చైనా: వూహాన్‌లో ప్రభుత్వ వైఫల్యాలను బయటపెట్టిన మహిళా బ్లాగర్‌కు నాలుగేళ్ల తర్వాత విముక్తి

ఫొటో సోర్స్, Youtube/Screenshot
వూహాన్ నగరంలో కోవిడ్ నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రపంచానికి రిపోర్ట్ చేసిన బ్లాగర్ ఝాంగ్ నాలుగేళ్ల తర్వాత జైలు నుంచి విడుదలైనట్లు రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ అనే స్వతంత్ర జర్నలిస్ట్‌ల గ్రూప్ ధ్రువీకరించింది.
తాను జైలు నుంచి విడుదలైనట్లు ఝాంగ్ ప్రకటిస్తున్న వీడియోను ఈ సంస్థ విడుదల చేసింది. ఆమె కోసం పోరాడిన వారందరికీ ఈ సంస్థ ధన్యవాదాలు చెప్పింది.
గత వారమే ఝాంగ్ విడుదల కావాల్సి ఉంది. కానీ, ఆమె ఎక్కడున్నారో ఆచూకీ తెలియడం లేదంటూ స్నేహితులు, బంధవులు ఆందోళన వ్యక్తం చేశారు.
న్యాయవాదిగా కొన్నాళ్లు పని చేసిన ఝాంగ్, కోవిడ్ వ్యాప్తిపై అనేక సిరీస్‌లుగా వీడియోలు విడుదల చేశారు.
వూహాన్‌లో పరిస్థితులపైనా, అక్కడి అధికారుల నుంచి ప్రతిస్పందన తీసుకోవడానికి ఆమె ఆ నగరానికి వెళ్లినప్పుడు అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
ఆమెపై తప్పుడు కేసులు పెడుతున్నారంటూ మీడియా వాచ్ డాగ్‌లు, మానవహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
ఆమె స్వేచ్ఛను నియంత్రిస్తున్నారని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థ విమర్శించింది.
తాజాగా ఆన్‌లైన్‌లో పోస్ట్ చేసిన చిన్న వీడియోలో ఝాంగ్ పైజామా ధరించి ఒక హాలులో నిలబడి కనిపించారు. తన సోదరుడి ఇంటికి వెళ్లేందుకు మే 13న అనుమతి లభించిందని ఆమె వెల్లడించారు.

ఫొటో సోర్స్, Getty Images
కోవిడ్ ప్రారంభమైన 2020 ఫిబ్రవరిలో ఆమె షాంఘై నుంచి వూహాన్‌కు వెళ్లారు. అక్కడ ఆసుపత్రుల్లో రద్దీ, బాధితులపై సాగుతున్న వేధింపులు, మరణాల సంఖ్యపై ప్రభుత్వ దాస్తున్న వాస్తవాలను ఆమె బయటపెట్టారు.
ఆమె ప్రసారం చేసిన లైవ్ వీడియోలు, సోషల్ మీడియాలో ప్రచురించిన వీడియోలు విపరీతంగా వ్యూస్ సంపాదించాయి. అధికారులు ఆమెను హెచ్చరించినా వీడియోల ప్రచురణను ఆపలేదు ఝాంగ్.
‘ప్రజల్లో అపోహలు పుట్టించడం, సమస్యలను సృష్టించడం’ అనే సెక్షన్లను చైనాలో అధికారులు తరచూ వాడుతుంటారు. ఝాంగ్ మీద కూడా అవే ఆరోపణలు చేస్తూ 2020 మేలో ఆమెను జైలులో పెట్టారు.
నిర్బంధంలో పెట్టిన తొలి రోజుల్లో ఆమె నిరాహార దీక్ష చేశారు. దీంతో ఆమెకు ట్యూబ్ ద్వారా బలవంతంగా ఆహారం తినిపించారని ఆమె లాయర్ వెల్లడించారు.
2023 జూలై వరకు ఆమె పాక్షిక నిరాహార దీక్షలో పాల్గొన్నారు. దీంతో ఆమె బరువు 37 కేజీలకు పడిపోయింది.
తీవ్రమైన పోషకాహార లోపంవల్ల ఆమెకు జీర్ణకోశ వ్యాధులు రావడంతోపాటు, తెల్ల రక్తకణాల సంఖ్య పడిపోయిందని రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ వెల్లడించింది.
ఝాంగ్ జైలు విడుదలైనా, ఆమె కదలికలపై అధికారులు నిఘా పెట్టారని ఆమె మద్దతుదారులు చెబుతున్నారు.
2020 ప్రారంభంలో కోవిడ్ మహమ్మారి మొదటిసారిగా సంభవించినప్పుడు, గవర్నమెంట్ నియంత్రణ ఉన్నప్పటికీ వ్యాధి నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యాలు పలువురు ఆన్ లైన్‌లో విపరీతంగా షేర్ చేశారు.
చివరకు ప్రభుత్వ సెన్సార్‌షిప్ యంత్రాంగం ఈ ప్రచారాన్ని అణచివేయగలిగింది.
మరోవైపు ప్రభుత్వం తన అదుపులో ఉండే మీడియా సాయంతో సానుకూల కథనాలను ప్రసారం చేసింది. వైరస్‌పై విజయం సాధించామని అగ్రనేతలు ప్రకటించారు. కోవిడ్ -19 పట్ల ప్రభుత్వ స్పందన అద్భుతమని అభివర్ణించుకున్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














