ఇండియా టాప్ 3 ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ల కోసం దక్షిణాఫ్రికా ఏ వ్యూహంతో బరిలోకి దిగుతోంది?

భారత్, దక్షిణాఫ్రికా , అహ్మదాబాద్, టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రదీప్ కృష్ణ
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 5 నిమిషాలు

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఆదివారం సూపర్ 8 మ్యాచ్ జరగనుంది. గత టీ20 ప్రపంచకప్ ఫైనల్‌లో తలపడిన ఈ రెండు జట్లు మరోసారి ఎదురవడంతో ఈ మ్యాచ్‌పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

సూపర్-8లోని మొదటి గ్రూప్‌లో భారత్, దక్షిణాఫ్రికాతో పాటు వెస్టిండీస్, జింబాబ్వే కూడా ఉన్నాయి. లీగ్ దశలో ఈ నాలుగు జట్లకు పరాజయమే ఎదురవలేదు. భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఆడిన 4 మ్యాచ్‌లలో విజయం సాధించాయి. జింబాబ్వే 3 మ్యాచ్‌ల్లో గెలవగా, ఒకటి వర్షం కారణంగా రద్దయింది. దీంతో, ఆ గ్రూప్‌లోని అన్ని జట్లు అజేయంగా నిలిచాయి. ఈ సూపర్-8 రౌండ్‌లో ప్రతి విజయం కీలకం.

ఈరోజు జరిగే మ్యాచ్‌లో ‌భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాయో తెలుసుకుందాం.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, దక్షిణాఫ్రికా , అహ్మదాబాద్, టీ20 ప్రపంచకప్, అభిషేక్ శర్మ

ఫొటో సోర్స్, Getty Images

భారత్ బలహీనతలు

భారత జట్టు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచినప్పటికీ, కొన్ని బలహీనతలు ఉన్నాయి. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఫామ్, ఆఫ్-స్పిన్‌లో భారత బ్యాటర్ల ఇబ్బందులు, క్యాచ్‌లు జారవిడవడం, పేలవమైన ఫీల్డింగ్‌పై అభిమానులు ఆందోళనగా ఉన్నారు.

అభిషేక్ శర్మ ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ డకౌట్ అయ్యాడు. ఈ వరల్డ్ నంబర్‌వన్ టీ20 ర్యాంకింగ్ బ్యాటర్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ప్రస్తుత టోర్నీలో పరుగుల ఖాతా తెరవలేకపోయాడు. అభిషేక్ శర్మ స్థానంలో సంజూ శామ్సన్‌ను ఆడించాలా వద్దా అనే ప్రశ్నల మధ్య, శనివారం మీడియాతో మాట్లాడిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అందరూ అభిషేక్ శర్మకు మద్దతు ఇవ్వాల్సిన సమయమిదన్నాడు.

"గత సంవత్సరమంతా అభిషేక్ శర్మ బాగా ఆడాడు, ఇప్పుడు అతనికి మద్దతు ఇవ్వడం మన వంతు" అన్నాడు.

దీంతో, అతనికి జట్టులో చోటు కొనసాగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక తిలక్ వర్మది మరో రకమైన పరిస్థితి, అతను ఇన్నింగ్స్‌ను నెమ్మదిగా నిర్మిస్తున్నాడు. ఆడిన 4 మ్యాచ్‌ల్లో 120.45 స్ట్రైక్ రేట్‌తో 106 పరుగులు మాత్రమే చేశాడు. పవర్‌ప్లే తర్వాత వేగంగా పరుగులు చేయలేకపోయాడు. అయితే, తిలక్ వర్మకు కెప్టెన్ మద్దతుగా నిలిచాడు. తిలక్ గురించి ఆందోళన చెందడం లేదని, అతను బాగా రాణిస్తాడనే నమ్మకముందని అన్నాడు.

ఫీల్డింగ్ విషయంపై భారత జట్టు మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోలో మాట్లాడుతూ, భారత జట్టు ఫీల్డింగ్‌లో కచ్చితంగా మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. గత 6 నెలల్లో దీనిపై చాలా చర్చలు జరిగాయని, ఆటగాళ్లు ఫీల్డింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు.

భారత్, దక్షిణాఫ్రికా , అహ్మదాబాద్, టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

పవర్ ప్లేలో ఆసక్తికర పోరు

పరుగులు చేయడంలో అభిషేక్, తిలక్ ఇబ్బంది పడుతుండగా, మిగతా బ్యాటర్లు ఆఫ్-స్పిన్నర్ల బౌలింగ్‌లో తడబడుతున్నారు. గత 2 మ్యాచ్‌లలో అభిషేక్ శర్మ ఆఫ్-స్పిన్నర్ల బౌలింగ్‌లోనే ఔటయ్యాడు. ఇషాన్ కిషన్ ఫామ్‌లో ఉన్నప్పటికీ, గత 3 మ్యాచ్‌లలో ఆఫ్-స్పిన్నర్లకే వికెట్ సమర్పించుకున్నాడు.

టాప్-3 బ్యాటర్స్ ఎడమచేతి వాటం కావడంతో, ప్రత్యర్థి జట్టు ఆఫ్-స్పిన్నర్లతో ఆటను ప్రారంభిస్తున్నాయి. పాకిస్తాన్, నెదర్లాండ్స్ కూడా అదే చేశాయి. కాబట్టి, దక్షిణాఫ్రికా కూడా అదే వ్యూహాన్ని అవలంభిస్తుందని భావిస్తున్నారు.

తొలి ఓవర్ బౌలింగ్‌ చేయడానికి కెప్టెన్ మార్‌క్రమ్ వచ్చే అవకాశాలు ఎక్కువున్నాయి. భారత పిచ్‌లపై బౌలింగ్ చేసిన అనుభవం అతనికి ఉంది. అది కచ్చితంగా భారత జట్టుకు సవాలుగా ఉంటుందని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, మార్‌క్రమ్ కాకుండా, దక్షిణాఫ్రికా జట్టులో గుర్తింపుపొందిన ఇతర ఆఫ్-స్పిన్నర్లు లేరు. ట్రిస్టన్ స్టబ్స్ ఆఫ్-స్పిన్ బౌలింగ్ చేయగలడు కానీ, అతను అంతర్జాతీయ మ్యాచ్‌లలో పెద్దగా బౌలింగ్ చేయలేదు.

ఒక ఎండ్‌లో మార్‌క్రమ్ ఆఫ్-స్పిన్ వేస్తే, మరొక ఎండ్‌లో వేరొకరు ఫాస్ట్ బౌలింగ్ వేయవచ్చు. అలా జరిగితే, ఓపెనర్లు మార్‌క్రమ్‌ను ఆచితూచి ఆడి, ఫాస్ట్ బౌలర్‌ను లక్ష్యంగా చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో, పవర్‌ప్లేలో ఆసక్తికర పోరాటాన్ని ఆశించవచ్చు.

దక్షిణాఫ్రికా, ఇండియా

ఫొటో సోర్స్, Getty Images

దక్షిణాఫ్రికా బౌలర్ల వేగం భారత్‌కు లాభమా?

ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోలో సంజయ్ బంగర్ కీలక విషయాన్ని ప్రస్తావించారు. "దక్షిణాఫ్రికా వేగం భారత ఆటగాళ్లకు అనుకూలంగా ఉంటుంది" అన్నారు.

భారత బ్యాటర్లు భారీ షాట్లు కొట్టడానికి బంతి వేగాన్ని బాగా ఉపయోగించుకుంటారు. ఈ ప్రపంచకప్‌లో వారికి అంత వేగం దొరకలేదని, అందుకే భారత్ మునుపటిలాగా భారీ స్కోరు చేయలేకపోయారని బంగర్ అభిప్రాయపడ్డారు.

నెదర్లాండ్స్, అమెరికా, నమీబియా వంటి జట్లకు అంత పేరున్న ఫాస్ట్ బౌలర్లు లేరు. పాకిస్తాన్ కూడా స్పిన్నర్లపై ఎక్కువగా ఆధారపడింది. అయితే, అహ్మదాబాద్ లాంటి పిచ్‌పై దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాటర్లు కోరుకునే వేగాన్ని అందించగలరని బంగర్ అభిప్రాయపడ్డారు.

దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లలో కగిసో రబాడ, అన్రిచ్ నోర్ట్జే, మార్కో జాన్సెన్, లుంగి ఎన్గిడీలున్నారు. వారు వేగంగా బౌలింగ్ చేయగలరు. వారి ప్రధాన స్పిన్నర్లు కేశవ్ మహారాజ్, జార్జ్ లిండా ఎడమచేతి వాటం స్పిన్నర్లు. దీంతో దక్షిణాఫ్రికా వారిలో ఒకరినే ఆడించే అవకాశాలున్నాయి. అలాగే, మార్‌క్రమ్ ఆఫ్ స్పిన్నర్ కాబట్టి, ప్లేయింగ్ లెవన్‌లో కనీసం ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను ఉపయోగించాల్సి రావొచ్చు. ఇది భారత బ్యాటర్లకు అనుకూలంగా మారవచ్చు.

అహ్మదాబాద్ స్టేడియం

దక్షిణాఫ్రికా జట్టు లీగ్ దశ మ్యాచ్‌లలో మూడు అహ్మదాబాద్‌లోనే ఆడింది. ఆ జట్టు ప్రారంభం నుంచి అక్కడ శిక్షణ పొందుతోంది. కాబట్టి, స్టేడియం, అక్కడి పిచ్‌ల స్వభావం వారికి బాగా తెలుసునని, ఈ సూపర్ 8 మ్యాచ్‌లో అది వారికి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు.

భారత మాజీ ఫాస్ట్ బౌలర్ వరుణ్ ఆరోన్ ఈఎస్‌పీఎన్ క్రిక్‌ఇన్ఫోలో మాట్లాడుతూ, "దక్షిణాఫ్రికా జట్టు అహ్మదాబాద్‌లో ఎక్కువగా ఆడింది, కాబట్టి ఎక్కువ ప్రయాణించాల్సిన అవసరం లేదు. వారికి ఆ స్థలం బాగా పరిచయం ఉంటుంది. ఇంత టోర్నీలో ఇది చాలా కీలకం. ఆ జట్టులోని కొంతమంది ఆటగాళ్లు గుజరాత్ టైటాన్స్ తరపున, మరికొందరు మిగతా ఐపీఎల్ జట్ల తరఫున ఆడారు. మొత్తంమీద, ఇది వారికి సానుకూలాంశం కావచ్చు" అన్నారు.

ప్రపంచకప్ వంటి పెద్ద టోర్నమెంట్లలో ఏదైనా జట్టు ఎక్కువగా ప్రయాణించకపోవడాన్ని సాధారణంగా ఒక ప్రయోజనంగా భావిస్తారు. అందుకే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భారత జట్టు దుబాయ్‌లో తమ అన్ని మ్యాచ్‌లను ఆడటంపై చాలా చర్చ జరిగింది.

అహ్మదాబాద్ స్టేడియంలో దక్షిణాఫ్రికా జట్టు కెనడాపై 213 పరుగులు, అఫ్గానిస్తాన్‌పై 187 పరుగులు చేసింది, న్యూజీలాండ్‌పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. అఫ్గానిస్తాన్ మ్యాచ్ మినహా, మిగతా అన్ని మ్యాచ్‌లలోనూ సులభంగా గెలిచింది దక్షిణాఫ్రికా.

ఈ సిరీస్‌లో అత్యధిక రన్‌రేట్ ఉన్న వేదికలలో అహ్మదాబాద్ ఒకటి. దూకుడుకు పేరుగాంచిన దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ ఇక్కడ బాగా రాణించారు. ముఖ్యంగా కెప్టెన్ మార్‌క్రమ్ మంచి ఆరంభం ఇస్తున్నాడు. అందుకే, సుపరిచితమైన మైదానం, ఆటగాళ్ల ఫామ్ దక్షిణాఫ్రికాకు సహాయపడతాయి.

మరోవైపు, భారత జట్టు ఈ అహ్మదాబాద్ స్టేడియంలోనే తమ చివరి లీగ్ మ్యాచ్ ఆడింది, 17 పరుగుల తేడాతో గెలిచింది.

భారత్, దక్షిణాఫ్రికా , అహ్మదాబాద్, టీ20 ప్రపంచకప్

ఫొటో సోర్స్, Getty Images

వరుణ్ చక్రవర్తిని ఎదుర్కోగలదా?

స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఈ ప్రపంచకప్‌ టోర్నీలో బాగా రాణిస్తున్నాడు. అతను ఇప్పటివరకు 9 వికెట్లు పడగొట్టాడు. దక్షిణాఫ్రికా జట్టుపై అతనికి మంచి రికార్డు కూడా ఉంది. ఇప్పటివరకు దక్షిణాఫ్రికాతో ఆడిన 8 మ్యాచ్‌లలో 11.36 సగటుతో 22 వికెట్లు పడగొట్టాడు. ప్రతీ మ్యాచ్‌లో కనీసం రెండు వికెట్లు తీశాడు. ఫామ్‌లో ఉన్న మార్‌క్రమ్‌ను నాలుగు సార్లు ఔట్ చేశాడు (క్రికెట్‌మెట్రిక్స్ డేటా మేరకు). అహ్మదాబాద్‌లో కూడా వరుణ్ చక్రవర్తి ఆధిపత్యం కొనసాగే అవకాశాలున్నాయి.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)