పరిశోధనల కోసం ఈ వలంటీర్లు కలుషిత వాయువులను పీలుస్తున్నారు

ఫొటో సోర్స్, TONY JOLLIFFE/BBC
- రచయిత, రెబాకా మోరెల్లె& అలీసన్ ఫ్రాన్సిస్
- హోదా, బీబీసీ న్యూస్ సైన్స్
కలుషిత గాలి నుంచి తప్పించుకోవడానికి మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ, ఈ వలంటీర్లు కలుషిత గాలిని పీల్చడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇంతకీ విషయమేంటి?
మాంచెస్టర్‌లోని ల్యాబ్‌లో వలంటీర్లు గుండెల నిండా కలుషిత వాయువును పీల్చుకునేందుకు మాస్కులు ధరించారు.
కాలుష్యం వలన మెదడు ఎలా ప్రభావితం అవుతుందో తెలుసుకునేందుకు డీజిల్ మొదలుకొని శుద్ధిచేసే ఉత్పత్తులకు సంబంధించిన పలు రకాల కలుషిత వాయువులను వలంటీర్లు పీల్చుకుంటున్నారు.
శాస్త్రవేత్తలు ఈ ప్రయోగాలకు ముందు, ఆ తరువాత వలంటీర్ల రక్త నమూనా పరీక్షలు, మెదడులోని కాగ్నిటివ్ టెస్ట్‌లు నిర్వహించి, ఆ ఫలితాలను విశ్లేషిస్తున్నారు.
గాలి నాణ్యతలో వచ్చే మార్పులు నేరుగా ఊపిరితిత్తులు, కార్డియోవాస్క్యులర్ వ్యవస్థపై ప్రభావం చూపుతాయని తెలిసినప్పటికీ, మెదడుపై ఆ ప్రభావమెంతో తెలుసుకునే అధ్యయనాలు తక్కవగానే జరిగాయి.
లండన్‌లోని ఇంపీరియల్ కాలేజీకి చెందిన ఎన్విరాన్మెంటల్ టాక్సికాలజిస్ట్ డా. అయాన్ మద్వే ఈ అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తల బృందంలో ఒకరు.
ఆయన మాట్లాడుతూ, “గత పదేళ్లుగా మేం వాయు కాలుష్యం మెదడు సంబంధిత సమస్యల మధ్య గణాంకాల పరంగా ఉన్న అంశాలను అధ్యయనం చేస్తున్నాం.
మా అధ్యయన లక్ష్యమేంటంటే, వాయు కాలుష్యం వలన మెదడుపై కలిగే ప్రభావం, దాని ఫలితాలు ఎలా ఉంటాయో, అంతర్లీనంగా ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసుకోవడం” అని చెప్పారు.

ఫొటో సోర్స్, TONY JOLLIFFE/BBC
మాంచెస్టర్ విశ్వవిద్యాలయంలో ఈ ప్రయోగాలను నిర్వహిస్తున్నారు.
పరిశోధకులు నాలుగు రకాల కాలుష్యాన్ని సృష్టిస్తున్నారు అవి..డీజిల్ నుంచి ఉత్పత్తి అయ్యే పొగ, కలపను మండించడం ద్వారా విడుదలయ్యే పొగ, ఉత్పత్తుల శుద్ధీకరణ వల్ల విడుదలయ్యే వాయువు, వంట చేస్తున్న సమయంలో వెలువడే పొగ (పంది మాంసాన్ని వేయించడం ద్వారా).
కాలుష్య స్థాయిలను జాగ్రత్తగా పరిశీలించడం, నియంత్రించడం చేస్తూ ఒక ఎయిర్ ఛాంబర్‌లోకి పంపుతారు. అక్కడి నుంచి వలంటీర్లు ఆ వాయుని పీల్చుకునేందుకు వీలుగా పైప్‌ను ఆ ఛాంబర్‌తో అనుసంధానం చేస్తారు.
నెలల వ్యవధిలో పలుమార్లు వలంటీర్లు ల్యాబ్‌కు వచ్చినప్పుడు పరిశుభ్రమైన గాలిని, కలుషిత గాలిని గంటపాటు పీలుస్తారు. అయితే, వారు ఎలాంటి గాలిని పీలుస్తున్నారో వారికి తెలీదు.
ఆ సమయంలో ప్రయోగాలను కొనసాగిస్తారు పరిశోధకులు.

ఫొటో సోర్స్, TONY JOLLIFFE/BBC
మాంచెస్టర్ యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ అట్మాస్పియర్ సైన్స్ విభాగ ప్రొఫెసర్ గార్డన్ మెక్ ఫిగ్గన్స్ మాట్లాడుతూ, “ఇండోర్ అవుట్‌డోర్ కాలుష్యం వలన ఎంత మేర ప్రభావం ఉందని తెలుసుకోవడం కూడా మా ప్రయోగాల్లో ముఖ్యమైన అంశం. అయితే, ఆధారాలను బట్టి చూస్తూ, ఇండోర్ కాలుష్యమే అత్యంత ప్రమాదకారి అని మాత్రం తెలుస్తోంది” అన్నారు.
“ఇప్పుడు మనం రెండిటికీ గురవుతుంటాం. ఉదాహరణకు మీరు మీ ఇంటిలోని కిటీకి తెరిచి ఉంచినప్పుడు లేదా కిటికీ మూసివేసి, కృత్రిమంగా గాలిని తీసుకున్నప్పుడు కూడా వాయు కాలుష్య కారకాలు మీపై ప్రభావం చూపుతాయి. మనమంతా ఈ భిన్నమైన కాలుష్యంలోనే జీవిస్తున్నాం” అని వివరించారు.
ఆయన మాట్లాడుతూ “మేం వీటిపై సమగ్రమైన వివరణలను ఇవ్వాలని అనుకుంటున్నాం. ఈ కాలుష్యంపై కొంతమేర మార్గదర్శకాలను అందించగలిగితే, ఎవరికి వారు వారి ఆరోగ్య పరిస్థితులను బట్టి, నిర్ణయాలు తీసుకునే వీలుంటుంది. క్లిష్టత గురించి కూడా వారు తెలుసుకుంటారు” అని చెప్పారు.
మెదడుపై జరిగే పరీక్షల ద్వారా అభిజ్ఞపనితీరు గురించి, రక్తనమూనాల ద్వారా శరీరంలో చోటుచేసుకున్న మార్పుల గురించి తెలుసుకోవచ్చని శాస్త్రవేత్తల బృందం చెప్తోంది.

ఫొటో సోర్స్, TONY JOLLIFFE/BBC
ప్రొఫెసర్ మెక్ ఫిగ్గన్స్ మాట్లాడుతూ, “ప్రస్తుతం మేం కాలుష్యాన్ని మెదడు ఏ విధంగా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
కాలుష్య కారకాలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా మెదడును చేరుతున్నాయో లేదో చూడాలని మా బృందం ప్రయత్నిస్తోంది” అని ఆయన చెప్పారు.
“ఇందులో ఒక అవకాశమేంటంటే, కాలుష్య కారకాలు శరీరంలోని ఊపిరితిత్తుల వంటి భాగాల్లో చేరి మంటను కలిగిస్తాయి. జీవక్రియ వలన ఉత్పత్తి అయిన రసాయనాలు మెదడుకు చేరుకుని సమాచారాన్ని చేరవేస్తాయి” అని అన్నారు.
“అయితే, ఇప్పుడే ఏమీ తెలీదు” అని చెప్పారు ప్రొఫెసర్ ఫిగ్గన్స్.

ఫొటో సోర్స్, TONY JOLLIFFE/BBC
ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం 99% ప్రపంచ జనాభా పీల్చుకునే గాలిలో ఐక్యరాజ్య సమితి పేర్కొన్న పరిధిని మించిన సాధారణ కాలుష్య కారకాలు ఉంటున్నాయి. పైగా ఇండోర్, అవుట్‌డోర్ కాలుష్యం ఫలితంగా ఏటా 70 లక్షల మంది అకాల మరణం పాలవుతున్నారు.
ఈ సమయంలో మెదడుపై కాలుష్య ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవడం అవసరమని ఈ శాస్త్రవేత్తల బృందం చెప్తోంది.
తొలి దశ ప్రయోగాల్లో 13 మంది భాగస్వాములయ్యారు. ఈ రకమైన పరిశోధనలు భిన్నమైనవి. ఇందులో ప్రతి వలంటీర్ నాలుగు రకాల కాలుష్య కారకాలతో కూడిన గాలిని, స్వచ్ఛమైన గాలిని పీలుస్తారు. ఆ ఫలితాలను ఒకదానితో మరొకటి పోల్చి, విశ్లేషించి, ఆ వివరాలను నమోదు చేస్తారు.
ఆ వలంటీర్లలో బ్రియోనీ ఎవెన్స్ కూడా ఒకరు.
ఆమె ఆ ఎయిర్ ఛాంబర్ నుంచి వచ్చే కలుషిత వాయువును పుస్తకం చదువుతూ గంటలకొద్దీ పీల్చారు.
ఆమె మాట్లాడుతూ, ఇలాంటి అధ్యయనానికి నా సమయాన్ని కేటాయించినందుకు సంతోషంగా ఉంది. వారు ఈ ప్రయోగాల ద్వారా పరిశోధనలకు అవసరమైన మరింత డేటాను పొందగలిగితే, నేను అందుకు సాయపడినందుకు ఆనందిస్తాను.
మనకు హానిని కలిగించే విషయాలను కనుగొనడానికి మనం చేస్తున్న పని ఉపయోగపడి, అది మన సాధారణ జీవన విధానాన్ని మార్చగలిగితే, మనం చేసిన పని విలువైనదిగా అనిపిస్తుంది అన్నారు.
కొన్ని నెలల్లోనే ఈ ప్రయోగ ఫలితాలు రానున్నాయి.
ఇవి కూడా చదవండి..
- ఇంట్లోనే చనిపోయినా పదేళ్ల వరకు ఎవరికీ తెలియలేదు.. ఆ వృద్ధురాలి మరణం దేశాన్నే కదిలించింది
- ‘నన్ను, నా చెల్లిని కాపాడబోయి మా నాన్న వరదలో కొట్టుకుపోయారు. కానీ...’
- దావూద్ ఇబ్రహీం: పోలీస్ కానిస్టేబుల్ కొడుకు అండర్ వరల్డ్ డాన్ ఎలా అయ్యాడు?
- ఐపీఎల్-2024: రోహిత్ శర్మ ముంబయి ఇండియన్స్‌తోనే ఉంటాడా, వేరే దారి చూసుకుంటాడా?
- కోవిడ్: కేరళలో కరోనా కొత్త సబ్‌వేరియంట్ జేఎన్.1, పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలకు కేంద్రం ఏం చెప్పింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














