గ్రహించింది'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, AFP via Getty Images
అమెరికా అసంతృప్తి
''భారతదేశానికి రష్యా ఎందుకంత ముఖ్యమైంది? ఎందుకంటే, చైనా విస్తరణవాదాన్ని బ్యాలన్స్ చేయడానికి రష్యా సహాయపడుతుంది. భారత్‌తో స్నేహబంధానికి పుతిన్ ఎంత విలువ ఇస్తారనేది ఆయన దిల్లీ పర్యటన చాటిచెబుతుంది. అధికారం మారినప్పుడల్లా విధానం మారిపోయే అమెరికా మాదిరిగా గాకుండా రష్యా స్థిరమైన విధానాన్ని కొనసాగిస్తుంది'' అని హడ్సన్ ఇనిస్టిట్యూట్‌లోని డాక్టర్ అపర్ణా పాండే చెప్పారు.
''పుతిన్ పర్యటన గురించి అమెరికాలో ఇంకా పెద్దగా చర్చలేవీ జరగలేదు. కానీ, నిపుణులు నిశితంగా పరిశీలిస్తున్నారు. భారీ రక్షణ ఒప్పందం కానీ, చమురు కొనుగోలుకు హామీ వంటి అమెరికాను కలవరపెట్టే అంశాలేవీ భారత్-రష్యా సంయుక్త ప్రకటనలో లేవు. అమెరికా రష్యాతో మాట్లాడగలిగితే, భారతదేశం కూడా మాట్లాడగలదు'' అని ఆమె వివరించారు.
కానీ, అమెరికా వైపు నుంచి కొన్ని ప్రతిస్పందనలను బట్టి చూస్తే, పుతిన్ భారతదేశ పర్యటనపై అమెరికాలో అసంతృప్తి ఉన్నట్లు కనిపిస్తోంది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ట్రంప్ పాలక వర్గం బెదిరింపులకు గురిచేస్తోందని అమెరికా గాయని మేరీ మిల్బేన్ ఆరోపించారు.
''నేను మళ్లీ చెబుతున్నా. టారిఫ్‌ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా బెదిరింపులకు దిగడం, ఆపై భారతదేశాన్ని బలవంతంగా పక్కనబెట్టే ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచి ఆయన కొత్త ప్రపంచ ఆర్థిక చదరంగం ఆటను ఆరంభించారు'' అని ఆమె తన 'ఎక్స్' ఖాతాలో రాశారు.
''ఇప్పుడు ఒకవైపు నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షుడితో సమావేశమవుతున్నారు. మరోవైపు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ కలుస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్‌హౌస్‌లో క్రిస్మస్ పార్టీలకు హాజరవుతూ తీరికలేకుండా ఉన్నారు'' అని వ్యాఖ్యానించారు.
అమెరికా రక్షణ మంత్రిత్వ శాఖ పెంటగాన్ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ ఏఎన్ఐతో మాట్లాడుతూ, ''భారత్, రష్యాలను దగ్గర చేసినందుకు డోనల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతికి అర్హుడు'' అని అన్నారు.
''రష్యా దృక్కోణంలో ఈ పర్యటన చాలా సఫలమైంది. భారతదేశం వ్లాదిమిర్ పుతిన్‌కు ప్రపంచంలో మరెక్కడా లభించని గౌరవాన్ని ఇచ్చింది. డోనల్డ్ ట్రంప్ నోబెల్ బహుమతిని అందుకోవాలని కూడా నేను చెబుతాను, ఎందుకంటే భారతదేశం, రష్యా ఒకదానికొకటి మరింత దగ్గరయ్యాయి'' అని అన్నారు.
భారతదేశంలో కుదిరిన అనేక ఒప్పందాలు, అవగాహనల గురించి చాలా వేడుకలు జరగవచ్చు.
కానీ ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, వాటిలో ఎన్ని పూర్తిగా కార్యరూపం దాల్చుతాయి? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారతదేశాన్ని, ప్రధాని మోదీని చూసిన తీరుపై ఆగ్రహం కారణంగా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నారనేదే.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














