చెన్నై సిక్స్: ‘చేయని నేరానికి చిక్కుకుపోయా.. భారతీయ జైల్లోనే చచ్చిపోతా అనుకున్నా’ - బ్రిటన్ మాజీ సైనికుడి కథ

జైలు గదిలో బ్రిటన్ మాజీ సైనికుడు నిక్ డన్

ఫొటో సోర్స్, Nick Dunn

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ మాజీ సైనికుడు నిక్ డన్, తన సహచరులతో కలసి రెండున్నరేళ్లకు పైగా భారతీయ జైలులో ఉన్నారు

ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. తిండి కోసం కొట్టుకోవడం, పిల్లి-ఎలుకల్లా దెబ్బలాడుకోవడం... ఇది ఇండియాలోని జైళ్లలో వారు రోజూ ఎదుర్కొన్న పరిస్థితి. ఇరాక్, అఫ్గానిస్తాన్‌ దేశాల్లో పని చేసిన ఈ బ్రిటన్ మాజీ సైనికుడు జైల్లో ఎదురైన పరిస్థితులతో ఎలా పోరాడారో తాను రాసిన ఓ పుస్తకంలో చెప్పుకొచ్చారు.

రాళ్లతో పరచిన గచ్చుపై ఆయన పడుకునేందుకు ఓ బొంత.. భారతీయ శైలిలో నిర్మించిన శిథిలావస్థలో ఉన్న శౌచాలయం.. తినడానికి పాడైపోయిన కారెట్లు, బంగాళ దుంపలు.

చూడ్డానికి అంత స్పష్టంగా లేని ఆ ఫోటోలన్నింటినీ నిక్ తన వద్దనున్న స్పై పెన్‌తో చిత్రీకరించారు. నిజానికి ఆయనతో పాటు చైన్నై జైల్లో ఉన్న ఆయన సహచరులు రెండున్నర ఏళ్ల పాటు ఎదుర్కొన్న పరిస్థితులకి ఆ ఫోటోలు అద్దం పడతాయి.

“జైలు గదులు అధ్వాన్నంగా, మురిగ్గా ఉండేది. ఏ రోజు చూసినా అదే పరిస్థితి” అంటూ తన గతాన్ని గుర్తు చేసుకున్నారు ప్రస్తుతం నార్తంబర్‌లాండ్‌లోని అషింగ్టన్‌లో ఉన్న నిక్.

నిక్ సహా తన ఐదుగురు స్నేహితులు కూడా సైన్యంలో పని చేసేవారు. 2013లో ఎంవి సీమన్ గార్డ్ ఒహియో నౌకలో హిందూ మహా సముద్రంలో ప్రయాణిస్తున్న సమయంలో భారతీయ కోస్ట్ గార్డ్ దళాలు వారిని బంధించనంత వరకు సోమాలియా సముద్రపు దొంగల నుంచి రక్షణ కల్పించే విధులను నిర్వర్తించేవారు.

భారతీయ సముద్ర జల్లాలో చట్ట విరుద్ధంగా ఆయుధాలతో తిరుగుతున్నారన్నది వారిపై వచ్చిన ఆరోపణ. సుమారు నాలుగేళ్ల తర్వాత కోర్టు వారిని నిరపరాధులని తేల్చింది. వారి వద్ద ఉన్న ఆయుధాలకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు వారి దగ్గర ఉన్నాయి. వాళ్లు భారతీయ సముద్ర జలాల్లో ప్రవేశించడానికి కూడా ఓ కారణం ఉంది. సముద్రంలో తుపాను వాతావరణం నెలకొనడంతో వారు అత్యవసర వస్తువుల్ని సమకూర్చుకోవాల్సి ఉంది.

నిక్ దృష్టిలో చెప్పాలంటే ఇది రెండు వర్గాల మధ్య నెలకొన్న ఒక అపార్థం మాత్రమే. కొంత సమయం తరువాత గందరగోళం తొలగి సమస్యంతా సమసిపోతుందనుకున్నారు. కానీ భారతీయ ప్రాసిక్యూటర్లు దాన్ని కేసు పెట్టి సమస్యగా మార్చేశారు.

బ్రిటన్ మాజీ సైనికుడు నిక్ డన్

ఫొటో సోర్స్, Nick Dunn

రోజులు..నెలలు.. ఏళ్లు

రోజులు వారాలయ్యాయి. వారాలు నెలలయ్యాయి. నెలలు ఏళ్లయ్యాయి. కానీ కోర్టులో కేసు మాత్రం కుంటి నడకన సాగుతూనే వచ్చింది.

కొంత కాలం వాళ్ల జీవితం హోటళ్లు, హాస్టళ్లలో గడిచింది. కానీ ఎక్కువ కాలం జైల్లోనే గడిపారు. కొన్ని సార్లు వారిలో ప్రతి నలుగురు ఒక్కో జైలుగదిలో, మరి కొన్ని సార్లు సుమారు 20 మందికిపైగా ఒకే గదిలో ఉండాల్సి వచ్చేది. వారిలో బ్రిటష్ సైన్యం సహా వారితో పాటు నౌకలో ఉన్న ఇతర దేశాలకు చెందిన వాళ్లు కూడా ఉండేవారు.

భారత ప్రభుత్వం బెయిల్ ఇచ్చేలా బ్రిటన్ ప్రభుత్వం ఒత్తిడి తేవాలంటా వారికి మద్దతుగా సుమారు లక్షా 30వేల మందితో సంతకాల సేకరణ ఉద్యమం చేసిన వారి కుటుంబసభ్యులకు వాళ్లెప్పుడూ రుణపడే ఉంటారు.

ఆ జైల్లో వీళ్లు మాత్రమే విదేశీయులు. మిగిలిన వారంతా భారతీయు నేరస్థులే. వారిలో హత్యలు, అత్యాచారాలు చేసిన వాళ్లు కూడా ఉండేవారు.

మొదటి రోజు నుంచే వీరిని లక్ష్యంగా చేసుకున్నారు. వీళ్లపై రాళ్లు విసిరేవారు. అయితే వీళ్లు మాత్రం గుంపులు గుంపులుగానే వెళ్లేవారు. ఎవరు ఎటువంటి దాడి చేసినా తిప్పికొట్టేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవారు.

‘‘అధికారులు బహుశా కొత్తగా వచ్చిన మమ్మల్ని ఉగ్రవాదులుగా చిత్రీకరించడం, మాజీ సైనికులమైన మా ఆకారాలు చూసి వాళ్లు భయపడి ఆ ప్రయత్నం చేసి ఉండవచ్చు’’ అన్నారు నిక్.

కానీ ఒక రోజు ఆ గొడవ బయటపడింది.

“ఒక్కసారిగా కోలాహలం మొదలయ్యింది” అంటూ తాను రాసిన కొత్త పుస్తకం సర్వైవింగ్ హెల్‌లో గుర్తు చేసుకున్నారు నిక్.

జైలు డాక్టరు వచ్చే సమయంలో బ్రిటన్ సైనికులపై సహచర ఖైదీలు అక్కడున్న కుర్చీలు, కర్రలతో దాడి చేశారు.

“ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఆ పెనుగులాటలో చాలా మంది నేలపై పడిపోయారు” అని చెప్పారు నిక్.

“తీవ్రంగా పెనుగులాడారు. ఒకరిపై ఒకరు పిడి గుద్దులు కురిపించుకున్నారు” అని నిక్ నాటి ఘటనను తన పుస్తకంలో ప్రస్తావించారు.

పోలీసుల జోక్యంతో గొడవ ఆ సద్దుమణిగింది. నిజానికి ఆ ఘర్షణ అక్కడున్న వారికే మేలు చేసింది.

మిగిలిన ఖైదీలు “మమ్మల్ని ఓ పెద్దమనుషులుగా చూశారు. మా వల్ల జరిగిన నష్టాన్ని కూడా వారు పెద్దగా పట్టించుకోలేదు” అని నిక్ రాశారు.

“బహుశా వాళ్లకు మా గురించి తగిన సమచారం వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఆ తర్వాత వాళ్ల నుంచి కానీ ఇతర ఖైదీల నుంచి కానీ మాకు ఎటువంటి సమస్య ఎదురు కాలేదు”.

జైలు జీవితంలో ఉండే కర్కశత్వం నుంచి బయటపడేందుకు ఎవరికి వారే ప్రయత్నించాలి.

బ్రిటన్ మాజీ సైనికుడు నిక్ డన్

ఫొటో సోర్స్, Nick Dunn

ఫొటో క్యాప్షన్, బ్రిటన్ మాజీ సైనికుడు నిక్ డన్
చెన్నై సిక్స్‌గా పేరొందిన బ్రిటన్ సైనికులు నిక్ డన్, పాల్ టవర్స్, నిక్ సింప్సన్, రే టిండల్, జాన్ ఆర్మ్‌స్ట్రాంగ్, బిల్లీ ఇర్వింగ్
ఫొటో క్యాప్షన్, చెన్నై సిక్స్‌గా పేరొందిన బ్రిటన్ మాజీ సైనికులు నిక్ డన్, పాల్ టవర్స్, నిక్ సింప్సన్, రే టిండల్, జాన్ ఆర్మ్‌స్ట్రాంగ్, బిల్లీ ఇర్వింగ్

బ్రిటన్‌లో హాఫ్ మారథాన్

‘‘రాళ్లతో తయారు చేసిన వ్యాయామ సామాగ్రి అక్కడ ఉండేది. ఓ ఇనుప రాడ్ సాయంతో బరువులెత్తే సామాగ్రిని తయారు చేశాం.’’

“జైల్లో ఉండే పోలీసులు మేం సిద్ధం చేసుకున్న తాత్కాలిక జిమ్‌ను ఎప్పటికప్పుడు నాశనం చేసేవారు. మేం తిరిగి మళ్లీ తయారు చేసుకునేవాళ్లం” అని నిక్ తన పుస్తకంలో రాసుకొచ్చారు.

“చివరకు మా వస్తువుల్ని మాకు వదిలేయాలని ప్రాథేయపడ్డాం. ఇతర ఖైదీలకు మేం ఆదర్శంగా ఉంటామన్న విషయాన్ని మీరే గుర్తిస్తారని చెప్పాం.”

2017 సెప్టెంబర్ 10న తనకు న్యాయం చేయడం కోసం ఖర్చయ్యే మొత్తాన్ని సేకరించేందుకు, అలాగే జనాల్లో అవగాహన తీసుకొచ్చేందుకు ఆయన సోదరి లిసా గ్రేట్ నార్త్ రన్‌లో పాల్గొన్నారు. సాధారణంగా నిధులను సేకరించేందుకు నిర్వహించే హాఫ్ మారథాన్ ఇది. ఈశాన్య బ్రిటన్‌లోని న్యూకాజిల్ అపాన్ టైన్ నుంచి సౌత్ షీల్డ్స్‌ వరకు ఈ హాఫ్ మారథాన్‌ను నిర్వహిస్తారు. అదే సమయంలో ఇండియాలో ఉన్న నిక్ కూడా జైలు మైదానంలో హాఫ్ మారథాన్ పూర్తి చేశారు.

‘‘40 డిగ్రీల వేడిలో సుమారు మైలు దూరం.. నా బ్రిటన్ సహచరులు మాత్రమే కాదు తోటి ఖైదీలు కూడా చాలా ఇబ్బంది పడ్డారు.

కొంత మంది నా బ్రిటిష్ సహచరులు నాతో పాటు రేసులో పరుగెత్తారు. మరి కొందరు మాత్రం నారింజ పళ్ల సాయంతో ఎలాగోలా నెట్టుకొచ్చారు.

ఆహార సరఫరా అంతంత మాత్రంగా ఉండేది. ఖైదీలకు వంట ఎవరు చెయ్యాలన్న విషయంలో షిఫ్టుల విధానం ఉంటుంది.

ప్రతిసారీ బకెట్‌ను కడుక్కోవడానికి బదులు పాత పైపును కుళాయికి తగిలించి షవర్‌లా మార్చారు.’’

“తిరిగి ఇంటికెళ్లేంతవరకు ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మేం ప్రయత్నిస్తునే ఉండేవాళ్లం” అని నిక్ చెప్పారు.

“అక్కడ పరిశుభ్రత గురించి పట్టించుకొని కూర్చుని ఉండే పరిస్థితులు కావవి. ఎటు చూసినా అపరిశుభ్రత రాజ్యమేలుతుండేది.”

బీడీలకు అలవాట పడిపోయారు, గుడ్లు, చపాతీలు, కూర ఇలా ఏది పెడితే దాంతో సర్దుకుపోయేవాళ్లు.

చెన్నై జైలు కారిడార్

ఫొటో సోర్స్, Nick Dunn

ఫొటో క్యాప్షన్, జైలులో పరిస్థితులను చిత్రీకరించేందుకు నిక్ స్పై కెమెరా వాడారు
జైలు గది

ఫొటో సోర్స్, Nick Dunn

ఫొటో క్యాప్షన్, జైల్లో నిక్ గది

ఈ కేసులో ఎప్పుడు ఏం జరిగింది?

* 6 అక్టోబర్ 2013- శ్రీలంకలో బయల్దేరడానికి సిద్ధంగా ఉన్న ఎంవి సీమెన్ గార్డ్ ఓహియోలో నిక్ అడుగు పెట్టారు.

* 12 అక్టోబర్ 2013- ఇండియన్ గార్డ్ ఎంవి సీమెన్ గార్డ్ ఓహియోను ట్యుటికోరిన్ పోర్టుకి తీసుకొచ్చింది.

* 18 అక్టోబర్ 2013- 10మంది సిబ్బంది సహా 25 గార్డులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు.

* ఫిబ్రవరి 2014- వారిపై 2,158 పేజీల చార్జి షీట్ సిద్ధమయ్యింది.

* మార్చి 2014- వారికి తక్షణం బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ 1,36,00 వేల మంది బ్రిటన్ ప్రజలు సంతకాలు చేశారు.

* 26 మార్చి 2014 – నిక్ సహా 35 మందిలో 33 మందికి బెయిల్ లభించింది.

* జులై 2014- అయితే మద్రాస్ హైకోర్టు వారిపై ఆరోపణల్ని కొట్టి పారేసింది. కానీ దేశం విడిచి వెళ్ల కూడదని ఆదేశించింది.

* అక్టోబర్ 2014- మళ్లీ అప్పీలు చేసిన భారత పోలీసులు

* జులై 2015- మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టు కొట్టివేసింది. తిరిగి విచారణకు ఆదేశించింది.

* 11 జనవరి 2016- నౌకా సిబ్బందిని నేరస్థులుగా తేల్చి ఐదేళ్ల జైలు విధించింది.

* 27 నవంబర్ 2017- చెన్నై అప్పీలు కోర్టు వారిపై కేసుల్ని కొట్టేసింది. ఆపై జైలు నుంచి విడుదలై తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు.

రాళ్లు, రాడ్డుతో తయారు చేసుకున్న డంబెల్

ఫొటో సోర్స్, Nick Dunn

ఫొటో క్యాప్షన్, రాళ్లు, రాడ్డుతో తయారు చేసుకున్న డంబెల్
జైల్లో భోజనాల గది

ఫొటో సోర్స్, Nick Dunn

1,30,000 సంతకాల సేకరణ

వారు జైల్లో ఉన్న సమయంలో కుటుంబసభ్యులు వారి విడుదల కోసం ఎడ తెగని ప్రయత్నాలు చేశారు.

ఓసారి తన సోదరుణ్ణి కలిసే సమయంలో స్పై పెన్‌ను ఆయనకు అందించిన నిక్ సోదరి లిసా తన సోదరుని విషయంలో జోక్యం చేసుకోవాని బ్రిటన్ ప్రభుత్వానికి పదే పదే విజ్ఞప్తి చేశారు. కానీ కోర్టుల్లో కేసు నత్తనడకన సాగుతుండటం వల్ల పెద్దగా పురోగతి కనిపించలేదు.

“మా ఆ కఠినమైన ప్రయాణం ముగిసే సరికి మాలో ఎవరో ఒకరి ప్రాణాలు పోవడం ఖాయమని అనుకున్నా” అని నిక్ చెప్పారు.

2017 సెప్టెంబర్-అక్టోబర్ నెలల సమయంలో రెండేళ్ల జైలు కాస్త ఐదేళ్లకు మారడంతో వారి జీవితంలో మరిన్ని ఆటు పోట్లు మొదలయ్యాయి.

తమ నౌకలో కెప్టెన్‌గా పని చేసే ఉక్రెయిన్ దేశస్థుడు తీవ్రంగా జబ్బు పడ్డారు. “దాంతో మాలో ప్రతి ఒక్కరం చనిపోబోతున్నామన్న విషయం మాకు స్పష్టంగా అర్థమయ్యింది” అని నిక్ చెప్పారు.

“నేను ఊహించినట్టుగానే మా కేసు విచారణ మళ్లీ వేగం పుంజుకుంది. భారతీయ జైల్లో ఉంటూ మాలో ఎవ్వరు మరణించినా లేదా తీవ్రంగా జబ్పు పడినా ప్రపంచ దేశాల ముందు భారతీయ అధికారులకు తలవంపులుగా మారుతుంది” అని నిక్ చెప్పుకొచ్చారు.

కేసు సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా ముందుకు వచ్చింది. ఆయన తక్షణం దీన్ని పరిష్కరించాలని ఆదేశించారు.

తన సోదరి లిసాతో నిక్

ఫొటో సోర్స్, Nick Dunn

ఫొటో క్యాప్షన్, తన సోదరి లిసాతో నిక్

2017 నవంబర్ 27 సోమవారం తీర్పు వెలువడేది ఆ రోజే. అందరూ జైల్లో తీర్పు కోసం ఎంతో ఆతృతగా వేచి చూస్తున్నారు.

కొన్ని గంటల తర్వాత వాళ్లను విడుదల చేస్తున్నట్టు సమాచారం వచ్చింది.

“ఒక్కసారిగా నా మోకాళ్లపై కూలబడిపోయాను ” అన్నారు నిక్.

అదే రోజు జైలు నుంచి బయటకు వచ్చారు. ఆరు రోజుల తర్వాత బ్రిటన్ చేరుకున్నారు.

నిక్ న్యూ కాజిల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల నుంచి ఘన స్వాగతం లభించింది.

ఆ ఘటన జరిగి ఇప్పటికి దాదాపు రెండున్నరేళ్లు గడిచిపోయింది. ఇప్పటికీ ఆయన భద్రతా విభాగంలోనే పని చేస్తున్నారు. అయితే ఇప్పుడు మాత్రం ఆయన విదేశాల్లో పని చేయడం పట్ల పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

“నా జీవితంలో నేను ఎదుర్కొన్న పరిస్థితుల కారణంగా నా జీవితంలో చాలా మారిపోయాయి. ప్రతి రోజును కొత్తగా చూడటం మొదలు పెట్టాను. ఎప్పుడైనా కాస్త నిరాశ, నిస్పృహ ఆవరిస్తే... ఇంతకన్నా దారుణమైన పరిస్థితుల నుంచి బయటపడ్డానన్న విషయాన్ని ఓ సారి గుర్తు చేసుకుంటాను” అని నిక్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)