బ్లాక్‌మనీ: భారతీయులు విదేశాల్లో దాచిన నల్లధనం ఎంతో ఊహించగలరా.. - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, NurPhoto
భారతీయులు విదేశాల్లో దాచిన నల్లధనం రూ.15 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకు ఉంటుందని సాక్షి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో...
ఈ నల్లధనం, కేవలం 1980-2010 సంవత్సరాల మధ్య దాచిన మొత్తమే అని తేలింది. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లయిడ్ ఎకనామిక్ రీసెర్చ్(ఎన్‌సీఏఈఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ (ఎన్‌ఐఎఫ్‌ఎమ్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ ఫైనాన్స్ (ఎన్‌ఐపీఎఫ్‌పీ) సంస్థలు వేర్వేరుగా దీనిపై అధ్యయనాలు నిర్వహించాయి.
వీటన్నింటినీ కలిపి 'దేశ, విదేశాల్లో భారతీయులు దాచిన నల్లధనం వివరాలు' పేరిట ఒక నివేదికలో పొందుపరిచాయి. దీనికి సంబంధించిన స్టాండింగ్ కమిటీ నివేదికను సోమవారం లోక్‌సభ ముందుంచాయి. దేశ విదేశాల్లో కచ్చితంగా ఇంత మొత్తంలో నల్లధనం ఉంటుందని చెప్పడం కష్టమని.. కానీ సుమారుగా అంచనా వేయగలమని పేర్కొన్నాయి.
భారతీయులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని రియల్ ఎస్టేట్, మైనింగ్, ఫార్మాస్యూటికల్స్, పాన్‌మసాలా, గుట్కా, పొగాకు, విద్య, సినిమాలు వంటి రంగాల్లో పెట్టుబడిగా పెడుతున్నారని అధ్యయనంలో గుర్తించాయి.
1980-2010 సంవత్సరాల మధ్య విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనం రూ.26.6 లక్షల కోట్ల నుంచి రూ.33.9 లక్షల కోట్ల వరకూ ఉంటుందని ఎన్‌సీఏఈఆర్ తన అధ్యయనంలో వెల్లడించింది.
1990-2008 సంవత్సరాల మధ్య రూ.9,41,837 కోట్ల నల్లధనాన్ని భారతీయులు విదేశాల్లో దాచారని ఎన్‌ఐఎఫ్‌ఎమ్ తెలిపింది. కాగా, దేశ విదేశాల్లో ఉన్న భారతీయుల నల్లధనంపై నివేదిక తయారుచేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ 2011లో ఈ మూడు సంస్థలను కోరిందని సాక్షి కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, Getty Images
శ్రీశైలానికి గోదారి
గోదావరి వరద నీటిని కృష్ణా నదిలోకి మళ్లించాలన్న యోచనకు పదును పెరుగుతోందంటూ ఈనాడు దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
ఈ అంశంపై పలు ఆలోచనలపై కసరత్తు చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు ముఖ్యంగా మూడు రకాల మార్గాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.
తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు ఎక్కువ నీటి వినియోగం జరగాలంటే గోదావరి నీటిని ఎక్కడి నుంచి మళ్లిస్తే ఎక్కువ ప్రయోజనం ఉంటుందన్నదానిపై చర్చిస్తున్నారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య గోదావరి జలాల వినియోగంపై చర్చ జరిగింది.
ఇంద్రావతి గోదావరిలో కలిసిన తర్వాత నీటి లభ్యత ఎక్కువగా ఉంటుందని, ఇక్కడి నుంచి నేరుగా శ్రీశైలానికి నీటిని మళ్లించడానికి అవకాశం ఉంటుందని, పూర్తి సహకారంతో కరవు జిల్లాలకు గోదావరి వరద జలాలను వినియోగించుకోవచ్చన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సానుకూలంగా స్పందించారని ఆ కథనం పేర్కొంది.
ప్రస్తుతం కృష్ణా నది విషయంలో శ్రీశైలం జలాశయం నిండిన తర్వాత నాగార్జునసాగర్‌కు జలాలు వస్తాయి. తాజా ఆలోచన ప్రకారం గోదావరి నుంచి పోలవరం ప్రాజెక్టు ద్వారా ప్రకాశం బ్యారేజీకి తీసుకువచ్చిన నీటిని కృష్ణా నది ద్వారానే పులిచింతలకు, అక్కడి నుంచి నాగార్జునసాగర్‌కు నీటిని మళ్లించి, ఇక్కడి నుంచి శ్రీశైలంలోకి ఎత్తిపోతల ద్వారా నింపడంపై ఆలోచిస్తున్నారు.
ప్రస్తుతం విద్యుత్తు ఉత్పత్తి ద్వారా వదిలిన నీటిని తిరిగి శ్రీశైలంలోకి ఎత్తిపోసే వ్యవస్థ ఉంది. దీనినే వినియోగించుకొని నీటి ఎత్తిపోత చేపట్టడానికి అవకాశం ఉందనే అభిప్రాయాన్ని రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయంటూ ఈనాడు కథనం పేర్కొంది.

ఫొటో సోర్స్, facebook/Telangana CMO
తెలంగాణ ఐఏఎస్‌ల అసంతృప్తి
ఎటువంటి శిక్షణ తీసుకోని కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కలెక్టర్లుగా పనిచేస్తుండగా నేరుగా ఎంపికైన కొందరు ఐఏఎస్‌లు ఆప్రాధాన్య పోస్ట్‌లలో కాలం గడుపుతున్నారంటూ నవతెలంగాణ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
గతంలో ఉన్న 10జిల్లాలను రాష్ట్రం ఏర్పడిన తర్వాత 33 జిల్లాలుగా విభజించటంతో ఐఏఎస్ అధికారులు ఎక్కువ మంది కావాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ప్రతియేటా రాష్ట్రానికి కేటాయిస్తున్న ఐఏఎస్ అధికారులతోపాటు సీనియర్ ఐఏఎస్‌లు, రాష్ట్ర సర్వీస్ నుంచి ఎంపికైన కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లను వివిధ విభాగాల్లో నియమించే అవకాశం ఉన్నది.
ఐఏఎస్ అధికారుల్లో డిప్యూటీ సెక్రెటరీ, జాయింట్ సెక్రెటరీ క్యాడర్ అధికారులను మాత్రమే జిల్లా కలెక్టర్లుగా నియమిస్తారు. జిల్లా కలెక్టర్లుగా పనిచేసే అవకాశం ఉన్న కొందరు సీనియర్ ఐఏఎస్‌లను లూప్‌లైన్‌లో పెట్టడంతో వారు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
తమకు కీలక పోస్టులు ఇవ్వటం లేదని దళిత, బలహీన వర్గాలకు చెందిన కొందరు ఐఏఎస్‌లు ఇటీవల సీఎస్ వద్ద మొరపెట్టుకున్నారు.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లను ఎటువంటి శిక్షణ లేకుండానే జిల్లా కలెక్టర్లుగా నియమించటం వివాదాస్పదమైంది. 2017లో రాష్ట్ర రెవెన్యూ సర్వీస్‌లో డిప్యూటీ కలెక్టర్లుగా పనిచేస్తున్న 10 మంది అధికారులు కన్‌ఫర్డ్ ఐఏఎస్‌లుగా ఎంపిక కాగా వీరిలో పలువురిని జిల్లా కలెక్టర్లుగా నియమించారు.
ఇటీవల ఎంపికైన 11 మందిలో ముగ్గురిని జిల్లా కలెక్టర్లుగా నియమించారు. రాష్ట్రంలో గ్రూప్ వన్ అధికారులైన డిప్యూటీ కలెక్టర్లకు ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండానే ఐఏఎస్‌లుగా కేంద్రం ఎంపిక చేస్తుంది.
ఎంపికైన తర్వాత వీరు కనీసం ఆరు నెలల పాటూ ముస్సోరీలోనూ, మరో ఆరు నెలలు రాష్ట్రం లోనూ శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శిక్షణ పూర్తయిన తర్వాతే వీరికి పాలనాపరమైన నైపుణ్యం వస్తుంది.
ఇదేమీ లేకుండానే కొందరు కన్‌ఫర్డ్ అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించటం పట్ల సీనియర్ ఐఏఎస్‌లు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారంటూ నవతెలంగాణ పత్రిక పేర్కొంది.

ఫొటో సోర్స్, FACEBOOK/TELANGANA BJP
‘గోల్కొండపై బీజేపీ జెండా’
బెంగాల్ తరహా రాజకీయాలు చేస్తే రాజకీయంగా మనుగడ లేకుండా చేస్తామని సీఎం కేసీఆర్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ హెచ్చరించారంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. అందులో..
బీజేపీ కార్యకర్తలపై దాడులు చేస్తే పార్టీ నాయకత్వం ఉపేక్షించబోదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ తీవ్ర అసహనంతో వ్యవహరిస్తూ మరో నిజాం తరహా పాలన చేస్తున్నారని ఆరోపించారు.
ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్న బీజేపీని అణచివేసేందుకు ఆంక్షలు, అరెస్టులు, నిర్బంధాలు కొనసాగిస్తున్నారని మండిపడ్డారు. 2023లో గోల్కొండ కోటపై కాషాయ జెండాను ఎగురవేస్తామని, బీజేపీ అధికారంలోకి వస్తేనే సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం సాధ్యమని లక్ష్మణ్ ప్రకటించారు.
రాష్ట్రానికి చంద్ర గ్రహణం వీడే వరకు, కల్వకుంట్ల కుటుంబం నుంచి విముక్తి కలిగే వరకూ బీజేపీ ఉద్యమాలు, యాత్రలు చేస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. గత జూన్‌లో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్ర ఏడాది పూర్తయిన సందర్భంగా సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో లక్ష్మణ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌కు కొత్త అసెంబ్లీ, కొత్త సచివాలయంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించడంలో లేకుండాపోయిందని విమర్శించారంటూ ఆంధ్రజ్యోతి కథనం పేర్కొంది.
ఇవి కూడా చదవండి
- ఇరాన్ అధ్యక్షుడే లక్ష్యంగా ట్రంప్ కొత్త ఆంక్షలు.. ఇది యుద్ధ దాహమే అంటున్న అధికారులు
- 'ప్రజావేదికతోనే అక్రమ కట్టడాల కూల్చివేత ప్రారంభిస్తాం': జగన్
- ఆ పొలం నిండా కుళ్లిపోతున్న మృతదేహాలు.. వాటి మీద శాస్త్రవేత్తల పరిశోధనలు
- ‘జైశ్రీరాం, జై హనుమాన్ అనమంటూ నా భర్తను కరెంటు స్తంభానికి కట్టేసి కొట్టారు’
- ఇంతమంది చిన్నారులు ఎందుకు చనిపోతున్నారు...
- కార్లోస్ బ్రాత్‌వైట్... ఈ పేరు ఎందుకు గుర్తుపెట్టుకోవాలి...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








