వెనెజ్వెలా విషయంలో భారత్ ప్రకటనపై విమర్శలెందుకు వస్తున్నాయి? ఆ ప్రకటనలో ఏముంది?

నరేంద్ర మోదీ, భారత్, వెనెజ్వెలా

ఫొటో సోర్స్, AFP via Getty Images

అమెరికా ప్రత్యేక దళాలు శనివారం తెల్లవారుజామున వెనెజ్వెలా రాజధాని కారకస్ నుంచి అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకున్నాయి.

ఇరువురిని న్యూయార్క్‌కు తరలించారు, అక్కడ మాదకద్రవ్యాల అక్రమ రవాణా ఆరోపణలపై విచారణ జరగనుంది. ఈ ఆరోపణలను మదురో ఖండిస్తూ వచ్చారు. దేశంలోని విస్తారమైన చమురు నిల్వలపై నియంత్రణకు ఇది అమెరికా చూపుతున్న సాకుగా ఆయన ఆరోపించారు.

వెనెజ్వెలాపై ఈ చర్య ప్రపంచాన్ని షాక్‌కు గురిచేసింది. అనేక దేశాలు అమెరికా చర్యను "ఏకపక్షంగా, ఐక్యరాజ్యసమితి చార్టర్‌కు విరుద్ధం" అని అభివర్ణించాయి.

అమెరికా అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించిందని, దక్షిణ అమెరికా ప్రాంతానికి ముప్పుగా పరిణమించిందని చెబుతూ, మదురోను వెంటనే విడుదల చేయాలని చైనా డిమాండ్ చేసింది.

ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టం సూత్రాల ప్రకారం సమస్యలను పరిష్కరించుకోవాలని పాకిస్తాన్ సూచించింది. వెనెజ్వెలా సార్వభౌమత్వానికి హామీ ఇవ్వాలని క్రైస్తవ నాయకుడు పోప్ లియో విజ్ఞప్తి చేశారు.

భారత్ మాత్రం చాలా జాగ్రత్తగా, ఆచితూచి స్పందించింది. ఈ స్పందనపై చాలానే విమర్శలు వచ్చాయి.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
జై శంకర్, భారత్

ఫొటో సోర్స్, AFP via Getty Images

ఫొటో క్యాప్షన్, వెనెజ్వెలాపై అమెరికా దాడి జరిగిన దాదాపు 24 గంటల అనంతరం, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదలైంది.

భారత ప్రకటనలో ఏముంది?

అమెరికా చర్య అనంతరం, దాదాపు 24 గంటల తర్వాత భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.

"వెనెజ్వెలా ప్రజల భద్రత. శ్రేయస్సు కోసం భారత్ తన మద్దతు ఉంటుందని పునరుద్ఘాటిస్తోంది. ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కొనసాగేందుకు చర్చలు, శాంతియుత మార్గాల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సంబంధిత అన్ని పక్షాలకు విజ్ఞప్తి చేస్తున్నాం" అని తెలిపింది.

అలాగే వెనెజ్వెలా ప్రయాణానికి సంబంధించి భారత్ ఒక అడ్వైజరీని కూడా జారీ చేసింది. వెనెజ్వెలాకు అత్యవసరమైతే తప్ప ప్రయాణించరాదని భారత పౌరులకు సూచించింది.

అయితే, ఈ ప్రకటన దేశంలోని ప్రతిపక్ష పార్టీలకు అసహనం కలిగించింది. అమెరికా దురాక్రమణను ఖండించనందుకు చాలామంది విమర్శలు గుప్పించారు.

"గత 24 గంటలుగా వెనెజ్వెలాలో అమెరికా చేపట్టిన చర్యలపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ చట్ట నిబంధనలను ఏకపక్షంగా ఉల్లంఘించలేం" అని కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ 'ఎక్స్' పోస్టు ద్వారా తెలిపారు.

అమెరికా రహస్య ఆపరేషన్ జరిగిన 24 గంటల తర్వాత న్యూదిల్లీ స్పందించిందని ఆంగ్ల వార్తాపత్రిక 'ది టెలిగ్రాఫ్' రాసింది.

"ఈ ప్రతిస్పందన ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్‌పై రష్యా దాడి సమయంలో భారత్ ఇచ్చిన ప్రతిస్పందనను పోలి ఉంది. ఆ సమయంలో, అది ఏ ఒక్క పక్షానికి బహిరంగంగా మద్దతు ఇవ్వలేదు" అని ది టెలిగ్రాఫ్ రాసింది.

వామపక్షాల నిరసనలు, వెనెజ్వెలా

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ, సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా, సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్ ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య (ఎడమ నుంచి కుడికి).

నిరసనలకు వామపక్షాల పిలుపు

వెనెజ్వెలాపై అమెరికా దాడిని భారతదేశంలోని వామపక్ష పార్టీలు ఖండించాయి.

"అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా వామపక్ష పార్టీలు నిరసనలకు పిలుపునిచ్చాయి" అని కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) సోషల్ మీడియా 'ఎక్స్' పోస్టులో తెలిపింది.

ఈ ప్రకటనను సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ(ఎంఎల్)-లిబరేషన్, ఆర్ఎస్పీ (రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ), ఏఐఎఫ్బీ (ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్)లు సంయుక్తంగా జారీ చేశాయి.

"వెనెజ్వెలాపై అమెరికా దురాక్రమణను, అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ కిడ్నాప్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది యూఎన్ చార్టర్‌ను స్పష్టంగా ఉల్లంఘిస్తూ సార్వభౌమ దేశంపై జరిగిన దాడి. వామపక్ష పార్టీలమైన మేం, అమెరికా దురాక్రమణకు వ్యతిరేకంగా, లాటిన్ అమెరికా ప్రజలతో సంఘీభావంగా దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిస్తున్నాం" అని ప్రకటన పేర్కొంది.

"అమెరికా దురాక్రమణను ఖండిస్తున్న దేశాలకు భారత ప్రభుత్వం మద్దతివ్వాలి. వెనెజ్వెలాతో గట్టిగా నిలబడాలి" అని ఆ పోస్టులో రాశారు.

భారత్ ప్రకటనపై విమర్శలు ఎందుకు?

"వెనెజ్వెలా చమురు కోసం ఎన్ని సాకులు చెప్పినా, చరిత్ర వారిని ఎప్పటికీ క్షమించదు. అది కూడా మనల్ని క్షమించదు. ఎందుకంటే, మనం ఇప్పటికీ ఈ రకమైన భాషను ఉపయోగిస్తున్నందుకు మనల్ని కూడా క్షమించదు. ఇది మన భారతదేశం కాదు. 1952, 54లలో ఇలాంటిది జరిగి ఉంటే భారత్ స్పష్టమైన, బలమైన ప్రకటన జారీ చేసి ఉండేది" అని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా అన్నారు.

"వెనెజ్వెలాలో అమెరికా ఆపరేషన్‌పై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది కానీ, ఖండించలేదు" అని అంతర్జాతీయ వ్యవహారాలను కవర్ చేసే జర్నలిస్ట్ శశాంక్ మట్టూ రాశారు.

"వెనెజ్వెలాలోకి ట్రంప్ సైనిక చొరబాటును భారత్ ఖండించలేదు" అని సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంతో అనుబంధంగా ఉన్న యూఎస్సీ డోర్న్‌సైఫ్ కాలేజ్ ఆఫ్ లెటర్స్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌లో ప్రొఫెసర్ డెరెక్ జె. గ్రాస్‌మాన్ 'ఎక్స్' పోస్టులో రాశారు.

"భారత్ ఆసియాలో, ప్రపంచవ్యాప్తంగా మా అత్యంత ముఖ్యమైన భాగస్వాములలో ఒకటి" అని వాషింగ్టన్‌కు చెందిన భౌగోళిక రాజకీయ వ్యూహకర్త, విదేశాంగ విధాన పరిశోధన సంస్థలో జాతీయ భద్రతా సీనియర్ ఫెలో జాన్ సిటిలిడిస్ అన్నారు.

"కానీ, ఇది 'నేషనల్ ప్రైమసీ థియరీ' కింద నిర్వహించిన ఆపరేషన్. ఇది ట్రంప్ వైట్‌హౌస్ జాతీయ భద్రతా వ్యూహంలో స్పష్టంగా కనిపించే ఫ్రేమ్‌వర్క్" అని తెలిపారు.

భారత్, అమెరికాలు ఉమ్మడి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయడం కొనసాగిస్తాయని జాన్ సిటిలిడిస్ చెప్పారు.

'విదేశాంగ విధానాన్ని మార్చాలి'

భారత ప్రకటన ఆందోళనకరంగా ఉందని, దాని విదేశాంగ విధానంలో పూర్తి మార్పు జరగాలని భారత్ - చైనా సంబంధాల నిపుణులు జోరావత్ దౌలత్ సింగ్ అభిప్రాయపడ్డారు.

భారత ప్రకటనను 'ఎక్స్' వేదికగా జోరావర్ షేర్ చేస్తూ, "భారత విదేశాంగ విధానానికి ఒక ప్రధాన నమూనా మార్పు అవసరం. ఎందుకంటే, అలాంటి ప్రతిస్పందన ఎటువంటి నిర్దిష్ట ప్రయోజనాలను ఇవ్వదు లేదా భవిష్యత్తులో అమెరికా దూకుడు చర్యలను నిరోధించదు" అని తెలిపారు.

"భారత అధికారిక ప్రకటనలు అసంబద్ధంగా మారాయని ఇది సూచిస్తుంది" అని రాశారు.

వ్యూహాత్మక వ్యవహారాల నిపుణులు బ్రహ్మ చెల్లానీ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"ఘటనను తీవ్ర ఆందోళన కలిగించేదిగానే చెబుతూ, ట్రంప్ ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతినకుండా, అటు ఏకపక్ష సైనిక చర్యకూ మద్దతు ఇవ్వకుండా న్యూదిల్లీ సంకేతాలిచ్చింది" అని బ్రహ్మ చెల్లానీ 'ఎక్స్' పోస్టులో తెలిపారు.

"అయితే, యూఎన్ చార్టర్ ఆర్టికల్ 2(4) (బలప్రయోగం నిషేధం) స్పష్టమైన ఉల్లంఘనను భారత్ ఖండించడంలో విఫలమైందంటూ విమర్శకులు ఎత్తిచూపుతారు. గ్లోబల్ సౌత్ లీడర్‌గా భారత్ స్థానాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని వాదిస్తారు" అని తెలిపారు బ్రహ్మ చెల్లానీ.

కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, వెనెజ్వెలా సమస్యపై ఎలా స్పందించాలో భారత ప్రభుత్వం నిర్ణయించుకోవాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు.

చాకచక్యమైన దౌత్యంతో నడిపించాలి: శశి థరూర్

ప్రస్తుత సున్నిత పరిస్థితిలో భారత్ స్పందన సముచితమేనన్నట్లుగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ పరోక్షంగా వ్యాఖ్యానించారు.

వెనెజ్వెలా సమస్య సున్నితత్వాన్ని దృష్టిలో ఉంచుకుని, ఎలా స్పందించాలో నిర్ణయించుకోవడం భారత ప్రభుత్వానికే వదిలేశామని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ చెప్పారు.

"ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్టాన్ని నిరంతరం ఉల్లంఘిస్తున్నారు. మనం చూస్తున్న పరిస్థితి ప్రపంచ క్రమం విచ్ఛిన్నమై, దాని స్థానంలో గందరగోళం ఏర్పడుతుందని సూచిస్తుంది. అటువంటి గందరగోళంలో, 'మైట్ ఈజ్ రైట్' అనే సూత్రం ఆటవిక చట్టంగా మారే ప్రమాదం ఉంది. భారత్ ఒక చిన్న దేశం కాదు లేదా సూపర్ పవర్ కాదు, మనం ఈ దశను చాలా చాకచక్యమైన దౌత్యంతో నడిపించాలి" అని అన్నారు..

ది హిందూ దౌత్య వ్యవహారాల ఎడిటర్ సుహాసిని హైదర్ ఎక్స్ పోస్టులో "వెనెజ్వెలాపై అమెరికా దాడి విషయంలో మోదీ ప్రభుత్వం తన వైఖరిని చాలా జాగ్రత్తగా తీసుకుంది. యుక్రెయిన్, గాజా, ఇరాన్‌ విషయంలో భారత్ అనుసరించిన వైఖరికి అనుగుణంగానే ఇది కూడా ఉందని దౌత్య నిపుణులు అంటున్నారు. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం ప్రస్తుతం కీలక దశలో ఉంది. దీనిని ప్రధాన ఆందోళనగా కూడా పరిగణిస్తున్నారు" అని తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)