రోజుకు 25 గంటలు ఉండే రోజు వస్తుందా, ఇది జరిగేది ఎప్పుడంటే...

ఫొటో సోర్స్, eladelantado.com
- రచయిత, పారా పద్దయ్య
- హోదా, బీబీసీ ప్రతినిధి
భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. దీని వల్ల రాత్రీ పగలు ఏర్పడుతున్నాయి. సీజన్లు మారుతున్నాయి.
ఇలాంటి ఒక భ్రమణం పూర్తి చేయడానికి భూమికి ప్రస్తుతం 24 గంటలు లేదా కాస్త అటు ఇటుగా 86,400 సెకన్లు పడుతుంది.
అయితే కొన్ని రోజులుగా భూమి తిరిగే వేగం తగ్గుతోంది. దీంతో భూమి మీద రోజు వ్యవధి పెరుగుతోంది. ఈ మార్పు చాలా చిన్నదే కావచ్చు. కానీ కాలాన్ని కొన్ని మిల్లీ సెకన్లు ముందుకు జరుపుతోంది. వందేళ్లకు దాదాపు 1.7 మిల్లీ సెకన్లు పెరుగుతుంది.
సాధారణంగా నిత్య జీవితంలో ఇదసలు లెక్కే కాదు. కానీ కాల గమనంలో లక్షలు, కోట్ల సంవత్సరాల్లో ఇది పెద్ద మార్పు.
ఇలా మిల్లీ సెకన్లు పెరుగుతూ 20 కోట్ల ఏళ్ల తర్వాత ఒక గంట వ్యవధికి చేరుతుంది. అప్పుడు భూమి మీద రోజుకు 24 గంటలకు బదులు 25 గంటలు ఉంటాయని నాసా చెబుతోంది.
భూమి ఏర్పడిన కొత్త కొన్నేళ్లపాటు రోజుకు 10 గంటలు మాత్రమే ఉండేవి.అలాగే 24 గంటల కంటే ఎక్కువ సమయం ఉన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ అవి ఎక్కువ కాలం లేవు.
"భూమి తిరిగే వేగం క్రమంగా మార్పుకు గురవుతోంది. దీనివల్ల భూమిపైన సంభవించే పరిణామాలు కాలానుగుణంగా మారుతున్నాయి" అని కాల్‌టెక్‌లోని ప్లానెటరీ సైన్స్ ప్రొఫెసర్ కాన్‌స్టాంటిన్ బేటిగిన్ లైవ్ సైన్స్ వెబ్‌సైట్‌తో చెప్పారు.


ఫొటో సోర్స్, Getty Images
భూమితో పాటు తిరిగే గడియారాలు
ఈ రోజుకు కూడా భూ భ్రమణానికి స్పష్టమైన సమయం లేదు. ఖగోళంలో సంభవించే పరిణామాలు, వాతావరణ మార్పుల వల్ల రోజులో మైక్రో సెకన్ల కాలం తగ్గడం,పెరగడం జరుగుతోంది.
భూభ్రమణానికి సమానంగా టైమ్‌ను జతపరిచేందుకు అలా పెరిగిన సెకన్ల కాలాన్ని లీప్ సంవత్సరంగా గుర్తిస్తున్నారు.
భూమి తిరిగే వేగానికి అనుగుణంగా కాాలాన్ని మైక్రో సెకన్లు, నానో సెకన్ల తేడాను కూడా నమోదు చేసేందుకు శాస్త్రవేత్తలు 1950లలో ఆటమిక్ క్లాక్స్ ఏర్పాటు చేశారు. ఈ గడియారాలు మైక్రో సెకన్లను కూడా గుర్తిస్తాయి. సమయాన్ని స్పష్టంగా లెక్కిస్తాయి.
సెకనులో వంద కోట్ల భాగాన్ని నానో సెకన్లను కూడా ఇవి నమోదు చేస్తాయి.
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు ఉపయోగించే సమయానికి కారణమైన కో ఆర్డినేటెడ్ యూనివర్సల్ టైమ్‌ను ఈ ఆటమిక్ క్లాక్స్ ద్వారానే రూపొందించారు. ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 450 ఆటమిక్ గడియారాల ద్వారా నమోదైన సమయాన్ని ఒక్కటిగా చేసి గణిస్తారు.
ప్రపంచ ప్రామాణిక సమయాన్ని గుర్తించడానికి ఆటమిక్ గడియారం ద్వారా గుర్తించిన సమయమే ఆధారం.
మన ఫోన్లు, వాచ్‌లు శాటిలైట్లలోని సమయాాలు దీన్ని బట్టే నడుస్తాయి.
ఈ గడియారాలు ఒక్క సెకను పాటు ఆగిపోయినా లేదా కాలాన్ని నమోదు చేయడంలో పొరపాటు జరిగినా, అది మన కంప్యూటర్లు, ఫోన్లు , జీపీఎస్ సిగ్నల్స్ , సర్వర్లలో సమయ స్పష్టత లోపిస్తుంది.
భూభ్రమణాన్ని గణించేందుకు ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆటమిక్ గడియారాలు భూమి తిరిగే వేగం 0.9 సెకన్ల కంటే ఎక్కువగా ఉండటాన్ని ఇంటర్నేషనల్ ఎర్త్ రొటేషన్ అండ్ రిఫరెన్స్ సిస్టమ్ సర్వీసెస్ గుర్తించినప్పుడు ఆ గడియారానికి లీప్ సెకన్లను కలుపుతోంది.
భారత దేశంలో ఆటమిక్ క్లాక్స్ అహ్మదాబాద్, ఫరీదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, గువాహటిలో ఉన్నాయి. వీటిని ఆప్టిక్ ఫైబర్ కేబుల్ ద్వారా అనుసంధానించారు. భారత్‌లో ఈ గడియారాలను నేషనల్ ఫిజికల్ లేబోరేటరీ నిర్వహిస్తోంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
ఎందుకిలా జరుగుతోంది?
దాదాపు 60 కోట్ల ఏళ్ల క్రితం భూమి మీద రోజుకు 22 గంటలే ఉండేవి. అంత కంటే వెనక్కు వెళితే 14 నుంచి 18 గంటలు ఉన్న రోజులు కూడా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. అప్పట్లో భూమి నుంచి చంద్రుడు ప్రస్తుతం కంటే మరింత దగ్గరగా ఉండేవాడు.
ఇవన్నీ చూస్తే భూమి మీద రోజుకు 24 గంటలే అనేది శాశ్వతం అనుకునే పరిస్థితి లేదు. అయితే ఇలాంటి మార్పులు జరగడానికి కొన్ని కోట్ల సంవత్సరాలు పడుతుంది.
భూమి తిరిగేటప్పుడు చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వల్ల సముద్రంలో అలల మధ్య ఏర్పడే ఘర్షణ వల్ల భూమి తిరిగే వేగం తగ్గుతోంది.
దీని వల్ల భూమి మీద ఒక రోజు గడువు వందేళ్లలో 1.7 మిల్లీ సెకన్లు పెరిగింది. ఇది కొన్ని కోట్ల సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామమే అయినప్పటికీ, స్వల్పకాలంలో సంభవిస్తున్న వాతావరణ మార్పులు, కరిగిపోతున్న మంచు లాంటివి భూమి తిరిగే వేగంపై ప్రభావం చూపుతున్నాయి.
వాతావరణ మార్పులు, భూమి లోపల సంభవిస్తున్న పరిణామాలు, చంద్రుడు భూమికి దూరంగా జరగడం వల్ల భూమి ఒక భ్రమణం పూర్తి చేయడానికి 25 గంటలు పడుతుందని నాసా అధ్యయనంలో తేలింది.
అపోలో మిషన్లలో పాల్గొన్న వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై ఉంచిన రిఫ్లెక్టర్లపై లేజర్లను ప్రయోగించడం ద్వారా భూమి నుంచి చంద్రుడు ఎంత వేగంతో దూరం అవుతున్నాడనే దానిని స్పష్టంగా లెక్కించారు.
చంద్రుడు ప్రతీ ఏటా భూమి నుంచి 3.8 సెంటీమీటర్లు దూరంగా వెళుతున్నట్లు వాళ్లు నిర్ధరించారు. ఇది పెరిగే కొద్దీ రోజులో సమయం పెరుగుతోంది.
"ఇదంతా సముద్రంలో ఆటు పోట్ల వల్లనే" అని లండన్ యూనివర్సిటీలోని రాయల్ హాలోవేలో జియోఫిజిక్స్ ప్రొఫెసర్ డేవడ్ వాల్థమ్ చెప్పారు.
ఆయన భూమి, చంద్రుడు మధ్య సంబంధంపై అధ్యయనం చేస్తున్నారు.
భూమి తిరిగేటప్పుడు చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి మహా సముద్రాలపై పడుతుంది. దీంతో సముద్రాల్లో అలలు కొన్ని పెద్దవిగా, కొన్ని చిన్నవిగా మారతాయి. దీంతో వాటి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. దీని కారణంగా భూమి భ్రమణ శక్తి తగ్గుతుంది. చంద్రుడి శక్తి పెరిగే కొద్దీ భూమి తిరిగే వేగం తగ్గుతుంది.
రోజువారీగా చూస్తే ఇదేమీ పెద్ద తేడాగా అనిపించదు. కానీ దీర్ఘకాలంలో చూస్తే మాత్రం కాలంలో పెద్ద మార్పు కనిపిస్తుంది.
తాజా విశ్లేషణ ప్రకారం 1600 చివరి నుంచి భూమి మీద రోజు వ్యవధి వందేళ్లలో 1.09 మిల్లీ సెకన్లు పెరిగింది.
ఇతర అంచనాలు, గతంలో ఏర్పడిన గ్రహణాల ఆధారంగా చూసినప్పుడు ఇది వందేళ్లకు 1.78 మిల్లీ సెకన్లుగా ఉంది.
ఇవేవీ పెద్దగా కనిపించకపోయినా, 4.5 బిలియన్ సంవత్సరాల భూగ్రహ చరిత్రలో ఇదంతా ఒక లోతైన మార్పుకు దారితీస్తుంది.
ప్రస్తుతం చంద్రుడు భూమి నుంచి 3,84,400 కిలో మీటర్ల దూరంలో ఉన్నాడు.
అయితే 3.2 బిలియన్ ఏళ్ల క్రితం చంద్రుడు- భూమి మధ్య దూరం 2,70,000 కిలోమీటర్లుగా ఉంది. ఇది దాని ప్రస్తుత దూరంలో 70శాతం.

ఫొటో సోర్స్, Getty Images
భూ భ్రమణవేగం తగ్గడంలో భారత్, చైనాల పాత్రేంటి?
చైనా నిర్మించిన భారీ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు త్రీ గార్జెస్ డ్యామ్ కారణంగా భూ భ్రమణ వేగం 0.06 మైక్రో సెకన్లు తగ్గిందని గతంలో నాసా వెల్లడించింది.
దీంత పాటు కరుగుతున్న హిమానీ నదాలు, తరిగిపోతున్న భూగర్భ జలాలు, పెరుగుతున్న సముద్రమట్టాలు కూడా భూవేగాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిణామాల వల్ల భూమి అక్షం మరింత వంగిపోతోంది.
తాగు, సాగునీరు, పారిశ్రామిక అవసరాల కోసం ఉత్తర అమెరికా, వాయువ్య భారత దేశంలో భూగర్భ జలాలను భారీగా తోడేస్తున్నారు.
1993 నుంచి 2010 మధ్య 2150 గిగాటన్నుల భూగర్భ జలాలను వెలికి తీశారు. ఇది 860 మిలియన్ ఒలింపిక్ సైజు స్విమ్మింగ్ పూల్స్‌లో నీటికి సమానం.
భూగర్భ జలాలను తోడేయడం వల్ల భారీ పరిణామంలో నీరు ఒక చోట నుంచి మరో చోటకు తరలిపోతోంది.
దీంతో భూ ద్రవ్యరాశి పంపిణీలో అసమానతల వల్ల భూమి తిరిగే వేగం తగ్గిపోతోంది. భూమి అక్షం 31.5 అంగుళాలు (80 సెంటీమీటర్లు) వంగిపోయిందని సోల్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన కి వియోన్ సో నాయకత్వంలో జరిగిన పరిశోధనలో తేలింది.
నీటి కదలిక భూ భ్రమణ వేగాన్ని ఎలా ప్రభావితం చేసిందో ఈ పరిశోధన ఎత్తి చూపింది.
ఇలా నీటిని తోడేయడం వల్ల సముద్ర మట్టం 0.24 అంగుళాలు పెరిగింది.
దీని వల్ల భూమి ద్రవ్యరాశిలో తేడాలు వచ్చాయి. దీంతో భూఅక్షం ఏటా 4.36 సెంటీమీటర్లు చొప్పున వంగిపోతూ వచ్చింది.
ఈ మార్పును శాస్త్రవేత్తలు 2000 సంవత్సరంలో తొలిసారి గుర్తించారు.
ఇలా ఎందుకు జరుగుతోందో తెలుసుకోవడానికి పదేళ్ల పాటు పరిశోధనలు జరిగాయి.

ఫొటో సోర్స్, Getty Images
రోజులో గంట పెరిగితే ఏమవుతుంది?
రోజు వ్యవధి 25 గంటలకు పెరిగితే, మనుషుల మీద అనేక రకాలుగా ప్రభావం చూపుతుంది. క్యాలెండర్లు, గడియారాల్లో సమయం లాంటి అంశాలతో పాటు మనుషుల్లో జీవ సంబంధ అంశాల్లోనూ మార్పు వస్తుందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఇస్రో మాజీ శాస్త్రవేత్త ఒకరు చెప్పారు.
అయితే రోజు వ్యవధి పెరిగితే దానికి అలవాటుపడటమనేది కూడుకున్నది.
రోజుకు 25 గంటల వల్ల ఖండాలు, సముద్రాలు మారిపోవచ్చు. కొత్త జీవావరణం ఉద్భవించవచ్చు. దూరంగా వెళ్లే కొద్దీ చంద్రుడు ఇప్పుడున్న దాని కంటే చిన్నగా కనిపిస్తాడు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి తగ్గే కొద్దీ సముద్రాల్లో ఆటుపోట్లు బలహీన పడతాయి.
రోజు పెద్దదిగా ఉండటం వల్ల భూమి మీద వేడి విస్తరణలో తేడాలు వస్తాయి. ఇది వాతావరణ విస్తరణ, వాతావరణ నమూనాలను మార్చివేస్తుంది.
జీవ సంబంధమైన పరిణామాలు కూడా కొత్తగా ఏర్పడవచ్చు. అనేక మొక్కలు, జంతువులు, మనుషులు పగటి ఉష్ణోగ్రత చక్రంపై ఆధారపడతారు.
పగటి ఉష్ణోగ్రతలు మరో గంట పెరిగితే భవిష్యత్‌లో వివిధ రకాల జీవులు తదనుగుణంగా తమ అలవాట్లను మార్చుకోవాల్సి వస్తుంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














