సౌదీ, యూఏఈ మధ్య ఉద్రిక్తతలతో పాకిస్తాన్‌కు మరిన్ని సమస్యలు తప్పవా? రెండు ముస్లిం దేశాల మధ్య పాక్ తటస్థంగా ఉండలేదా?

సౌదీ అరేబియా, యూఏఈ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, సారా హసన్
    • హోదా, బీబీసీ ఉర్దూ

యెమెన్‌లో వేర్పాటువాదు గ్రూపులకు మద్దతిచ్చే విషయంలో సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మధ్య నెలకొన్న వివాదం కాస్త సద్దుమణుగుతున్నట్లు కనిపిస్తోంది.

అయితే, ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడం తాత్కాలికమేనని, భవిష్యత్‌లో మరో అంశంపై వీటి మధ్య మళ్లీ వివాదం చెలరేగవచ్చని నిపుణులు అంటున్నారు.

యూఏఈ నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్నట్లు ఆరోపిస్తోన్న ఆయుధాలు, యుద్ధ వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఇటీవల సౌదీ అరేబియా నేతృత్వంలోని కూటమి యెమెన్‌లో వైమానిక దాడులు చేసింది.

ఆ తర్వాత, యెమెన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు.. 24 గంటల్లోగా యూఏఈ తన బలగాలను అక్కడి నుంచి ఉపసంహరించుకోవాలని సౌదీ అరేబియా డిమాండ్ చేసింది.

ఈ డిమాండ్‌‌కు యూఏఈ స్పందిస్తూ.. ఆరోపణలన్నింటినీ ఖండించింది. కానీ, తమ బలగాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది.

విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. సౌదీ అరేబియా, యూఏఈ వ్యూహాత్మక, ఆర్థిక ప్రయోజనాలు గత కొన్నేళ్లుగా కొంతవరకు భిన్నంగా మారుతూ వస్తున్నాయి.

అందుకే, మిడిల్ ఈస్ట్‌లో ఈ రెండు ముఖ్యమైన దేశాల మధ్య పెరుగుతోన్న 'అప్రకటిత పోటీ' ఇప్పుడు బహిర్గతమవుతోందంటున్నారు.

యెమెన్‌లో అంతర్యుద్ధమైనా లేదా ఆఫ్రికా దేశాల్లో నౌకాశ్రయాలు, సైనిక స్థావరాలను ఏర్పాటు చేసే విషయంలోనైనా యూఏఈ తన ఆర్థిక ప్రయోజనాలను నెరవేర్చుకోవాలని చూస్తున్నట్లు కనిపిస్తోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

సందిగ్ధంలో పాకిస్తాన్

బీబీసీ మానిటరింగ్ విశ్లేషణ ప్రకారం.. సౌదీ అరేబియా ప్రాంతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తూ, పెట్టుబడుల హబ్‌గా మారేందుకు ప్రయత్నిస్తుండగా.. ఆఫ్రికాలో, ఎర్ర సముద్రంలో పట్టు పెంచుకునేందుకు యూఏఈ తన అధికారాన్ని, వనరులను ఉపయోగిస్తోంది.

అబ్రహం ఒప్పందాల్లో యూఏఈ చేరడమే దీనికి ఉదాహరణ. ఒకానొక సమయంలో ఇజ్రాయెల్‌ను గుర్తించేందుకు ముస్లిం దేశాలన్నీ సౌదీ అరేబియా వైపు చూస్తున్నప్పుడు, యూఏఈ ఒకడుగు ముందుకేసి ఇజ్రాయెల్‌ను గుర్తించింది.

అంతర్జాతీయ వ్యవహారాల నిపుణుల ప్రకారం.. గత కొన్నేళ్లుగా గల్ఫ్ దేశాల్లో, ముస్లిం ప్రపంచంలో సౌదీ అరేబియా కీలక పాత్ర పోషించడాన్ని యూఏఈ సవాల్ చేస్తున్నట్లు అనేక సందర్భాల్లో కనిపిస్తోంది.

ముస్లిం ప్రపంచంలో కేవలం ఏకైక అణుశక్తిగా ఉన్న పాకిస్తాన్‌కు సంప్రదాయంగా సౌదీ అరేబియా, యూఏఈ రెండింటితోనూ దీర్ఘకాలిక, స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి.

లక్షల మంది పాకిస్తానీలు ఈ రెండు దేశాల్లో పనిచేస్తున్నారు. తాజాగా సౌదీ అరేబియాతో పాకిస్తాన్ వ్యూహాత్మక రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకుంది.

ఇలాంటి పరిస్థితుల్లో.. ఈ రెండు పశ్చిమాసియా దేశాల మధ్య ఉద్రిక్తతలు, విభేదాలు పెరగడం పాకిస్తాన్‌తో సహా మొత్తం ముస్లిం ప్రపంచంపైనా ప్రభావం చూపుతుంది.

ఈ రెండు దేశాల మధ్య విభేదాలను తగ్గించేందుకు పాకిస్తాన్ తన పాత్రను పోషించడానికి ప్రయత్నించనుందని అనలిస్టులు భావిస్తున్నారు. కానీ, ఉద్రిక్తతలు మరింత పెరిగితే, పాకిస్తాన్ తటస్థంగా ఉండడం సాధ్యం కాదని కూడా వారు అంటున్నారు.

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య ఉద్రిక్తతలు భవిష్యత్‌లో ఎందుకు పెరిగే అవకాశం ఉంది? పాకిస్తాన్‌పై దీని ప్రభావం ఎలా ఉంటుంది? అనే దానిపై బీబీసీ పలువురు నిపుణులతో మాట్లాడింది.

పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ (రిటైర్డ్) రహీల్ షరీఫ్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, పరస్పర ప్రయోజనాల విషయంలో యూఏఈ, సౌదీ దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

పాకిస్తాన్ తటస్థంగా ఉండగలదా?

యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఒక ప్రైవేట్ పర్యటనలో భాగంగా పాకిస్తాన్‌లోని రహీమ్యార్ ఖాన్‌‌లో ఉన్నప్పుడు సౌదీ అరేబియా, యూఏఈ మధ్య ఉద్రిక్తతలు వెలుగులోకి వచ్చాయి.

ఉద్రిక్తతలు తలెత్తిన వెంటనే పాకిస్తాన్ ఇరుదేశాలనూ సంప్రదించింది.

పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ మంగళవారం రహీమ్యార్ ఖాన్‌లో షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్‌ అల్ నహ్యాన్‌తో సమావేశమయ్యారు.

ద్వైపాక్షిక అంశాలతో పాటు పలు రంగాల్లో సహకారం గురించి ఈ సమావేశంలో చర్చించినట్లు ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.

మరోవైపు పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ మంగళవారం సాయంత్రం సౌదీ విదేశాంగ మంత్రి ఫైసల్ బిన్‌ ఫర్హాన్‌‌తో సంప్రదింపులు జరిపారు.

ఈ రెండు సమావేశాల అనంతరం విడుదల చేసిన ప్రభుత్వ ప్రకటనల్లో యెమెన్‌ ప్రస్తావన లేనప్పటికీ, రెండు దేశాలతో సంప్రదింపుల ఉద్దేశం ఉద్రిక్తతలను తగ్గించేందుకే కావొచ్చని అనలిస్టులు భావిస్తున్నారు.

యెమెన్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న సౌదీ నేతృత్వంలో కూటమితో పాకిస్తాన్ మిలిటరీకి నేరుగా ఎలాంటి సంబంధాలు లేవు. కానీ, పాకిస్తాన్ ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ (రిటైర్డ్) రాహీల్ షరీఫ్ ఈ కూటమిలో ఉన్నత పదవిలో ఉన్నారు.

కాయద్-ఏ-ఆజమ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ కందీల్ అబ్బాస్ మాట్లాడుతూ, ఈ రెండు దేశాలతో పాకిస్తాన్‌కు బలమైన సంబంధాలు, ఆర్థిక ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.

ఈ రెండు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరగడం వల్ల పాకిస్తాన్‌పై ప్రభావం పడొచ్చు.

''ముస్లింల పవిత్రమైన స్థలాలు ఉండటంతో సౌదీ అరేబియా తనను తాను ఇస్లాంకు కేంద్రంగా భావిస్తోంది. గతంలో ముస్లిం ప్రపంచానికి సంబంధించి సౌదీ అరేబియా ఎన్నో కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ, 2015 నుంచి సౌదీ కీలకపాత్ర తగ్గుతూ వస్తోంది'' అని డాక్టర్ కందీల్ అబ్బాస్ బీబీసీతో అన్నారు.

గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్‌లోని దేశాల మధ్య విభేదాలకు ఇది స్పష్టమైన ఉదాహరణగా ఆయన పేర్కొన్నారు.

అయితే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ - సౌదీ అరేబియా విషయానికొస్తే.. ఎవరికైనా ముప్పు వాటిల్లితే ఇద్దరూ కలిసి పోరాడాలనే ఒప్పందం ఉందని ఆయన తెలిపారు.

ప్రస్తుతం, పరస్పర ప్రయోజనాల విషయంలో రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయని డాక్టర్ కందీల్ అబ్బాస్ అంటున్నారు.

పాకిస్తాన్, సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, SPA

ఫొటో క్యాప్షన్, యూఏఈలో 21 లక్షల మంది పాకిస్తాన్ కార్మికులు పనిచేస్తున్నారు.

‘‘పాకిస్తాన్ ఎలాంటి కీలక పాత్రను పోషించలేదు’’

రియాద్‌లోని కింగ్ ఫైసల్ సెంటర్ ఫర్ రీసర్చ్ అండ్ ఇస్లామిక్ స్టడీస్‌లో రీసర్చ్ ఫెలోగా ఉన్న ఒమర్ కరీం దీనిపై మాట్లాడారు.

ఆయన అభిప్రాయం ప్రకారం.. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడంలో పాకిస్తాన్ ఎలాంటి కీలకపాత్రను పోషించలేదు. ఎందుకంటే, ఈ రెండు దేశాలపై అది ఆర్థికంగా ఆధారపడి ఉంది.

యెమెన్‌లో యూఏఈ మద్దతున్న ఎస్‌టీసీ గ్రూప్‌పై ఏదైనా చర్యలు తీసుకోవడం వల్ల ఉద్రిక్తతలు పెరిగితే.. పాకిస్తాన్ తటస్థంగా కూడా ఉండలేదని ఆయన అంటున్నారు.

సౌదీ అరేబియాతో ఉన్న రక్షణ ఒప్పందం ప్రకారం.. పాకిస్తాన్ సౌదీ అరేబియాకే మద్దతు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.

ఇటీవలి ఉద్రిక్తతల తర్వాత రెండు దేశాలతో పాకిస్తాన్ కచ్చితంగా సంప్రదింపులు జరిపిందని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని డాక్టర్ కందీల్ అబ్బాస్ తెలిపారు. కానీ, "చాలా కీలక విషయాల్లో పాకిస్తాన్‌తో పోలిస్తే భారత్‌కు యూఏఈ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది" అని అబ్బాస్ అన్నారు.

యూఏఈలో 21 లక్షల మంది పాకిస్తాన్ కార్మికులు పనిచేస్తున్నప్పటికీ.. యూఏఈ విధానాలపై పాకిస్తాన్ ఎన్నడూ బహిరంగంగా స్పందించలేదు.

తమ ఆర్థిక ప్రయోజనాలకు అవసరమైన గ్వాదర్ పోర్టు (పాకిస్తాన్ బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లోని పోర్టు) అభివృద్ధి విషయంలో దుబయ్ పోర్టు సమస్యలను సృష్టిస్తోందని పాకిస్తాన్ గతంలో ఫిర్యాదు చేసినట్లు కందీల్ అబ్బాస్ తెలిపారు.

మకాలా, యెమెన్

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఈ ఫోటో దక్షిణ యెమెన్‌లోని మకాలాలోనిది. సౌదీ దాడిలో యూఏఈ మిలటరీ వెహికిల్స్ ధ్వంసమయ్యాయి.

ఈ ఉద్రిక్తతలతో ఏమవుతుంది?

యెమెన్‌లోని తాజా ఉద్రిక్తతలు యూఏఈ, సౌదీ అరేబియా మధ్య భౌగోళిక, రాజకీయ, ఆర్థిక పరంగా పెరుగుతున్న దూరాన్ని ప్రతిబింబిస్తున్నాయి.

ఓపెక్ నిర్ణయాల్లో రెండు దేశాల మధ్య విభేదాలు ఉన్నాయి. అంతేకాక సూడాన్, యెమెన్, ఇతర సరిహద్దు వివాదాల విషయంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

ఈ రెండు దేశాలు ఆఫ్రికాలో తమ ప్రాంతీయ ఆధిపత్యాన్ని, పట్టును పెంచుకునేందుకు ఒకదానికొకటి పోటీ పడుతున్నట్లు కనిపిస్తోంది.

ప్రస్తుతం ఆర్థిక ప్రయోజనాల కోణంలో రెండు దేశాలు భిన్నమార్గాల్లో పయనిస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.

''సౌదీ అరేబియాకు రక్షణ విషయాలు చాలా కీలకం. సౌదీ అరేబియా భద్రతకు ముప్పు పరిణమించే ఎర్ర సముద్రంలోని పలు గ్రూప్‌ల కార్యక్రమాలను రియాద్ అసలు సహించదు'' అని ఒమర్ కరీం చెప్పారు.

రియాద్‌తో ఉన్న పోటీలో భాగంగా.. 'హార్న్ ఆఫ్ ఆఫ్రికా' దేశాల్లోని ఎన్నో గ్రూపులకు అబుదాబి (యూఏఈ రాజధాని) మద్దతు ఇస్తోందన్నారు. సౌదీ అరేబియాకు సమస్యలు సృష్టించగల ఎన్నో దాని వద్ద ఉన్నాయని ఆయన అన్నారు.

సూడాన్, సోమాలిలాండ్, ఇథియోపియా, గల్ఫ్ ఆఫ్ ఏడెన్ వంటి ఎన్నో విషయాలపై రెండు దేశాల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని ఒమర్ కరీం చెబుతున్నారు.

డాక్టర్ కందీల్ అబ్బాస్ చెబుతున్న దాని ప్రకారం.. ఈ ప్రాంతంతో పాటు ఆఫ్రికా దేశాల్లో ట్రేడ్ కారిడార్లతో పాటు, స్థావరాలను సొంతం చేసుకోవాలని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కోరుకుంటోంది. ఈ విషయంలో ఇతర చమురు ఉత్పత్తి దేశాలు కూడా చాలా చురుగ్గానే ఉన్నాయి.

పాకిస్తాన్ ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్, యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్

ఫొటో సోర్స్, Pakistan PM Office

‘‘మొత్తం ఇస్లామిక్ ప్రపంచంపై ప్రభావం’’

సూడాన్, లిబియా, పాలస్తీనా అంశాల్లో ఈ రెండు గల్ఫ్ దేశాల భిన్న వైఖరి, విభేదాలు.. మొత్తం ఇస్లామిక్ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని కందీల్ అబ్బాస్ అన్నారు.

ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే.. భవిష్యత్తులో కూడా ఉద్రిక్తతలు పెరిగే అవకాశముందని డాక్టర్ అబ్బాస్ భావిస్తున్నారు.

ఇరాన్, ఇజ్రాయెల్ వల్ల మిడిల్ ఈస్ట్‌లో ఇప్పటికే చాలా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సమయంలో అరబ్ దేశాలు కూడా తమలో తాము వివాదాల్లో చిక్కుకోవాలని అమెరికా కోరుకోదని కందీల్ అబ్బాస్ చెప్పారు.

ఆయన ప్రకారం, రెండు దేశాలతో అమెరికాకు లోతైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి, ఈ రెండు అరబ్ దేశాలను విభేదాలకు దూరంగా ఉంచుతుంది.

యెమెన్‌లో నెలకొన్న తాజా ఘర్షణల తర్వాత.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో సౌదీ అరేబియా, యూఏఈ విదేశాంగ మంత్రులతో ఫోన్‌లో మాట్లాడారు.

ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగితే.. అమెరికా జోక్యం చేసుకున్నా, ఇవి కొనసాగుతాయని అనలిస్టు ఒమర్ కరీం అన్నారు.

ఎందుకంటే, ఖతార్, ఇతర గల్ఫ్ దేశాల మధ్య ఘర్షణల్లోనూ అమెరికా కీలకంగా వ్యవహరించలేకపోయిందన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)