యుక్రెయిన్ యుద్ధంలో మరణించిన భారతీయుల కుటుంబాలకు రష్యా పరిహారం

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, ఇమ్రాన్ ఖురేషి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఏజెంట్ల చేతిలో మోసపోయి రష్యా సైన్యంలో చేరి యుక్రెయిన్‌తో యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల కుటుంబాలకు పరిహారం చెల్లించే ప్రక్రియను రష్యా ప్రారంభించింది.

రెండు కుటుంబాలు ఈ విషయాన్ని బీబీసీకి ధ్రువీకరించాయి. రష్యా నుంచి పరిహారం డబ్బులు రావడం ప్రారంభమైందని వారు చెప్పారు. వారిలో ఒక కుటుంబం రష్యా పౌరసత్వాన్ని కూడా అంగీకరించినట్లు తెలిపింది.

‘‘మొత్తం రూ.1.3 కోట్లు రావాల్సి ఉండగా, ఇప్పటికే నా ఖాతాలో రూ.45 లక్షలు జమ అయ్యాయి. మిగిలిన మొత్తం ఈ నెల 15న లేదా 20న వస్తాయి’’ అని గుజరాత్‌కు చెందిన అశ్విన్‌ భాయ్ మంగుకియా బీబీసీతో చెప్పారు.

ఏజెంట్ చేతిలో మోసపోయి, రష్యా ఆర్మీలో హెల్పర్‌గా చేరిన మంగుకియా కుమారుడు 23 ఏళ్ల హేమిల్ అశ్విన్ భాయ్ ఫిబ్రవరి 21న జరిగిన క్షిపణి దాడిలో మరణించారు.

రష్యాలో మంచి జీతం వచ్చే ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెప్పిన మాటలను నమ్మిన చాలా మంది భారతీయుల మాదిరిగానే హేమిల్‌ కూడా వెళ్లారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
అస్ఫాన్‌తోపాటు పంజాబ్, హరియాణాల నుంచి రష్యాకు వెళ్లిన భారతీయులు తమకు సాయం చేయాలని కోరుతూ భారత్‌లో ఉన్న తమవారికి వీడియో పంపారు.
ఫొటో క్యాప్షన్, అస్ఫాన్‌తోపాటు పంజాబ్, హరియాణాల నుంచి రష్యాకు వెళ్లిన భారతీయులు తమకు సాయం చేయాలని కోరుతూ భారత్‌లో ఉన్న తమవారికి వీడియో పంపారు.

ఏజెంట్ల మోసం

రష్యా సైనిక స్థావరాల్లో సహాయకుల్లా పనిచేసే ఉద్యోగం ఇప్పిస్తామని ఏజెంట్లు చెబితే.. పేద కుటుంబాలకు చెందిన సుమారు 50 మంది భారతీయులు వెళ్లారు. ఆ ఏజెంట్లకు లక్షల రూపాయలు చెల్లించారు. కానీ, తర్వాత వారిని సైన్యంలో చేర్చారని వారి కుటుంబాలకు తెలిసింది.

భారత్ నుంచి రష్యాకు వెళ్లిన వారందరి వయసు 22 నుంచి 31 ఏళ్ల మధ్యలోనే ఉంటుంది.

బాధితుల్లో తెలంగాణ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, కశ్మీర్, పంజాబ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల వారు కూడా ఉన్నారు.

గుజరాత్‌కు చెందిన హేమిల్, హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అస్ఫాన్‌లు యుక్రెయిన్ సరిహద్దుల్లో చనిపోయిన తర్వాత, మిగిలిన భారతీయులను వెనక్కి తీసుకురావాలని వారి కుటుంబాలు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకున్నాయి.

అక్కడ చనిపోయిన వారి మృతదేహాలను భారత్‌కు తీసుకొచ్చారు. అయితే, అక్కడికి వెళ్లిన భారతీయుల్లో ఇద్దరు అదృశ్యమయ్యారు.

మేం మాట్లాడిన చాలా మంది భారతీయుల్లో హేమిల్‌కు తప్ప మరెవరికీ జీతం రాలేదని తెలిసింది. హేమిల్‌ మాత్రం రష్యాలో పనిచేసేటప్పుడు రెండు నెలల్లో తన తొలి జీతంగా రూ.2.2 లక్షలను ఇంటికి పంపారు.

అశ్విన్‌ భాయ్ మంగుకియా సూరత్‌లోని చేనేత మార్కెట్‌లో కార్మికుడిగా పనిచేస్తున్నారు.

‘‘నేను సంపాదించేదంతా బతకడం కోసమే. నా రెండో కొడుకు సైబర్ సెక్యూరిటీ కోర్సు చదువుతున్నాడు. మేం అక్కడ పౌరసత్వాన్ని ఒప్పుకున్నాం’’ అని తెలిపారు.

రష్యాలో ఎందుకు పౌరసత్వం తీసుకున్నారు? అని అడిగితే.. ‘‘మన దేశంలో సమస్యేంటంటే, మేం అంతగా సంపాదించలేం. మన దేశంలో అవినీతి ఎక్కువ’’ అని ఆయన అన్నారు.

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన షేక్ మహమ్మద్ తాహిర్‌ మాత్రం తనని యుద్ధ రంగంలోకి దించకముందే, మాస్కో నుంచి తప్పించుకుని భారత్‌కు వచ్చేశారు.

యుక్రెయిన్‌పై రష్యా యుద్ధం

మూడు దేశాలు.. ఐదుగురు ఏజెంట్లు

ఈ వ్యవహారం వెనుక మొత్తం ఐదుగురు ఏజెంట్ల పాత్ర ఉన్నట్లు బీబీసీ పరిశోధనలో తేలింది.

వీరంతా ఇండియాకు చెందిన వారే. కానీ వేర్వేరు దేశాల్లో ఉంటున్నారు.

రష్యాలో ఆర్మీ సహా వేర్వేరు సంస్థల్లో ఉద్యోగాల పేరిట భారతీయ యువకులను తీసుకెళ్లి వారి నుంచి డబ్బులు వసూలు చేశారు.

రాజస్థాన్‌కు చెందిన మొయిన్, తమిళనాడుకు చెందిన పళనిసామి రమేశ్ కుమార్ రష్యాలో ఉండి ఆపరేట్ చేశారు.

వీరికి అనుసంధానంగా దుబయిలో ఫైజల్ ఖాన్ ఉన్నారు. ఆయన నడిపే బాబా వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్‌లో ప్రకటనలు ఇచ్చి యువతకు వల వేశారు.

ముంబయిలో సుఫియాన్, పూజ అనే ఏజెంట్ల ద్వారా భారతీయ యువకులను ఆకర్షించారు.

ముంబయిలోని ఏజెంట్లను ఫోన్లో సంప్రదించేందుకు బీబీసీ ప్రయత్నించగా వారు అందుబాటులోకి రాలేదు.

ఫైజల్ ఖాన్ అందుబాటులోకి రావడంతో బీబీసీ ఆయనతో మాట్లాడింది.

మోదీ, పుతిన్

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాని మోదీ పర్యటనతో చిగురించిన ఆశలు

హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్ అస్ఫాన్ సోదరుడు మహమ్మద్ ఇమ్రాన్ బీబీసీతో మాట్లాడారు. రష్యా ప్రభుత్వం తమ కుటుంబానికి పరిహారాన్ని, పౌరసత్వాన్ని ఆఫర్ చేసిందని తెలిపారు.

‘‘మేం అక్కడికి వెళ్లాలనుకుంటున్నాం. డాక్యుమెంట్ల ప్రాసెస్ జరుగుతోంది. అస్ఫాన్ భార్యకు, ఇద్దరు పిల్లలకు (రెండేళ్ల కొడుకు, ఏడాది కూతురుకు) పౌరసత్వం ఇస్తామని రష్యా ప్రభుత్వం చెప్పింది’’ అని మహమ్మద్ ఇమ్రాన్ చెప్పారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాస్కో పర్యటనలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిసి ఈ సమస్యపై చర్చించిన తర్వాత, బాధిత కుటుంబాల్లో ఆశలు చిగురించాయి.

ప్రధానమంత్రి మోదీ పర్యటనతో తమకు ఆశలు పెరిగాయని కర్ణాటకలోని కలబురగికి చెందిన సమీర్ అహ్మద్ కుటుంబ సభ్యులు తెలిపారు. సమీర్ అహ్మద్ రష్యాలో యుద్ధంలో పాల్గొంటున్నారు.

తన కుమారుడితో కలిసి భర్త అస్ఫాన్ ఫొటో చూపిస్తోన్న భార్య

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తన కుమారుడితో కలిసి భర్త అస్ఫాన్ ఫొటో చూపిస్తోన్న భార్య

‘‘సమీర్ రెండు మూడు రోజులకు ఒకసారి మాట్లాడతాడు. అక్కడున్న భారతీయులందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు మన ప్రధానమంత్రి ఏదో ఒకటి చేస్తారని ఆశలున్నాయి. డిసెంబర్ 15న సమీర్ వెళ్లినప్పటి నుంచి మేం ఈ ఆశతోనే బతుకుతున్నాం’’ అని మహమ్మద్ ముస్తఫా చెప్పారు.

తమ ఆర్మీలో పనిచేసే చాలా మంది భారతీయులకు చట్టపరమైన వీసాలు లేవని న్యూ దిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది.

‘‘రష్యా ఉద్దేశ్యపూర్వకంగా సైన్యంలో భారతీయులను చేర్చుకోలేదు. ఈ యుద్ధంలో వారెలాంటి పాత్ర పోషించరు. భారత ప్రభుత్వానికి రష్యా అండగా నిలుస్తుంది. ఈ సమస్య త్వరగా పరిష్కారం కావాలని ఆశిస్తున్నా’’ అని రష్యా రాయబార కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.

రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తున్న ముఠాకు చెందిన నలుగురు వ్యక్తులను సీబీఐ అరెస్ట్ చేసింది.

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)