జపాన్ అణుకేంద్ర ఉద్యోగి మొబైల్ ఫోన్ చైనాలో మిస్..

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, కోహ్ ఈవే
- హోదా, బీబీసీ ప్రతినిధి
జపాన్ అణు నియంత్రణ సంస్థలో పని చేసే ఓ ఉద్యోగి చైనా పర్యటనకు వెళ్ళి తన ఫోన్ పోగొట్టుకున్నారు. ఈ ఫోన్‌లో సున్నితమైన సమాచారముందని జపాన్ మీడియా తెలిపింది.
అణు నియంత్రణ సంస్థలో కీలక బాధ్యతల్లో ఉన్న సిబ్బంది కాంటాక్టు వివరాలు ఆ ఫోన్‌లో ఉన్నాయి.
అయితే ఈ కీలక సమాచారం లీక్ అయిందా లేదా అనే విషయాన్ని అణునియంత్రణ సంస్థ చెప్పలేదు.
పదేళ్లుగా నిలిచిపోయిన అణు కార్యక్రమాన్ని జపాన్ ప్రభుత్వం తిరిగి ప్రారంభించే ప్రయత్నాలు చేస్తున్నవేళ ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

జపాన్‌ను 2011లో భారీ భూకంపం, సునామీ, అక్కడి ఫుకుషిమా అణు కేంద్రంలో బీభత్సాన్ని సృష్టించాక, దేశంలోని అన్ని అణు విద్యుత్ రియాక్టర్లను మూసేవేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఫుకుషిమా ఘటన తరువాత అణు సంబంధిత భద్రతను కట్టుదిట్టం చేసే చర్యల్లో భాగంగా జపాన్ ప్రభుత్వం అణు నియంత్రణ సంస్థను (ఎన్‌ఆర్ఏ)ను ఏర్పాటు చేసింది. అణు రక్షణతోపాటు, న్యూక్లియర్ రియాక్టర్ల పునఃప్రారంభాన్ని ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది.
వ్యక్తిగత పర్యటన కోసం చైనాకు వెళ్లిన ఈ ఉద్యోగి నవంబర్3న షాంఘై విమానాశ్రయంలో భద్రతా తనిఖీల వేళ తన ఫోన్ పోగొట్టుకుని ఉండవచ్చని భావిస్తున్నారు.
తన ఫోన్ పోయినట్టు మూడు రోజుల తరువాత గమనించిన ఉద్యోగి ఎయిర్‌పోర్టు సిబ్బందిని సంప్రదించినా ఫలితం లేకుండా పోయింది.
అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించడానికి వీలుగా ఎన్ఆర్ఏ కొంతమంది ఉద్యోగులకు ఫోన్లు జారీ చేసిందని ఆషీ వార్తపత్రిక తెలిపింది.
క్యోడో న్యూస్ సమాచారం మేరకు , ఈ ఉద్యోగి పని చేసే ఎన్‌ఆర్‌ఏ విభాగం దేశవ్యాప్తంగా ఉన్న అణు కేంద్రాలలో న్యూక్లియర్ పదార్థాల చోరీ, ఉగ్రవాదుల ముప్పు నుంచి రక్షించే బాధ్యత చూస్తుంది. .
ఎన్‌ఆర్‌ఏ ఈ ఘటనను వ్యక్తిగత సమాచార భద్రతా కమీషన్‌కు ఫిర్యాదు చేసింది. బయటి దేశాలకు ఉద్యోగ సంబంధ ఫోన్లను తీసుకువెళ్ళొద్దని ఉద్యోగులను హెచ్చరించింది.
జపాన్‌లో న్యూక్లియర్ సంబంధ అధికారులు భద్రతా లోపాల వల్ల వార్తలకెక్కడం ఇది మొదటిసారి కాదు.
2023లో ప్రపంచంలోనే అతి పెద్ద అణు కేంద్రం- కాషీవాజాకి కరీవా అణు కేంద్రంలో ఒక ఉద్యోగి తన కారుపై కొన్ని పత్రాలను పెట్టి, తరువాత కారును నడుపుకుంటూ వెళ్లి వాటిని పోగొట్టారు.
నిరుడు నవంబర్‌లో అదే కేంద్రంలో మరో ఉద్యోగి ముఖ్యమైన పత్రాలను కాపీ చేసి, నిబంధనలకు విరుద్ధంగా వాటిని ఒక డెస్క్‌లో పెట్టి తాళం వేశారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














