ఒంటె పాలు తాగడం మంచిదేనా, ఇవి వెంటనే అరుగుతాయా?

ఫొటో సోర్స్, Mahesh Garva/Sahjivan
- రచయిత, అపూర్వ అమీన్
- హోదా, బీబీసీ కోసం
"ఒంటె ఏ గడ్డి పడితే అది తినదు.. మేక రాళ్లు తప్ప అన్నీ లోపలేస్తుంది" అనే సామెతను గుజరాత్‌లోని గ్రామీణ ప్రాంతాల్లో తరచూ వాడుతుంటారు.
ఒంటె పాల ప్రత్యేకత గురించి చెప్పేందుకు గుజరాతీలు ఈ సామెత వాడతారు. ఒంటె పాలను అక్కడ 'తెల్ల బంగారం'గా పిలుస్తుంటారు. అలా పిలిచేందుకు దీని వెనుకాల ఒక కారణం ఉంది.
కచ్‌కు చెందిన ఒంటెలు వివిధ రకాల మొక్కలను ఆహారంగా తీసుకోవడమే.
ఒంటె పాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతారు. ఎన్నో పెద్ద జబ్బులను ఈ పాలు నయం చేయగలవని అంటారు.
'సమతుల ఆహార ప్రణాళిక'లో (పర్‌ఫెక్ట్ డైట్‌లో) ఒంటెపాలకు ప్రత్యేకమైన స్థానం ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఒంటె పాల ప్రయోజనాల గురించి బీబీసీ కొందరు నిపుణులతో మాట్లాడింది.

భారత్‌లో ఒంటెల జనాభాలో 90 శాతం గుజరాత్, రాజస్థాన్‌లో ఉన్నాయి. అయితే, క్రమంగా తగ్గుతోన్న ఒంటెల జనాభా ఆందోళనకరమైన అంశంగా ఉంది.
ఇప్పటి వరకు వీటిని ఒక ప్రయాణ సాధనంగా, సరుకుల రవాణా కోసం వాడారు. కానీ, ఇప్పుడు ఒంటె పాల వినియోగం విస్తృతంగా పెరుగుతూ వస్తోంది.
ప్రపంచంలో చాలా ప్రాంతాల్లో ముఖ్యంగా ఎడారి, పాక్షిక ఎడారి ప్రాంతాల్లో ప్రజలు తీసుకునే ఆహారంలో ఒంటె పాలు ఒక ముఖ్యమైన భాగంగా ఉంటున్నాయి.
న్యూస్ వెబ్‌సైట్ స్క్రోల్ కథనం ప్రకారం.. భారత్ వార్షికంగా 7 వేల టన్నుల ఒంటె పాలను ఉత్పత్తి చేస్తోంది. అయితే, ఇది ప్రపంచ ఉత్పత్తిలో 0.2 శాతం కంటే తక్కువ.
భారత్ 1984లో ఒంటెలపై జాతీయ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.
1970ల్లో భారత్‌లో 11 లక్షల ఒంటెలున్నట్లు అంచనాలున్నాయి.
కానీ, నాలుగు దశాబ్దాల్లోనే ఈ ఒంటెల జనాభా భారత్‌లో 75 శాతం తగ్గి 2.5 లక్షలకు పడిపోయినట్లు 2019 అక్టోబర్‌లో విడుదల చేసిన 20వ పశుగణన డేటాలో వెల్లడైంది.
2012 నుంచి 2019 మధ్య కాలంలోనే ఒంటెల జనాభా 37 శాతం తగ్గింది.

ఫొటో సోర్స్, Mahesh Garva/Sahjivan
ఒంటె పాలలో ఉన్న పోషకాలు, వాటి వల్ల ప్రయోజనాలు
సౌదీ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్సస్‌లో ప్రచురితమైన ఒక పరిశోధనలో... ఒంటెల్లో రెండు రకాలు ఉంటాయని తెలిసింది.
ఒకటి వెనుకవైపు రెండు మూపురాలు కలిగిన బ్యాక్ట్రియన్ కామెల్ (కామెలస్ బ్యాక్ట్రియానస్), రెండోది వెనుకవైపు ఒక్క మూపురం కలిగిన డ్రోమెడరీ కామెల్ (కామెలస్ డ్రోమెడారియస్).
ఈ పరిశోధన ప్రకారం.. ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలల్లో మూడు నుంచి ఐదింతలు ఎక్కువ విటమిన్ సీ ఉంటుంది.
వీటిలో పీహెచ్ విలువ 6.2 నుంచి 6.5 మధ్యలో ఉంటుంది. ఆవు పాలతో పోలిస్తే కాస్త తక్కువ. ఆవు పాలలో పీహెచ్ విలువ 6.5 నుంచి 6.7 మధ్యలో ఉంటుంది.
గేదె, ఆవు పాలలో గుర్తించే బీ-లాక్టోగ్లోబులిన్ (బీటా-లాక్టోగ్లోబులిన్) ప్రొటీన్ చాలామందిలో ముఖ్యంగా పిల్లల్లో అలర్జీలు కలిగించడానికి ప్రధానమైనదిగా చూస్తారు.
తల్లి పాలల్లో బీ-లాక్టోగ్లోబులిన్ ప్రొటీన్ అనేది ఉండదు. ఒంటె పాల ప్రొటీన్ నిర్మాణం ఆవు పాల మాదిరిగా కాకుండా అచ్చం తల్లి పాల మాదిరిగా ఉంటుంది.
బీ-లాక్టోగ్లోబులిన్ ప్రొటీన్ లేకపోవడం వల్ల ఒంటె పాలు త్వరగా అరుగుతాయి.
పాలు తాగిన తర్వాత గ్యాస్, ఎసిడిటీ లేదా కడుపు ఉబ్బరంతో ఇబ్బందిపడే వారికి ఒంటె పాలు అద్భుతమైన ప్రత్యామ్నాయం.
గేదె, ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలలో చాలా తక్కువ కొవ్వు శాతం ఉంటుంది.
ఒంటె పాలలో బీ1, బీ2, సీ అనే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.
ఆవు పాలతో పోలిస్తే ఒంటె పాలలో మూడు నుంచి ఐదింతలు ఎక్కువ విటమిన్ సీ ఉంటుంది.
ఎడారి ప్రాంత ప్రజల ఆహారంలో ఇది చాలా ముఖ్యమైనది.
మెడికల్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రశాంత్ పనారా బీబీసీతో మాట్లాడుతూ, ''ఒంటె పాలు తల్లి పాలకు దగ్గరగా ఉంటాయి. ఒంటె పాలల్లో విటమిన్ బీ12, జింక్, కాల్షియం తగినంత మొత్తంలో ఉంటాయి. అలాగే, ప్రొటీన్, శాచురేటెడ్ ప్రొటీన్ ఉంటాయి. ఈ పాలతో ఎలాంటి ఇబ్బంది ఉండదు. అదనంగా, ఒంటె పాలు మధుమేహంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయని నిరూపితమైంది'' అని చెప్పారు.
''దీని ప్రత్యేక లక్షణాల కారణంగా లాక్టోస్ ఇన్‌టోలరెన్స్‌తో ఇబ్బందిపడే వారికి కూడా ఇది ప్రయోజనకరంగా ఉందని నిరూపితమైంది. ఈ పాలు మన రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో అద్భుతంగా పనిచేస్తాయి'' అని ఆయన తెలిపారు.
''ప్రతి పాలకు మన శరీరం ఒకే విధంగా స్పందించదు. ఒంటె పాలలో ఉన్న పోషకాలు ఎముకల దృఢత్వానికి, కండరాల బలానికి, నరాల సమతుల్యతకు సాయపడతాయి'' అని ఫుడ్స్ అండ్ న్యూట్రిషియన్ (డైట్ అండ్ న్యూట్రిషియన్ కన్సల్టెంట్)లో పీహెచ్‌డీ చేసిన డాక్టర్ పూర్వీ పారిఖ్ బీబీసీతో చెప్పారు.
''ఒంటె పాలు ఏ2 రకం, వీటిల్లో బీటా-లాక్టోగ్లోబులిన్ ఉండదు, విటమిన్ సీ, జింక్, ఐరన్ పుష్కలంగా ఉంటాయి, కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది'' అని తెలిపారు.

ఫొటో సోర్స్, Mahesh Garva/Sahjivan
గుజరాత్‌లో ఒంటె పాల వ్యాపారం ఎవరు చేస్తారు?
గుజరాత్‌లో ప్రధానంగా రెండు జాతులకు చెందిన ఒంటెలు ఉన్నాయి. అవి ఖరాయ్, కచ్ఛీ. దేశవ్యాప్తంగా మొత్తం తొమ్మిది జాతుల ఒంటెలు కనిపిస్తాయి.
''కచ్‌లో సుమారు 350 కుటుంబాలు ఒంటెలను పెంచుతున్నాయి. ఒక ఒంటె రోజుకు 4 నుంచి 5 లీటర్ల పాలను ఇస్తుంది'' అని కచ్ కామెల్ బ్రీడర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఆశాభాయ్ రబారీ చెప్పారు.
''కచ్ కాకుండా ఇతర జిల్లాల్లో 100 కుటుంబాలు ఒంటెల పెంపకంలో నిమగ్నమై ఉన్నాయి'' అని ఒంటెలు, వాటి పెంపకందారుల కోసం పనిచేసే సంస్థ ''సహజీవన్'కు చెందిన మహేష్ భాయ్ గర్వా తెలిపారు.
గుజరాత్‌లోని కచ్ నుంచి పాలను సేకరించి, ఆ పాలను బోర్డర్ డెయిరీకి పంపుతారు.
''గుజరాత్‌లో 'ఫకిరాణి జాట్', 'రబారీ' కమ్యూనిటీలు ప్రధానంగా ఒంటెల పెంపకాన్ని చేపడుతున్నారు. అంతేకాక, కచ్‌లోని ఖవాడా ప్రాంతానికి చెందిన 'సమా' కమ్యూనిటీ కూడా ఒంటెల పెంపకంలో ఉందని గర్వా తెలిపారు.
గుజరాత్‌లోని ఒంటె పాల సేకరణ ప్రక్రియ గురించి మహేష్ భాయ్ గర్వా వివరిస్తూ .. '' ప్రస్తుతం కచ్ జిల్లాలో ఐదు ప్రాంతాల నుంచి పాలను సేకరిస్తున్నారు. వీటిలో రాపర్- కోడా చక్కా, నఖత్రానా, గధ్సిసా, దయాపర్‌లో పాల సంఘాలు ఉన్నాయి'' అని చెప్పారు.

ఫొటో సోర్స్, Mahesh Garva/Sahjivan
ఒంటె పాల రుచి, ధరలో వ్యత్యాసం
''ఒంటె పాల నుంచి తయారు చేసిన పలు ఉత్పత్తులు మార్కెట్లో దొరుకుతున్నాయి. వాటిల్లో ముఖ్యమైనవి కామెల్ మిల్క్ చాక్లెట్, పచ్చి పాలు, కుంకుమ పువ్వు కలిపిన పాలు, పాల పౌడర్ వంటివి ఉన్నాయి. ఈ ఉత్పత్తులు ఆన్‌లైన్ వెబ్‌సైట్లలో కూడా తేలిగ్గా అందుబాటులో ఉంటున్నాయి'' అని మహేష్ భాయ్ చెప్పారు.
''ప్రస్తుతం ఖీర్, ఐస్‌క్రీమ్, చాక్లెట్ వంటి పలు ఆహారోత్పత్తులను ఒంటె పాల నుంచి తయారు చేస్తున్నారు'' అని సహజీవన్ సంస్థ కార్యకర్త, పర్యావరణ వేత్త రమేష్ భాయ్ భాటి చెప్పారు.
ఒంటె పాలకు ఎక్కువగా ప్రాచుర్యం పొందిన సర్హాద్ డెయిరీ ఫౌండర్, చైర్మన్ వలంజీ హంబల్ బీబీసీతో మాట్లాడుతూ.. '' అంతకుముందు చిన్న హోటళ్లలో ఒంటె పాలను లీటరు రూ.20 నుంచి రూ.25కు అమ్మేవాళ్లం. తొలుత 300 లీటర్ల సేకరణతో ప్రారంభించాం. కానీ, ఇప్పుడు రోజుకు 5 వేల లీటర్లను సేకరిస్తున్నాం. కచ్‌లో 70 శాతం పాలను సర్హాద్ డెయిరీ సేకరిస్తుంది'' అని తెలిపారు.
ఐదేళ్ల క్రితం కచ్‌లోని యువత ఈ వ్యాపారం నుంచి ఇతర వ్యాపారాలకు మరలిందని వలంజీ తెలిపారు.
'' ప్రస్తుతం మేం ఒంటె పాల పౌడర్‌ను తయారు చేస్తున్నాం. మా వ్యాపారాన్ని విదేశాలకు కూడా విస్తరించాలని ప్రయత్నిస్తున్నాం. యువత మళ్లీ ఈ వ్యాపారం వైపుకు మరలుతోంది. ఒంటెలను అమ్మడం బదులు, వీటిని కొంటున్నారు'' అని చెప్పారు.
భారత ఆహార భద్రత, ప్రమాణాల ప్రాధికార సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) 2019లో ఒంటె పాలను ఆహార పదార్థంగా గుర్తించింది.
''గుజరాత్‌లో కచ్‌లో మాత్రమే కాకుండా.. ఒంటె పెంపకందారులు ప్రధానంగా జామ్‌నగర్, ద్వారకా, భరూచ్, భావ్‌నగర్, బనస్కాంఠాలలోని డీసా, పాలన్పూర్‌లలో ఉంటారు'' అని రమేష్ భాయ్ భాటి చెప్పారు.

ఫొటో సోర్స్, Mahesh Garva/Sahjivan
ఒంటెల్లో వ్యాధులు
పశ్చిమ బెంగాల్‌లోని సుందర్బన్స్ తర్వాత, కచ్‌లో ఎక్కువగా చిత్తడి అడవులు ఉన్నాయి. ఈ అడవులపై ఆధారపడి కచ్‌లో ఒంటెలు జీవిస్తున్నాయి.
గుజరాత్‌లో గుర్తించిన జాతి ఖరాయ్ ఒంటె ప్రత్యేక లక్షణం ఏంటంటే.. సముద్ర నీటిలో కూడా ఇది ఈదగలదు.
కచ్‌లోని ఖరాయ్ ఒంటెల జనాభా చాలా తక్కువ. ఒంటె పాల రుచి అనేది ఆ ఒంటె తినే ఆహారంపై ఆధారపడి ఉంటుందని రమేష్ భాయ్ భాటి చెప్పారు.
సాల్ట్-సాండ్ కామెల్ (ఒంటెలు) వారానికి ఒకసారి ఉప్పు ఉన్న ప్రాంతంలో మేత మేయడానికి వెళ్తాయి.
''ఒంటెలు తమ ఆహార అవసరాల కోసం వారానికి ఒకరోజు ఉప్పు ఉన్న ప్రాంతాల్లో మేత మేయడానికి వెళ్తాయి. ఉప్పుగా ఉన్న ఆహారాన్ని తీసుకోవడం వాటి సహజ లక్షణం. అందుకే, వాటి పాల రుచి కాస్త ఉప్పగా ఉంటుంది'' అని రమేష్ భాయ్ భాటి తెలిపారు.
ఒంటెలలో రెండు వ్యాధులను మనం ప్రధానంగా చూడొచ్చని కచ్ జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ రాజేష్ పటేల్ తెలిపారు.
''గుజరాత్‌లో 'ఫిడా' అని పిలిచే ట్రిపనోసోమియాసిస్, ఇది సాధారణంగా బ్రెయిన్ ఫీవర్‌కు చెందింది. తల తిరుగుడుకు, డీహైడ్రేషన్‌కు కారణమవుతుంది. కొన్నిసార్లు ఒంటె చనిపోవచ్చు కూడా. ఈ వ్యాధికి ఇంజెక్షన్ల రూపంలో ప్రభుత్వం ఉచితంగా చికిత్స అందిస్తోంది'' అని డాక్టర్ రాజేష్ పటేల్ చెప్పారు.
''మరో వ్యాధి మాంగే. ఇది చర్మానికి సంబంధించిన అంటు వ్యాధి. ఒంటెలలో ఇది సాధారణం'' అని డాక్టర్ రాజేష్ పటేల్ తెలిపారు.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














