పిచ్చుకల ప్రేమికుడు రిటైర్మెంట్ డబ్బుతో ఏం చేస్తున్నారో చూడండి...

- రచయిత, కథనం: శంకర్ వండిశెట్టి, కెమేరా: పెదపోలు రవి
- హోదా, బీబీసీ కోసం
పిచ్చుకలు కనుమరుగైపోతున్నాయని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అలాంటి అందమైన బుల్లి పిచ్చుకలను కాపాడేందుకు ఈ రిటైర్డ్ టీచర్ సృజనాత్మకంగా కృషి చేస్తున్నారు. రిటైర్మెంట్‌తో వచ్చిన డబ్బును ఈ బుల్లి పిట్టలకు గింజలు పెట్టడానికి ఖర్చు చేస్తున్నారు.
ఆ టీచర్ పేరు పోలువర్తి దాలినాయుడు. పిచ్చుకల ఉనికి ఇటు పర్యావరణానికి, అటు జీవ వైవిధ్యానికి తోడ్పడుతుందని చెబుతున్న ఈ రిటైర్డ్ టీచర్... ఈ బుల్లి పిట్టల పరిరక్షణ కోసం హరిత వికాస పౌండేషన్ పేరుతో ఓ సంస్థను కూడా ఏర్పాటు చేశారు.
కాకినాడ జిల్లా తునికి చెందిన దాలినాయుడు హిందీ పండిట్‌గా రిటైరయ్యారు. ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నప్పటి నుంచే ఆయన జీవవైవిధ్యాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నారు.
రిటైరయ్యాక ఆయన ఇలా ఊరూరా పిచ్చుకల కోసం వరి ధాన్యం కుంచెలు కట్టడం ప్రారంభించారు.
‘‘ఇప్పుడు పల్లెల్లో కూడా కుంచెలు కట్టే విధానం తగ్గిపోయింది. నేను హిందీ మాస్టర్ గా పనిచేస్తున్నప్పుడు సుబ్బారావు అనే ఆయన దగ్గర నేర్చుకున్నాను. నేను నేర్చుకున్నది అందరికీ నేర్పుతున్నాను. దాని వల్ల పక్షుల సంతతి పెరుగుతోంది. పిచుకలతో పాటుగా ఉడుతలు, మైనాలు, రామ చిలుకలు ఇవన్నీ జీవవైవిధ్యానికి ఎంతో మేలు చేసే భూమిక ఏర్పడుతుంది’’ అని దాలినాయుడు చెబుతున్నారు.
ఇలా పక్షులకు ఆహారం అందించే లక్ష్యంతో దాలినాయుడు స్వయంగా ఒక ఎకరం పొలంలో వరి పండిస్తున్నారు. ఈ పంటను కేవలం ధాన్యం కుంచెలు కట్టేందుకు వినియోగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ కుంచెలు కట్టేందుకు తోడ్పడిన వారికి కొంత మొత్తం పారితోషకంగా చెల్లిస్తున్నారు.
ఈ పంట సాగు కోసం ఏటా లక్ష రూపాయల వరకూ ఖర్చవుతోందని, ఇదంతా పిచ్చుకలను కాపాడేందుకే చేస్తున్నానంటున్నారు దాలినాయుడు.
‘‘9 రకాల కుంచెలు కట్టడం నేర్చుకున్నాను. దానిని కొలిమేరు గ్రామంలో 12 మందికి నేర్పాను. వారు మరో 8 మందికి నేర్పారు. వాళ్లు డిపరెంట్ మోడళ్లలో తయారు చేస్తారు. ఒక నెల రోజుల పాటు ఈ కుంచెలు కడతారు. నా పెన్షన్ డబ్బులు దానికి ఖర్చు చేస్తాను’’ అని ఆయన అన్నారు.

పిచ్చుకల పరిరక్షణ వల్ల కలిగే మేలు గురించి ఆయన విస్తృతంగా చేస్తున్న ప్రచారానికి మంచి స్పందన కూడా వస్తోంది. ఈ ప్రయత్నాలతో పిచ్చుకల సంఖ్య గతంలో కన్నా పెరిగిందని స్థానికులు చెబుతున్నారు.
కొలిమేరుకు చెందిన సత్యవతి, ‘‘మాస్టారు చెప్పిన తర్వాత మేం నేర్చుకున్నాం. పక్షుల సంఖ్య పెరిగింది. మా వ్యవసాయాలు కూడా బాగున్నాయి. మేం కూడా ఇవి నేర్చుకుని చేస్తున్నాం ’’ అని చెప్పారు.
2012 నుంచి పిచ్చుకల పరిరక్షణతో పాటుగా, జీవవైవిధ్యం కోసం దాలినాయుడు చేస్తున్న కృషిని గుర్తించి ప్రభుత్వం పలు అవార్డులతో సత్కరించింది. 2019 నుంచి హరిత వికాస్ ఫౌండేషన్ పేరుతో ఈ ప్రయత్నాన్ని మరింత విస్తృతం చేసినట్లు దాలినాయుడు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- చరిత్రలో తొలిసారి రాజ్యసభలో ప్రాతినిధ్యం కోల్పోతున్న టీడీపీ.. ఈ పరిస్థితి ఎందుకొచ్చింది?
- ఆంధ్రప్రదేశ్: ధనవంతులైన ఎంపీల వల్లే రాష్ట్రానికి నష్టం జరుగుతుందా?
- దామోదరం సంజీవయ్య: సీఎం పదవి చేపట్టినా కులం పేరుతో అవమానాలు తప్పలేదా?
- కేజీ బేసిన్: కాకినాడ తీరంలో తొలిసారిగా చమురు వెలికితీత...భారతదేశపు చమురు అవసరాలను ఇది తీర్చగలదా?
- ఆంధ్రప్రదేశ్: అసెంబ్లీ ఎన్నికల్లో దశాబ్దాలుగా ఆ కుటుంబాలదే హవా, ఎవరు వారు, ఏయే సీట్లు...









