భారత్ టాప్‌లో ఉన్నప్పటికీ, సూపర్ 8 ముందు ఆందోళనకు గురిచేస్తున్న 3 విషయాలు ఏమిటి?

టీ20 ప్రపంచకప్, సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నేటి నుంచి టీ20 ప్రపంచకప్ సూపర్-8 రౌండ్ ఆరంభం కాబోతోంది.
    • రచయిత, ప్రవీణ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

టీ20 ప్రపంచకప్-2026 గ్రూప్ దశ మ్యాచ్‌లు ముగిశాయి. నేటి నుంచి సూపర్-8 రౌండ్ ప్రారంభమవుతోంది.

గత విజేత భారత్‌‌ను ఈసారి కూడా 'టైటిల్ ఫేవరెట్‌'గా క్రికెట్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గ్రూప్‌ దశలో మొదటి స్థానంలో నిలవడం ద్వారా టీమిండియా టోర్నీ 'ఫేవరెట్' ట్యాగ్‌ను నిలబెట్టుకుంది.

కేవలం గ్రూప్-ఏలోనే కాకుండా, మొత్తం 4 గ్రూపులను పరిశీలించినా భారత జట్టు అత్యధికంగా +2.500 నికర రన్‌రేట్ సాధించింది.

కానీ భారత్‌జట్టులోని కొన్ని సమస్యలు ఈ మ్యాచ్‌ల్లో బయటపడ్డాయి. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా స్పందించారు.

ఇంతకీ భారత జట్టును వేధిస్తున్న ఆ సమస్యలేంటి? కెప్టెన్ ఏమన్నాడు?

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
అభిషేక్ శర్మ, టీ20 ప్రపంచకప్, భారత్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటివరకు పరుగుల ఖాతా తెరవని అభిషేక్ శర్మ
క్రికెట్, భారత్, టీమిండియా

వరల్డ్ కప్ మ్యాచ్‌లు ప్రారంభానికి ముందు, అభిషేక్ శర్మ భారత జట్టుకు పెద్ద బలమని చాలామంది భావించారు. కానీ, అతనే ఇప్పటివరకూ అతిపెద్ద 'ఫ్లాప్'గా మారాడు.

తన మెరుపు బ్యాటింగ్‌తో కేవలం పవర్ ప్లేలోనే ప్రత్యర్థి జట్టుకు విజయాన్ని దూరం చేయగల బ్యాటర్‌గా గుర్తింపు పొందిన అభిషేక్, ఈ వరల్డ్‌ కప్‌లో మాత్రం ఇప్పటివరకూ పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు.

అమెరికా జట్టుతో జరిగిన మ్యాచ్‌లో ఎదుర్కొన్న తొలి బంతికే అవుట్ అయ్యాడు ఈ భారత ఓపెనర్. తర్వాత నమీబియాపై జరిగిన మ్యాచ్‌కు అనారోగ్యం కారణంగా దూరమయ్యాడు. పాకిస్తాన్‌ మ్యాచ్‌లో కేవలం నాలుగు బంతులు, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌లో కేవలం మూడు బంతులు మాత్రమే ఆడాడు.

అభిషేక్ పేలవమైన ప్రదర్శన మాత్రమే కాదు, భారత జట్టుకు ఆందోళన కలిగిస్తున్న మరో అంశం కూడా ఉంది. అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ల్లో అతను ఆడిన గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో కేవలం ఒకే ఒక్క అర్ధసెంచరీ చేశాడు. ఐదుసార్లు పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు.

ఈ వరల్డ్ కప్‌లో అభిషేక్ శర్మ పరుగులు సాధించలేకపోవడానికి గల కారణాలను క్రికెట్ నిపుణుడు సారంగ్ భలేరావు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో విశ్లేషించారు.

''అభిషేక్ శర్మ ఈ వరల్డ్ కప్‌లో ఆడిన మూడు ఇన్నింగ్స్‌లోనూ బౌండరీతోనే తన పరుగుల ఖాతా తెరవాలని ప్రయత్నించాడు, ఆ క్రమంలోనే ఔటయ్యాడు. అతను సింగిల్ తీస్తూ మొదటి ఓవర్ ఆడటానికి ప్రయత్నించాలి. అలా కనీసం 10 బంతుల వరకూ క్రీజ్‌లో నిలదొక్కుకుంటే, ఆ తర్వాత ప్రత్యర్థులకు అత్యంత ప్రమాదకరమైన ఆటగాడిగా మారిపోతాడు'' అని రాశారు.

మూడుసార్లు సున్నా పరుగులకే ఔట్ అయినప్పటికీ, టీమ్ మేనేజ్‌మెంట్ అభిషేక్ శర్మ ప్రదర్శన గురించి అంతగా ఆందోళన చెందబోదని సారంగ్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే అభిషేక్ శర్మ ఒక 'బిగ్ మ్యాచ్ విన్నర్' అన్నారు.

టీ20 ప్రపంచకప్, తిలక్ వర్మ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వేగంగా పరుగులు సాధించడంలో విఫలమవుతున్న తిలక్ వర్మ
క్రికెట్, భారత్, టీమిండియా

'తిలక్ వర్మ తడబడటం ఇప్పుడు భారత జట్టుకు ఆందోళన కలిగించే విషయంగా మారింది.' అని నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్‌ ఆడటంలో విఫలమైన తిలక్ వర్మపై అనూప్ పాల్ అనే అభిమాని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్'లో రాశారు.

ఇలా చాలామంది యూజర్లు తిలక్ వర్మ ఫామ్, ఆటతీరుపై ప్రశ్నలు సంధిస్తున్నారు. వాస్తవానికి, గత రెండేళ్లలో భారత జట్టుకు నంబర్ 3 స్థానంలో అత్యంత నమ్మదగ్గ బ్యాటర్‌గా ఎదిగాడు తిలక్. 2025 ఆసియా కప్ ఫైనల్‌లో 69 పరుగుల అద్భుత ఇన్నింగ్స్ ఆడి, భారత జట్టును విజేతగా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు.

కానీ, గతేడాది చివరలో తిలక్ వర్మ గాయపడ్డాడు. ఆ తర్వాత వరల్డ్ కప్‌కు కొన్నిరోజుల ముందే తిరిగి జట్టులోకి చేరాడు.

ఈ టోర్నీలో అభిషేక్ శర్మ రాణించకపోవడం వల్ల, తిలక్ వర్మ చాలా త్వరగా మైదానంలో అడుగుపెట్టాల్సి వస్తోంది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ 16 బంతులను ఎదుర్కొని, 25 పరుగులు చేశాడు.

కానీ, ఆ తర్వాత నుంచే తడబాటు మొదలైంది. నమీబియాపై 21 బంతుల్లో 25 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కూడా 24 బంతుల వరకూ ఆడినప్పటికీ 25 పరుగులకే పరిమితమయ్యాడు. నెదర్లాండ్స్‌పై 27 బంతులు ఎదుర్కొని 31 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు.

తిలక్ వర్మ ఇంత నెమ్మదిగా పరుగులు చేయడం వల్ల పెరుగుతున్న ఒత్తిడిని క్రీజ్‌లో ఉన్న ఆయన తోటి బ్యాటర్ ఎదుర్కోవాల్సి వస్తోంది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో కూడా, తొలి ఓవర్లు మినహాయిస్తే భారత జట్టు తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమైంది.

అయితే, ఆరంభ ఓవర్లలో వేగంగా పరుగులు చేయలేకపోవడాన్ని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అంగీకరించాడు.

నెదర్లాండ్స్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ మాట్లాడుతూ, ''అవును, మా ఆరంభం నెమ్మదిగా ఉంది. కానీ మా బ్యాటర్లు బాధ్యతాయుతంగా, పరిస్థితులకు అనుగుణంగా ఆడేందుకు ప్రయత్నిస్తున్నారు'' అని చెప్పారు.

భారత్, టీ20 ప్రపంచకప్ 2026

ఫొటో సోర్స్, Getty Images

క్రికెట్, భారత్, టీమిండియా

టోర్నీలో ఆడిన నాలుగు మ్యాచ్‌లలో భారత బ్యాటర్లు స్పిన్నర్ల బౌలింగ్‌లో ఇబ్బంది పడ్డారు. అమెరికన్ స్పిన్నర్లు మొహమ్మద్ మోహ్సీన్, హర్మీత్ సింగ్‌లను ఎదుర్కోవడంలో తడబడ్డారు.

మొహమ్మద్ మోహ్సీన్ నాలుగు ఓవర్లలో 16 పరుగులే ఇచ్చి ఒక వికెట్ తీశాడు. హర్మీత్ సింగ్ నాలుగు ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత, నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్ 4 ఓవర్లలో 20 పరుగులే ఇచ్చి నలుగురు భారతీయ బ్యాటర్లను ఔట్ చేశాడు.

పాకిస్తాన్ పార్ట్-టైమ్ బౌలర్ సయీం అయూబ్ కూడా భారత్‌పై మూడు వికెట్లు పడగొట్టాడు. ఉస్మాన్ తారిక్‌ బౌలింగ్‌లో కూడా భారత బ్యాటర్లు కొంత అసౌకర్యంగా కనిపించారు.

ఇక, నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్యన్ దత్ నాలుగు ఓవర్లలో 19 పరుగులకు రెండు వికెట్లు పడగొట్టాడు. ఈ నాలుగు మ్యాచ్‌లలో భారత్‌పై ప్రత్యర్థి స్పిన్నర్లు పైచేయి సాధించారు. దీంతో, భారత్ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరముంది.

టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

భారత్ ముందు మరో రెండు ప్రశ్నలు

రాబోయే మ్యాచ్‌లలో భారత జట్టుకు సమస్యలను కలిగించే మరో రెండు అంశాలు ఉన్నాయి: చివరి ఓవర్లలో ఫీల్డింగ్, బౌలింగ్.

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ సులువుగా గెలిచినప్పటికీ, ఆ మ్యాచ్‌లో భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లను వదిలేశారు. నెదర్లాండ్స్‌పై కూడా ఆ ధోరణి కొనసాగింది.

నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చివరి ఓవర్లలో భారత్ బౌలింగ్ ఏమాత్రం బాగాలేదు. 16 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లకు 125 పరుగులు చేసిన నెదర్లాండ్స్‌కు, చివరి 4 ఓవర్లలో ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నారు భారత బౌలర్లు. కేవలం ఒక వికెట్ మాత్రమే తీయగలిగారు.

క్రిక్‌బజ్ షోలో దీని గురించి మాజీ ఫాస్ట్ బౌలర్ మోహిత్ శర్మ మాట్లాడుతూ, "సూపర్ 8లో భారత బౌలింగ్ దాడి ఎలా ఉంటుందనే దానిపై ఇంకా ప్రశ్నలున్నాయి. నెదర్లాండ్స్‌ మ్యాచ్ తర్వాత డెత్ ఓవర్లలో భారత బౌలింగ్‌పై ప్రశ్నలు తలెత్తాయి. ఇప్పుడు మనం బలమైన జట్లను ఎదుర్కోబోతున్నాం" అన్నారు.

సూపర్ 8 మ్యాచ్‌లు ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానున్నాయి. గ్రూప్ 1లో భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే ఉంది. భారత్ ఫిబ్రవరి 22న దక్షిణాఫ్రికాతో తలపడనుంది.

కానీ, టోర్నీ ఫేవరెట్ ట్యాగ్‌ను కొనసాగించాలన్నా, టైటిల్ ఆశలు చేజారకూడదన్నా, భారత్ ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు కనుగొనాలి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)