ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే మంచి రాబడినిచ్చే ఇతర మార్గాలేంటి? మీకు ఈ 4 ఆప్షన్లు తెలుసా?

పర్సనల్ ఫైనాన్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్

ఫొటో సోర్స్, Getty Images

కొత్త ఏడాది తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని నిశ్చయించుకున్నట్లే, ఆర్థిక క్రమశిక్షణను కొనసాగించాలని, సరైన పెట్టుబడులు పెట్టాలని కూడా చాలామంది భావిస్తుంటారు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లను చాలామంది సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు. ఇటీవల కాలంలో.. పొదుపు ఖాతాల నుంచి డబ్బులను ఉపసంహరించి, ఫిక్స్‌డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెట్టే ధోరణి పెరుగుతోంది.

భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) డేటా ప్రకారం.. బ్యాంకు మొత్తం డిపాజిట్లలో ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీల) వాటా 62 శాతానికి పెరిగి రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఈ గణాంకాలు 2025 సెప్టెంబర్ క్వార్టర్‌కు చెందినవి.

2023 మార్చిలో ఈ వాటా 57 శాతంగా ఉంది. ఈ ఏడాది సెప్టెంబర్ క్వార్టర్‌లో పొదుపు ఖాతాల వాటా 33 శాతం నుంచి 29 శాతానికి తగ్గింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టేందుకు ఒక కారణం.. పొదుపు ఖాతాలతో పోలిస్తే ఇవి ఎక్కువ వడ్డీ రేట్లను అందిస్తుండటమే.

చాలా బ్యాంకులు పొదుపు ఖాతాలపై కేవలం 2 శాతం నుంచి 3 శాతం మాత్రమే వడ్డీ అందిస్తుండగా.. ఎఫ్‌డీలు దీనికి రెట్టింపు కంటే ఎక్కువగా 6 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీ రేటును ఆఫర్ చేస్తున్నాయి.

ఎఫ్‌డీల్లో పెట్టుబడి పెట్టేందుకు రెండు కారణాలున్నాయి. అవి ఒకటి సేఫ్టీ, మరొకటి వడ్డీ రేట్లు.

కానీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ప్రస్తుతం చాలా బ్యాంకులు చెల్లిస్తోన్న వడ్డీ రేటు ప్రస్తుత ద్రవ్యోల్బణ రేటు కంటే తక్కువగా ఉందని మీకు తెలుసా?

ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు పెట్టడం ద్వారా.. తరచుగా మన పొదుపు విలువను మనమే తగ్గించేసుకుంటున్నాం.

ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు పెట్టేవారు.. నిర్దిష్ట కాలవ్యవధి తర్వాత ఒకేసారి పెద్దమొత్తంలో డబ్బులు చేతికి వస్తాయని భావిస్తుంటారు.

కానీ, మార్కెట్లో మంచి రాబడులను అందించే ఇతర ఎన్నో ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి.

మార్కెట్లో క్రమబద్ధంగా పెట్టుబడి పెట్టడం ద్వారా పొందే రాబడులకు, ఫిక్స్‌డ్ డిపాజిట్ల ద్వారా పొందే రాబడికి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది.

తక్కువ రిస్క్‌తో, ఎక్కువ రాబడిని అందించే నాలుగు పెట్టుబడి మార్గాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

పర్సనల్ ఫైనాన్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్

మ్యూచువల్ ఫండ్ డబ్బును వివిధ కంపెనీల షేర్లలో పెట్టుబడి పెట్టినట్లే.. ఇండెక్స్ ఫండ్‌ డబ్బులను కూడా షేర్లలో పెట్టుబడిగా పెట్టొచ్చు.

అయితే, మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగా కాకుండా... ఇండెక్స్ ఫండ్స్‌కు ఫండ్ మేనేజర్ ఉండరు. అంటే, ఈ ఫండ్‌ల ద్వారా పెట్టే పెట్టుబడులు ఆటోమేటెడ్ ఇన్వెస్ట్‌మెంట్ల రూపంలో ఉంటాయి.

మ్యూచువల్ ఫండ్స్‌లో డబ్బులు పెట్టేటప్పుడు.. ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో ఈ పెట్టుబడులు ఉంటాయి. ప్రస్తుత మార్కెట్ రేటు కంటే ఎక్కువ రాబడులను పొందడమే వీటి లక్ష్యం.

అయితే, ఇండెక్స్ ఫండ్స్ స్థిరమైన, సురక్షితమైన రాబడులను పొందడమే లక్ష్యంగా ఉంటాయి.

సెన్సెక్స్-30ని ఉదాహరణగా చూస్తే.. కింద ఇచ్చిన కంపెనీల చార్ట్‌ను, వాటి వెయిటేజ్‌ను మీరు చూడొచ్చు.

ఈ చార్ట్‌లో రిలయన్స్‌కు అత్యధికంగా 13.36 శాతం వెయిటేజ్ ఉంది. ఆ తర్వాత హెచ్‌డీఎఫ్‌సీకి 9.65 శాతం ఉంది.

ఇండెక్స్ ఫండ్‌లలో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు.. మీ పొదుపులో 13.36 శాతం రిలయన్స్‌లో, 9.65 శాతం హెచ్‌డీఎఫ్‌సీలో పెట్టుబడిగా పెడతారు. అంటే, కంపెనీల వెయిటేజీ ప్రకారం.. మీ డబ్బులు పెట్టుబడిగా పెళ్తాయి.

ఒకవేళ కంపెనీ వెయిటేజీలో తన స్థానం మారి.. ఈ జాబితా నుంచి కిందకి పడిపోతే, ఈ కంపెనీ నుంచి మీ డబ్బులను వెనక్కి తీసుకుని, ముందటి కంపెనీని రీప్లేస్ చేసిన కంపెనీలో పెట్టుబడిగా పెట్టుకోవచ్చు.

సెన్సెక్స్-30 అనేది చాలా ముఖ్యమైన ఇండెక్స్. లాభాలు ఇచ్చే కంపెనీలే దీనిలో ఉంటాయి.

గత పదేళ్లలో.. సెన్సెక్స్-30 ఇండెక్స్ 250 శాతం పెరిగింది. అందుకే, ఈ ఇండెక్స్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే వారి సంఖ్య కూడా బాగా పెరిగింది.

మార్కెట్లో ప్రతి రంగానికి అంటే బ్యాంకింగ్, ఐటీ, గోల్డ్, రియల్ ఎస్టేట్ వంటి వాటికి ఇండెక్స్ ఫండ్‌లు అందుబాటులో ఉన్నాయి.

పర్సనల్ ఫైనాన్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్

ఫొటో సోర్స్, Getty Images

ఎక్స్చేంజ్ - ట్రేడెడ్ ఫండ్స్

ఎక్స్చేంజ్ - ట్రేడెడ్ ఫండ్స్ అచ్చం ఇండెక్స్ ఫండ్స్ మాదిరిగానే ఉంటాయి. ఈ రెండు ఫండ్స్ కూడా పలు కంపెనీల్లో, రంగాల్లో పెట్టుబడి పెట్టేందుకు మీకు అనుమతి ఇస్తాయి.

కానీ, ఈ రెండు ఫండ్స్ మధ్య స్వల్ప వ్యత్యాసమే ఉంటుంది.

ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ మీరు ఎంపిక చేసుకున్న ఇండెక్స్‌కు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ పాయింట్‌ను పరిగణనలోకి తీసుకుంటే, ఇండెక్స్ ఫండ్స్ కంటే ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ చాలా మెరుగైనవి.

ఇండెక్స్ ఫండ్స్ మాదిరిగా కాకుండా.. ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్‌కు సిప్ ఆప్షన్ ఉండదు.

ఎక్స్చేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ ద్వారా మీరు యూనిట్లను కొనుగోలు చేయొచ్చు. ఈ ఫండ్ యూనిట్ మొత్తాన్ని ఇండెక్స్ కనీస ధర బట్టి నిర్ణయిస్తారు.

పర్సనల్ ఫైనాన్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్

డిబెంచర్ మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టేందుకు మీకోసం ఫండ్ మేనేజర్‌ను నియమిస్తారు.

ఈ ఫండ్ మేనేజర్ మీ డబ్బులతో పలు బాండ్లను కొనుగోలు చేసి, ఈ బాండ్లపై ఆర్జించిన వడ్డీని పరిహారంగా మీకు ఇస్తారు.

అంటే.. రుణం లాంటి లావాదేవీ అన్నమాట. ఈ ఫండ్స్‌లో ఫండ్ మేనేజర్ పాత్ర చాలా కీలకం.

ఎందుకంటే, వివిధ రంగాల్లోని బాండ్లు చెల్లించే వడ్డీ రేట్లలో చాలా వ్యత్యాసం ఉంటుంది.

ఒకవేళ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, డిబెంచర్ మ్యూచువల్ ఫండ్స్ మధ్య రాబడుల తేడాలను కనుక పోల్చితే.. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంటే తక్కువ రాబడులే వీటి నుంచి వస్తాయి.

అయితే, రిస్క్ తక్కువ. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో రిస్క్ ఎక్కువగా ఉంటుంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే డిబెంచర్ మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చే రిటర్నులు ఎప్పుడూ ఎక్కువే.

పర్సనల్ ఫైనాన్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ఫండ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్

ఫొటో సోర్స్, Getty Images

గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్

గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ డెట్ మ్యూచువల్ ఫండ్లలో ఒక రకం.

వీటి ప్రత్యేకత ఏంటంటే.. ప్రభుత్వ బాండ్లలో మాత్రమే ఇవి పెట్టుబడి పెడతాయి.

ఈ బాండ్లపై కేంద్ర ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం క్రమం తప్పకుండా వడ్డీ చెల్లిస్తుంది. ఈ ఫండ్‌లలో నష్టభయం కూడా చాలా తక్కువ.

సెబీ నిబంధనల ప్రకారం.. గిల్ట్ ఫండ్స్ పోర్టుఫోలియోలోని 80 శాతం తప్పనిసరిగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టాలి.

ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే గిల్ట్ మ్యూచువల్ ఫండ్స్ మంచి రాబడులను అందిస్తాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)